ప్రజలను ఆకట్టుకునే విధంగా మీ సంభాషణను మొదలుపెట్టండి
1. తొలి క్రైస్తవులు వేర్వేరు విధాలుగా సంభాషణను మొదలుపెట్టిన తీరు నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?
1 తొలి క్రైస్తవులు సువార్తను విభిన్న సంస్కృతుల వారికి, మతాల వారికి ప్రకటించారు. (కొలొ. 1:23) వాళ్లు ప్రకటించింది దేవుని రాజ్యం గురించిన సందేశమే అయినా వాళ్లు మాట్లాడుతున్న వ్యక్తులనుబట్టి వేర్వేరు విధాలుగా సంభాషణను మొదలుపెట్టారు. ఉదాహరణకు, పేతురు లేఖనాల మీద ప్రగాఢ గౌరవమున్న యూదులతో మాట్లాడుతున్నప్పుడు యోవేలు ప్రవక్త రాసిన మాటలను ప్రస్తావించాడు. (అపొ. 2:14-17) మరోవైపు, పౌలు గ్రీకులతో తర్కించిన విధానాన్ని ఒకసారి గమనించండి, ఇది అపొస్తలుల కార్యములు 17:22-31లో ఉంది. నేడు కొన్ని క్షేత్రాల్లోని ప్రజలు లేఖనాలను గౌరవిస్తారు కాబట్టి ఇంటింటి పరిచర్య చేస్తున్నప్పుడు వాళ్లతో బైబిలు గురించి నిస్సంకోచంగా మాట్లాడవచ్చు. అయితే బైబిలుపట్ల గానీ, మతంమీద గానీ ఆసక్తి లేనివాళ్లతో లేదా క్రైస్తవేతరులతో మాట్లాడుతున్నప్పుడు మనం ఎంతో వివేచనను ఉపయోగించాల్సి ఉంటుంది.
2. బైబిలు మీద గౌరవమున్నవాళ్లకు, గౌరవం లేనివాళ్లకు సహాయం చేయడానికి అందించాల్సిన సాహిత్యాన్ని మనం ఎలా ఉపయోగించవచ్చు?
2 అందించాల్సిన సాహిత్యాన్ని సమర్థవంతంగా ఉపయోగించండి: ఈ సేవా సంవత్సరంలో మనం ఇవ్వబోయే ప్రచురణలు ప్రతీ రెండు నెలలకు మారతాయి, దానిలో పత్రికలు, కరపత్రాలు, బ్రోషుర్లు మొదలైనవాటి గురించి ఉంటాయి. మనం పరిచర్య చేసే ప్రాంతంలోని ప్రజలకు బైబిలుపట్ల ఆసక్తి లేకపోయినాసరే, వాళ్లను ఆకట్టుకునేలా మన సాహిత్యాల్లోని ఒక అంశం గురించి మాట్లాడడం వీలౌతుంది. మొదటిసారి కలిసినప్పుడు మనం లేఖనం చదవలేకపోవచ్చు, నేరుగా బైబిలు గురించి మాట్లాడలేకపోవచ్చు కానీ గృహస్థులు ఆసక్తి చూపిస్తే సృష్టికర్త మీద, ఆయన ప్రేరేపిత వాక్యం మీద విశ్వాసం కలిగేలా వారికి సహాయం చేయాలనే ఉద్దేశంతో మనం వారిని మళ్లీ కలుసుకోవచ్చు. మరోవైపు, మనం ప్రకటించే ప్రాంతంలోని ప్రజలకు బైబిలు మీద గౌరవముంటే, దాన్ని మనసులో ఉంచుకొని సంభాషణను ప్రారంభించి సాహిత్యాన్ని ఇవ్వండి. నెలలో మనం ఇవ్వాల్సిన సాహిత్యం ఏదైనా, బైబిలు బోధిస్తోంది పుస్తకాన్ని లేదా దేవుడు చెప్పేది వినండి, దేవుడు చెప్పేది వినండి నిత్యం జీవించండి బ్రోషుర్లను ఎప్పుడైనా ఇవ్వవచ్చు. ఏదేమైనా, యెహోవా మీద ఆసక్తి కలిగే విధంగా సంభాషణను మొదలుపెట్టడం ముఖ్యం.
3. మనం పనిచేసే ప్రాంతంలోని ప్రజల హృదయాలు నేలలాంటివని ఎందుకు చెప్పవచ్చు?
3 నేలను సిద్ధంచేయండి: ఒక వ్యక్తి హృదయం నేలలాంటింది. (లూకా 8:15) బైబిలు సత్యాలనే విత్తనాలు మొలకెత్తడానికి, పెరగడానికి కొన్ని నేలలను బాగా సిద్ధం చేయాల్సి ఉంటుంది. మొదటి శతాబ్దంలోని సువార్తికులు అన్ని రకాల నేలల్లో విత్తనాలను విజయవంతంగా నాటారు, అది వాళ్లకు సంతృప్తిని, ఆనందాన్ని తీసుకువచ్చింది. (అపొ. 13:48, 52) ఇతరులతో సంభాషణను మొదలుపెట్టే విధానం మీద శ్రద్ధ పెడితే మనం కూడా అలాంటి విజయాన్నే పొందుతాం.