కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • kr అధ్యా. 17 పేజీలు 182-191
  • రాజ్య ప్రచారకులకు శిక్షణ ఇవ్వడం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • రాజ్య ప్రచారకులకు శిక్షణ ఇవ్వడం
  • దేవుని రాజ్యం పరిపాలిస్తోంది!
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • “తండ్రి నాకు నేర్పించిన వాటినే నేను మాట్లాడుతున్నాను”
  • చక్కగా ప్రకటించేలా శిక్షణ ఇవ్వడం
  • తమ బాధ్యతలను చక్కగా నిర్వర్తించేలా సహోదరులకు శిక్షణ ఇవ్వడం
  • మరింత ఎక్కువగా యెహోవా సేవచేయడానికి తోడ్పడే పాఠశాలలు అవి యెహోవా ప్రేమకు నిదర్శనాలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2012
  • యెహోవా నుండి వీలైనంత ఎక్కువగా నేర్చుకుంటున్నారా?
    మన రాజ్య పరిచర్య—2011
  • పయినీర్లకు శిక్షణ ఇవ్వడానికి ఎలాంటి పాఠశాలలు ఉన్నాయి?
    నేడు యెహోవా ఇష్టాన్ని ఎవరు చేస్తున్నారు?
  • పరిచర్య శిక్షణా పాఠశాల—ఫలవంతమైన సేవ చేయడానికి గొప్ప అవకాశం
    మన రాజ్య పరిచర్య—2005
మరిన్ని
దేవుని రాజ్యం పరిపాలిస్తోంది!
kr అధ్యా. 17 పేజీలు 182-191

17

రాజ్య ప్రచారకులకు శిక్షణ ఇవ్వడం

ఈ అధ్యాయంలోని ముఖ్యాంశం

తమ నియామకాలు నిర్వర్తించేలా రాజ్య ప్రచారకులకు శిక్షణ ఇవ్వడం

1-3. యేసు ప్రకటనా పనిని విస్తృతం చేయడానికి ఏమి చేశాడు? మనకు ఏ ప్రశ్నలు రావచ్చు?

యేసు రెండు సంవత్సరాలపాటు గలిలయ అంతటా ప్రకటించాడు. (మత్తయి 9:35-38 చదవండి.) ఆయన చాలా పట్టణాల్లో, గ్రామాల్లో రాజ్యం గురించిన మంచివార్త ప్రకటిస్తూ సభామందిరాల్లో బోధించాడు. ఆయన వెళ్లిన ప్రతీచోట ప్రజలు ఆయన దగ్గరికి గుంపులుగుంపులుగా వచ్చేవాళ్లు. అందుకే, “కోయాల్సిన పంట” చాలా ఉందని, దానికి ఎక్కువమంది పనివాళ్లు అవసరమని యేసు శిష్యులతో అన్నాడు.

2 కాబట్టి ప్రకటనా పనిని విస్తృతం చేయడం కోసం యేసు ఏర్పాటు చేశాడు. ఏ విధంగా? ఆయన తన 12 మంది అపొస్తలులను “దేవుని రాజ్యం గురించి ప్రకటించడానికి” పంపించాడు. (లూకా 9:1, 2) అయితే, ఆ పనిని ఎలా చేయాలో అపొస్తలులకు తెలిసుండకపోవచ్చు. అందుకే, వాళ్లను పరిచర్యకు పంపించే ముందు యేసు వాళ్లకు ప్రేమతో శిక్షణ ఇచ్చాడు. ఆయన ఆ శిక్షణను తన తండ్రి దగ్గర పొందాడు.

3 అయితే మనకు కొన్ని ప్రశ్నలు రావచ్చు. యేసు తన తండ్రి దగ్గర ఎలాంటి శిక్షణ పొందాడు? యేసు తన అపొస్తలులకు ఎలాంటి శిక్షణ ఇచ్చాడు? నేడు కూడా పరిచర్య విషయంలో ఆయన తన అనుచరులకు శిక్షణ ఇస్తున్నాడా? ఒకవేళ ఇస్తే, ఎలా ఇస్తున్నాడు?

“తండ్రి నాకు నేర్పించిన వాటినే నేను మాట్లాడుతున్నాను”

4. యేసుకు శిక్షణ ఎప్పుడు, ఎక్కడ మొదలైంది?

4 తాను తండ్రి దగ్గర శిక్షణ పొందానని యేసే స్వయంగా చెప్పాడు. ఒక సందర్భంలో ఆయన ఇలా అన్నాడు: “తండ్రి నాకు నేర్పించిన వాటినే నేను మాట్లాడుతున్నాను.” (యోహా. 8:28) ఇంతకీ ఆ శిక్షణ ఎప్పుడు, ఎక్కడ మొదలైంది? బహుశా, ఆయన సృష్టించబడినప్పటి నుండే అది మొదలై ఉండవచ్చు. నిజానికి, ఆయన దేవుని మొదటి కొడుకు. (కొలొ. 1:15) ఆయన పరలోకంలో తన తండ్రితోపాటు ఎన్నో యుగాలు గడిపాడు. అక్కడ ‘మహాగొప్ప ఉపదేశకుడైన’ తన తండ్రి చెప్పేవాటిని వింటూ, ఆయన చేసేవన్నీ గమనిస్తూ ఉన్నాడు. (యెష. 30:20, NW) అలా యేసు తన తండ్రి లక్షణాల గురించి, పనుల గురించి, సంకల్పాల గురించి నేర్చుకున్నాడు.

5. భూమ్మీద చేయబోయే పరిచర్య విషయంలో యెహోవా తన కొడుకుకు ఎలా శిక్షణ ఇచ్చాడు?

5 కొంతకాలం తర్వాత, భూమ్మీద చేయబోయే పరిచర్య విషయంలో కూడా యెహోవా యేసుకు శిక్షణ ఇచ్చాడు. మహాగొప్ప ఉపదేశకుడైన యెహోవాకు, ఆయన మొదటి కొడుకుకు మధ్యవున్న సంబంధాన్ని ఒక ప్రవచనం ఎలా వర్ణిస్తుందో గమనించండి. (యెషయా 50:4, 5 చదవండి.) ‘ప్రతీ ఉదయం’ యెహోవా తన కొడుకును మేల్కొల్పుతాడని ఆ ప్రవచనం చెప్తుంది. ఒక ఉపాధ్యాయుడు తన విద్యార్థిని ఉదయాన్నే లేపి అతనికి బోధించడాన్ని ఆ పదచిత్రం గుర్తుచేస్తుంది. ఒక బైబిలు రెఫరెన్సు పుస్తకం ఇలా చెప్తుంది: “ఒక విద్యార్థిని పాఠశాలకు తీసుకెళ్లినట్లుగా యెహోవా . . . తన కొడుకును తీసుకెళ్లి, ఏమి ప్రకటించాలో ఎలా ప్రకటించాలో నేర్పించాడు.” అవును, తన కొడుకు ‘ఏమి చెప్పాలో, ఏమి మాట్లాడాలో’ యెహోవా ఆ పరలోక పాఠశాలలో నేర్పించాడు. (యోహా. 12:49) అంతేకాదు, తన కొడుకు ఎలా బోధించాలో కూడా తండ్రి నేర్పించాడు.a యేసు భూమ్మీదికి వచ్చిన తర్వాత, ఆ శిక్షణలో నేర్చుకున్నవాటిని ఆచరణలో పెట్టాడు. ఆయన తన పరిచర్యను సమర్థవంతంగా కొనసాగించి, తన అనుచరులు కూడా దాన్ని సంపూర్ణంగా చేసేలా వాళ్లకు శిక్షణ ఇచ్చాడు.

6, 7. (ఎ) యేసు తన అపొస్తలులకు ఎలాంటి శిక్షణ ఇచ్చాడు? ఆ శిక్షణ వల్ల వాళ్లు ఏమి చేయగలిగారు? (బి) నేడు యేసు తన అనుచరులకు ఏ విషయంలో శిక్షణ ఇస్తున్నాడు?

6 యేసు తన అపొస్తలులకు ఎలాంటి శిక్షణ ఇచ్చాడు? మత్తయి 10వ అధ్యాయంలో, పరిచర్యకు సంబంధించి ఆయన సూటైన నిర్దేశాలు ఇచ్చాడు: ఎక్కడ ప్రకటించాలో (5, 6 వచనాలు), ఏ సందేశం చెప్పాలో (7వ వచనం), యెహోవా మీద ఆధారపడడం ఎంత ప్రాముఖ్యమో (9, 10 వచనాలు), గృహస్థులతో ఎలా సంభాషణ మొదలుపెట్టాలో (11-13 వచనాలు), మనం చెప్పేది వాళ్లు వినకపోతే ఏమి చేయాలో (14, 15 వచనాలు), హింస ఎదురైతే ఏమి చేయాలో (16-23 వచనాలు) యేసు స్పష్టంగా చెప్పాడు.b యేసు ఇచ్చిన ఆ శిక్షణ వల్ల, అపొస్తలులు మొదటి శతాబ్దంలో ప్రకటనా పనిని విజయవంతంగా కొనసాగించగలిగారు.

7 మరి నేటి సంగతేంటి? దేవుని రాజ్యానికి రాజైన యేసు, తన అనుచరులకు ఒక ముఖ్యమైన పని అప్పగించాడు. “అన్ని దేశాల ప్రజలకు సాక్ష్యంగా ఉండేలా, రాజ్యం గురించిన మంచివార్త భూమంతటా” ప్రకటించమని ఆయన చెప్పాడు. (మత్త. 24:14) మరి ఆ పని చేయడానికి కావాల్సిన శిక్షణను ఆయన ఇస్తున్నాడా? అవును! ప్రకటించే విషయంలో, సంఘ బాధ్యతలను నిర్వర్తించే విషయంలో తన అనుచరులకు శిక్షణ అందేలా యేసు చూస్తున్నాడు.

చక్కగా ప్రకటించేలా శిక్షణ ఇవ్వడం

8, 9. (ఎ) దైవపరిపాలనా పరిచర్య పాఠశాల ముఖ్య ఉద్దేశం ఏమిటి? (బి) వారం మధ్యలో జరిగే కూటం, ప్రకటనా పనిని చక్కగా చేయడానికి మీకెలా సహాయం చేసింది?

8 యెహోవా సంస్థ ఎప్పటినుండో సమావేశాల ద్వారా, సంఘ కూటాల ద్వారా, మరిముఖ్యంగా సేవా కూటం ద్వారా దేవుని ప్రజలకు పరిచర్య విషయంలో శిక్షణ ఇస్తుంది. అంతేకాదు 1940ల నుండి, పరిచర్యకు సంబంధించిన వేర్వేరు పాఠశాలల ద్వారా మనకు శిక్షణ ఇస్తుంది.

9 దైవపరిపాలనా పరిచర్య పాఠశాల. ముందటి అధ్యాయంలో చూసినట్లుగా, దైవపరిపాలనా పరిచర్య పాఠశాల 1943లో మొదలైంది. ఆ పాఠశాల ఉద్దేశమేమిటి? సంఘ కూటాల్లో చక్కగా ప్రసంగాలిచ్చేలా విద్యార్థులకు శిక్షణ ఇవ్వడమా? కాదు. పరిచర్యలో యెహోవాను స్తుతించేలా వాళ్లకు శిక్షణ ఇవ్వడమే దాని ముఖ్య ఉద్దేశం. (కీర్త. 150:6) ఈ పాఠశాల, సహోదరసహోదరీలను సమర్థవంతమైన రాజ్య ప్రచారకులుగా తీర్చిదిద్దింది. నేడు, వారం మధ్యలో జరిగే కూటంలో మనం అలాంటి శిక్షణే పొందుతున్నాం.

10, 11. ప్రస్తుతం గిలియడ్‌ పాఠశాల ఎవరెవరికి శిక్షణ ఇస్తుంది? ఆ పాఠశాల ముఖ్య ఉద్దేశం ఏమిటి?

10 వాచ్‌టవర్‌ బైబిల్‌ స్కూల్‌ ఆఫ్‌ గిలియడ్‌. వాచ్‌టవర్‌ బైబిల్‌ స్కూల్‌ ఆఫ్‌ గిలియడ్‌ అని ప్రస్తుతం పిలుస్తున్న పాఠశాల 1943, ఫిబ్రవరి 1 సోమవారం రోజున మొదలైంది. క్రమ పయినీర్లకు, ఇతర పూర్తికాల సేవకులకు మిషనరీ సేవ చేసేలా శిక్షణ ఇవ్వడం కోసమే ఈ పాఠశాలను ఏర్పాటు చేశారు. కానీ 2011 అక్టోబరు నుండి, ఈ పాఠశాల ప్రత్యేక పూర్తికాల సేవలో ఉన్నవాళ్లకు మాత్రమే, అంటే ప్రత్యేక పయినీర్లకు, ప్రయాణ పర్యవేక్షకులకు వాళ్ల భార్యలకు, బెతెల్‌ సభ్యులకు, ఈ పాఠశాలకు హాజరవ్వని మిషనరీలకు శిక్షణ ఇస్తుంది.

11 గిలియడ్‌ పాఠశాల ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఎంతోకాలం నుండి ఈ పాఠశాల ఉపదేశకునిగా ఉన్న ఒక సహోదరుడు ఇలా చెప్తున్నాడు: “విద్యార్థులు దేవుని వాక్యాన్ని లోతుగా అధ్యయనం చేసి తమ విశ్వాసాన్ని బలపర్చుకునేలా; ఆధ్యాత్మిక లక్షణాలను వృద్ధి చేసుకుని తమకు ఎదురయ్యే సవాళ్లను అధిగమించేలా; మంచివార్తను ఉత్సాహంగా ప్రకటించాలనే కోరికను పెంపొందించుకునేలా వాళ్లకు సహాయం చేయడమే ఈ పాఠశాల ఉద్దేశం.”—ఎఫె. 4:11.

12, 13. గిలియడ్‌ పాఠశాల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ఫలితాలు వచ్చాయి? ఒక ఉదాహరణ చెప్పండి.

12 గిలియడ్‌ పాఠశాల వల్ల ఎలాంటి ఫలితాలు వచ్చాయి? 1943లో ఈ పాఠశాల మొదలైనప్పటి నుండి 8,500 కన్నా ఎక్కువమంది సహోదరసహోదరీలు దానిలో శిక్షణ పొంది,c దాదాపు 170 దేశాల్లో సేవ చేస్తున్నారు. వాళ్లు ఈ పాఠశాలలో నేర్చుకున్నవాటిని ఆచరణలో పెడుతూ ఉత్సాహంగా పరిచర్య చేస్తున్నారు, ఇతరుల్లో కూడా ఆ ఉత్సాహాన్ని నింపుతున్నారు. చాలావరకు వాళ్లు, ప్రచారకులు తక్కువగా ఉన్న ప్రాంతాలకు వెళ్లి సేవ చేస్తున్నారు.

13 జపాన్‌లో ఏమి జరిగిందో పరిశీలించండి. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో, అక్కడ ప్రకటనా పని దాదాపు ఆగిపోయింది. 1949 ఆగస్టు నాటికి, జపాన్‌లో పదిమంది ప్రచారకులు కూడా లేరు. అయితే ఆ సంవత్సరం చివరికల్లా, గిలియడ్‌ పాఠశాలలో శిక్షణ పొందిన 13 మంది మిషనరీలు అక్కడున్న ప్రచారకులతో కలిసి ప్రకటించడం మొదలుపెట్టారు. తర్వాత, ఇంకొంతమంది మిషనరీలు కూడా అక్కడికి వెళ్లి సేవ చేశారు. మొదట వాళ్లు పెద్దపెద్ద పట్టణాల్లో ప్రకటించి, తర్వాత చిన్న పట్టణాలకు వెళ్లారు. వాళ్లు తమ బైబిలు విద్యార్థులను, ఇతర ప్రచారకులను పయినీరు సేవ చేపట్టమని మనస్ఫూర్తిగా ప్రోత్సహించారు. వాళ్లు చేసిన కృషికి మంచి ఫలితాలు వచ్చాయి. ప్రస్తుతం జపాన్‌లో 2,16,000 కన్నా ఎక్కువమంది రాజ్య ప్రచారకులు ఉన్నారు, వాళ్లలో దాదాపు 40 శాతం మంది పయినీర్లే!d

14. దైవపరిపాలనా పాఠశాలలన్నీ దేనికి రుజువుగా ఉన్నాయి? (188వ పేజీలో ఉన్న “రాజ్య ప్రచారకులకు శిక్షణ ఇచ్చే పాఠశాలలు” అనే బాక్సు కూడా చూడండి.)

14 ఇతర దైవపరిపాలనా పాఠశాలలు. పైన ప్రస్తావించిన పాఠశాలలే కాక, విద్యార్థులు తమ ఆధ్యాత్మికతను పెంచుకునేలా, ప్రకటనా పనిలో ఉత్సాహంగా పాల్గొనేలా శిక్షణనిచ్చే ఇతర పాఠశాలలు కూడా ఉన్నాయి. అవి, పయినీరు సేవా పాఠశాల, క్రైస్తవ దంపతుల కోసం పాఠశాల, ఒంటరి సహోదరుల కోసం పాఠశాల వంటివి.e పరిచర్యను పూర్తిస్థాయిలో చేసేలా రాజు తన అనుచరులకు శిక్షణ ఇస్తున్నాడని చెప్పడానికి, ఈ పాఠశాలలే గొప్ప రుజువు.—2 తిమో. 4:5.

తమ బాధ్యతలను చక్కగా నిర్వర్తించేలా సహోదరులకు శిక్షణ ఇవ్వడం

15. బాధ్యతగల స్థానాల్లో ఉన్న సహోదరులు యేసును ఎలా అనుకరించవచ్చు?

15 ముందటి పేరాల్లో చూసినట్లుగా, యేసు తన తండ్రి దగ్గర శిక్షణ పొందాడని యెషయా ప్రవచనం చెప్తుంది. ఆ పరలోక పాఠశాలలో, “అలసినవానిని మాటలచేత” ఎలా ఊరడించాలో యేసు నేర్చుకున్నాడు. (యెష. 50:4) తర్వాత భూమ్మీదికి వచ్చినప్పుడు దాన్ని ఆచరణలో పెట్టాడు. “భారం మోస్తూ అలసిపోయిన” వాళ్లకు ఆయన సేదదీర్పును ఇచ్చాడు. (మత్త. 11:28-30) బాధ్యతగల స్థానాల్లో ఉన్న సహోదరులు కూడా, యేసులాగే సంఘంలోని వాళ్లందరికీ సేదదీర్పును ఇచ్చేవాళ్లుగా ఉండాలి. ఈ విషయంలో అర్హులైన సహోదరులకు శిక్షణ ఇవ్వడం కోసమే వేర్వేరు పాఠశాలలు రూపొందించబడ్డాయి.

16, 17. రాజ్య పరిచర్య పాఠశాల ఉద్దేశం ఏమిటి? (అధస్సూచి కూడా చూడండి.)

16 రాజ్య పరిచర్య పాఠశాల. ఈ పాఠశాల మొదటి తరగతి 1959, మార్చి 9న న్యూయార్క్‌లోని సౌత్‌ లాన్సింగ్‌లో జరిగింది. నెల రోజులపాటు జరిగిన ఈ పాఠశాలకు, ప్రయాణ పర్యవేక్షకులు అలాగే కాంగ్రిగేషన్‌ సర్వెంట్‌లు (ప్రస్తుతం పెద్దల సభ సమన్వయకర్త అని పిలుస్తున్నాం) ఆహ్వానించబడ్డారు. తర్వాత్తర్వాత ఈ పాఠశాల ఇంగ్లీషులోనే కాక వేరే భాషల్లో కూడా జరగడంతో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సహోదరులు దానినుండి ప్రయోజనం పొందారు.f

జపాస్‌లో రాజ్య పరిచర్య పాఠశాలలో బోధిస్తున్న సహోదరుడు లాయిడ్‌ బ్యారీ, 1970

జపాన్‌లో రాజ్య పరిచర్య పాఠశాలలో బోధిస్తున్న సహోదరుడు లాయిడ్‌ బ్యారీ, 1970

17 రాజ్య పరిచర్య పాఠశాల ఉద్దేశం ఏమిటి? దాని గురించి 1962 యెహోవాసాక్షుల వార్షిక పుస్తకం (ఇంగ్లీషు) ఇలా చెప్పింది: “ఈ తీరిక లేని లోకంలో, సంఘంలో ఉన్న ప్రతీ పర్యవేక్షకుడు తన పనుల్ని సర్దుబాటు చేసుకుని, సంఘంలోని వాళ్లందరి పట్ల శ్రద్ధ చూపిస్తూ వాళ్లకు ఒక ఆశీర్వాదంగా ఉండాలి; అదే సమయంలో, సంఘ పనుల్లోపడి తన సొంత కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయకుండా స్వస్థబుద్ధితో నడుచుకోవాలి. అవన్నీ చేయడానికి, అంటే ఒక పర్యవేక్షకుడు ఏమేమి చేయాలని బైబిలు చెప్తుందో వాటన్నిటిని చేయడానికి కావాల్సిన శిక్షణను ఈ పాఠశాల ఇస్తుంది. అది ఎంత గొప్ప అవకాశమో కదా!”—1 తిమో. 3:1-7; తీతు 1:5-9.

18. రాజ్య పరిచర్య పాఠశాల వల్ల సంఘంలోని వాళ్లందరూ ఎలా ప్రయోజనం పొందుతారు?

18 రాజ్య పరిచర్య పాఠశాల ద్వారా పెద్దలు, సంఘ పరిచారకులే కాకుండా సంఘంలోని వాళ్లందరూ ప్రయోజనం పొందుతున్నారు. ఏ విధంగా? సంఘ పెద్దలు, సంఘ పరిచారకులు ఆ పాఠశాలలో నేర్చుకున్నవాటిని పాటిస్తూ, యేసులాగే తోటి విశ్వాసులకు సేదదీర్పును ఇస్తున్నారు. ఒక పెద్ద లేదా సంఘ పరిచారకుడు మీతో దయగా మాట్లాడినప్పుడు, మీరు చెప్పేది శ్రద్ధగా విన్నప్పుడు, లేదా మిమ్మల్ని కలిసి ప్రోత్సహించినప్పుడు మీరు ఎంతో సంతోషించి ఉంటారు. (1 థెస్స. 5:11) నిజంగా అలాంటి వాళ్లు సంఘానికి ఆశీర్వాదం కాదంటారా?

19. టీచింగ్‌ కమిటీ ఇంకా ఏ పాఠశాలలను పర్యవేక్షిస్తుంది? ఆ పాఠశాలల ఉద్దేశం ఏమిటి?

19 ఇతర పాఠశాలలు. పరిపాలక సభలోని టీచింగ్‌ కమిటీ, సంస్థలోని బాధ్యతగల స్థానాల్లో ఉన్న సహోదరులకు శిక్షణ ఇవ్వడానికి ఇతర పాఠశాలలు కూడా ఏర్పాటు చేసింది. సంఘ పెద్దలు, ప్రయాణ పర్యవేక్షకులు, బ్రాంచి కమిటీ సభ్యులు తమకున్న బాధ్యతలను చక్కగా నిర్వర్తించేలా, తమ ఆధ్యాత్మికతను కాపాడుకునేలా, యెహోవా అప్పగించిన గొర్రెలను శ్రద్ధగా చూసుకునే విషయంలో లేఖన సూత్రాలను పాటించేలా సహాయం చేయడమే ఆ పాఠశాలల ఉద్దేశం.—1 పేతు. 5:1-3.

మలావీలో జరుగుతున్న పరిచర్య శిక్షణా పాఠశాల మొదటి తరగతి

మలావీలో జరిగిన పరిచర్య శిక్షణా పాఠశాల మొదటి తరగతి, 2007

20. మనందరం ‘యెహోవా చేత బోధించబడుతున్నాం’ అని యేసు ఎందుకు అన్నాడు? మీరు ఏమి చేయాలని నిశ్చయించుకున్నారు?

20 మెస్సీయ రాజు తన అనుచరులకు చక్కగా శిక్షణ ఇస్తున్నాడని స్పష్టమౌతోంది. ఆ శిక్షణ అంతటికీ మూలం యెహోవాయే. ఏ విధంగా? యెహోవా తన కొడుకుకు శిక్షణ ఇచ్చాడు, కొడుకు తన అనుచరులకు శిక్షణ ఇస్తున్నాడు. అందుకే, మనమందరం ‘యెహోవా చేత బోధించబడుతున్నాం’ అని యేసు చెప్పగలిగాడు. (యోహా. 6:45; యెష. 54:13) మనం ఆధ్యాత్మికంగా బలంగా ఉండి, పరిచర్యను పూర్తి స్థాయిలో చేయాలని యెహోవా కోరుకుంటున్నాడు. అందుకే మనకు ఈ శిక్షణ ఇస్తున్నాడు. కాబట్టి దానినుండి పూర్తి ప్రయోజనం పొందాలని నిశ్చయించుకుందాం.

a తన కొడుకు ఎలా బోధించాలో యెహోవా నేర్పించాడని ఎందుకు చెప్పవచ్చు? యేసు భూమ్మీద ఉన్నప్పుడు ఎన్నో ఉదాహరణలు ఉపయోగించి బోధించాడు. యేసు అలా బోధిస్తాడనే విషయాన్ని, ఆయన పుట్టడానికి కొన్ని వందల సంవత్సరాల క్రితమే యెహోవా రాయించాడు. (కీర్త. 78:2; మత్త. 13:34, 35) కాబట్టి, తన కొడుకు ఉదాహరణల ద్వారా బోధించాలని యెహోవా ఉద్దేశించాడని తెలుస్తోంది.—2 తిమో. 3:16, 17.

b కొన్ని నెలల తర్వాత, యేసు “ఇంకో 70 మందిని ఎంచుకొని . . . వాళ్లను ఇద్దరిద్దరిగా పంపించాడు.” అలా పంపించే ముందు వాళ్లకు శిక్షణ ఇచ్చాడు.—లూకా 10:1-16.

c కొంతమంది గిలియడ్‌ పాఠశాలకు ఒకటి కన్నా ఎక్కువసార్లు హాజరయ్యారు.

d మిషనరీలు చేసిన కృషికి ఎలాంటి ఫలితాలు వచ్చాయో తెలుసుకోవడానికి, యెహోవాసాక్షులు—దేవుని రాజ్య ప్రచారకులు (ఇంగ్లీషు) అనే పుస్తకంలో 23వ అధ్యాయం చూడండి.

e క్రైస్తవ దంపతుల కోసం పాఠశాలను, ఒంటరి సహోదరుల కోసం పాఠశాలను కలిపి రాజ్య సువార్తికుల కోసం పాఠశాలగా మార్చారు.

f రాజ్య పరిచర్య పాఠశాల కొన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. దాని కాలనిడివి ఒక్కోసారి ఒక్కోలా ఉండవచ్చు. 1984 నుండి, సంఘ పెద్దలతోపాటు సంఘ పరిచారకులు కూడా ఆ పాఠశాలలో శిక్షణ పొందుతున్నారు.

దేవుని రాజ్యం పరిపాలిస్తోందని మీరు ఎందుకు నమ్ముతున్నారు?

  • యేసు తన తండ్రి దగ్గర ఎలాంటి శిక్షణ పొందాడు?

  • పరిచర్య విషయంలో రాజు తన అనుచరులకు ఎలా శిక్షణ ఇచ్చాడు?

  • అర్హులైన సహోదరులు తమ బాధ్యతలను చక్కగా నిర్వర్తించేలా రాజు ఎలా శిక్షణ ఇచ్చాడు?

  • మన రాజైన యేసుక్రీస్తు ఇస్తున్న శిక్షణకు మీరెలా కృతజ్ఞత చూపించవచ్చు?

రాజ్య ప్రచారకులకు శిక్షణ ఇచ్చే పాఠశాలలు

మన క్రైస్తవ జీవితం, పరిచర్య

ఉద్దేశం: మంచివార్తను చక్కగా ప్రకటించేలా, బోధించేలా ప్రచారకులకు శిక్షణ ఇవ్వడం.

ఎంతకాలం: జరుగుతూనే ఉంటుంది.

స్థలం: స్థానిక రాజ్యమందిరం.

అర్హతలు: క్రమంగా సంఘంతో సహవసిస్తూ, బైబిలు బోధల్ని అంగీకరించి, క్రైస్తవ ప్రమాణాల ప్రకారం జీవిస్తున్న వాళ్లెవరైనా దీనిలో భాగం వహించవచ్చు. దీనిలో భాగం వహించాలనుకుంటే క్రైస్తవ జీవితం, పరిచర్య మీటింగ్‌ పర్యవేక్షకునితో మాట్లాడండి.

ప్రయోజనాలు: సమాచారాన్ని పరిశోధించి ఎలా తర్కబద్ధంగా అందించాలో, ఇతరులు చెప్పేది వింటూ వాళ్ల ఆధ్యాత్మిక అవసరాలపై ఎలా శ్రద్ధ నిలపాలో ఈ కూటం నేర్పిస్తుంది.

ఎన్నో సంవత్సరాల నుండి ప్రయాణ పర్యవేక్షకునిగా సేవ చేస్తున్న ఆర్నీ అనే సహోదరుడు ఇలా చెప్తున్నాడు: “నాకు చిన్నప్పటి నుండి నత్తి ఉండేది, వేరేవాళ్ల కళ్లల్లోకి చూసి మాట్లాడడం పెద్ద సమస్యగా ఉండేది. కానీ నా ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడానికి ఈ [కూటం] సహాయం చేసింది. మాట్లాడేటప్పుడు శ్వాసను ఎలా నియంత్రించుకోవాలో, ఎలా ఏకాగ్రత నిలపాలో ఈ కూటంలో నేర్చుకున్నాను. ఇప్పుడు సంఘంలో, అలాగే పరిచర్యలో యెహోవాను చక్కగా స్తుతించగలుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది.”

దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో బైబిలు చదువుతున్న ఒక చిన్న పిల్లవాడు

సంఘ పెద్దల కోసం పాఠశాలg

ఉద్దేశం: ఆధ్యాత్మికతను పెంచుకునేలా, సంఘ బాధ్యతలను చక్కగా నిర్వర్తించేలా పెద్దలకు సహాయం చేయడం.

ఎంతకాలం: ఐదు రోజులు.

స్థలం: బ్రాంచి కార్యాలయం నిర్ణయిస్తుంది; సాధారణంగా దగ్గర్లో ఉన్న రాజ్యమందిరంలో లేదా సమావేశ హాలులో జరుగుతుంది.

అర్హతలు: బ్రాంచి కార్యాలయమే సంఘ పెద్దల్ని ఆహ్వానిస్తుంది.

ప్రయోజనాలు: అమెరికాలోని న్యూయార్క్‌లో ప్యాటర్‌సన్‌లో, ఈ పాఠశాల 92వ తరగతికి హాజరైన కొంతమంది సహోదరులు ఇలా చెప్పారు:

“నన్ను నేను పరిశీలించుకోవడానికి, యెహోవా గొర్రెల్ని శ్రద్ధగా చూసుకోవడానికి ఈ పాఠశాల నాకు ఎంతగానో సహాయం చేసింది.”

“నేను ఈ పాఠశాలలో నేర్చుకున్న విషయాలను జీవితాంతం పాటించాలని నిర్ణయించుకున్నాను.”

పయినీరు సేవా పాఠశాల

ఉద్దేశం: “పరిచర్యను పూర్తిస్థాయిలో” చేసేలా పయినీర్లకు శిక్షణ ఇవ్వడం.—2 తిమో. 4:5.

ఎంతకాలం: ఆరు రోజులు.

స్థలం: బ్రాంచి కార్యాలయం నిర్ణయిస్తుంది; సాధారణంగా దగ్గర్లోని రాజ్యమందిరంలో జరుగుతుంది.

అర్హతలు: ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ సంవత్సరాల నుండి పయినీరు సేవ చేస్తున్నవాళ్లను ప్రాంతీయ పర్యవేక్షకుడే ఆహ్వానిస్తాడు. గత ఐదు సంవత్సరాల్లో ఈ పాఠశాలకు హాజరుకాని కొంతమంది పయినీర్లను మళ్లీ హాజరవ్వమని ఆహ్వానిస్తాడు.

ప్రయోజనాలు: లిలీ అనే సహోదరి ఇలా చెప్తుంది: “పరిచర్యలో, అలాగే నా జీవితంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి ఈ పాఠశాల సహాయం చేసింది. నా అధ్యయన అలవాట్లు, ప్రకటనా, బోధనా నైపుణ్యాలు మెరుగయ్యాయి. అంతేకాదు, ఇతరులకు సహాయం చేసేలా, సంఘ పెద్దలకు మద్దతిచ్చేలా, సంఘ అభివృద్ధికి దోహదపడేలా ఈ పాఠశాల నన్ను పురికొల్పింది.”

ఈ పాఠశాలకు రెండుసార్లు హాజరైన బ్రెండ ఇలా చెప్తుంది: “ఆధ్యాత్మిక విషయాల మీద మనసుపెట్టడానికి, నా మనస్సాక్షిని బలపర్చుకోవడానికి, ఇతరుల్ని ప్రోత్సహించడానికి ఈ పాఠశాల సహాయం చేసింది. యెహోవా ఎంత ఉదారత గల దేవుడో నాకు అర్థమైంది.”

బెతెల్‌ ప్రవేశ పాఠశాల

ఉద్దేశం: కొత్తగా బెతెల్‌కు వచ్చినవాళ్లు ఆ సేవలో రాణించేలా సహాయం చేయడం.

ఎంతకాలం: రోజుకు నాలుగు గంటల చొప్పున నాలుగు రోజులు.

స్థలం: బెతెల్‌.

అర్హతలు: బెతెల్‌ కుటుంబంలో శాశ్వత సభ్యులను, సంవత్సరం, అంతకన్నా ఎక్కువకాలం బెతెల్‌ సేవ చేయడానికి ఆమోదం పొందిన తాత్కాలిక సభ్యులను బ్రాంచి కార్యాలయమే ఎంపిక చేస్తుంది.

ప్రయోజనాలు: 1980లలో ఈ పాఠశాలకు హాజరైన డమీట్రీయస్‌ ఇలా చెప్తున్నాడు: “ఈ పాఠశాల నా అధ్యయన అలవాట్లను మెరుగుపర్చింది, బెతెల్‌లో ఎక్కువ కాలం సేవ చేయడానికి నన్ను సిద్ధం చేసింది. తరగతి ఉపదేశకులు, పాఠ్యాంశాలు, పాఠశాలలో ఇవ్వబడిన చక్కని సలహాల వల్ల యెహోవాకు నామీద ఎంత ప్రేమ, శ్రద్ధ ఉన్నాయో నేను గ్రహించాను. అంతేకాదు నేను బెతెల్‌ సేవలో ఆనందించాలని యెహోవా కోరుకుంటున్నాడని నాకు అర్థమైంది.”

రాజ్య సువార్తికుల కోసం పాఠశాలh

ఉద్దేశం: పూర్తికాల సేవలో ఉన్నవాళ్లు (దంపతులు, ఒంటరి సహోదరులు, ఒంటరి సహోదరీలు) యెహోవాకు, ఆయన సంస్థకు మరింతగా ఉపయోగపడేలా ప్రత్యేక శిక్షణ ఇవ్వడం. దీనిలో పట్టభద్రులైన వాళ్లను, తమ దేశంలోనే అవసరం ఎక్కువున్న ప్రాంతంలో సేవ చేయడానికి నియమించవచ్చు. 50 సంవత్సరాల కన్నా తక్కువ వయసున్న వాళ్లను, మారుమూల ప్రాంతాల్లో తాత్కాలిక ప్రత్యేక పయినీర్లుగా నియమించవచ్చు.

ఎంతకాలం: రెండు నెలలు.

స్థలం: బ్రాంచి కార్యాలయం నిర్ణయిస్తుంది; సాధారణంగా రాజ్యమందిరంలో లేదా సమావేశ హాలులో జరుగుతుంది.

పరిచర్యలో ఉన్న ఒక సహోదరి

దైవపరిపాలనా పాఠశాలల నుండి సహోదరసహోదరీలు ప్రయోజనం పొందుతున్నారు

అర్హతలు: 23 నుండి 65 సంవత్సరాల మధ్య వయసు ఉండి, మంచి ఆరోగ్యం ఉండి, అవసరం ఎక్కువున్న ప్రాంతంలో సేవ చేయాలనే కోరిక ఉన్న పూర్తికాల సేవకులు దీనికి హాజరవ్వవచ్చు. వాళ్లకు ‘నేనున్నాను నన్ను పంపించు’ అనే స్వభావం ఉండాలి. (యెష. 6:8) ఈ పాఠశాలకు హాజరవ్వాలనుకునే ఒంటరి సహోదరులు, ఒంటరి సహోదరీలు, దంపతులు క్రమంగా కనీసం రెండు సంవత్సరాలైనా పూర్తికాల సేవ చేసి ఉండాలి. దంపతులైతే పెళ్లై కనీసం రెండేళ్లు అయ్యుండాలి. సహోదరులైతే సంఘ పెద్దగా లేదా సంఘ పరిచారకునిగా క్రమంగా కనీసం రెండు సంవత్సరాలైనా సేవ చేసి ఉండాలి. ఈ పాఠశాలకు హాజరవ్వాలనుకునే వాళ్లకోసం ప్రాదేశిక సమావేశంలో ఒక కూటం జరుగుతుంది.

ప్రయోజనాలు: ఒంటరి సహోదరుల కోసం బైబిలు పాఠశాలకు, క్రైస్తవ దంపతుల కోసం బైబిలు పాఠశాలకు హాజరైన చాలామంది నుండి మంచి ప్రతిస్పందన వచ్చింది. 2013లో, పరిపాలక సభ ఈ రెండు పాఠశాలలను కలిపి రాజ్య సువార్తికుల కోసం పాఠశాలగా మార్చింది. ప్రస్తుతం ఈ పాఠశాల ద్వారా చాలామంది పయినీర్లు, ఒంటరి సహోదరీలు ప్రయోజనం పొందుతున్నారు.

వాచ్‌టవర్‌ బైబిల్‌ స్కూల్‌ ఆఫ్‌ గిలియడ్‌

ఉద్దేశం: ఈ పాఠశాలలో పట్టభద్రులైన వాళ్లను ప్రయాణ పర్యవేక్షకులుగా, మిషనరీలుగా, లేదా బెతెల్‌ సభ్యులుగా నియమిస్తారు. వాళ్లు తాము పొందిన శిక్షణను చక్కగా ఉపయోగించుకుని క్షేత్రంలో జరుగుతున్న ప్రకటనా పనిని, అలాగే బ్రాంచి కార్యాలయ ఏర్పాట్లను బలపరుస్తారు, స్థిరపరుస్తారు.

ఎంతకాలం: ఐదు నెలలు.

స్థలం: న్యూయార్క్‌లోని ప్యాటర్‌సన్‌లో ఉన్న వాచ్‌టవర్‌ ఎడ్యుకేషనల్‌ సెంటర్‌.

గిలియడ్‌ తరగతిలో ఒక సహోదరుడు బోధిస్తుండగా వింటున్న విద్యార్థులు

గిలియడ్‌ తరగతి—ప్యాటర్‌సన్‌, న్యూయార్క్‌

అర్హతలు: ఇప్పటికే ప్రత్యేక పూర్తికాల సేవ చేస్తున్న దంపతులు, ఒంటరి సహోదరులు, ఒంటరి సహోదరీలు దీనికి హాజరవ్వవచ్చు. అంటే ప్రత్యేక పయినీర్లు, ప్రయాణ పర్యవేక్షకులు, బెతెల్‌సభ్యులు, ఇంతవరకూ గిలియడ్‌ పాఠశాలకు హాజరవ్వని మిషనరీలు హాజరవ్వవచ్చు. వాళ్లను దరఖాస్తు పెట్టుకోమని బ్రాంచి కమిటీయే ఆహ్వానిస్తుంది. దరఖాస్తు చేసుకునేవాళ్లు ఇంగ్లీషు మాట్లాడగలగాలి, రాయగలగాలి.

ప్రయోజనాలు: ఎన్నో సంవత్సరాలుగా తమ నియామకంలో కొనసాగుతున్న అమెరికాకు చెందిన లాడే, మనీక్‌ అనే దంపతులు ఏమన్నారో గమనించండి:

“ప్రపంచంలో ఎక్కడికంటే అక్కడికి వెళ్లి, ప్రియ సహోదరులతో కలిసి పనిచేసేలా గిలియడ్‌ పాఠశాల మమ్మల్ని సంసిద్ధుల్ని చేసింది” అని లాడే చెప్తున్నాడు.

మనీక్‌ ఇలా అంటుంది: “నేను నేర్చుకున్న విషయాలను ఆచరణలో పెడుతూ, నా నియామకంలో చాలా సంతోషంగా ఉన్నాను. ఆ సంతోషమే, యెహోవా నామీద చూపించే ప్రేమకు నిదర్శనం.”

రాజ్య పరిచర్య పాఠశాల

ఉద్దేశం: పర్యవేక్షించే పనిలో, సంస్థాపరమైన బాధ్యతలు నిర్వర్తించే విషయంలో ప్రయాణ పర్యవేక్షకులకు, పెద్దలకు, సంఘ పరిచారకులకు శిక్షణ ఇవ్వడం. (అపొ. 20:28) సంఘాల్లోని ప్రస్తుత పరిస్థితుల గురించి, మార్పుల గురించి, ఇతర అత్యవసరమైన విషయాల గురించి ఈ పాఠశాల చర్చిస్తుంది. పరిపాలక సభ నిర్దేశం మేరకు, ఈ పాఠశాల కొన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది.

ఎంతకాలం: ఈ మధ్యకాలంలో, ఈ పాఠశాల వేర్వేరు కాలనిడివితో జరిగింది.

స్థలం: సాధారణంగా దగ్గర్లోని రాజ్యమందిరంలో లేదా సమావేశ హాలులో జరుగుతుంది.

అర్హతలు: అర్హులైన పెద్దలను, సంఘ పరిచారకులను ప్రాంతీయ పర్యవేక్షకుడు ఆహ్వానిస్తాడు. ప్రయాణ పర్యవేక్షకులను బ్రాంచి కార్యాలయం ఆహ్వానిస్తుంది.

ప్రయోజనాలు: “ఈ పాఠశాల, తక్కువ సమయంలోనే ఎక్కువ విషయాలు నేర్పిస్తుంది. సంఘ పెద్దలు యెహోవా సేవలో ధైర్యంగా ముందుకు సాగడానికి, తమ ఆనందాన్ని కాపాడుకోవడానికి ఈ పాఠశాల సహాయం చేస్తుంది. కొత్తగా సేవ చేస్తున్న పెద్దలైనా, ఎంతోకాలంగా సేవ చేస్తున్న పెద్దలైనా సంఘాన్ని సమర్థవంతంగా ఎలా కాయాలో, ఐక్యంగా ఎలా పని చేయాలో ఈ పాఠశాలలో నేర్చుకుంటారు.”—క్విన్‌.

“ఈ పాఠశాల ఆధ్యాత్మిక విషయాల పట్ల మా అవగాహనను పెంచింది, ప్రమాదాల విషయంలో హెచ్చరించింది, మందను శ్రద్ధగా చూసుకోవడానికి కావాల్సిన సలహాలు ఇచ్చింది.”—మైకల్‌.

ప్రాంతీయ పర్యవేక్షకులకు వాళ్ల భార్యలకు పాఠశాలi

ఉద్దేశం: సమర్థవంతంగా సంఘాలకు సేవచేసేలా; “మాట్లాడే విషయంలో, బోధించే విషయంలో కష్టపడి పనిచేసేలా”; తమ సంరక్షణలో ఉన్న మందను కాసేలా ప్రాంతీయ పర్యవేక్షకులకు శిక్షణ ఇవ్వడం.—1 తిమో. 5:17; 1 పేతు. 5:2, 3.

ఎంతకాలం: ఒక నెల.

స్థలం: బ్రాంచి కార్యాలయం నిర్ణయిస్తుంది.

అర్హతలు: అర్హులైన ప్రాంతీయ పర్యవేక్షకులను, వాళ్ల భార్యలను బ్రాంచి కార్యాలయం ఆహ్వానిస్తుంది.

ప్రయోజనాలు: “యేసు ఒక శిరస్సుగా సంస్థను ఎలా నడిపిస్తున్నాడో మేము అర్థం చేసుకున్నాం. సంఘాలను సందర్శిస్తున్నప్పుడు సహోదరులను ప్రోత్సహించాలని, సంఘ ఐక్యతను బలపర్చాలని ఆ పాఠశాల నేర్పించింది. అంతేకాదు, సహోదరులకు సలహా లేదా దిద్దుబాటు ఇస్తున్నప్పుడు, వాళ్లు యెహోవా ప్రేమను గుర్తించేలా చేయడమే మా ముఖ్య ఉద్దేశమై ఉండాలని కూడా ఆ పాఠశాల నేర్పింది.”—జోయల్‌, మొదటి తరగతి, 1999.

బ్రాంచి కమిటీ సభ్యులకు, వాళ్ల భార్యలకు పాఠశాల

ఉద్దేశం: బెతెల్‌ గృహాలను, తమ క్షేత్రంలోని సర్క్యూట్‌లను పర్యవేక్షించేలా; సంఘాల్లోని పరిచర్యకు సంబంధించిన విషయాలను చూసుకునేలా బ్రాంచి కమిటీ సభ్యులకు శిక్షణ ఇవ్వడం.—లూకా 12:48బి.

ఎంతకాలం: రెండు నెలలు.

స్థలం: న్యూయార్క్‌లోని ప్యాటర్‌సన్‌లో ఉన్న వాచ్‌టవర్‌ ఎడ్యుకేషనల్‌ సెంటర్‌.

అర్హతలు: బ్రాంచి కమిటీ సభ్యులను లేదా కంట్రీ కమిటీ సభ్యులను, వాళ్ల భార్యలను పరిపాలక సభలోని సర్వీస్‌ కమిటీ ఆహ్వానిస్తుంది.

ప్రయోజనాలు: 25వ తరగతిలో శిక్షణ పొంది, ఇప్పుడు నైజీరియాలో సేవ చేస్తున్న లోవల్‌, కారా అనే జంట ఏమంటుందో వినండి:

లోవల్‌ ఇలా చెప్తున్నాడు: “నేను ఏ నియామకాన్ని చేస్తున్నాను, ఎంత చేస్తున్నాను అనేదాని కన్నా, నా ఆధ్యాత్మికతను బట్టే యెహోవా సంతోషిస్తాడని ఆ పాఠశాల నేర్పించింది.”

ఆ పాఠశాలలో నేర్చుకున్న ఒక విషయం గురించి కారా ఇలా అంటుంది: “ఏదైనా ఒక అంశాన్ని ఇతరులకు అర్థమయ్యేలా చెప్పాలంటే, వాళ్లకు బోధించే ముందు నేను దాన్ని అధ్యయనం చేయాలి.”

g ప్రస్తుతం ఈ పాఠశాల అన్ని దేశాల్లో అందుబాటులో లేదు.

h ప్రస్తుతం ఈ పాఠశాల అన్ని దేశాల్లో అందుబాటులో లేదు.

i ప్రస్తుతం ఈ పాఠశాల అన్ని దేశాల్లో అందుబాటులో లేదు.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి