మార్చి 17 నుండి జ్ఞాపకార్థ ఆచరణ ప్రచార కార్యక్రమం మొదలౌతుంది
1. మార్చి 17న ఏ ప్రచార కార్యక్రమం మొదలౌతుంది?
1 ప్రతీ సంవత్సరం జరిగే జ్ఞాపకార్థ ఆచరణ, యేసు మరణాన్ని ప్రకటించే అవకాశమిస్తుంది. (1 కొరిం. 11:26) కాబట్టి, యెహోవా ప్రేమతో ఇచ్చిన బహుమానమైన విమోచన క్రయధనం గురించి తెలుసుకోవడానికి ఇతరులు కూడా హాజరవ్వాలని మనం కోరుకుంటాం. (యోహా. 3:16) ఈ సంవత్సరం, జ్ఞాపకార్థ ఆచరణకు ఇతరులను ఆహ్వానించే ప్రచార కార్యక్రమం శనివారం మార్చి 17న మొదలౌతుంది. దానిలో వీలైనంత ఎక్కువగా భాగం వహించాలని మీరు కోరుకుంటున్నారా?
2. ఆహ్వాన పత్రాలను ఇచ్చేటప్పుడు మనం ఏమి చెప్పవచ్చు? ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి?
2 మనమేమి చెప్పవచ్చు? ఆహ్వాన పత్రాలను ఇచ్చేటప్పుడు క్లుప్తంగా మాట్లాడడం మంచిది. మీరిలా అనవచ్చు: “నమస్తే. ఏప్రిల్ 5న ప్రపంచవ్యాప్తంగా జరిగే ఒక ముఖ్యమైన వార్షిక ఆచరణకు హాజరయ్యేందుకు ఈ ఆహ్వాన పత్రాన్ని మీకు ఇవ్వడానికి వచ్చాం. అక్కడ ఒక ఉచిత బైబిలు ప్రసంగాన్ని ఇస్తారు. యేసు మరణించడం వల్ల ఏమి సాధ్యమైందో, ఇప్పుడాయన ఏమి చేస్తున్నాడో అక్కడ వివరిస్తారు. మన ప్రాంతంలో ఆ కూటం ఎక్కడ, ఎప్పుడు జరుగుతుందో ఇందులో ఉంది.” గృహస్థులు క్రైస్తవ మతానికి చెందినవాళ్లు కాకపోతే, ఆహ్వాన పత్రాలను ఇచ్చేముందు వాళ్లకు ఆసక్తి ఉందో లేదో తెలుసుకోవాలి. వాటిని వారాంతాల్లో ఇస్తున్నప్పుడు సముచితమైన చోట పత్రికలను కూడా ఇవ్వాలి.
3. మనం సాధ్యమైనంతమందిని ఎలా ఆహ్వానించవచ్చు?
3 వీలైనంతమందిని ఆహ్వానించండి: సాధ్యమైనంతమందిని ఆహ్వానించాలనేదే మన లక్ష్యం. అందుకే మీ బైబిలు విద్యార్థులను, మీరు పునర్దర్శనం చేస్తున్న వాళ్లను, బంధువులను, తోటి ఉద్యోగస్థులను, తోటి విద్యార్థులను, పొరుగువాళ్లను, పరిచయమున్న ఇతరులను తప్పక ఆహ్వానించండి. మీ ప్రాంతంలోని ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఆహ్వాన పత్రాలను ఎలా అందించాలనే దాని గురించి స్థానిక పెద్దలు నిర్దేశాలిస్తారు. ఈ వార్షిక ప్రచార కార్యక్రమం వల్ల చక్కని ఫలితాలొస్తాయి. గత సంవత్సరం జ్ఞాపకార్థ ఆచరణకు ఒక స్త్రీ వచ్చినప్పుడు అక్కడున్న ఒక అటెండెంట్, ఆమెను ఆహ్వానించిన వ్యక్తిని కనుగొనడానికి సహాయం చేస్తానని చెప్పాడు. అయితే, తనకు అక్కడున్న వాళ్లెవరూ తెలియదని, ఆ రోజు ఉదయం ఇంటింటికి వెళ్తున్న ఎవరో ఆ ఆహ్వాన పత్రాన్ని తనకిచ్చారని ఆమె చెప్పింది.
4. ప్రచార కార్యక్రమంలో ఆసక్తిగా భాగం వహించడానికి ఏ కారణాలున్నాయి?
4 బహుశా, మీరిచ్చిన ఆహ్వాన పత్రం వల్లే ఎవరో ఒకరు జ్ఞాపకార్థ ఆచరణకు హాజరౌతుండవచ్చు. ఎవరు స్పందించినా, స్పందించకపోయినా మీరు శ్రద్ధగా చేసే ప్రయత్నాలు మాత్రం చక్కని సాక్ష్యమిస్తాయి. మీరిచ్చే ఆహ్వాన పత్రాలు, యేసు ఇప్పుడు శక్తిమంతుడైన రాజుగా ఉన్నాడని ప్రకటిస్తాయి. మీరు చూపించే ఆసక్తిని బట్టి మీ క్షేత్రంలోని ప్రజలకు, తోటి ప్రచారకులకు, ముఖ్యంగా యెహోవా దేవునికి మీరు విమోచన క్రయధనం అనే బహుమానాన్ని ఎంతో విలువైనదిగా ఎంచుతున్నారని చూపిస్తారు.—కొలొ. 3:15.