తల్లిదండ్రులారా, మీ మాదిరి ఏమి బోధిస్తుంది?
“మీరు ప్రియమైన పిల్లలవలె దేవునిపోలి . . . ప్రేమగలిగి నడుచుకొనుడి.—ఎఫెసీయులు 5:1, 2.
1. యెహోవా మొదటి మానవ దంపతులకు ఏ నిర్దేశాలను ఇచ్చాడు?
కుటుంబ ఏర్పాటుకు యెహోవా ఆరంభకుడు. ప్రతి కుటుంబము ఆయనను బట్టి ఉనికిలో ఉంది, ఎందుకంటే మొదటి కుటుంబాన్ని స్థాపించి, మొదటి మానవజతకు సంతానోత్పత్తి శక్తులను ఇచ్చినది ఆయనే. (ఎఫెసీయులు 3:14, 15) ఆయన ఆదాము హవ్వలకు తమ బాధ్యతల సంబంధంగా ప్రాథమిక నిర్దేశాలను ఇచ్చి, వాటిని నిర్వర్తించడానికి వారు వ్యక్తిగతంగా చొరవ తీసుకునేందుకు కావలసినంత అవకాశాన్ని కూడా అనుమతించాడు. (ఆదికాండము 1:28-30; 2:6, 15-22) ఆదాము హవ్వలు పాపం చేసిన తర్వాత, కుటుంబాలు ఎదుర్కోవలసిన పరిస్థితులు మరింత క్లిష్టతరమయ్యాయి. అయినప్పటికీ, అటువంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి తన సేవకులకు సహాయపడే నిర్దేశక సూత్రాల్ని యెహోవా ప్రేమతో అందజేశాడు.
2. (ఎ) లిఖిత సలహాలకు మౌఖిక ఉపదేశాన్ని ఏ మాధ్యమాల ద్వారా యెహోవా దృఢతరం చేశాడు? (బి) తల్లిదండ్రులు తమను తాము ఏమని ప్రశ్నించుకోవాలి?
2 మన మహాగొప్ప ఉపదేశకునిగా యెహోవా మనం ఏమి చేయాలో ఏమి చేయకూడదో తెలియజేయడానికి కేవలం లిఖితపూర్వక నిర్దేశకాలను మాత్రమే ఇవ్వలేదు. ప్రాచీన కాలాల్లో ఆయన లిఖితపూర్వక నిర్దేశకాలకు యాజకుల ద్వారా, ప్రవక్తల ద్వారా, కుటుంబ శిరస్సుల ద్వారా ఇవ్వబడే మౌఖిక నిర్దేశకాలను జోడించాడు. నేడు అటువంటి మౌఖిక బోధను అందజేయడానికి ఆయన ఎవర్ని ఉపయోగించుకుంటున్నాడు? క్రైస్తవ పెద్దల్నీ, తల్లిదండ్రుల్నీ. మీరు తల్లి గానీ తండ్రి గానీ అయినట్లైతే, మీరు యెహోవా మార్గాలను మీ కుటుంబానికి ఉపదేశించడానికి మీ వంతు మీరు నిర్వర్తిస్తున్నారా?—సామెతలు 6:20-23.
3. కుటుంబ శిరస్సులు ప్రభావవంతమైన బోధ విషయంలో యెహోవా నుండి ఏమి నేర్చుకోగలరు?
3 అటువంటి ఉపదేశాన్ని కుటుంబంలో ఎలా ఇవ్వాలి? యెహోవాయే మాదిరిని కనపరుస్తున్నాడు. ఏది మంచో ఏది చెడో ఆయన స్పష్టంగా పేర్కొంటున్నాడు, అంతేకాదు ఆయన పునరుక్తిని సమృద్ధిగా ఉపయోగిస్తున్నాడు. (నిర్గమకాండము 20:4, 5; ద్వితీయోపదేశకాండము 4:23, 24; 5:8, 9; 6:14, 15; యెహోషువ 24:19, 20) ఆయన ఆలోచనల్ని రేకెత్తించే ప్రశ్నల్ని వేస్తున్నాడు. (యోబు 38:4, 8, 31) దృష్టాంతాల ద్వారా నిజజీవిత మాదిరుల ద్వారా ఆయన మన భావోద్వేగాల్ని రేకెత్తిస్తూ మన హృదయాల్ని మలుస్తున్నాడు. (ఆదికాండము 15:5; దానియేలు 3:1-29) తల్లిదండ్రులారా, మీరు మీ పిల్లలకు బోధిస్తున్నప్పుడు ఆ విధానాల్ని అనుకరించడానికి ప్రయత్నిస్తారా?
4. క్రమశిక్షణనిచ్చే విషయంలో మనం యెహోవా నుండి ఏమి నేర్చుకుంటాము, క్రమశిక్షణ ఎందుకు ప్రాముఖ్యం?
4 సరియైనదాని విషయమై యెహోవా దృఢంగా ఉంటాడు, కానీ ఆయన అపరిపూర్ణత చూపించే ప్రభావాలను అర్థం చేసుకుంటాడు. అందుకని ఆయన శిక్షించేముందు, అపరిపూర్ణ మానవులకు బోధిస్తాడు, మళ్లీ మళ్లీ హెచ్చరికల్ని, జ్ఞాపికల్ని ఇస్తాడు. (ఆదికాండము 19:15, 16; యిర్మీయా 7:23-26) ఆయన క్రమశిక్షణను ఇచ్చినప్పుడు దాన్ని సరియైన మోతాదులోనే ఇస్తాడు, అధికంగా ఇవ్వడు. (కీర్తన 103:10, 11; యెషయా 28:26-29) మనం మన పిల్లలతో అదే విధంగా వ్యవహరించినట్లైతే, మనకు యెహోవా తెలుసన్నదానికి అది సాక్ష్యాన్నిస్తుంది, అంతేగాక వారు కూడా ఆయన్ను తెలుసుకోవడం సులభంగా ఉంటుంది.—యిర్మీయా 22:16; 1 యోహాను 4:8.
5. వినడం విషయంలో తల్లిదండ్రులు యెహోవా నుండి ఏమి నేర్చుకోగలరు?
5 ప్రేమపూర్ణుడైన పరలోక తండ్రిగా యెహోవా అద్భుతమైన రీతిలో వింటాడు. ఆయన కేవలం ఆజ్ఞల్ని మాత్రమే జారీచేయడు. మన హృదయాల్ని ఆయన సన్నిధిని కుమ్మరించుమని ఆయన ప్రోత్సహిస్తున్నాడు. (కీర్తన 62:8) మనం వ్యక్తం చేసే భావోద్వేగాలు పూర్తిగా సరియైనవి కానప్పుడు ఆయన ఆకాశంనుండి పెద్ద స్వరంతో మందలించడు. ఆయన ఓపికగా మనకు బోధిస్తాడు. అందుకని, అపొస్తలుడైన పౌలు ఇచ్చిన ఈ సలహా ఎంత యుక్తమైనది: “మీరు ప్రియమైన పిల్లలవలె దేవునిపోలి నడుచుకొనుడి”! (ఎఫెసీయులు 4:31–5:1) తల్లిదండ్రులు తమ పిల్లలకు ఉపదేశం ఇవ్వడంలో యెహోవా వారికి ఎంతటి చక్కని మాదిరిని ఉంచుతున్నాడో కదా! అది మన హృదయాల్ని తాకే, మనం ఆయన జీవిత మార్గంలో నడవాలని కోరుకునేలా చేసే మాదిరి.
మాదిరి చూపించే ప్రభావం
6. తల్లిదండ్రుల వైఖరి, వారి మాదిరి వారి పిల్లల్ని ఎలా ప్రభావితం చేస్తుంది?
6 మౌఖికంగా ఉపదేశించడానికి తోడు యౌవనస్థులపైన ఒకరి మాదిరి అనేది చాలా గొప్ప ప్రభావాన్ని చూపిస్తుంది. తల్లిదండ్రులు దాన్ని ఇష్టపడినా ఇష్టపడకపోయినా, వాస్తవం ఏమిటంటే వారి పిల్లలు వారిని అనుకరించనైయున్నారు. తల్లిదండ్రులు తమ నోటిద్వారానే వచ్చిన కొన్ని మాటల్ని తమ పిల్లలు తిరిగి అనడం వారిని ప్రీతిపర్చగలదు—కొన్నిసార్లు వారికి విభ్రాంతిని కలుగజేయగలదు కూడా. తల్లిదండ్రుల ప్రవర్తన, వారి వైఖరి ఈ రెండూ ఆధ్యాత్మిక విషయాలపట్ల వారికి ఉన్న ప్రగాఢమైన మెప్పుదలను ప్రతిబింబిస్తున్నప్పడు, అది పిల్లలపై మంచి ప్రభావాన్ని చూపిస్తుంది.—సామెతలు 20:7.
7. యెఫ్తా తన కుమార్తెకు తండ్రిగా ఎటువంటి మాదిరిని ఉంచాడు, దాని ఫలితమేమిటి?
7 తల్లిదండ్రుల మాదిరి చూపించే ప్రభావం అనేది బైబిలులో చాలా చక్కగా దృష్టాంతపర్చబడింది. అమ్మోనీయులపై విజయం పొందేలా ఇశ్రాయేలీయులను నడిపించడానికి యెహోవా ఉపయోగించుకున్న యెఫ్తా ఒక తండ్రి కూడా. ఇశ్రాయేలీయులతో యెహోవా వ్యవహరించిన విధానాల గురించిన చరిత్రను యెఫ్తా చాలా తరచుగా చదివివుంటాడని అమ్మోనీయుల రాజుకు ఆయనిచ్చిన ప్రత్యుత్తరాన్ని గూర్చిన నివేదిక సూచిస్తుంది. ఆయన ఎంతో ధారాళంగా ఆ చరిత్రను ఉటంకించాడు, ఆయన యెహోవా మీద బలమైన విశ్వాసాన్ని కనపర్చాడు. ఆయన కుమార్తె, జీవితాంతం కన్యగా యెహోవాకు సమర్పించుకుని సేవచేయాలని నిర్ణయించుకోవడంలో ఆమె ప్రదర్శించిన విశ్వాసాన్నీ స్వయంత్యాగ స్ఫూర్తినీ పెంపొందించుకోవడానికి ఆయన మాదిరి ఆమెకు నిస్సందేహంగా సహాయం చేసివుంటుంది.—న్యాయాధిపతులు 11:14-27, 34-40; పోల్చండి యెహోషువ 1:8.
8. (ఎ) సమూయేలు తల్లిదండ్రులు ఎటువంటి చక్కని మాదిరిని ప్రదర్శించారు? (బి) అది సమూయేలుకు ఎలా ప్రయోజనాన్ని చేకూర్చింది?
8 సమూయేలు పిల్లవానిగా ఉన్నప్పుడు మాదిరికరంగా ఉండేవాడు, అటుతర్వాత జీవితాంతమూ ఒక ప్రవక్తగా దేవునికి విశ్వసనీయంగా ఉన్నాడు. ఆయనవలెనే మీ పిల్లలూ తయారు కావాలని మీరు కోరుకుంటున్నారా? సమూయేలు తల్లిదండ్రులైన ఎల్కానా, హన్నా చూపించిన మాదిరిని విశ్లేషించండి. తమ గృహంలోని పరిస్థితి బాగా లేకపోయినప్పటికీ వారు ఆరాధన కోసం పరిశుద్ధ మందసం ఉన్న షిలోహుకు క్రమంగా వెళ్లేవారు. (1 సమూయేలు 1:3-8, 21) హన్నా ఎంతటి లోతైన భావాలతో ప్రార్థించిందో గమనించండి. (1 సమూయేలు 1:9-13) దేవునికి చేసిన ఏ ప్రమాణాన్నైనా నెరవేర్చాల్సిన ప్రాముఖ్యతను గూర్చి వారిద్దరూ ఎలా భావించారో గమనించండి. (1 సమూయేలు 1:22-28) సమూయేలు, తన చుట్టూ ఉన్నవారు యెహోవాను సేవిస్తున్నామని చెప్పుకుంటూనే దేవుని మార్గాల్ని ఏమాత్రం ఖాతరు చేయనివారిగా ఉన్నప్పటికీ, తాను సరియైన మార్గాన్ని వెంబడించడాన్ని సాధ్యపర్చిన లక్షణాలను పెంపొందించుకోవడానికి, తన తల్లిదండ్రుల చక్కని మాదిరి సమూయేలుకు నిస్సందేహంగా సహాయపడివుంటుంది. కొంతకాలానికి యెహోవా తన ప్రవక్తగా సమూయేలుకు బాధ్యతలను అప్పగించాడు.—1 సమూయేలు 2:11, 12; 3:1-21.
9. (ఎ) ఇంట్లోని ఏ ప్రభావాలు తిమోతిపై మంచి ప్రభావాన్ని చూపాయి? (బి) తిమోతి ఎటువంటి వ్యక్తిగా తయారయ్యాడు?
9 యౌవనునిగా ఉన్నప్పుడే అపొస్తలుడైన పౌలుకు సహవాసి అయిన తిమోతిలా మీ కుమారుడు కూడా అవ్వాలని కోరుకుంటున్నారా? తిమోతి తండ్రి విశ్వాసి కాడు, కానీ ఆయన తల్లి ఆయన అవ్వ ఆధ్యాత్మిక విషయాలపట్ల మెప్పుదలతో కూడిన చక్కని మాదిరిని ఉంచారు. ఇది ఒక క్రైస్తవునిగా తిమోతి జీవితానికి ఒక మంచి పునాదిని స్థాపించుకోవడానికి నిస్సందేహంగా సహాయపడివుంటుంది. ఆయన తల్లి అయిన యునీకే, ఆయన అవ్వ అయిన లోయి “నిష్కపటమైన విశ్వాసము” గలవారై ఉన్నారని మనకు చెప్పబడింది. క్రైస్తవులుగా వారి జీవితాలు ఒక నాటకం కాదు; వారు నిజంగా తాము నమ్ముతున్నామని చెప్పుకునేదానికి అనుగుణ్యంగా జీవించారు, యౌవనుడైన తిమోతికి కూడా అలాగే జీవించమని నేర్పించారు. తాను నమ్మదగ్గవాడననీ, ఇతరుల సంక్షేమం నిమిత్తం తాను శ్రద్ధవహించేవాడననీ తిమోతి నిరూపించుకున్నాడు.—2 తిమోతి 1:3-5; ఫిలిప్పీయులు 2:20-22.
10. (ఎ) ఇంటిబయటి ఎటువంటి మాదిరులు మన పిల్లల్ని ప్రభావితం చేస్తాయి? (బి) ఈ ప్రభావాలు మన పిల్లల మాటల్లో వైఖరుల్లో పొడచూపితే మనం ఎలా ప్రతిస్పందించాలి?
10 మన పిల్లలపై పడే ప్రభావాలు అన్నీ ఇంటిలోనివే కావు. స్కూల్లో వారి తోటి పిల్లలున్నారు, యౌవనుల మనస్సులను మలచడమే వృత్తిధర్మంగా గల ఉపాధ్యాయులున్నారు, ప్రతి ఒక్కరు లోతుగా కూరుకుపోయిన జాతిపరమైన సమాజపరమైన ఆచారాలకు అనుగుణ్యంగా మారాలని భావించే ప్రజలున్నారు, తాము సాధించిన ఘనకార్యాలనుబట్టి ప్రతిచోట ప్రశంసించబడుతున్న క్రీడాకారులున్నారు, తమ ప్రవర్తన గురించి వార్తల్లో చెప్పబడే ప్రజా అధికారులున్నారు. ఇంకా కోట్లాది మంది పిల్లలు యుద్ధ కిరాతకానికి గురి అయ్యారు. ఈ ప్రభావాలు మన పిల్లల మాటల్లోనూ వైఖరుల్లోనూ పొడచూపితే మనం ఆశ్చర్యపోవాలా? వారు అలా చేసినప్పుడు మనం ఎలా ప్రతిస్పందిస్తాము? తీవ్రంగా మందలించడం, కఠినంగా లెక్చరివ్వడం సమస్యని పరిష్కరిస్తుందా? మన పిల్లల విషయంలో వెంటనే ప్రతిస్పందించే బదులు మనల్ని మనం, ‘మనతో యెహోవా వ్యవహరించే పద్ధతిలో, ఈ పరిస్థితిని ఎలా పరిష్కరించాలో గ్రహించడానికి సహాయం చేసేదేమైనా ఉందా?’ అని ప్రశ్నించుకోవటం ఉత్తమం కాదా?—పోల్చండి రోమీయులు 2:4.
11. తల్లిదండ్రులు తప్పులు చేసినప్పుడు అది వారి పిల్లల వైఖరిని ఎలా ప్రభావితం చేయగలదు?
11 అపరిపూర్ణులైన తల్లిదండ్రులు పరిస్థితులన్నింటినీ అతి శ్రేష్ఠమైన విధానంలో పరిష్కరించలేరు. వారు తప్పులు చేస్తారు. పిల్లలు దాన్ని గ్రహించినప్పుడు తమ తల్లిదండ్రులపట్ల వారికి ఉన్న గౌరవం ఎగిరిపోయేలా చేస్తుందా? అలా జరుగవచ్చు, ప్రాముఖ్యంగా తల్లిదండ్రులు తమ అధికారాన్ని గట్టిగా నొక్కి చెప్పడంద్వారా తమ తప్పుల్ని తేలిగ్గా తీసుకోవడానికి ప్రయత్నించినట్లైతే అలా జరుగుతుంది. కానీ తల్లిదండ్రులు నమ్రతతో తమ తప్పుల్ని స్వేచ్ఛగా ఒప్పుకున్నట్లైతే పరిణామాలు చాలా వేరుగా ఉండవచ్చు. ఈ విధంగా చేయడం ద్వారా, పిల్లలు కూడా అలాగే చేయడం నేర్చుకోవల్సిన అవసరం ఉంది గనుక వారికోసం విలువైన మాదిరిని ఉంచగలరు.—యాకోబు 4:6.
మన మాదిరి ఏమి బోధించగలదు?
12, 13. (ఎ) ప్రేమ గురించి పిల్లలు ఏమి తెలుసుకోవల్సిన అవసరం ఉంది, ఈ విషయాన్ని అత్యంత ప్రభావవంతమైన రీతిలో ఎలా నేర్పించవచ్చు? (బి) పిల్లలు ప్రేమ గురించి నేర్చుకోవటం ఎందుకు ప్రాముఖ్యం?
12 మౌఖిక ఉపదేశానికి మంచి మాదిరి తోడైనప్పుడు అత్యంత ప్రభావవంతంగా నేర్పించగల విలువైన పాఠాలు ఎన్నో ఉన్నాయి. కొన్నింటిని పరిశీలించండి.
13 నిస్వార్థ ప్రేమను వ్యక్తం చేయడం: మాదిరి ద్వారా లోతుగా నాటాల్సిన ఒక అత్యంత ప్రాముఖ్యమైన పాఠం ఏమిటంటే ప్రేమంటే ఏమిటన్నదే. “[దేవుడే] మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము.” (1 యోహాను 4:19) ప్రేమకు ఆయనే అత్యున్నతమైన మూలము, ఆయనే అత్యున్నతమైన మాదిరి. సూత్రబద్ధమైన ఈ ప్రేమ అయిన అగాపే బైబిలులో 100 సార్లకు పైగా పేర్కొనబడింది. నిజ క్రైస్తవుల్ని గుర్తించే ఒక లక్షణం అది. (యోహాను 13:35) అటువంటి ప్రేమను దేవునిపట్ల, యేసుక్రీస్తుపట్ల, మానవులు ఒకరిపట్ల మరొకరు చూపించవలసింది—చివరికి మనకు అభిమానం లేని ప్రజలపట్ల కూడా చూపించవలసింది. (మత్తయి 5:44, 45; 1 యోహాను 5:3) మనం ఈ ప్రేమను మన పిల్లలకు ప్రభావవంతంగా నేర్పించడానికి ముందు అది మన హృదయంలో వసించాలి, మన జీవితాల్లో ప్రస్ఫుటం కావాలి. మన కార్యాలు మన మాటలకన్నా గట్టిగా వినపడతాయి. కుటుంబంలో పిల్లలు ప్రేమనూ, దానికి సంబంధించిన అనురాగం వంటి లక్షణాలనూ చూసి వాటిని అనుభవించాల్సిన అవసరం ఉంది. ఇవి లేకపోయినట్లైతే పిల్లల్లో శారీరకంగా, మానసికంగా, భావోద్రేకపరంగా ఎదుగుదల కుంటుపడుతుంది. కుటుంబం వెలుపల తోటి క్రైస్తవులపట్ల యుక్తమైన రీతిలో ప్రేమానురాగాలు ఎలా ప్రదర్శితమౌతున్నాయో పిల్లలు చూడాల్సిన అవసరం కూడా ఉంది.—రోమీయులు 12:10; 1 పేతురు 3:8.
14. (ఎ) సంతృప్తిని కలిగించే నాణ్యమైన పని చేసేలా పిల్లలకు ఎలా నేర్పించవచ్చు? (బి) మీ కుటుంబంలో దీన్ని ఎలా చేయవచ్చు?
14 పనిచేయడం నేర్చుకోవడం: జీవితంలో పని అనేది ఒక ప్రాథమికమైన అంశం. ఆత్మగౌరవం ఉండాలంటే ఒక వ్యక్తి నాణ్యతగల పని చేయడం నేర్చుకోవల్సిన అవసరం ఉంది. (ప్రసంగి 2:24; 2 థెస్సలొనీకయులు 3:10) ఒక పిల్లవానికి ఎలా చేయాలో ఏమీ చెప్పకుండానే కొన్ని పనుల్ని ఇచ్చి, అటుతర్వాత వాటిని సరిగ్గా చేయనందుకు వాణ్ని నిందించినట్లైతే అసలు నాణ్యతగల పనులు నేర్చుకోవడమన్నది సంభవం కాకపోవచ్చు. కానీ పిల్లలు తమ తల్లిదండ్రులతోపాటు నిజంగా కలిసి పనిచేస్తూ నేర్చుకున్నప్పుడు, వారిని సరియైన విధంగా మెచ్చుకున్నప్పుడు వారు సంతృప్తిని కలిగించే పనిచేయడాన్ని నేర్చుకోవడం సులభ సాధ్యమౌతుంది. తల్లిదండ్రుల మాదిరితోపాటు వివరణలు కూడా ఇచ్చినట్లైతే పిల్లలు ఫలాని పనిని పూర్తి చేయడం ఎలాగో నేర్చుకోవడం మాత్రమే గాక, సమస్యల్ని ఎలా అధిగమించవచ్చో, అది పూర్తయ్యేంత వరకు దానికే ఎలా అంటిపెట్టుకోవచ్చో, తర్కబద్ధంగా ఆలోచిస్తూ ఎలా నిర్ణయాలు తీసుకోవచ్చో కూడా వారు నేర్చుకోగలరు. ఈ సందర్భాల్లోనే యెహోవా కూడా పనిచేస్తున్నాడనీ, ఆయన నాణ్యమైన పని చేస్తాడనీ, యేసు తన తండ్రిని అనుకరిస్తాడనీ వారు గ్రహించేందుకు వారికి సహాయం చేయవచ్చు. (ఆదికాండము 1:31; సామెతలు 8:27-31; యోహాను 5:17) ఒక కుటుంబం వ్యవసాయంగానీ లేదా వ్యాపారంగానీ చేస్తున్నట్లైతే కుటుంబంలోని కొందరు సభ్యులు కలిసి పనిచేయవచ్చు. లేదా బహుశ తల్లి తన కుమారునికి లేక కుమార్తెకు వంట చేయడమూ, భోంచేసిన తర్వాత శుభ్రం చేయడమూ నేర్పించవచ్చు. ఉద్యోగరీత్యా ఇంటికి దూరంగా ఉండే తండ్రి ఇంటివద్ద ఉన్నప్పుడు తన పిల్లలతో కొన్ని పనులు కలిసి చేయడానికి ప్లానులు వేసుకోవచ్చు. అత్యవసరమైన పనుల్ని కేవలం అయిపోగొట్టడమే కాక పిల్లల్ని భావి జీవితం కోసం సంసిద్ధుల్ని చేయడమన్నది తల్లిదండ్రులు మనస్సులో ఉంచుకుంటే ఎంత ప్రయోజనకరంగా ఉంటుంది !
15. విశ్వాసం విషయంలో పాఠాలను ఏ మార్గాల్లో నేర్పించవచ్చు? సోదాహరణంగా వివరించండి.
15 దుర్దశలో సహితం విశ్వాసాన్ని కల్గివుండటం: మన జీవితాల్లో విశ్వాసం కూడా చాలా కీలకమైన అంశం. కుటుంబ పఠనంలో విశ్వాసం గురించి చర్చించినప్పుడు పిల్లలు దాన్ని నిర్వచించడం నేర్చుకోగలరు. తమ హృదయాల్లో విశ్వాసం అభివృద్ధి చెందేలా చేసే సాక్ష్యాధారాల గురించి కూడా వారు తెలుసుకోగలరు. కానీ కఠోరమైన శ్రమల్లో సహితం తమ తల్లిదండ్రులు అచంచలమైన విశ్వాసాన్ని కనపరుస్తుండటం వారు చూసినప్పుడు ఆ ప్రభావం జీవితకాలం ఉండగలదు. పనామాలోని ఒక బైబిలు విద్యార్థినిని, యెహోవాను సేవించడం గనుక ఆపకపోతే ఇంట్లోనుండి వెళ్లగొడతానని ఆమె భర్త బెదిరించాడు. అయినప్పటికీ, ఆమె అతి దగ్గర్లో ఉన్న రాజ్యమందిరానికి వెళ్లడానికి తన నలుగురు చిన్న పిల్లలతో 16 కిలోమీటర్ల దూరం నడిచి, మరి 30 కిలోమీటర్లు బస్సులో క్రమంగా ప్రయాణించేది. ఆ మాదిరినిబట్టి ప్రోత్సహించబడి ఆమె కుటుంబంలోని దాదాపు 20 మంది సత్య మార్గాన్ని అవలంబించారు.
అనుదిన బైబిలు పఠనంలో మాదిరిని కనపర్చటం
16. అనుదిన కుటుంబ బైబిలు పఠనం ఎందుకు సిఫారసు చేయబడుతుంది?
16 ఏ కుటుంబమైనా స్థాపించగల అత్యంత విలువైన ఆచారాల్లో ఒకటి—తల్లిదండ్రులకు ప్రయోజనాన్ని చేకూర్చగల ఆచారం, అనుకరించడానికి పిల్లలకు ఒక మాదిరిగా ఉండగల ఆచారం అయిన—క్రమంగా బైబిలును చదివే ఆచారమే. సాధ్యమైనట్లైతే, ప్రతి రోజు కొంతసేపు బైబిలును చదవండి. మీరు ఎంత చదువుతారన్నది కాదు ప్రాముఖ్యమైనది. బైబిలును క్రమంగా చదవడమూ, ఆ చదివే విధానమూ అంతకంటే ఎంతో ఎక్కువ ప్రాముఖ్యమైనవి. పిల్లల విషయంలో, బైబిలును చదవటంతోపాటు, వారు అర్థం చేసుకోగల భాషలో అందుబాటులో ఉన్నట్లైతే నా బైబిలు కథల పుస్తకము యొక్క ఆడియో క్యాసెట్లు కూడా వినవచ్చు. దేవుని వాక్యాన్ని ప్రతి రోజు చదవటం దేవుని తలంపుల్ని మనస్సులో అన్నింటికన్నా ప్రథమంగా ఉంచుకునేందుకు సహాయపడుతుంది. అంతేగాక ఆ పద్ధతిలో బైబిలును వ్యక్తులుగా మాత్రమే కాక కుటుంబాలుగా చదివినట్లైతే, అది పూర్తి కుటుంబమూ యెహోవా మార్గంలో నడిచేందుకు సహాయపడుతుంది. ఇటీవల జరిగిన “దైవిక జీవిత మార్గము” జిల్లా సమావేశాల్లోని కుటుంబములారా—అనుదిన బైబిలు పఠనాన్ని మీ జీవిత మార్గంగా చేసుకోండి ! అనే నాటకంలో ఈ అలవాటునే ప్రోత్సహించడం జరిగింది.—కీర్తన 1:1-3.
17. ఎఫెసీయులు 6:4లో ఉన్న సలహాను అన్వయించుకోవడానికి కుటుంబ బైబిలు పఠనమూ, కీలకమైన లేఖనాలను కంఠతా పెట్టడమూ ఎలా సహాయం చేస్తాయి?
17 ఒక కుటుంబముగా బైబిలును చదవటమనేది అపొస్తలుడైన పౌలు ఎఫెసులో ఉన్న క్రైస్తవులకు ప్రేరేపణక్రింద వ్రాసినదానికి అనుగుణ్యంగా ఉంది, అదేమిటంటే: “తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు [“యెహోవా,” NW] యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి.” (ఎఫెసీయులు 6:4) ఏమిటి దానర్థం? “బోధలోను” అన్నదానికి అక్షరార్థంగా “మనస్సును లోపల ఇమడ్చటం” అని అర్థం; కాబట్టి క్రైస్తవ తండ్రులు యెహోవా దేవుని మనస్సును తమ పిల్లల మనస్సుల్లో ఇమడ్చమని—దేవుని తలంపులను తమ పిల్లలు తెలుసుకునేందుకు సహాయపడమని ఉద్బోధించబడుతున్నారు. కొన్ని కీలకమైన లేఖనాలను కంఠతా పెట్టమని పిల్లల్ని ప్రోత్సహించడం దీన్ని సాధించడానికి సహాయపడగలదు. లక్ష్యం ఏమిటంటే, పిల్లల తలంపుల్ని యెహోవా తలంపులు నిర్దేశించేలా చేయడమే, ఆ విధంగా తల్లిదండ్రులు పిల్లల దగ్గర ఉన్నా లేకపోయినా వారి కోరికలూ, వారి ప్రవర్తనా క్రమ క్రమంగా దైవిక ప్రమాణాలను ప్రతిబింబించనారంభిస్తాయి. అటువంటి ఆలోచనా విధానానికి బైబిలు పునాది.—ద్వితీయోపదేశకాండము 6:6, 7.
18. బైబిలును చదివేటప్పుడు, (ఎ) దాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవడానికి, (బి) అందులోని సలహా నుండి ప్రయోజనం పొందడానికి, (సి) యెహోవా సంకల్పం గురించి అది తెలిపేదానికి ప్రతిస్పందించడానికి, (డి) ప్రజల వైఖరుల గురించీ, వారి చర్యల గురించీ అది చెబుతున్న దాన్నుండి ప్రయోజనం పొందడానికి ఏమి అవసరం?
18 కానీ, బైబిలు మన జీవితాల్ని ప్రభావితం చేయాలంటే అది ఏమి చెబుతుందో అర్థం చేసుకోవల్సిన అవసరం ఉంది. చాలామంది విషయంలో ఇందుకు బైబిలు భాగాలను ఒకటికి పదిసార్లు చదవాల్సిన అవసరం ఉండవచ్చు. కొన్ని వ్యక్తీకరణల్లోని పూర్తి భావాన్ని గ్రహించడానికి మనం నిఘంటువులో అర్థాన్ని వెదకడం లేదా లేఖనాలపై అంతర్దృష్టిలో (ఆంగ్లం) పరిశోధన చేయడం అవసరం కావచ్చు. ఒక లేఖనంలో సలహా గానీ ఆజ్ఞ గానీ ఉన్నట్లైతే ఆ సలహానీ ఆ ఆజ్ఞనూ మన కాలాల్లో అన్వయించుకోదగినదిగా చేసే పరిస్థితుల గురించి మాట్లాడటానికి సమయం వెచ్చించండి. అప్పుడు మీరు, ‘ఈ సలహాను అన్వయించుకోవడం మనకెలా ప్రయోజనాన్ని తీసుకురాగలదు?’ అని ప్రశ్నించండి. (యెషయా 48:17, 18) లేఖనం గనుక యెహోవా సంకల్పంలోని ఏదైనా అంశాన్ని గురించి చెబుతున్నట్లైతే, ‘దీని మూలంగా మన జీవితాలెలా ప్రభావితమౌతున్నాయి?’ అని ప్రశ్నించండి. బహుశ మీరు ఫలాని ప్రజల వైఖరుల గురించీ, వారి చర్యల గురించీ చెబుతున్న ఒక వృత్తాంతాన్ని చదువుతుండవచ్చు. తమ జీవితాల్లో వారు ఎటువంటి ఒత్తిళ్ళను అనుభవించారు? వారు వాటితో ఎలా వ్యవహరించారు? మనం వారి ఉదాహరణ నుండి ఎలా ప్రయోజనం పొందగలము? నేడు మన జీవితాల్లో ఆ వృత్తాంతం ఏమి భావాన్ని కలిగివుందో చర్చించటానికి ఎల్లప్పుడూ సమయాన్ని తీసుకోండి.—రోమీయులు 15:4; 1 కొరింథీయులు 10:11.
19. దేవునిపోలి నడుచుకునే వారిగా ఉండటం ద్వారా మనం మన పిల్లలకు ఏమి అందిస్తున్న వారమౌతాము?
19 దేవుని తలంపుల్ని మన మనస్సుల్లోనూ హృదయాల్లోనూ నాటుకునేలా చేయడానికది ఎంత శ్రేష్ఠమైన మార్గం! ఆ విధంగా మనం, “ప్రియమైన పిల్లలవలె దేవునిపోలి నడుచు”కోవడానికి నిజంగా సహాయాన్ని పొందుతాము. (ఎఫెసీయులు 5:1) అంతేగాక మన పిల్లలు నిజంగా అనుకరించను యోగ్యమైన మాదిరిని మనం అందిస్తాము.
మీకు జ్ఞాపకముందా?
◻ తల్లిదండ్రులు యెహోవా మాదిరి నుండి ఎలా ప్రయోజనం పొందగలరు?
◻ పిల్లలకు మౌఖిక ఉపదేశాన్నివ్వటానికి తోడు తల్లిదండ్రులు చక్కని మాదిరిని ఎందుకు కనపర్చాలి?
◻ తల్లిదండ్రుల మాదిరి ద్వారా అత్యంత శ్రేష్ఠంగా నేర్పించగల కొన్ని విషయాలు ఏమిటి?
◻ కుటుంబ బైబిలు పఠనం ద్వారా మనం పూర్తి ప్రయోజనాన్ని ఎలా పొందగలము?
[10వ పేజీలోని చిత్రాలు]
ఒక కుటుంబముగా అనుదినము బైబిలును చదవటం చాలామందికి ఆనందాన్నిస్తుంది