మీరు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారా?
ఈ జ్ఞాపకార్థ ఆచరణ మన కృతజ్ఞత చూపించడానికి మంచి అవకాశాన్నిస్తుంది
1. జ్ఞాపకార్థ ఆచరణ ఏ ప్రత్యేక అవకాశాన్నిస్తుంది?
1 యెహోవా మంచితనం పట్ల కృతజ్ఞత పెంపొందించుకోవడానికి, దాన్ని చూపించడానికి ఏప్రిల్ 14న జరిగే జ్ఞాపకార్థ ఆచరణ ప్రత్యేక అవకాశాన్నిస్తుంది. కృతజ్ఞత చూపించడాన్ని యెహోవా, యేసు ఎలా ఎంచుతారో లూకా 17:11-18 తెలియజేస్తుంది. విచారకరంగా, స్వస్థత పొందిన పదిమంది కుష్ఠరోగుల్లో ఒక్కరే కృతజ్ఞత చూపించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. భవిష్యత్తులో, విమోచన క్రయధనమనే బహుమానం రోగాలన్నిటినీ పూర్తిగా నయం చేసి నిత్యజీవానికి మార్గం తెరుస్తుంది! అప్పుడు, యెహోవా ఇచ్చే అలాంటి ఆశీర్వాదాలను బట్టి ప్రతీరోజు ఆయనకు తప్పక కృతజ్ఞతలు చెబుతాం. మరైతే, రానున్న వారాల్లో మన కృతజ్ఞతను ఎలా చూపించవచ్చు?
2. విమోచన క్రయధనంపై కృతజ్ఞతను ఎలా పెంపొందించుకోవచ్చు?
2 కృతజ్ఞత పెంపొందించుకోండి: మన ఆలోచనలే మనలో కృతజ్ఞతా భావాన్ని కలిగిస్తాయి. క్యాలెండరు,ప్రతీరోజు లేఖనాలను పరిశోధిద్దాం వంటివాటిలో, విమోచన క్రయధనంపై మన కృతజ్ఞత పెంచుకోవడానికి సహాయపడే జ్ఞాపకార్థ ఆచరణ బైబిలు పఠన పట్టిక ఉంటుంది. కుటుంబమంతా కలిసి ఆ లేఖనాలు పరిశీలించవచ్చు. అలాచేస్తే, విమోచన క్రయధనం పట్ల మన కృతజ్ఞత అధికమౌతుంది. అది మన ప్రవర్తనపై కూడా మంచి ప్రభావం చూపుతుంది.—2 కొరిం. 5:14, 15; 1 యోహా. 4:11.
3. జ్ఞాపకార్థ ఆచరణ కాలంలో, మన కృతజ్ఞతను ఏయే విధాల్లో చూపించవచ్చు?
3 కృతజ్ఞత చూపించండి: క్రియల్లో ‘చూపిస్తేనే’ కృతజ్ఞత తెలుస్తుంది. (కొలొ. 3:15, NW) యేసును కనుగొనడానికి, ఆయనకు కృతజ్ఞతలు చెప్పడానికి ఆ కుష్ఠరోగి కృషిచేశాడు. అద్భుతరీతిలో తాను పొందిన స్వస్థత గురించి అతను ఇతరులతో ఉత్సాహంగా మాట్లాడివుంటాడు కూడా. (లూకా 6:45) విమోచన క్రయధనం పట్ల మనకున్న కృతజ్ఞత, ప్రత్యేక ప్రచార కార్యక్రమంలో ఆసక్తిగా పాల్గొనేలా మనల్ని కదిలిస్తుంది. మన కృతజ్ఞతను చూపించే మరో చక్కని మార్గం: జ్ఞాపకార్థ ఆచరణ కాలంలో సహాయ పయినీరు సేవచేయడం లేదా పరిచర్యలో ఎక్కువగా పాల్గొనడం. అంతేకాదు, జ్ఞాపకార్థ ఆచరణ రోజు అక్కడికివచ్చినవాళ్లను సాదరంగా ఆహ్వానిస్తాం, వాళ్ల ప్రశ్నలకు జవాబు ఇవ్వడానికి అందుబాటులో ఉంటాం.
4. ఈ జ్ఞాపకార్థ ఆచరణ కాలాన్ని మనం ఎలా సద్వినియోగం చేసుకోవచ్చు?
4 ఇదే మనకు చివరి జ్ఞాపకార్థ ఆచరణ కావచ్చా? (1 కొరిం. 11:26) చెప్పలేం. ఒకవేళ ఇదే చివరిదైతే మాత్రం, కృతజ్ఞత చూపించే ఇలాంటి అవకాశం మనకు మళ్లీ రాదు. కాబట్టి ఈసారి దొరికిన అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటారా? కృతజ్ఞతతో నిండిన మన ‘నోటి మాటలు, హృదయ ధ్యానం’ గొప్ప మనసుతో విమోచన క్రయధనాన్ని ఇచ్చిన యెహోవాకు సంతోషం తెచ్చుగాక!—కీర్త. 19:14.