కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w95 7/1 పేజీలు 9-14
  • పరలోక పౌరసత్వంగల క్రైస్తవ సాక్షులు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పరలోక పౌరసత్వంగల క్రైస్తవ సాక్షులు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ‘తిరిగి జన్మించడం’
  • దేవుని పిల్లలు
  • “దేవుని ఇశ్రాయేలు”
  • ఒక క్రొత్త నిబంధన
  • “నూతన యెరూషలేము”
  • యెహోవా అనేకులైన కుమారులను మహిమకు తెస్తాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • పరలోక పిలుపును నిజముగా ఎవరు కలిగియున్నారు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
  • “దేవుని ఇశ్రాయేలు” మరియు “గొప్ప సమూహము”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • పరలోకంలో ఉన్నవాటిని, భూమ్మీద ఉన్నవాటిని సమకూర్చడం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2006
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
w95 7/1 పేజీలు 9-14

పరలోక పౌరసత్వంగల క్రైస్తవ సాక్షులు

“మన పౌరస్థితి [పౌరసత్వం NW] పరలోకమునందున్నది.”—ఫిలిప్పీయులు 3:20.

1. కొంతమంది మానవుల విషయంలో యెహోవాకు ఏ అద్భుతమైన సంకల్పం ఉంది?

మానవులుగా జన్మించిన వ్యక్తులు, పరలోకంలో రాజులు మరియు యాజకులుగా దేవదూతలను సహితం పరిపాలిస్తారు. (1 కొరింథీయులు 6:2, 3; ప్రకటన 20:6) అదెంతటి ఆశ్చర్యకరమైన సత్యమో కదా! అయినప్పటికీ, యెహోవా దాన్ని సంకల్పించాడు, మరి తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన దాన్ని సాధిస్తాడు. మన సృష్టికర్త అలాంటి పని ఎందుకు చేస్తాడు? ఆ విషయాన్ని గురించి తెలుసుకోవడం ఒక క్రైస్తవున్ని నేడు ఎలా ప్రభావితం చేయాలి? బైబిలు ఈ ప్రశ్నలకు ఎలా సమాధానమిస్తుందో చూద్దాము.

2. యేసు ఏ క్రొత్త సంగతి చేస్తాడని బాప్తిస్మమిచ్చు యోహాను ప్రకటించాడు, మరి ఈ క్రొత్త సంగతి దేనికి సంబంధించినది?

2 బాప్తిస్మమిచ్చు యోహాను యేసు కొరకు మార్గాన్ని సిద్ధం చేస్తున్నప్పుడు, యేసు ఏదో కొంత క్రొత్తది చేస్తాడని ఆయన ప్రకటించాడు. ఆ వృత్తాంతమిలా చెబుతుంది: “[యోహాను]—నాకంటె శక్తిమంతుడొకడు నా వెనుక వచ్చుచున్నాడు; నేను వంగి ఆయన చెప్పులవారును విప్పుటకు పాత్రుడనుకాను; నేను నీళ్లతో మీకు బాప్తిస్మమిచ్చితిని గాని ఆయన పరిశుద్ధాత్మతో మీకు బాప్తిస్మమిచ్చునని చెప్పి ప్రకటించుచుండెను.” (మార్కు 1:7, 8 అథఃస్సూచి) ఆ సమయానికి ముందు, ఎవ్వరికీ పరిశుద్ధాత్మతో బాప్తిస్మం ఇవ్వబడలేదు. ఇది పరిశుద్ధాత్మ ఇమిడి ఉన్న ఒక క్రొత్త ఏర్పాటు, మానవులను పరలోక పరిపాలనకు సిద్ధపర్చాలన్న యెహోవా యొక్క ఇంకా బయల్పర్చబడ వలసిన సంకల్పానికి సంబంధించినది.

‘తిరిగి జన్మించడం’

3. పరలోక రాజ్యాన్ని గురించిన ఏ క్రొత్త విషయాలను యేసు నీకొదేముకు వివరించాడు?

3 ఒక ప్రముఖ పరిసయ్యునితో ఒక రహస్య సమావేశంలో, ఈ దైవిక సంకల్పాన్ని గురించి యేసు ఇంకా ఎక్కువ బయల్పర్చాడు. నీకొదేము అను ఆ పరిసయ్యుడు యేసు దగ్గరికి రాత్రి వేళలో వచ్చాడు, మరి యేసు అతనితో “ఒకడు తిరిగి జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని” అన్నాడు. (యోహాను 3:3 [NW]) ఒక పరిసయ్యునిగా నీకొదేము హెబ్రీ లేఖనాలను చదివి ఉండవచ్చు, కాబట్టి దేవుని రాజ్యాన్ని గురించిన మహిమాన్విత సత్యాన్ని గూర్చి కొంత తెలుసు. ఆ రాజ్యం “మనుష్యకుమారునిపోలిన” యొకనికి మరియు “మహోన్నతుని పరిశుద్ధులకు” ఇవ్వబడుతుందని దానియేలు గ్రంథం ప్రవచించింది. (దానియేలు 7:13, 14, 27) ఆ రాజ్యం ఇతర రాజ్యాలన్నింటినీ “పగులగొట్టి నిర్మూలము చేయును” మరి అది నిరంతరం నిలుచును. (దానియేలు 2:44) ఈ ప్రవచనాలు యూదా జనాంగం విషయంలో నెరవేర్చబడతాయని బహుశా నీకొదేము తలంచి ఉంటాడు; అయితే ఆ రాజ్యాన్ని చూడాలంటే ఒకడు తిరిగి జన్మించాలని యేసు చెప్పాడు. నీకొదేముకు అర్థం కాలేదు, అందుకే “ఒకడు నీటిమూలముగాను ఆత్మమూలముగాను జన్మించితేనేగాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని” యేసు చెప్పాడు.—యోహాను 3:5.

4. పరిశుద్ధాత్మ ద్వారా జన్మించిన వారికి యెహోవాతో వారికున్న సంబంధం ఎలా మారుతుంది?

4 బాప్తిస్మమిచ్చు యోహాను పరిశుద్ధాత్మతో ఇవ్వబడే బాప్తిస్మం గురించి మాట్లాడాడు. ఒక వ్యక్తి దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే తాను పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాలని యేసు ఇప్పుడు చెప్పాడు. ఈ ప్రత్యేక జన్మ ద్వారా, అసంపూర్ణ స్త్రీ పురుషులు యెహోవా దేవునితో ఒక అత్యంత ప్రత్యేక సంబంధంలోకి ప్రవేశిస్తారు. వారు ఆయన దత్తత పిల్లలౌతారు. “[యేసును] ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. వారు దేవునివలన పుట్టినవారే గాని, రక్తమువలననైనను శరీరేచ్ఛవలననైనను మానుషేచ్ఛవలననైనను పుట్టినవారు కారని” మనం చదువుతాము.—యోహాను 1:12, 13; రోమీయులు 8:15.

దేవుని పిల్లలు

5. నమ్మకస్థులైన శిష్యులు ఎప్పుడు పరిశుద్ధాత్మతో బాప్తిస్మం పొందారు, మరి అదే సమయంలో పరిశుద్ధాత్మకు సంబంధించిన కార్యకలాపాలు అప్పుడు ఇంకేమి జరిగాయి?

5 యేసు నీకొదేముతో మాట్లాడినప్పుడు, దేవుని రాజ్యంలో భవిష్యత్‌ రాజరికంకొరకు ఆయనను అభిషేకిస్తూ పరిశుద్ధాత్మ అప్పటికే యేసుపైకి వచ్చింది, మరి దేవుడు యేసును తన కుమారునిగా అప్పటికే బహిరంగంగా ఒప్పుకున్నాడు. (మత్తయి 3:16, 17) సా.శ. 33 పెంతెకొస్తునాడు యెహోవా ఇంకా ఎక్కువమంది ఆత్మీయ పిల్లలను కన్నాడు. యెరూషలేములోని మేడగదిలో సమకూడిన నమ్మకమైన శిష్యులు పరిశుద్ధాత్మతో బాప్తిస్మం పొందారు. అదే సమయంలో, దేవుని ఆత్మీయ కుమారులయ్యేందుకు వారు పరిశుద్ధాత్మ ద్వారా తిరిగి జన్మించారు. (అపొస్తలుల కార్యములు 2:2-4, 38; రోమీయులు 8:15) అంతేకాక, భవిష్యత్‌ పరలోక వారసత్వం కొరకు వారు పరిశుద్ధాత్మతో అభిషేకించబడ్డారు, మరి ఆ పరలోక నిరీక్షణ తప్పక నెరవేరుతుందనే దానికి సంచకరువుగా వారు మొదటిగా పరిశుద్ధాత్మతో ముద్ర వేయబడ్డారు.—2 కొరింథీయులు 1:21, 22.

6. పరలోక రాజ్యాన్ని గురించిన యెహోవా సంకల్పం ఏమిటి, మరి దీనిలో మానవులు భాగం కలిగి ఉండాలన్నది ఎందుకు సముచితమైనది?

6 ఆ రాజ్యంలో ప్రవేశించడానికి దేవుడు ఎన్నుకున్న మొదటి అసంపూర్ణ మానవులు వీరే. అంటే, వారు తాము మరణించి, పునరుత్థానమైన తర్వాత, మానవులు మరియు దేవదూతలపై పరిపాలన చేసే పరలోక రాజ్యసంస్థలో భాగమౌతారు. ఈ రాజ్యం ద్వారా, సర్వసృష్టి ముందు ఆయన గొప్ప నామం పరిశుద్ధపర్చబడాలని మరి ఆయన సర్వాధిపత్యం నిరూపించబడాలని యెహోవా సంకల్పించాడు. (మత్తయి 6:9, 10; యోహాను 12:28) ఆ రాజ్యంలో మానవులు భాగం కలిగివుండటం ఎంత సముచితమైనదో కదా! ఆ నాడు ఏదెను తోటలో యెహోవా సర్వాధిపత్యానికి విరుద్ధంగా తన మొదటి సవాలును లేవదీసేటప్పుడు సాతాను మానవులనే ఉపయోగించాడు, మరి ఇప్పుడు ఆ సవాలుకు జవాబు చెప్పడంలో మానవులు ఇమిడి ఉండాలని యెహోవా సంకల్పిస్తున్నాడు. (ఆదికాండము 3:1-6; యోహాను 8:44) అపొస్తలుడైన పేతురు ఆ రాజ్యంలో పరిపాలించేందుకు ఎన్నుకొనబడిన వ్యక్తులకు ఇలా వ్రాశాడు: “మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రియైన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలోనుండి యేసుక్రీస్తు తిరిగి లేచుటవలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు, నిర్మలమైనదియు, వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు, ఆయన తన విశేష కనికరముచొప్పున మనలను మరల జన్మింపజేసెను. . . . ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడియున్నది.”—1 పేతురు 1:3-5.

7. పరిశుద్ధాత్మతో బాప్తిస్మం పొందిన వారు యేసుతో ఎలాంటి అనుపమానమైన సంబంధాన్ని అనుభవిస్తారు?

7 దేవుని దత్తపుత్రులుగా, ఎన్నుకొనబడిన ఈ క్రైస్తవులు యేసుక్రీస్తు సహోదరులయ్యారు. (రోమీయులు 8:16, 17; 9:4, 26; హెబ్రీయులు 2:11) యేసు అబ్రాహాముకు వాగ్దానం చేయబడిన సంతానమని నిరూపించబడ్డాడు గనుక, ఆత్మాభిషేకం నొందిన ఈ క్రైస్తవులు కూడా, విశ్వసించే మానవజాతిపై దీవెనలు కుమ్మరించే సంతానం యొక్క సహవాస, లేక అనుబంధ భాగమైయున్నారు. (ఆదికాండము 22:17, 18; గలతీయులు 3:16, 26, 29) ఎటువంటి దీవెనలు? పాపం నుండి రక్షింపబడటం, దేవునితో సమాధానపర్చబడటం మరియు ఆయనను ఇప్పుడు మరియు నిత్యము సేవించడమే. (మత్తయి 4:23; 20:28; యోహాను 3:16, 36; 1 యోహాను 2:1, 2) తమ ఆత్మీయ సహోదరుడైన యేసుక్రీస్తును గురించి మరియు తమ దత్తు తండ్రియైన యెహోవా దేవుని గురించి సాక్ష్యమివ్వడం ద్వారా, భూమిపైనున్న అభిషక్త క్రైస్తవులు యథార్థపరులను ఈ దీవెనలవైపుకు మళ్లిస్తారు.—అపొస్తలుల కార్యములు 1:8; హెబ్రీయులు 13:15.

8. ఆత్మ మూలంగా జన్మించిన దేవుని కుమారుల “ప్రత్యక్షత” అంటే ఏమిటి?

8 ఆత్మ మూలంగా జన్మించిన ఈ దేవుని కుమారుల “ప్రత్యక్షతను” గురించి బైబిలు మాట్లాడుతుంది. (రోమీయులు 8:19) యేసుతోపాటు ఆ రాజ్యంలో సహ రాజులుగా ఉంటూ, సాతాను లోక విధానాన్ని నాశనం చేయడంలో వీరు పాల్పంచుకుంటారు. తర్వాత, విమోచనా క్రయధనం యొక్క ప్రయోజనాలను మానవజాతికి అందించి, మానవజాతిని ఆదాము కోల్పోయిన పరిపూర్ణతకు తేవడంలో వారు వెయ్యేండ్ల పాటు సహాయం చేస్తారు. (2 థెస్సలొనీకయులు 1:8-10; ప్రకటన 2:26, 27; 20:6; 22:1, 2) వారి ప్రత్యక్షతలో ఇవన్నీ ఇమిడి ఉంటాయి. విశ్వసించే మానవ సృష్టి దీని కొరకే అపేక్షతో ఎదురు చూస్తోంది.

9. అభిషక్త క్రైస్తవుల ప్రపంచవ్యాప్త సమాఖ్యను బైబిలు ఎలా సూచిస్తుంది?

9 “పరలోకమందు వ్రాయబడియున్న జ్యేష్ఠుల సంఘమే” అభిషక్త క్రైస్తవుల ప్రపంచవ్యాప్త సమాఖ్య. (హెబ్రీయులు 12:23) యేసు విమోచనా బలి ద్వారా ప్రయోజనం పొందేవారిలో వీరే మొదటి వారు. వారు “క్రీస్తుయొక్క శరీరమై” కూడా ఉన్నారు, ఇది వారు ఒకరితో ఒకరు మరియు యేసుతో కలిగివున్న సన్నిహిత సంబంధాన్ని చూపిస్తుంది. (1 కొరింథీయులు 12:27) “ఏలాగు శరీరము ఏకమైయున్నను అనేకమైన అవయవములు కలిగియున్నదో, యేలాగు శరీరముయొక్క అవయవము లన్నియు అనేకములైయున్నను ఒక్క శరీరమైయున్నవో, ఆలాగే క్రీస్తు ఉన్నాడు. ఏలాగనగా, యూదులమైనను, గ్రీసుదేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను, మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానముచేసినవారమైతిమి,” అని పౌలు వ్రాశాడు.—1 కొరింథీయులు 12:12, 13; రోమీయులు 12:5; ఎఫెసీయులు 1:22, 23; 3:6.

“దేవుని ఇశ్రాయేలు”

10, 11. మొదటి శతాబ్దంలో నూతన ఇశ్రాయేలు ఎందుకు అవసరమైంది, మరి ఈ నూతన జనాంగంలో ఎవరు చేరి ఉన్నారు?

10 యేసు వాగ్దాన మెస్సీయగా వచ్చేందుకు 1,500 సంవత్సరాల కంటే ముందు, శారీరక ఇశ్రాయేలు జనాంగం యెహోవా యొక్క ప్రత్యేక ప్రజలై ఉన్నారు. ఎడతెగక జ్ఞాపికలను పంపినప్పటికీ, ఆ జనాంగం అపనమ్మకస్థులయ్యారు. యేసు కనిపించినప్పుడు, ఆ జనాంగం ఆయనను నిరాకరించింది. (యోహాను 1:11) అందుకే, “దేవుని రాజ్యము మీ యొద్దనుండి తొలగింపబడి, దాని ఫలమిచ్చు జనాంగమునకియ్యబడునని,” యేసు యూదా మత నాయకులకు చెప్పాడు. (మత్తయి 21:43 NW) “[రాజ్యము యొక్క] ఫలమిచ్చు [ఆ] జనాంగమును” గుర్తించడం రక్షణ కొరకు అత్యంత ప్రాముఖ్యము.

11 ఆ క్రొత్త జనాంగమే, సా.శ. 33 పెంతెకొస్తునాడు జన్మించిన అభిషక్త క్రైస్తవ సంఘము. దాని మొదటి సభ్యులు యేసును తమ పరలోక రాజుగా అంగీకరించిన యూదులైన శిష్యులే. (అపొస్తలుల కార్యములు 2:5, 32-36) అయితే, వారు తమ యూదా వంశానుక్రమం ఆధారంగా కాక యేసునందలి విశ్వాసం ఆధారంగా, దేవుని క్రొత్త జనాంగం యొక్క సభ్యులు అయ్యారు. అలా, దేవుని యొక్క ఈ క్రొత్త ఇశ్రాయేలు ఎంతో ప్రత్యేకమైనది—అదొక ఆత్మీయ జనాంగం. యూదుల్లో అధికులు యేసును అంగీకరించేందుకు నిరాకరించినప్పుడు, క్రొత్త జనాంగంలో భాగమవ్వగల ఆహ్వానం సమరయులకు అటు తర్వాత అన్యులకు అందించబడింది. ఆ క్రొత్త జనాంగం “దేవుని ఇశ్రాయేలు” అని పిలువబడింది.—గలతీయులు 6:16.

12, 13. నూతన ఇశ్రాయేలు యూదా మతం యొక్క ఒక తెగ కాదని ఎలా తేటతెల్లమైంది?

12 ప్రాచీన ఇశ్రాయేలులో, యూదులుకాని వారు యూదమత ప్రవిష్టులైనప్పుడు, వారు మోషే ధర్మశాస్త్రానికి లోబడాలి, మరి మగవారు సున్నతి చేయించుకోవడం ద్వారా దాన్ని సూచించాలి. (నిర్గమకాండము 12:48, 49) దేవుని ఇశ్రాయేలులోని యూదులుకాని వారికి కూడా అదే అన్వయిస్తుందని కొందరు యూదా క్రైస్తవులు భావించారు. అయితే, యెహోవా మనస్సులో వేరేది ఉంది. పరిశుద్ధాత్మ అపొస్తలుడైన పేతురును అన్యుడైన కొర్నేలి గృహానికి నడిపింది. కొర్నేలి మరియు అతని కుటుంబం పేతురు ప్రకటనాపనికి ప్రతిస్పందించినప్పుడు, వారింకా నీటి బాప్తిస్మం తీసుకోక ముందే వారు పరిశుద్ధాత్మను పొందారు. వారు మోషే ధర్మశాస్త్రానికి లోబడాలని అక్షేపించకుండా యెహోవా ఈ అన్యులను దేవుని ఇశ్రాయేలు యొక్క సభ్యులుగా అంగీకరించాడని ఇది స్పష్టంగా చూపింది.—అపొస్తలుల కార్యములు 10:21-48.

13 దీన్ని అంగీకరించడం కష్టతరమని కొందరు విశ్వాసులు భావించారు, మరి త్వరలో ఈ విషయం యెరూషలేములోని అపొస్తలులు మరియు పెద్దల ద్వారా చర్చించబడవలసి వచ్చింది. యూదులుకాని విశ్వాసులపై పరిశుద్ధాత్మ ఎలా పనిచేసిందన్న సాక్ష్యాధారాన్ని ఆ అధికార సమితి ఆలకించింది. అది ప్రేరేపిత ప్రవచనాల నెరవేర్పులో జరిగిందని బైబిలు పరిశోధన చూపింది. (యెషయా 55:5; ఆమోసు 9:11, 12) ఒక సరైన నిర్ణయం తీసుకోబడింది: యూదులు కాని క్రైస్తవులు మోషే ధర్మశాస్త్రానికి లోబడనవసరం లేదు. (అపొస్తలుల కార్యములు 15:1, 6-29) అలా, ఆత్మీయ ఇశ్రాయేలు నిజంగా ఒక క్రొత్త జనాంగం, కానీ అది యూదా మతం యొక్క ఒక తెగ కాదు.

14. క్రైస్తవ సంఘాన్ని “అన్యదేశములయందు చెదిరియున్న పండ్రెండు గోత్రములవారు” అని యాకోబు పిలవడం ద్వారా ఏమి సూచించబడింది?

14 దీనికి సమన్వయంగా, మొదటి శతాబ్దంలోని అభిషక్త క్రైస్తవులకు వ్రాస్తున్నప్పుడు, శిష్యుడైన యాకోబు తన పత్రికను “అన్యదేశములయందు చెదిరియున్న పండ్రెండు గోత్రములవారికి” అని సంబోధించాడు. (యాకోబు 1:1; ప్రకటన 7:3-8) నిజమే, నూతన ఇశ్రాయేలు యొక్క పౌరులు ప్రత్యేక గోత్రాలకు నియమించబడలేదు. శారీరక ఇశ్రాయేలులో ఉన్నట్లుగా ఆత్మీయ ఇశ్రాయేలులో 12 విభిన్న గోత్రాలుగా విభజింపబడలేదు. అయినప్పటికీ, యెహోవా దృష్టిలో సహజ ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాలకు ప్రతిగా దేవుని ఇశ్రాయేలు పూర్తిగా ప్రతిస్థాపించబడిందని యాకోబు యొక్క ప్రేరేపిత వాక్కు సూచిస్తుంది. ఒకవేళ జన్మతః ఇశ్రాయేలీయుడైన ఒకరు నూతన జనాంగంలో భాగమైతే, అతని భౌతిక వంశానుక్రమం ప్రకారం అతను యూదా గోత్రీకుడైనా లేక లేవీ గోత్రీకుడైనా, దానికి ప్రాధాన్యత లేదు.—గలతీయులు 3:28; ఫిలిప్పీయులు 3:5, 6.

ఒక క్రొత్త నిబంధన

15, 16. (ఎ) దేవుని ఇశ్రాయేలులోని యూదులు కాని సభ్యులను యెహోవా ఎలా దృష్టిస్తాడు? (బి) నూతన ఇశ్రాయేలు ఏ న్యాయపర ఆధారంపై స్థాపించబడింది?

15 యెహోవా దృష్టిలో ఈ నూతన జనాంగం యొక్క ఇశ్రాయేలీయులు-కాని సభ్యులు పూర్ణ రీతిలో ఆత్మీయ యూదులే! అపొస్తలుడైన పౌలు ఇలా వివరించాడు: “బాహ్యమునకు యూదుడైనవాడు యూదుడు కాడు; శరీరమందు బాహ్యమైన సున్నతి సున్నతికాదు. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరమువలన కలుగునది కాదు. అట్టివానికి మెప్పు మనుష్యులవలన కలుగదు దేవునివలననే కలుగును.” (రోమీయులు 2:28, 29) దేవుని ఇశ్రాయేలులో భాగమై ఉండేందుకు ఇవ్వబడిన ఆహ్వానానికి అనేకమంది అన్యులు ప్రతిస్పందించారు, మరి ఈ మార్పు బైబిలు ప్రవచనాన్ని నెరవేర్చింది. ఉదాహరణకు, ప్రవక్తయైన హోషేయ ఇలా వ్రాశాడు: “జాలినొందని దానియందు నేను జాలిచేసి కొందును; నా జనము కానివారితో—మీరే నా జనమని నేను చెప్పగా వారు—నీవే మా దేవుడవు అని యందురు.”—హోషేయ 2:23; రోమీయులు 11:25, 26.

16 ఒకవేళ ఆత్మీయ ఇశ్రాయేలీయులు మోషే ధర్మశాస్త్రం క్రింద లేనట్లైతే, వారు దేని ఆధారంగా నూతన జనాంగంలో భాగమయ్యారు? ఈ ఆత్మీయ జనాంగంతో యెహోవా యేసు ద్వారా ఒక క్రొత్త నిబంధనను చేశాడు. (హెబ్రీయులు 9:15) సా.శ. 33 నీసాను 14న తన మరణ జ్ఞాపకార్థ దినాన్ని యేసు ప్రారంభించినప్పుడు, ఆయన రొట్టెను ద్రాక్షారసాన్ని తన 11 మంది నమ్మకస్థులైన అపొస్తలులకు అందించి, ద్రాక్షారసం “నిబంధన రక్తమును” సూచించిందని చెప్పాడు. (మత్తయి 26:28; యిర్మీయా 31:31-34) లూకా వృత్తాంతంలో చెప్పబడినట్లు, ద్రాక్షారసపు గిన్నె “క్రొత్త నిబంధనను” సూచిస్తుందని యేసు చెప్పాడు. (లూకా 22:20) యేసు మాటల నెరవేర్పుగా, పెంతెకొస్తునాడు పరిశుద్ధాత్మ కుమ్మరింపబడినప్పుడు మరి దేవుని ఇశ్రాయేలు జన్మించినప్పుడు, రాజ్యము శారీరక ఇశ్రాయేలు నుండి తీసివేయబడి నూతన, ఆత్మీయ ఇశ్రాయేలుకు ఇవ్వబడింది. శారీరక ఇశ్రాయేలుకు బదులు, ఈ నూతన జనాంగం ఇప్పుడు యెహోవా యొక్క సాక్షులతో సమకూర్చబడిన ఆయన సేవకుడు.—యెషయా 43:10, 11

“నూతన యెరూషలేము”

17, 18. అభిషక్త క్రైస్తవుల కొరకు వేచివున్న మహిమను గురించిన ఏ వర్ణనలు ప్రకటన గ్రంథంలో ఇవ్వబడ్డాయి?

17 పరలోక పిలుపులో భాగం కలిగివుండే ఆధిక్యతగల వారికొరకు ఎంతటి మహిమ వేచి ఉందో కదా! వారి కొరకు వేచివున్న అద్భుతాలను గురించి తెలుసుకోవడం ఎంత ఆనందకరమో కదా! వారి పరలోక వారసత్వం యొక్క పులకరింపజేసే ముంగుర్తులను ప్రకటన గ్రంథం అందిస్తుంది. ఉదాహరణకు, ప్రకటన 4:4నందు మనమిలా చదువుతాము: “[యెహోవా] సింహాసనముచుట్టు ఇరువదినాలుగు సింహాసనములుండెను, ఈ సింహాసనములందు ఇరువదినలుగురు పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని, తమ తలలమీద సువర్ణ కిరీటములు పెట్టుకొన్నవారై కూర్చుండిరి.” ఈ 24 పెద్దలు, పునరుత్థానం చేయబడి యెహోవా తమకు వాగ్దానం చేసిన పరలోక స్థానాలను ఇప్పుడు ఆక్రమించుకొనియున్న అభిషక్త క్రైస్తవులు. వారి కిరీటాలు మరియు సింహాసనాలు మనకు వారి రాజరికాన్ని తెలియజేస్తాయి. యెహోవా సింహాసనం చుట్టూ సేవచేయగల వారికున్న అత్యంత గొప్ప ఆధిక్యతను గురించి కూడా ఆలోచించండి!

18 ప్రకటన 14:1నందు వారిని మరొకసారి మనం చూస్తాము: “నేను చూడగా, ఇదిగో, ఆ గొఱ్ఱెపిల్ల సీయోను పర్వతముమీద నిలువబడియుండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసళ్లయందు లిఖింపబడియున్న నూట నలువది నాలుగు వేలమంది ఆయనతోకూడ ఉండిరి.” ఇక్కడ మనం ఈ అభిషేకింపబడిన వారి పరిమిత సంఖ్య, అంటే 1,44,000 మందిని చూస్తాము. యెహోవా యొక్క సింహాసనాసీనుడైన రాజు, “గొఱ్ఱెపిల్ల,” అయిన యేసుతో పాటు వారు నిలబడటంలో వారి రాజరిక హోదాను గ్రహించవచ్చు. మరి వారు పరలోక సీయోను పర్వతంపై ఉన్నారు. భూలోక సీయోను పర్వతం ఇశ్రాయేలు రాజనగరమైన యెరూషలేము ఉన్న స్థలము. పరలోక సీయోను పర్వతం, యేసు మరియు పరలోక యెరూషలేములో భాగమైన ఆయన సహవారసుల ఉన్నత స్థానాన్ని సూచిస్తుంది.—2 దినవృత్తాంతములు 5:2; కీర్తనలు 2:6.

19, 20. (ఎ) అభిషక్త క్రైస్తవులు ఏ పరలోక సంస్థలో భాగమై ఉంటారు? (బి) పరలోకంలో పౌరసత్వం పొందనైయున్న పౌరులను యెహోవా ఏ కాల నిడివిలో ఎన్నుకున్నాడు?

19 దీనికి సమన్వయంగా, తమ పరలోక మహిమలో ఉన్న అభిషక్తులు “నూతనమైన యెరూషలేము” అని కూడా పిలువబడుతున్నారు. (ప్రకటన 21:2) భూలోక యెరూషలేము “మహారాజు పట్టణము” మరి దేవాలయం ఉన్న ప్రాంతం కూడా. (మత్తయి 5:35) గొప్ప సర్వాధిపతియైన యెహోవా మరియు ఆయన నియమించిన రాజైన యేసు ఇప్పుడు పరిపాలించే మహిమాన్విత రాజ్య సంస్థయే పరలోక నూతన యెరూషలేము, మానవజాతి స్వస్థత కొరకు యెహోవా సింహాసనం నుండి గొప్ప ఆశీర్వాదాలు ప్రవహిస్తుండగా దానిలో యాజకసేవ జరుగుతుంది. (ప్రకటన 21:10, 11; 22:1-5) మరొక దర్శనంలో నమ్మకమైన, పునరుత్థానం చేయబడిన, అభిషక్త క్రైస్తవులను ‘గొఱ్ఱెపిల్ల భార్య’ అని సంబోధించినట్లు యోహాను వింటాడు. యేసుతో వారు అనుభవించే సాన్నిహిత్యానికి మరియు ఆయనకు వారు చూపే ఇష్టపూర్వక విధేయతకు ఇది ఎంత సుందరమైన అలంకారికరూపం! వారిలో చివరి వ్యక్తి తన పరలోక బహుమానాన్ని తుదకు పొందినప్పుడు పరలోకంలో కలిగే ఆనందాన్ని ఊహించుకోండి. ఇప్పుడు, చివరకు “గొఱ్ఱెపిల్ల వివాహోత్సవము” జరుగవచ్చు! అప్పుడు ఆ రాజరిక పరలోక సంస్థ సంపూర్తి అవుతుంది.—ప్రకటన 19:6-8.

20 నిజమే, “మన పౌరస్థితి [పౌరసత్వం NW] పరలోకమునందున్నది” అని ఎవరి గురించి అపొస్తలుడైన పౌలు చెప్పాడో, వారి కొరకు అద్భుతమైన ఆశీర్వాదాలు వేచివున్నాయి. (ఫిలిప్పీయులు 3:20) దాదాపు రెండు వేల సంవత్సరాలుగా, యెహోవా తన ఆత్మీయ పిల్లలను ఎన్నుకొని, వారిని పరలోక వారసత్వం కొరకు సిద్ధం చేస్తూ ఉన్నాడు. రుజువులన్నిటి ఆధారంగా, ఎన్నుకోవడం మరియు సిద్ధం చేయడమనే ఈ పని ముగియబోతోంది. ప్రకటన 7వ అధ్యాయంలోని యోహాను యొక్క దర్శనంలో ఆయనకు బయల్పర్చబడినట్లు, ఇంకా ఎక్కువ రాబోతోంది. కావున ఇప్పుడు, క్రైస్తవుల యొక్క మరొక గుంపు మన అవధానాన్ని అపేక్షిస్తుంది, మరి మా తదుపరి శీర్షికలో ఈ గుంపును మనం పరిశీలిస్తాము.

మీకు జ్ఞాపకం ఉన్నాయా?

◻ పరలోక వారసత్వం ఉన్న వారిపై ఆత్మ యొక్క విభిన్న కార్యకలాపాలు ఏమిటి?

◻ యెహోవాతో మరియు యేసుతో అభిషక్తులు ఏ సన్నిహిత సంబంధాన్ని అనుభవిస్తారు?

◻ అభిషక్త క్రైస్తవుల సంఘం బైబిలులో ఎలా వర్ణించబడింది?

◻ దేవుని ఇశ్రాయేలు ఏ న్యాయపర ఆధారంపై స్థాపించబడింది?

◻ అభిషక్త క్రైస్తవుల కొరకు ఏ పరలోక ఆధిక్యతలు వేచి ఉన్నాయి?

[10వ పేజీలోని చిత్రాలు]

దాదాపు రెండు వేల సంవత్సరాల కాల నిడివిలో, పరలోక రాజ్యంలో పరిపాలించబోయే వారిని యెహోవా ఎన్నుకున్నాడు

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి