వ్యక్తిగత క్షేత్రం తీసుకోగలరేమో ఆలోచించండి
1. వ్యక్తిగత క్షేత్రం అంటే ఏమిటి?
1 వ్యక్తిగత క్షేత్రం అంటే ఏమిటి? మీ సంఘ క్షేత్రం పెద్దగా ఉంటే, పరిచర్య చేయడానికి మీకంటూ కొంత ప్రాంతం ఇస్తారు. దాన్నే మీ వ్యక్తిగత క్షేత్రం అంటారు. సాధారణంగా అది మీ ఇంటికి దగ్గర్లో ఉంటుంది. సంస్థీకరించబడ్డాం పుస్తకం, 103వ పేజీలో ఇలావుంది: “అనుకూలమైన వ్యక్తిగత క్షేత్రం ఉండడంవల్ల, మీరు క్షేత్ర సేవలో ఫలప్రదంగా ఎక్కువ సమయాన్ని వెచ్చించగలుగుతారు. అంతేకాక, మీ వ్యక్తిగత క్షేత్రంలో మీతోపాటు సేవ చేసేందుకు వేరొక ప్రచారకుణ్ణి ఆహ్వానించడానికి కూడా మీరు ఇష్టపడవచ్చు.”
2. వ్యక్తిగత క్షేత్రంలో పనిచేస్తూనే, క్షేత్రసేవా గుంపుకు ఎలా మద్దతు ఇవ్వవచ్చు?
2 మీ క్షేత్రసేవా గుంపుతో పాటు పరిచర్య చేస్తూనే: మీ పని స్థలానికి దగ్గర్లో ఉన్న ప్రాంతాన్ని మీరు వ్యక్తిగత క్షేత్రంగా తీసుకుంటే, భోజన విరామమప్పుడు లేదా ఇంటికి వెళ్లేముందు, దగ్గర్లో పనిచేసే మరో ప్రచారకునితో కలిసి పరిచర్య చేయవచ్చు. ఒకవేళ మీ వ్యక్తిగత క్షేత్రం మీ ఇంటికి దగ్గర్లో ఉంటే, సాయంత్రవేళల్లో మీ కుటుంబంతోపాటు పరిచర్య చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఒకవేళ మీరు క్షేత్రసేవా కూటానికి హాజరవ్వకపోతే, పరిచర్య మొదలుపెట్టేముందు యెహోవా నడిపింపు కోసం ప్రార్థించడం మంచిది. (ఫిలి. 4:6) వ్యక్తిగత క్షేత్రంలో పనిచేస్తూనే, మీ క్షేత్రసేవా గుంపుతో కలిసి పనిచేయడానికి సంఘం చేసే ఏర్పాట్లకు కూడా మద్దతునివ్వాలి. గుంపులోని చాలామంది, వారాంతాల్లో పరిచర్యకు వస్తారు కాబట్టి అప్పుడు వాళ్లతో కలిసి పరిచర్య చేస్తే బావుంటుంది.
3. వ్యక్తిగత క్షేత్రం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి?
3 ప్రయోజనాలు: వ్యక్తిగత క్షేత్రం ఉంటే, మీరు ఖాళీగా ఉన్నప్పుడల్లా వెళ్లి పరిచర్య చేయవచ్చు. ప్రయాణానికి అంతగా సమయం పట్టదు కాబట్టి పరిచర్యలో ఎక్కువ సమయం గడపవచ్చు. ఈ వెసులుబాటు వల్ల కొందరు సహాయ పయినీరు సేవ లేదా క్రమ పయినీరు సేవ చేయగలుగుతున్నారు. ఎవరైనా ఆసక్తి చూపిస్తే, వాళ్లు మీ ఇంటికి దగ్గర్లోనే ఉంటారు కాబట్టి వాళ్లను తిరిగి కలవడానికీ, వాళ్లతో బైబిలు అధ్యయనం చేయడానికీ సులువుగా ఉంటుంది. అంతేకాదు, దానివల్ల ఇంటివాళ్లతో బాగా పరిచయం పెంచుకోవడానికి, వాళ్లలో నమ్మకం కలిగించడానికి వీలౌతుందని చాలామంది ప్రచారకులు చెబుతున్నారు. ముఖ్యంగా, క్షేత్రాన్ని తిరిగి ఇచ్చే లోపు దాన్ని ఒకటికన్నా ఎక్కువసార్లు పూర్తి చేయగలిగితే అది ఇంకా సులువు. మీరు, మీ కుటుంబం పరిచర్యను సంపూర్ణంగా చేసేలా వ్యక్తిగత క్షేత్రం తీసుకోగలరేమో ఆలోచించండి.—2 తిమో. 4:5.