అధ్యాయం 26
“క్షమించడానికి సిద్ధంగా” ఉండే దేవుడు
1-3. (ఎ) దావీదు హృదయం ఎందుకు బరువెక్కింది? అంత వేదనలో ఆయనకు ఏది హాయినిచ్చింది? (బి) పాపం చేసినప్పుడు మనం ఏ భారాన్ని మోయాల్సి రావచ్చు? కానీ యెహోవా మనకు ఏ భరోసా ఇస్తున్నాడు?
“నా తప్పులు నన్ను ముంచెత్తుతున్నాయి; అవి నేను మోయలేనంత భారంగా తయారయ్యాయి. నేను మొద్దుబారిపోయాను, పూర్తిగా నలిగిపోయాను; నా హృదయ వేదనవల్ల గట్టిగా మూల్గుతున్నాను” అని కీర్తనకర్త దావీదు రాశాడు. (కీర్తన 38:4, 8) నిందించే మనస్సాక్షి ఎంత బరువుగా, భారంగా ఉంటుందో దావీదుకు తెలుసు. కానీ అంత వేదనలో ఆయనకు హాయినిచ్చింది ఒకటుంది. అదేంటంటే, యెహోవా పాపాన్ని అసహ్యించుకుంటాడు గానీ, నిజమైన పశ్చాత్తాపం చూపించి తమ ప్రవర్తనను మార్చుకునే పాపుల్ని కాదు. యెహోవా పశ్చాత్తాపం చూపించినవాళ్ల మీద కరుణ చూపించడానికి ముందుంటాడని నమ్ముతూ, దావీదు ఇలా అన్నాడు: “యెహోవా, నువ్వు . . . క్షమించడానికి సిద్ధంగా ఉంటావు.”—కీర్తన 86:5.
2 ఇప్పుడు కూడా మనం ఏదైనా తప్పు చేసినప్పుడు, మన మనస్సాక్షి మోయలేనంత భారంగా తయారై మనల్ని నలగ్గొట్టవచ్చు. అయితే, అలాంటి బాధ ఒకందుకు మంచిదే. ఎందుకంటే, అలా అనిపించినప్పుడే మన తప్పుల్ని సరిచేసుకోవడానికి ప్రయత్నిస్తాం. కానీ ఒకవేళ మనం జాగ్రత్తగా లేకపోతే, అదే బాధలో కూరుకుపోయే ప్రమాదం ఉంది. ఎంత పశ్చాత్తాపం చూపించినా యెహోవా మనల్ని క్షమించడని మన హృదయం మనల్ని నిందించే అవకాశం కూడా ఉంది. ఒకవేళ మనం “తీవ్రమైన దుఃఖంలో మునిగిపోతే,” దేవుని సేవను ఆపేసి, ఇక యెహోవా దృష్టిలో మనకు విలువ లేదని, ఆయన సేవ చేసే అర్హత లేదని అనుకునేలా సాతాను చేయవచ్చు.—2 కొరింథీయులు 2:5-11.
3 మరి యెహోవా అలాగే అనుకుంటాడా? లేదులేదు! యెహోవా గొప్ప ప్రేమలో ఒక కోణం, ఆయన క్షమాపణ. ఒకవేళ మనం నిజంగా, మనస్ఫూర్తిగా పశ్చాత్తాపం చూపిస్తే మనల్ని క్షమించడానికి సిద్ధంగా ఉంటానని, ఆయన తన వాక్యం ద్వారా భరోసా ఇస్తున్నాడు. (సామెతలు 28:13) ఆ విషయాన్ని మనం గట్టిగా నమ్మడానికి అసలు యెహోవా మనల్ని ఎందుకు క్షమిస్తాడో, ఎంతలా క్షమిస్తాడో ఇప్పుడు చూద్దాం.
యెహోవా ఎందుకు “క్షమించడానికి సిద్ధంగా” ఉంటాడు?
4. మనం ఎలాంటి వాళ్లమని యెహోవా గుర్తుచేసుకుంటాడు? దానివల్ల ఆయన మనతో ఎలా నడుచుకుంటాడు?
4 యెహోవాకు మన పరిమితులు తెలుసు. కీర్తన 103:14 ఇలా చెప్తుంది: “మనం ఎలా తయారుచేయబడ్డామో ఆయనకు బాగా తెలుసు, మనం మట్టివాళ్లమని ఆయన గుర్తుచేసుకుంటాడు.” మనం మట్టివాళ్లమని, అపరిపూర్ణత కారణంగా మనలో బలహీనతలు ఉంటాయని ఆయన ఎప్పుడూ మర్చిపోడు. “మనం ఎలా తయారుచేయబడ్డామో” ఆయనకు తెలుసు అనే మాట వినగానే, యెహోవా ఒక కుమ్మరి అని, మనం ఆయన తయారుచేసిన మట్టిపాత్రలం అని బైబిల్లో ఉన్న పోలిక మనకు గుర్తొస్తుంది. (యిర్మీయా 18:2-6) గొప్ప కుమ్మరైన యెహోవా మన పాపపు స్వభావం వల్ల వచ్చే బలహీనతల్ని అర్థం చేసుకుంటాడు. అంతేకాదు, ఆయన మలుస్తుంటే మనం ఎలా స్పందిస్తున్నాం అనేదాన్ని గమనించి, దానికి తగ్గట్టు తన పద్ధతిని మార్చుకుంటాడు.
5. పాపానికి ఉన్న గట్టి పట్టు గురించి రోమీయులు పుస్తకం ఏం చెప్తుంది?
5 పాపానికి ఎంత శక్తి ఉందో యెహోవా అర్థం చేసుకుంటాడు. అది మనిషిని ఊపిరాడనివ్వకుండా పట్టేసుకుంటుందని బైబిలు చెప్తుంది. ఇంతకీ, పాపం ఎంత గట్టిగా పట్టుకుంటుంది? రోమీయులు పుస్తకంలో అపొస్తలుడైన పౌలు ఇలా వివరించాడు: సైనికులు ఒక అధికారి కింద ఉన్నట్టు, మనం “పాపం కింద” ఉన్నాం (రోమీయులు 3:9); పాపం మనుషుల్ని ఒక రాజుగా ‘ఏలింది’ (రోమీయులు 5:21); అది మనలో నివాసం ఉంటుంది (రోమీయులు 7:17, 20); దాని “నియమం” మనలో ఎప్పుడూ పనిచేస్తూ, మనం చేసే ప్రతీదాన్ని అదుపు చేయడానికి ప్రయత్నిస్తుంది. (రోమీయులు 7:23, 25) అపరిపూర్ణ మనుషుల్ని పాపం ఎంత గట్టిగా పట్టుకుంటుందో కదా!—రోమీయులు 7:21, 24.
6, 7. (ఎ) నిజమైన పశ్చాత్తాపం చూపించి క్షమాపణ అడిగేవాళ్లను యెహోవా ఎలా చూస్తాడు? (బి) యెహోవా కరుణను మనం ఎందుకు అలుసుగా తీసుకోకూడదు?
6 కాబట్టి, మనం ఎంత గట్టిగా కోరుకున్నా, యెహోవా చెప్పింది చెప్పినట్టు చేయలేమని ఆయనకు తెలుసు. మనం నిజమైన పశ్చాత్తాపం చూపించి క్షమాపణ అడిగితే, మనల్ని క్షమిస్తానని ఆయన ప్రేమగా భరోసా ఇస్తున్నాడు. కీర్తన 51:17 లో ఇలా ఉంది: “విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి; దేవా, విరిగి నలిగిన హృదయాన్ని నువ్వు తిరస్కరించవు.” అవును, తప్పు చేశామనే బాధ వల్ల “విరిగి నలిగిన హృదయాన్ని” యెహోవా ఎప్పుడూ తిరస్కరించడు, అంటే ముఖం తిప్పేసుకోడు.
7 అంటే దీనర్థం ఇప్పుడు దేవుని కరుణను, మన పాపపు స్వభావాన్ని అడ్డం పెట్టుకొని పాపం చేసేయొచ్చా? లేదు! కుంటిసాకులతో యెహోవాను ఎవరూ మోసం చేయలేరు. ఆయన కరుణకు ఒక హద్దు ఉంది. ఎలాంటి పశ్చాత్తాపం చూపించకుండా, కావాలని పదేపదే తప్పు చేసేవాళ్లను ఆయన అస్సలు క్షమించడు. (హెబ్రీయులు 10:26) కానీ, ఎవరైతే నిజంగా పశ్చాత్తాపం చూపిస్తారో వాళ్లను క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. ఇది యెహోవా ప్రేమలోని ఒక అద్భుతమైన కోణం. బైబిల్లో దాన్ని ఎంత అందంగా వర్ణించారో కొన్ని పోలికల్ని ఇప్పుడు చూద్దాం.
యెహోవా ఎంతలా క్షమిస్తాడు?
8. యెహోవా మనల్ని క్షమిస్తున్నప్పుడు ఒకరకంగా ఏం చేస్తాడు? ఇది మనలో ఏ నమ్మకాన్ని నింపుతుంది?
8 దావీదు పశ్చాత్తాపం చూపించిన తర్వాత ఇలా అన్నాడు: “చివరికి నేను, నా పాపాన్ని నీ దగ్గర ఒప్పుకున్నాను; నా తప్పును దాచిపెట్టలేదు. . . . నువ్వు నా తప్పును, నా పాపాల్ని క్షమించావు.” (కీర్తన 32:5) ఇక్కడ “క్షమించావు” అంటున్నప్పుడు, హీబ్రూలో “ఎత్తడం” లేదా “తీసుకెళ్లిపోవడం” అని అర్థం. తప్పును, అపరాధాన్ని, పాపాన్ని తీసుకెళ్లిపోవడం గురించి ఆ లేఖనం చెప్తుంది. అంటే యెహోవా ఒక ఒకరకంగా దావీదు పాపాల్ని ఎత్తుకుని తీసుకెళ్లిపోయాడు. దాంతో, అప్పటివరకు అపరాధ భావాల్ని మోస్తున్న దావీదుకు పెద్ద బరువు దిగిపోయినట్టు అనిపించి ఉంటుంది. (కీర్తన 32:3) మనం కూడా యేసు విమోచన క్రయధనం మీద విశ్వాసం ఉంచి క్షమాపణ అడిగితే, యెహోవా మన పాపాల్ని తీసుకెళ్లిపోతాడని పూర్తి నమ్మకంతో ఉండవచ్చు.—మత్తయి 20:28.
9. యెహోవా మన పాపాల్ని మనకు ఎంత దూరంలో ఉంచుతాడు?
9 యెహోవా క్షమాపణ గురించి చెప్పడానికి దావీదు ఇంకో అందమైన పోలికను చెప్పాడు: “పడమటికి తూర్పు ఎంత దూరంలో ఉంటుందో, ఆయన మన అపరాధాల్ని మనకు అంత దూరంలో ఉంచాడు.” (కీర్తన 103:12) సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, పడమరన అస్తమిస్తాడు. తూర్పు, పడమర ఎంత దూరంలో ఉంటాయి? ఒక విధంగా, తూర్పు ఎప్పుడూ పడమరకు ఊహకందనంత దూరంలో ఉంటుంది. ఆ రెండు దిక్కులు ఎప్పటికీ కలవవు. వాటి మధ్య దూరం గురించి ఒక పండితుడు, “అది ఎంత వీలైతే అంత దూరం; మనం ఊహించలేనంత దూరం” అని అన్నాడు. యెహోవా మనల్ని క్షమిస్తే, ఆయన మన పాపాల్ని మనం ఊహించలేనంత దూరంలో ఉంచుతాడని దావీదు దైవప్రేరణతో రాశాడు.
“మీ పాపాలు . . . మంచు అంత తెల్లగా అవుతాయి”
10. యెహోవా మన పాపాల్ని క్షమిస్తే, జీవితాంతం పాపం తాలూకు మరకలతో మనం ఎందుకు ఉండనవసరం లేదు?
10 లేతరంగు బట్టల మీద పడిన మరకను తీసేయడానికి మీరు ఎప్పుడైనా ప్రయత్నించారా? బహుశా మీరు ఏం చేసినా ఆ మరక పోదు, అలాగే ఉంటుంది. అయితే యెహోవా మనల్ని ఎంతగా క్షమిస్తాడో చెప్పడానికి బైబిల్లో ఉన్న ఈ మాట గమనించండి: “మీ పాపాలు రక్తంలా ఎర్రగా ఉన్నా, మంచు అంత తెల్లగా అవుతాయి; అవి ముదురు ఎరుపు రంగులో ఉన్నా, ఉన్ని అంత తెల్లగా అవుతాయి.” (యెషయా 1:18) ‘రక్తంలాంటి ఎరుపు’ అంటే మరీ కళ్లకు కొట్టినట్టు ఉండే నిండు రంగు.a “ముదురు ఎరుపు” అంటే బట్టలకు రంగులు అద్దడంలో వాడే చిక్కటి రంగు. (నహూము 2:3) మనం ఎంత ప్రయత్నించినా పాపం అనే మరకను తీసేయలేం. కానీ మన పాపాలు రక్తంలా ఎర్రగా ఉన్నా, ముదురు ఎరుపు రంగులో ఉన్నా యెహోవా వాటిని మంచు లేదా ఉన్ని అంత తెల్లగా చేయగలడు. యెహోవా మన పాపాల్ని క్షమిస్తే, ఇక మనం జీవితాంతం పాపం తాలూకు మరకలతో ఉండాల్సిన అవసరం లేదు.
11. యెహోవా మన పాపాల్ని వెనక పారేస్తాడు అంటే అర్థమేంటి?
11 యెహోవా హిజ్కియాకు వచ్చిన ఒక ప్రాణాంతకమైన జబ్బును నయం చేసినప్పుడు, దానికి కృతజ్ఞతగా ఆయన ఒక పాట రాశాడు. అందులో ఆయన యెహోవాతో ఇలా అన్నాడు: “నా పాపాలన్నిటినీ నీ వెనక పారేశావు.” (యెషయా 38:17) యెహోవా పశ్చాత్తాపపడిన వ్యక్తి నుండి పాపాల్ని తీసుకుని తన వెనక పారేసినట్టు, హిజ్కియా ఇక్కడ వర్ణించాడు. అంటే యెహోవా వెనక్కి చూడడు, ఇక వాటిని పట్టించుకోడు. ఒక పుస్తకం చెప్తున్నట్టు, ఆ లేఖనాన్ని ఇలా అనువదించవచ్చు: “నువ్వు [నా పాపాల్ని] అసలు ఎప్పుడూ జరగలేదు అన్నట్టు చేశావు.” ఇది విని మీకు సంతోషంగా లేదా?
12. యెహోవా మనల్ని క్షమిస్తే మన పాపాల్ని శాశ్వతంగా తీసేస్తాడని మీకా ప్రవక్త ఎలా చెప్పాడు?
12 పశ్చాత్తాపం చూపించిన తన ప్రజల్ని యెహోవా ఖచ్చితంగా క్షమిస్తాడనే నమ్మకంతో మీకా ప్రవక్త ఇలా అన్నాడు: “తన ప్రజల్లో మిగిలినవాళ్ల . . . అపరాధాల్ని క్షమించే నీలాంటి దేవుడు ఎవరు? . . . నువ్వు మా పాపాలన్నిటినీ సముద్ర లోతుల్లోకి పడేస్తావు.” (మీకా 7:18, 19) ఈ మాటలు, బైబిలు కాలాల్లో జీవించిన వాళ్లకు ఎలా అర్థమై ఉంటాయో ఆలోచించండి. “సముద్ర లోతుల్లోకి” ఏదైనా పడేస్తే దాన్ని తీయడం ఎవరి వల్ల అయినా అవుతుందా? కాబట్టి, యెహోవా మన తప్పుల్ని క్షమిస్తే వాటిని శాశ్వతంగా తీసేస్తాడని మీకా మాటలు చెప్తున్నాయి.
13. ‘మా అప్పులు క్షమించు’ అని యేసు చెప్పిన మాటలకు అర్థం ఏంటి?
13 యెహోవా క్షమాపణ గురించి చెప్పడానికి యేసు అప్పుపడడం, అప్పు లాంటి పోలికల్ని వాడాడు. యేసు ఇలా ప్రార్థించమన్నాడు: ‘మా అప్పులు క్షమించు.’ (మత్తయి 6:12) ఇక్కడ యేసు, మన పాపాల్ని అప్పులతో పోల్చాడు. (లూకా 11:4) మనం పాపం చేసినప్పుడు యెహోవాకు ‘అప్పుపడతాం.’ ఒక రెఫరెన్సు పుస్తకం చెప్తున్నట్లు, “క్షమించు” అని అనువదించిన గ్రీకు పదానికి, “అప్పు కట్టమని అడగకుండా దాన్ని మాఫీ చేయడం” అని అర్థం. యెహోవా మనల్ని క్షమించినప్పుడు, ఆయన ఒకరకంగా మనం తనకు ఇవ్వాల్సిన అప్పును మాఫీ చేస్తున్నాడు. పశ్చాత్తాపం చూపించిన పాపులు ఈ మాట విని హాయిగా ఊపిరి పీల్చుకోవచ్చు. ఎందుకంటే, యెహోవా ఒక్కసారి అప్పును మాఫీ చేసేశాక, దాన్ని కట్టమని మళ్లీ ఎప్పుడూ అడగడు!—కీర్తన 32:1, 2.
14. “మీ పాపాలు తుడిచేయబడతాయి” అనే మాట వినగానే మీకు ఏం గుర్తొస్తుంది?
14 యెహోవా క్షమాపణ గురించి అపొస్తలుల కార్యాలు 3:19, అధస్సూచిలో కూడా చూస్తాం. అక్కడ ఇలా ఉంది: “కాబట్టి మీరు పశ్చాత్తాపపడి దేవుని వైపు తిరగండి. అప్పుడు మీ పాపాలు తుడిచేయబడతాయి.” ఇక్కడ, “తుడిచేయబడతాయి” అనే పదానికి గ్రీకులో “చెరిపేయడం, రద్దు చేయడం, లేకుండా చేయడం” అని అర్థం. కొంతమంది పండితులు చెప్తున్నట్లు, చేతితో రాసినదాన్ని తుడిపేయడం గురించి అది మాట్లాడుతుంది. అదెలా సాధ్యం? పూర్వకాలంలో కార్బన్, నీళ్లు, ఇంకొన్ని పదార్థాలతో తయారైన ఇంక్‌తో రాసేవాళ్లు. రాయడం అయిపోయాక, కావాలనుకుంటే దాన్ని తడిగుడ్డతో తుడిపేసేవాళ్లు. అలాగే యెహోవా మన పాపాల్ని క్షమించినప్పుడు, ఆయన ఒకరకంగా ఒక గుడ్డ తీసుకుని మన పాపాలన్నిటినీ తుడిచేస్తున్నాడు. యెహోవా కరుణను ఇది ఎంత అందంగా వర్ణిస్తుందో కదా!
15. మనం తన గురించి ఏం తెలుసుకోవాలని యెహోవా కోరుకుంటున్నాడు?
15 ఇప్పటిదాకా మనం ఇన్ని రకాల పోలికలు చూశాం కదా, వీటన్నిటిలో మనం ఒక విషయాన్ని తెలుసుకోవాలని యెహోవా కోరుకుంటున్నాడు. అదేంటంటే, మనం నిజంగా పశ్చాత్తాపం చూపిస్తే, ఆయన మన పాపాల్ని క్షమించడానికి సిద్ధంగా ఉంటాడు. ఆ పాపాల్ని మనసులో పెట్టుకుని ఆయన భవిష్యత్తులో మనల్ని శిక్షిస్తాడనే భయం మనకు అవసరం లేదు. అది మనకెలా తెలుసు? బైబిలు యెహోవా గొప్ప కరుణ గురించి ఇంకో విషయం చెప్తుంది. అదేంటంటే, ఆయన క్షమిస్తే మర్చిపోతాడు.
యెహోవా “క్షమించడానికి సిద్ధంగా” ఉంటాడని మనం తెలుసుకోవాలి అనుకుంటున్నాడు
“వాళ్ల పాపాన్ని ఇక గుర్తుచేసుకోను”
16, 17. యెహోవా మన పాపాల్ని మర్చిపోతాడు అంటే దాని అర్థమేంటి? అలాగని ఎందుకు చెప్పవచ్చు?
16 కొత్త ఒప్పందంలో ఉన్నవాళ్ల గురించి యెహోవా ఇలా మాటిచ్చాడు: “నేను వాళ్ల అపరాధాన్ని క్షమిస్తాను, వాళ్ల పాపాన్ని ఇక గుర్తుచేసుకోను.” (యిర్మీయా 31:34) అంటే యెహోవా ఒక్కసారి క్షమించేసిన తర్వాత పాపాలేవీ ఆయనకు గుర్తుండవా? కానేకాదు. దావీదుతో సహా చాలామంది చేసిన పాపాల గురించి బైబిలు చెప్తుంది. (2 సమూయేలు 11:1-17; 12:13) ఇప్పటికీ వాళ్లు చేసిన తప్పులేంటో యెహోవాకు తెలుసు. అందుకే కదా ఆయన వాళ్ల పాపాల గురించి, పశ్చాత్తాపపడడం గురించి, క్షమాపణ పొందడం గురించి మన ప్రయోజనం కోసం బైబిల్లో రాయించాడు. (రోమీయులు 15:4) మరి ఇంతకీ, దేవుడు వాళ్ల పాపాల్ని “ఇక గుర్తుచేసుకోను” అని అంటున్నప్పుడు దాని అర్థమేంటి?
17 “గుర్తుచేసుకోను” అని అనువదించిన హీబ్రూ పదానికి, ఊరికే గతాన్ని తలచుకోను అనే కాదు, గతంలో జరిగినదాన్ని బట్టి ఏదోకటి చేయను అనే అర్థం కూడా ఉందని థియొలాజికల్ వర్డ్‌బుక్ ఆఫ్ ది ఓల్డ్ టెస్ట్‌మెంట్ చెప్తుంది. కాబట్టి పాపాన్ని “గుర్తుచేసుకోవడం” అంటే, పాపులకు శిక్ష వేయడం అని అర్థం చేసుకోవచ్చు. (హోషేయ 9:9) కానీ యెహోవా “వాళ్ల పాపాన్ని ఇక గుర్తుచేసుకోను” అంటున్నప్పుడు, పశ్చాత్తాపపడిన పాపుల్ని ఒక్కసారి క్షమించేశాక, వాళ్ల పాపాల్ని బట్టి వాళ్లను భవిష్యత్తులో శిక్షించనని భరోసా ఇస్తున్నాడు. (యెహెజ్కేలు 18:21, 22) కాబట్టి యెహోవా మన పాపాల్ని మర్చిపోతాడు అంటే, వాటిని పదేపదే తవ్వితీసి మనల్ని నిందించడు లేదా శిక్షించడు అని అర్థం. యెహోవా మన పాపాల్ని క్షమించడమే కాదు, వాటిని మర్చిపోతాడు అని తెలుసుకున్నప్పుడు మీకు హాయిగా అనిపించట్లేదా?
పాపం వల్ల వచ్చే కష్టనష్టాల సంగతేంటి?
18. పశ్చాత్తాపపడిన పాపిని యెహోవా క్షమించాడంటే, అతను చేసిన చెడ్డపనికి ఏ కష్టనష్టాలు రావని దానర్థమా?
18 యెహోవా క్షమించడానికి సిద్ధంగా ఉంటాడంటే, పాపం చేసిన వ్యక్తి పశ్చాత్తాపపడిన తర్వాత అతను చేసిన చెడ్డపనికి ఏ కష్టనష్టాలు రావని దానర్థమా? కానేకాదు. తప్పు చేస్తే తిప్పలు తప్పవు. పౌలు ఇలా రాశాడు: “మనిషి ఏమి విత్తుతాడో అదే పంట కోస్తాడు.” (గలతీయులు 6:7) కాబట్టి, పాపం చేస్తే కొన్ని కష్టాలు రావచ్చు. అంటే యెహోవా మనల్ని క్షమించేసిన తర్వాత ఆయన మనకు కష్టాలు తెస్తాడని కాదు. కాబట్టి ఒక క్రైస్తవుడికి ఏదైనా కష్టం వస్తే, ‘నేను గతంలో పాపం చేశాను కదా అందుకే యెహోవా ఇప్పుడు శిక్షిస్తున్నాడేమో’ అని అనుకోకూడదు. (యాకోబు 1:13) ఇంకోవైపు, పాపం చేసిన తర్వాత వచ్చే కష్టాలు మన దరి చేరకుండా యెహోవా ఏమీ ఆపడు. పాపం చేసిన తర్వాత కొన్నిసార్లు విడాకులు, అనుకోకుండా ప్రెగ్నెంట్ అవ్వడం, సుఖవ్యాధులు, నమ్మకం పోవడం, గౌరవం తగ్గిపోవడం లాంటివి జరగవచ్చు. ఇవన్నీ చేదు అనుభవాలే, కానీ తప్పవు. దావీదు విషయంలో ఏం జరిగిందో గుర్తుచేసుకోండి. ఆయన బత్షెబ విషయంలో, ఊరియా విషయంలో చేసిన పాపాల్ని యెహోవా క్షమించినా, వాటివల్ల వచ్చిన కష్టాలు దావీదు మెడకు చుట్టుకోకుండా యెహోవా ఆపలేదు.—2 సమూయేలు 12:9-12.
19-21. (ఎ) లేవీయకాండం 6:1-7 లో ఉన్న నియమం అటు తప్పుచేసిన వ్యక్తికి, ఇటు నష్టపోయిన వ్యక్తికి ఎలా మంచి చేస్తుంది? (బి) ఎవరైనా మన పాపాల వల్ల బాధపడినప్పుడు, మనం ఏం చేస్తే యెహోవా సంతోషిస్తాడు?
19 మన పనుల వల్ల వేరేవాళ్లకు నష్టం జరిగితే, అప్పుడు మనకు ఇంకా ఎక్కువ కష్టాలు రావచ్చు. లేవీయకాండం 6వ అధ్యాయంలో ఉన్న ఉదాహరణ ఒకసారి గమనించండి. ఒక వ్యక్తి తన తోటి ఇశ్రాయేలీయుడి వస్తువుల్ని దొంగతనం చేసినా, దగా చేసినా, లేదా మోసం చేసినా ఏం చేయాలో మోషే ధర్మశాస్త్రం చెప్పింది. ఆ ఘోరమైన తప్పు చేసిన వ్యక్తి దాన్ని వెంటనే ఒప్పుకోలేదు, పైగా అబద్ధ ప్రమాణం కూడా చేశాడు. సాక్షులు ఎవ్వరూ లేకపోవడంతో అతనికి శిక్ష పడలేదు. అయితే, తర్వాత అతని మనస్సాక్షి అతన్ని గద్దించడంతో తప్పు ఒప్పుకున్నాడు. అతను దేవుని క్షమాపణ పొందాలంటే ఇంకో మూడు పనులు చేయాలి: తీసుకున్నదాన్ని తిరిగి ఇచ్చేయాలి, దోచుకున్న వస్తువుల విలువలో 20 శాతం జరిమానాగా నష్టపోయిన వ్యక్తికి ఇవ్వాలి, అలాగే అపరాధ పరిహారార్థ బలిగా ఒక పొట్టేలును ఇవ్వాలి. తర్వాత “యాజకుడు యెహోవా ముందు అతని కోసం ప్రాయశ్చిత్తం చేస్తాడు. అప్పుడు అతను . . . క్షమాపణ పొందుతాడు” అని ధర్మశాస్త్రం చెప్పింది.—లేవీయకాండం 6:1-7.
20 ఈ నియమం, దేవుడు చేసిన ఒక కరుణగల ఏర్పాటు. ఇది నష్టపోయిన వ్యక్తికి మంచి చేస్తుంది. ఎలాగంటే, దీనివల్ల అతను పోగొట్టుకున్న వస్తువు అతనికి తిరిగొస్తుంది, పైగా తప్పుచేసిన వ్యక్తి మొత్తానికి దాన్ని ఒప్పుకున్నందుకు ఇతనికి ప్రశాంతంగా కూడా ఉంటుంది. ఇంకోవైపు అది తప్పుచేసిన వ్యక్తికి కూడా మంచి చేస్తుంది. ఎలాగంటే, అతను చివరికి తన తప్పు తెలుసుకుని దాన్ని సరిదిద్దుకునేలా అతని మనస్సాక్షి అతన్ని కదిలిస్తుంది. అలా ఒప్పుకోకపోతే యెహోవా అతన్ని క్షమించడు.
21 మనం ఇప్పుడు మోషే ధర్మశాస్త్రం కింద లేకపోయినా, అందులో ఉన్న నియమాల్ని ఆలోచించడం వల్ల యెహోవా మనస్తత్వం ఏంటో, క్షమాపణ గురించి ఆయన ఆలోచన ఏంటో తెలుస్తుంది. (కొలొస్సయులు 2:13, 14) మన పాపాల వల్ల వేరేవాళ్లు బాధపడితే, మనం దాన్ని సరిచేసుకోవడానికి చేయగలిగినదంతా చేసినప్పుడు యెహోవా సంతోషిస్తాడు. (మత్తయి 5:23, 24) దానికోసం మనం మన తప్పు తెలుసుకుని, ఒప్పుకుని, బాధపడిన వ్యక్తికి సారీ కూడా చెప్పాల్సి రావచ్చు. తర్వాత, మనం యేసు బలి ఆధారంగా యెహోవాను క్షమాపణ అడగవచ్చు, అప్పుడు ఆయన మనల్ని క్షమించాడనే భరోసాతో ఉండవచ్చు.—హెబ్రీయులు 10:21, 22.
22. యెహోవా మనకు క్షమాపణతో పాటు ఇంకా ఏం ఇవ్వవచ్చు?
22 ప్రేమగల తల్లిదండ్రుల్లా, యెహోవా మనకు క్షమాపణతో పాటు కొంత క్రమశిక్షణను కూడా ఇవ్వవచ్చు. (సామెతలు 3:11, 12) పశ్చాత్తాపం చూపించిన క్రైస్తవుడు పెద్దగా, సంఘ పరిచారకుడిగా, లేదా పూర్తికాల సేవకుడిగా తన సేవను ఆపేయాల్సి రావచ్చు. తనకు ఎంతో ఇష్టమైన బాధ్యతల్ని కొంతకాలం చేయలేకపోవడం ఆయనకు బాధగా అనిపించవచ్చు. అలా జరిగినప్పుడు యెహోవా తనను క్షమించట్లేదు అని అనుకోకూడదు గానీ, క్రమశిక్షణ ఇచ్చాడంటేనే యెహోవాకు తన మీద ప్రేమ ఉందని గుర్తుంచుకోవాలి. క్రమశిక్షణను తీసుకోవడం, పాటించడం మనకే మంచిది.—హెబ్రీయులు 12:5-11.
23. యెహోవా కరుణను పొందలేనంత దూరంగా ఉన్నామని మనం ఎందుకు అనుకోకూడదు? మనం ఆయనలా ఎందుకు క్షమించాలి?
23 మన దేవుడు “క్షమించడానికి సిద్ధంగా” ఉంటాడని తెలుసుకున్నాక ఎంత సంతోషంగా ఉందో కదా! మనం తప్పు చేసినప్పుడు, యెహోవా కరుణను పొందలేనంత దూరంగా ఉన్నామని ఎప్పుడూ అనుకోకూడదు. మనం నిజమైన పశ్చాత్తాపం చూపిస్తూ, మన తప్పును సరిదిద్దుకోవడానికి తగిన పనులు చేస్తూ, యేసు రక్తం ఆధారంగా క్షమించమని పట్టుదలగా ప్రార్థిస్తే, యెహోవా మనల్ని ఖచ్చితంగా క్షమిస్తాడు అనే నమ్మకంతో మనం ఉండవచ్చు. (1 యోహాను 1:9) మనం కూడా యెహోవాలా వేరేవాళ్లను క్షమిస్తూ ఉందాం. ఏ పాపం చేయని యెహోవాయే మనల్ని ఇంత ప్రేమగా క్షమిస్తుంటే, పొద్దున లేస్తే పాపం చేసే మనం మనలాంటి వేరేవాళ్లను క్షమించవద్దా?
a ఒక పండితుడు ఆ రంగు గురించి ఇలా అన్నాడు: “అది శాశ్వతంగా అంటుకుపోయే రంగు. మంచులో తడిసినా, వర్షం వచ్చినా, ఉతికినా, ఎంతకాలం వాడినా అది అస్సలు వదలదు.”