ఏప్రిల్ 2 నుండి జ్ఞాపకార్థ ఆచరణ ఆహ్వానపత్రికలు ఇవ్వడం మొదలుపెడతాం
1. ఈ సంవత్సరంలో జ్ఞాపకార్థ ఆచరణ ఆహ్వానపత్రికలు ఎప్పుడు ఇస్తాం, ఈ వార్షిక ప్రచార కార్యక్రమం వల్ల ప్రయోజనం ఏమిటి?
1 ఈ సంవత్సరంలోకెల్లా చాలా ప్రాముఖ్యమైన సంఘటన అయిన క్రీస్తు మరణ జ్ఞాపకార్థ ఆచరణ ఆహ్వానపత్రికలు ఏప్రిల్ 2 నుండి 17 వరకు ఇస్తాం. ఇంతకుముందు, ఈ వార్షిక ప్రచార కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. ఆసక్తివున్న చాలామంది దానికి హాజరయ్యారు. ఉదాహరణకు, జ్ఞాపకార్థ ఆచరణ రోజు ఒకావిడ బ్రాంచి కార్యాలయానికి ఫోన్ చేసి, “నేను ఇప్పుడే ఇంటికి వచ్చాను. మా ఇంట్లో తలుపు దగ్గర ఒక ఆహ్వానపత్రిక కనబడింది. నాకు ఆ కార్యక్రమానికి వెళ్లాలనివుంది, అది ఎప్పుడు మొదలవుతుందో కొంచెం చెప్తారా?” అని అడిగింది. ఆహ్వానపత్రికలో సమయం ఎక్కడ ఇవ్వబడిందో ఆ సహోదరుడు వివరించాడు. “నేను తప్పకుండా ఆ కార్యక్రమానికి వెళ్తాను,” అంటూ ఆమె ఫోన్ పెట్టేసింది.
2. ఆహ్వానపత్రికలు ఇచ్చేటప్పుడు మనం ఏమి చెప్పవచ్చు?
2 ఎలా ఇవ్వాలి? మనకున్న తక్కువ సమయంలో అందరికీ ఆహ్వానపత్రికలు ఇవ్వడం సాధ్యం కాదు కాబట్టి, క్లుప్తంగా మాట్లాడితే బావుంటుంది. మనం ఇలా చెప్పవచ్చు, “నమస్కారమండీ ప్రపంచవ్యాప్తంగా జరగబోతున్న ఒక వార్షిక ఆచరణకు మిమ్మల్ని ఆహ్వానించాలనుకుంటున్నాం. అది ఏప్రిల్ 17, ఆదివారం రోజున జరుగుతుంది. [ఆహ్వానపత్రిక ఇవ్వండి.] ఆ తేదీన యేసుక్రీస్తు మరణించాడు. ఆయన చెల్లించిన విమోచన క్రయధనం నుండి మనం ఎలా ప్రయోజనం పొందవచ్చో వివరిస్తూ బైబిలు నుండి ఒక ఉచిత ప్రసంగం ఇవ్వబడుతుంది. మన ప్రాంతంలో ఆ కూటం జరిగే సమయం, స్థలం ఈ ఆహ్వానపత్రికలో ఇవ్వబడ్డాయి.” మీరు సమస్యాత్మక ప్రాంతంలో పరిచర్య చేస్తుంటే, ఆహ్వానపత్రికలు ఇచ్చేముందు గృహస్థులకు ఆసక్తి ఉందో లేదో గ్రహించాలి.
3. సాధ్యమైనంత ఎక్కువమందిని మనం ఎలా ఆహ్వానించవచ్చు?
3 ఒకవేళ మీ సంఘ క్షేత్రం చాలా పెద్దగా ఉంటే, తాళం వేసివున్న ఇళ్లలో ఆహ్వానపత్రికల్ని ఇంటివాళ్లకు మాత్రమే కనిపించేటట్టు పెట్టగలిగితేనే పెట్టమని పెద్దలు మీకు చెప్పవచ్చు. మీరు పునర్దర్శనాలు చేస్తున్న వాళ్లను, మీ బంధువులను, మీతో పనిచేసే వాళ్లను, మీ తోటి విద్యార్థులను, మీకు తెలిసిన వాళ్లందర్నీ తప్పకుండా ఆహ్వానించండి. వారాంతాల్లో ఆహ్వానపత్రికలు ఇస్తున్నప్పుడు, కావలికోట పత్రిక ఇవ్వడం సబబుగా అనిపించిన చోటల్లా దాన్ని కూడా ఇవ్వండి. ఆనందంగా సాగే ఈ ప్రచార కార్యక్రమంలో ఎక్కువగా పాల్గొనేలా ఏప్రిల్ నెలలో మీరు సహాయ పయినీరు సేవ చేయగలరా?
4. ఆసక్తి ఉన్నవాళ్లు జ్ఞాపకార్థ ఆచరణకు రావాలని మనం ఎందుకు కోరుకుంటాం?
4 కార్యక్రమానికి వచ్చే ఆసక్తి ఉన్నవాళ్లకు అక్కడ జరుగుతున్నదంతా ఎంత గొప్ప సాక్ష్యంగా ఉంటుందో కదా! విమోచన క్రయధనాన్ని ఏర్పాటు చేయడం ద్వారా యెహోవా చూపించిన గొప్ప ప్రేమ గురించి వాళ్లు వింటారు. (యోహా. 3:16) దేవుని రాజ్యం మానవులకు ఏవిధంగా ప్రయోజనాలను తెస్తుందో వాళ్లు తెలుసుకుంటారు. (యెష. 65:21-23) అంతేకాదు, ఎక్కువ విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నవాళ్లు బైబిలు అధ్యయనం కావాలనుకుంటే అక్కడున్న అటెండెంట్లను అడగవచ్చని ఛైర్మన్ చెప్తాడు. యెహోవా గురించి తెలుసుకోవాలని కోరుకునే చాలామంది ఈ ప్రచార కార్యక్రమానికి స్పందించి, జ్ఞాపకార్థ ఆచరణకు రావాలని ప్రార్థిద్దాం!