కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w98 4/1 పేజీలు 15-20
  • దేవుని నుండి వచ్చిన గ్రంథం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దేవుని నుండి వచ్చిన గ్రంథం
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • విజ్ఞానశాస్త్రంతో ఏకీభవిస్తున్న గ్రంథం
  • ఆధునిక జీవనానికి ఆచరణాత్మకమైన గ్రంథం
  • నిజమైన ప్రవచన గ్రంథం
  • ఈ గ్రంథం విజ్ఞానశాస్త్రంతో ఏకీభవిస్తోందా?
    సర్వమానవాళి కొరకైన గ్రంథం
  • ప్రవచన గ్రంథం
    సర్వమానవాళి కొరకైన గ్రంథం
  • బైబిలు—దేవుడు ఇచ్చిన గ్రంథం
    బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది?
  • ఆధునిక జీవనానికి ఆచరణాత్మకమైన గ్రంథం
    సర్వమానవాళి కొరకైన గ్రంథం
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
w98 4/1 పేజీలు 15-20

దేవుని నుండి వచ్చిన గ్రంథం

“ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్ఛనుబట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మవలన ప్రేరేపింపబడినవారై దేవుని మూలముగ పలికిరి.”—2 పేతురు 1:21.

1, 2. (ఎ) బైబిలు ఆధునిక జీవనానికి విలువైనదా కాదా అని కొంతమంది ఎందుకు ప్రశ్నిస్తారు? (బి) బైబిలు దేవుని నుండి వచ్చినదని చూపించేందుకు ఏ మూడు రుజువుల్ని మనం ఉపయోగించవచ్చు?

ఇరవయ్యొకటవ శతాబ్దానికి చేరువలో జీవిస్తున్న ప్రజలకు బైబిలు విలువైనదేనా? కాదని కొంతమంది అనుకుంటారు. డా. ఈలై. ఎస్‌. చెసన్‌ తాను బైబిల్ని వ్యవహారంలోలేని పుస్తకంగా ఎందుకు భావిస్తున్నాడో వివరిస్తూ, “ఆధునిక కెమిస్ట్రీ తరగతిలో ఉపయోగించేందుకు 1924 నాటి కెమిస్ట్రీ టెక్ట్స్‌[బుక్‌]ను ఎవ్వరూ సిఫారసు చేయరు” అని రాశాడు. పైకి చూస్తే, ఇది సరియైన వాదంలానే కనబడుతోంది. బైబిలు రాయబడిన కాలంనుండి ఇప్పటి వరకూ విజ్ఞాన శాస్త్రం గురించీ, మానసిక ఆరోగ్యం గురించీ, మానవ ప్రవర్తన గురించీ మానవుడు ఎంతో నేర్చుకున్నాడు. కాబట్టి, ‘అలాంటి ప్రాచీన గ్రంథం విజ్ఞానశాస్త్రపరంగా తప్పుల తడకగాకుండా ఎలా ఉండగలదు? ఆధునిక జీవనానికి ఆచరణాత్మకమైన సలహాను అది ఎలా కలిగి ఉండగలదు?’

2 దానికి బైబిలే జవాబిస్తుంది. 2 పేతురు 1:21లో, బైబిలు ప్రవక్తలు “పరిశుద్ధాత్మవలన ప్రేరేపింపబడినవారై దేవుని మూలముగ పలికిరి” అని మనకు చెప్పబడింది. బైబిలు దేవుని నుండి వచ్చిన గ్రంథమని ఆ విధంగా అది సూచిస్తోంది. అయితే, ఇది దేవుని నుండి వచ్చిన గ్రంథమని మనం ఇతరుల్నెలా ఒప్పించగలం? బైబిలు దేవుని వాక్యమనడానికి గల మూడు రుజువుల్ని మనం పరిశీలిద్దాం: (1) ఇది విజ్ఞానశాస్త్రపరంగా కచ్చితమైనది, (2) ఇది ఆధునిక జీవనానికి ఆచరణాత్మకమైనటువంటి కాల పరిమితిలేని సూత్రాల్ని కల్గివుంది, (3) ఇది, నెరవేరిన, చారిత్రక వాస్తవాలచే రుజువు పర్చబడిన నిర్దిష్టమైన ప్రవచనాల్ని కల్గివుంది.

విజ్ఞానశాస్త్రంతో ఏకీభవిస్తున్న గ్రంథం

3. బైబిలు విజ్ఞానశాస్త్ర పరిశోధనలచే ఎందుకు బెదిరించబడలేదు?

3 బైబిలు విజ్ఞానశాస్త్ర పాఠ్యపుస్తకంకాదు. అయితే, అది ఒక సత్యగ్రంథం, సత్యం కాలపరీక్షకు తాళుకొని నిలబడగలదు. (యోహాను 17:17) బైబిలు విజ్ఞానశాస్త్ర పరిశోధనలచే బెదిరించబడలేదు. బైబిలు విజ్ఞానశాస్త్రానికి సంబంధించిన విషయాల్ని ప్రస్తావించినప్పుడు, అది కట్టుకథలని నిరూపించబడిన ప్రాచీన “విజ్ఞానశాస్త్ర” సిద్ధాంతాల నుండి పూర్తిగా దూరంగావుంది. నిజానికి, బైబిలు విజ్ఞాన శాస్త్రపరంగా సరియైన వ్యాఖ్యానాల్ని కల్గివుండడం మాత్రమేగాక ఆ కాలంలో అంగీకరించబడిన అభిప్రాయాలను పూర్తిగా వ్యతిరేకిస్తుంది కూడా. ఉదాహరణకు, బైబిలుకూ, వైద్య విజ్ఞానశాస్త్రాలకూ మధ్యనున్న పొందికను పరిశీలించండి.

4, 5. (ఎ) ప్రాచీనకాలంనాటి వైద్యులు రోగాన్ని గూర్చిన దేన్ని అర్థంచేసుకోలేకపోయారు? (బి) ఐగుప్తులోని వైద్యులు చేసే మెడికల్‌ ప్రాక్టీసులతో మోషేకు నిస్సందేహంగా పరిచయముందని ఎందుకు చెప్పవచ్చు?

4 రోగమెలా వ్యాప్తిచెందుతుందో ప్రాచీనకాలంనాటి వైద్యులు పూర్తిగా అర్థంచేసుకోలేకపోయారు, అంతేగాక రోగాన్ని నిరోధించడంలో పారిశుద్ధ్యత యొక్క ప్రాముఖ్యతను కూడా వాళ్లు గ్రహించలేకపోయారు. ఆధునిక ప్రామాణికతలనుబట్టి చూస్తే ప్రాచీన మెడికల్‌ ప్రాక్టీసుల్లో అనేకం అనాగరికమైనవనిపించవచ్చు. అందుబాటులోవున్న అత్యంత ప్రాచీన వైద్య గ్రంథాల్లో ఒకటేమిటంటే, సా.శ.పూ. 1550 నాటి ఐగుప్తీయుల వైద్య పరిజ్ఞాన సంకలనమైన ఎబెర్స్‌ పపైరస్‌ గ్రంథమే. ఈ గ్రంథంలో “మొసలికాటు దగ్గరనుండి కాలిగోటి నొప్పి వరకూ” వివిధ బాధలకు 700 రోగనివారణోపాయాలు ఇవ్వబడ్డాయి. ఆ రోగనివారణోపాయాల్లో అనేకం నిరర్థకమైనవే అయినా, వాటిలో కొన్ని ఎంతో ప్రమాదకరమైనవి కూడా. గాయానికి చేసే చికిత్సల్లో ఒకటి, మానవ మలమూ ఇతర పదార్థాల సమ్మేళనంతో చేయబడిన మిశ్రమాన్ని ఆ గాయంపై రాస్తూండాలని సిఫారసు చేసింది.

5 ఇంచుమించుగా బైబిల్లోని మొదటి పుస్తకాలు—వాటిలో మోషే ధర్మశాస్త్రం కూడా ఇమిడివుంది—రాయబడిన కాలంలోనే ఐగుప్తీయుల వైద్య నివారణోపాయాలకు సంబంధించిన ఈ గ్రంథం రాయబడింది. సా.శ.పూ. 1593లో జన్మించిన మోషే ఐగుప్తులో పెరిగాడు. (నిర్గమకాండము 2:1-10) ఫరో ఇంటిలో పెంచబడిన మోషే ‘ఐగుప్తీయుల సకలవిద్యలను అభ్యసించాడు.’ (అపొస్తలుల కార్యములు 7:22) ఐగుప్తులోని ‘వైద్యులతో’ ఆయనకు పరిచయముంది. (ఆదికాండము 50:1-3) వాళ్ల నిష్ప్రయోజనకరమైన లేక అపాయకరమైన మెడికల్‌ ప్రాక్టీసులు ఆయన రచనలను ప్రభావితం చేశాయా?

6. మోషే ధర్మశాస్త్రంలోని ఏ పారిశుద్ధ్య నియమం ఆధునిక వైద్య విజ్ఞానశాస్త్రరీత్యా కారణసహితమైనదిగా పరిగణించబడుతుంది?

6 దానికి భిన్నంగా, మోషే ధర్మశాస్త్రం ఆధునిక వైద్య విజ్ఞానశాస్త్రం కారణసహితమైనవిగా పరిగణించే పారిశుద్ధ్య నియమాల్ని చేర్చింది. ఉదాహరణకు, మలాన్ని గుడారానికి దూరంగా కప్పిపెట్టాలని సైనిక శిబిరాల్ని గూర్చిన ఒక చట్టం తెలియజేసింది. (ద్వితీయోపదేశకాండము 23:13) ఇది ఎంతో పురోభివృద్ధిదాయకమైన రోగనిరోధక చర్యయైవుంది. వాళ్ళు ఉపయోగించే నీళ్లు కలుషితం కాకుండా ఉండేందుకు ఇది తోడ్పడింది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇప్పటికీ లక్షలాదిమంది ప్రాణాల్ని పొట్టన పెట్టుకుంటున్న, ఈగల మూలంగా వచ్చే షైజెల్లా అనబడే విరేచనాల నుండీ మరితర అతిసార వ్యాధుల నుండీ అది వారిని కాపాడింది.

7. మోషే ధర్మశాస్త్రంలోని ఏ పారిశుద్ధ్య నియమాలు అంటు వ్యాధులు వ్యాప్తి చెందకుండా నిరోధించేందుకు సహాయపడ్డాయి?

7 మోషే ధర్మశాస్త్రంలో అంటు వ్యాధులు వ్యాప్తి చెందకుండా నివారించే ఇతర పారిశుద్ధ్య కట్టడలు ఉన్నాయి. అంటువ్యాధి ఉన్న వ్యక్తి లేక ఉందని అనుమానించబడిన వ్యక్తి వేరుగా ఉంచబడేవాడు. (లేవీయకాండము 13:1-5) దానికదే (బహుశా రోగమొచ్చి) చనిపోయిన ఓ జంతువును తాకిన వస్త్రాల్నిగానీ లేక పాత్రల్నిగానీ తిరిగి ఉపయోగించే ముందు వాటిని శుభ్రంగా ఉతకాలి లేక కడగాలి, అలాకాకపోతే వాటిని నాశనం చేయాలి. (లేవీయకాండము 11:27, 28, 32, 33) శవాన్ని ముట్టుకున్న వ్యక్తి ఎవరైనా సరే అతడు అపవిత్రునిగా పరిగణించబడేవాడు. అతడు పారిశుద్ధ్య పద్ధతిని పాటించాల్సిందే. ఇందులో తన వస్త్రాల్ని ఉతుక్కోవడం, స్నానం చేయడం చేరివున్నాయి. అపవిత్రంగా ఉండే ఏడు రోజుల కాలంలో, అతడు ఇతరుల్ని ముట్టుకోకూడదు.—సంఖ్యాకాండము 19:1-13.

8, 9. మోషే ధర్మశాస్త్రంలోని పారిశుద్ధ్య నియమం, ఆ కాలంనాటి వైద్య విధానాలకన్నా ఎంతో ముందున్నదని ఎందుకు చెప్పవచ్చు?

8 ఆ కాలానికన్నా మరెంతో ముందున్న జ్ఞానాన్ని ఈ పారిశుద్ధ్య విధానం బయల్పరుస్తోంది. రోగాల వ్యాప్తిని గురించీ, నివారణ గురించీ ఆధునిక వైద్య శాస్త్రం ఎంతో తెలుసుకుంది. ఉదాహరణకు 19వ శతాబ్దంలోని వైద్య పురోభివృద్ధులు, యాంటీ సెప్సిస్‌ను—అంటువ్యాధుల్ని తగ్గించేందుకు పారిశుద్ధ్యతను పాటించడాన్ని పరిచయం చేయడానికి దారితీశాయి. దాని ఫలితంగా అంటువ్యాధుల సంఖ్యా, అకాల మరణాల సంఖ్యా విశేషంగా తగ్గిపోయాయి. 1900వ సంవత్సరంలో, అనేక యూరోపియన్‌ దేశాల్లోనూ, అమెరికాలోనూ సగటు జీవితాయుష్షు 50 ఏళ్లకన్నా తక్కువే ఉండేది. అప్పటినుండీ, రోగాల్ని నియంత్రించడంలో వైద్యశాస్త్రం సాధించిన పురోభివృద్ధినిబట్టేగాక మంచి పారిశుద్ధ్య పరిస్థితుల్నిబట్టీ, మంచి జీవన పరిస్థితుల్నిబట్టీ కూడా జీవితాయుష్షు గణనీయంగా పెరిగింది.

9 అయితే, రోగాలు వ్యాపించే విధానాన్ని గురించి వైద్య శాస్త్రం తెలుసుకోవడానికి వేలాది సంవత్సరాల మునుపే రోగాన్నుండి పరిరక్షించే సహేతుకమైన రోగ నిరోధక పద్ధతుల్ని బైబిలు సిఫారసు చేసింది. తన కాలంలోని ఇశ్రాయేలీయుల గురించి, వారు 70 లేక 80 సంవత్సరాల వయస్సు వరకు జీవిస్తారని మోషే చెప్పగలిగాడంటే అందులో ఆశ్చర్యమేమీ లేదు. (కీర్తన 90:10) అలాంటి పారిశుద్ధ్య కట్టడల్ని గురించి మోషే ఎలా తెలుసుకోగలిగాడు? బైబిలే ఇలా వివరిస్తోంది: ధర్మశాస్త్రం “దేవదూతల ద్వారా నియమింపబడెను.” (గలతీయులు 3:19) అవును, బైబిలు మానవ జ్ఞాన గ్రంథం కాదు; అది దేవుని నుండి వచ్చిన గ్రంథం.

ఆధునిక జీవనానికి ఆచరణాత్మకమైన గ్రంథం

10. బైబిలు దాదాపు 2,000 సంవత్సరాల క్రిందటే పూర్తిచేయబడినప్పటికీ, దాని సలహా విషయంలో ఏది వాస్తవమైవుంది?

10 సలహాలిచ్చే పుస్తకాలు పాతబడిపోయి, త్వరలోనే సవరించబడే లేక మార్చబడే అవకాశముంది. కానీ, బైబిలు నిజంగా అసమానమైనది. “నీ శాసనములు ఎన్నడును తప్పిపోవు” అని కీర్తన 93:5 చెబుతోంది. బైబిలు దాదాపు 2,000 సంవత్సరాల క్రిందటే పూర్తిచేయబడినప్పటికీ, దాని మాటలు ఇప్పటికీ అన్వయించుకోదగినవే. మన శరీరఛాయ ఏదైనప్పటికీ లేక మనం జీవించే దేశం ఏదైనప్పటికీ అవి సమానమైన ప్రభావంతో అన్వయిస్తాయి. ‘ఎన్నడును తప్పిపోని’ కాల పరిమితిలేని బైబిలు సలహాల్ని గూర్చిన కొన్ని ఉదాహరణలను పరిశీలించండి.

11. అనేక దశాబ్దాల క్రిందట, పిల్లల క్రమశిక్షణ విషయంలో తల్లిదండ్రుల్లో అనేకమంది ఏమని విశ్వసించడానికి నడిపించబడ్డారు?

11 అనేక దశాబ్దాల క్రిందట, పిల్లల క్రమశిక్షణ విషయంలో “అధునాతన భావాలచే” ప్రేరేపించబడ్డ తల్లిదండ్రుల్లో అనేకమంది—“నిషేధించడం నిషేధం” అని తలంచారు. పిల్లలకు హద్దుల్ని నియమించడమనేది ఉద్వేగాఘాతాన్నీ, నిరాశనూ కల్గిస్తుందని వాళ్లు భయపడ్డారు. తల్లిదండ్రులు తమ పిల్లల్ని మృదువుగా సరిదిద్దడం మినహా ఇంకేమీ చేయకూడదని పిల్లల పెంపకం విషయంలో సలహాల్నిచ్చే సుహృద్భావంగల సలహాదార్లు పదే పదే తెలియజేసేవారు. అలాంటి నిపుణుల్లో అనేకమంది ఇప్పుడు “అదుపులో ఉంచడానికి కొంచెం కఠినంగా ఉండాలని తల్లిదండ్రులకు ఉద్బోధిస్తున్నారు” అని ది న్యూయార్క్‌ టైమ్స్‌ నివేదిస్తుంది.

12. “క్రమశిక్షణ” అని అనువదించబడిన గ్రీకు నామవాచక భావమేమిటి, అలాంటి క్రమశిక్షణ పిల్లలకు ఎందుకు అవసరం?

12 అయితే, పిల్లల క్రమశిక్షణ విషయంలో బైబిలు ఎల్లవేళలా నిర్దిష్టమైన సమతుల్యతగల సలహాను ఇచ్చింది. అదిలా సలహా ఇస్తోంది: “తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను [“క్రమశిక్షణ”NW] బోధలోను వారిని పెంచుడి.” (ఎఫెసీయులు 6:4) “క్రమశిక్షణ” అని అనువదించబడిన గ్రీకు నామవాచకానికి “పెంచడం, తర్ఫీదునివ్వడం, ఉపదేశించడం” అని అర్థం. అలాంటి క్రమశిక్షణ లేక ఉపదేశం తల్లిదండ్రుల ప్రేమకు నిదర్శనమని బైబిలు చెబుతోంది. (సామెతలు 13:24) తప్పొప్పుల్ని తెలుసుకొనే వివేకాన్ని పెంపొందించుకోవడానికి సహాయపడే నైతిక నియమాల ఆధ్వర్యాన పిల్లలు వర్ధిల్లుతారు. సరియైన విధంగా ఇవ్వబడిన క్రమశిక్షణ వాళ్లు తాము భద్రంగా ఉన్నామని భావించేలా సహాయపడుతుంది; తమ తల్లిదండ్రులు తమ ఎడలా అలాగే తామెలాంటి వ్యక్తులుగా తీర్చిదిద్దబడాలనే విషయం ఎడలా శ్రద్ధ కల్గివున్నారని అది వారికి తెలియజేస్తుంది.—పోల్చండి సామెతలు 4:10-13.

13. (ఎ) క్రమశిక్షణనిచ్చే విషయానికి వచ్చేటప్పటికి, బైబిలు తల్లిదండ్రులకు ఏ హెచ్చరికనిస్తోంది? (బి) బైబిలు ఏ తరహా క్రమశిక్షణను సిఫారసు చేస్తోంది?

13 కానీ క్రమశిక్షణనిచ్చే ఈ విషయంలో బైబిలు తల్లిదండ్రుల్ని హెచ్చరిస్తోంది. తల్లిదండ్రుల అధికారం ఎన్నడూ దుర్వినియోగపర్చబడకూడదు. (సామెతలు 22:15) ఏ పిల్లవాడూ క్రూరంగా శిక్షించబడకూడదు. బైబిలు సూత్రాలకు అనుగుణ్యంగా జీవిస్తున్న కుటుంబంలో భౌతిక హింసకు తావేలేదు. (కీర్తన 11:5) భావోద్రేకమైన హింసకు అంటే, కఠినమైన మాటలూ, ఎడతెగని విమర్శా, ఎత్తిపొడుపు మాటలూ వంటి వాటికి కూడా తావు లేదు. ఇవన్నీ పిల్లవాడు కృంగిపోయేలా చేయగలవు. (పోల్చండి సామెతలు 12:18.) జ్ఞానయుక్తంగా, బైబిలు తల్లిదండ్రుల్నిలా హెచ్చరిస్తోంది: “మీ పిల్లల మనస్సు కృంగకుండునట్లు [“వాళ్ల ధైర్యం నిర్వీర్యమైపోయేలా”, ఫిలిప్స్‌] వారికి కోపము పుట్టింపకుడి.” (కొలొస్సయులు 3:21) బైబిలు నివారణా చర్యలను సిఫారసు చేస్తోంది. తల్లిదండ్రులు తమ పిల్లల్లో నైతిక విలువల్నీ, ఆధ్యాత్మిక విలువల్నీ నాటేందుకు మామూలు సమయాల్ని ఉపయోగించుకోవాలని ద్వితీయోపదేశకాండము 11:19 నందు వారికి ఉపదేశించబడింది. పిల్లల్ని పెంచే విషయంలో అలాంటి స్పష్టమైన, సహేతుకమైన సలహా బైబిలు కాలాల్లో ఎంత విలువైనదో నేడూ అంతే విలువైనది.

14, 15. (ఎ) ఏ విధంగా బైబిలు జ్ఞానయుక్తమైన సలహాను ఇవ్వడంకన్నా ఇంకా ఎక్కువే చేస్తుంది? (బి) వివిధ జాతులకూ దేశాలకూ చెందిన స్త్రీ పురుషులు ఒకరినొకరు సమానమైన వారిగా దృష్టించుకునేందుకు బైబిల్లోని ఏ బోధలు సహాయపడగలవు?

14 బైబిలు జ్ఞానయుక్తమైన సలహాల్ని ఇవ్వడంకన్నా ఇంకా ఎక్కువే చేస్తుంది. దాని సందేశం హృదయాన్ని ఆకట్టుకుంటుంది. హెబ్రీయులు 4:12 ఇలా చెబుతోంది: “దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంతమట్టుకు దూరుచు, హృదయముయొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది.” బైబిలుకున్న ప్రేరేపించే శక్తిని ఉదహరించేందుకు ఒక ఉదాహరణను పరిశీలించండి.

15 నేడు ప్రజలు జాతి దేశ వర్గ వైషమ్యాలనే అడ్డుగోడలచే విభజించబడ్డారు. ఇలాంటి కృత్రిమమైన అడ్డుగోడలు, ప్రపంచవ్యాప్తంగా నిర్దోషులైన మానవులు యుద్ధాల్లో సామూహికంగా వధించబడడానికి దోహదపడ్డాయి. మరో వైపున, వివిధ జాతులకూ దేశాలకూ చెందిన స్త్రీ పురుషులు ఒకరినొకరు సమానమైన వారిగా దృష్టించుకునేందుకు సహాయపడే బోధలు బైబిలులో ఉన్నాయి. ఉదాహరణకు, దేవుడు ‘ఒకనినుండి ప్రతిజాతి మనుష్యులను సృష్టించాడు’ అని అపొస్తలుల కార్యములు 17:26వ వచనం చెబుతోంది. నిజానికి ఉన్నదొకే ఒక జాతి అనీ అదే మానవ జాతి అనీ ఇది చూపిస్తోంది! అంతేగాక, బైబిలు “దేవునిపోలి నడుచుకొనుడి” అని మనల్ని ప్రోత్సహిస్తూ, ఆ దేవుని గురించి ఇలా చెబుతోంది: “[ఆయన] పక్షపాతి కా[డు] . . . ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొనువానిని ఆయన అంగీకరించును.” (ఎఫెసీయులు 5:1; అపొస్తలుల కార్యములు 10:34, 35) బైబిలు బోధల ప్రకారంగా జీవించేందుకు నిజంగా ప్రయత్నించే వారిపై ఈ జ్ఞానం ఐక్యపరిచే ప్రభావాన్ని చూపిస్తుంది. ఇది, ప్రజలను విభజించే మానవ నిర్మిత అడ్డుగోడల్ని తొలగిస్తూ, అంతర్గతంగా అంటే మానవ హృదయాంతరాళాలపై ప్రభావాన్ని చూపిస్తుంది. నేటి లోకంలో ఇది నిజంగా పనిచేస్తోందా?

16. యెహోవాసాక్షులు నిజమైన అంతర్జాతీయ సహోదరత్వాన్ని కల్గివున్నారని చూపించే ఒక అనుభవాన్ని తెలియజేయండి.

16 ఎంతో నిశ్చయంగా అది పనిచేస్తోంది! యెహోవాసాక్షులు తమ అంతర్జాతీయ సహోదరత్వాన్నిబట్టి అంటే సామాన్యంగా ఒకరితో మరొకరు సమాధానంగా ఉండని వేర్వేరు నేపథ్యాలకు చెందిన ప్రజల్ని ఐక్యపర్చే సహోదరత్వాన్నిబట్టి పేరుగాంచారు. ఉదాహరణకు, రువాండాలోని జాతి ఘర్షణలు జరిగిన కాలంలో, ఆ దేశంలో ఉన్న ప్రతి తెగలోని యెహోవాసాక్షులూ మరొక తెగకు చెందిన తమ క్రైస్తవ సహోదర సహోదరీల్ని కాపాడారు. ఈ ప్రక్రియలో తమ సొంత ప్రాణాల్ని అపాయంలో పడవేసుకున్నారు. ఒక సందర్భంలో, హుటూ తెగకు చెందిన ఒక సాక్షి తన సంఘానికి చెందిన ఆరుగురు టుట్సీ కుటుంబ సభ్యుల్ని తన ఇంట్లో దాచి పెట్టాడు. విచారకరంగా, టుట్సీ కుటుంబాన్ని చివరకు పట్టుకొని, చంపివేశారు. హుటూ సహోదరుడూ, అతని కుటుంబమూ ఇప్పుడు ఆ హంతకుల కోపానికి గురై, టాంజానియాకు పారిపోవాల్సి వచ్చింది. ఇలాంటి ఉదాహరణలు అనేకం రిపోర్టు చేయబడ్డాయి. బైబిలు సందేశానికున్న ప్రేరేపణా శక్తి తమ హృదయాలను ప్రగాఢంగా స్పృశించినందువల్లే అలాంటి ఐక్యత సాధ్యమౌతుందని యెహోవాసాక్షులు వెంటనే అంగీకరిస్తారు. విద్వేషం నిండివున్న ఈ ప్రపంచంలో ప్రజల్ని బైబిలు ఐక్యపర్చగలదనేది అది దేవుని నుండి వచ్చిందనడానికి శక్తివంతమైన రుజువు.

నిజమైన ప్రవచన గ్రంథం

17. బైబిలు ప్రవచనాలు ఏ విధంగా మానవ నిర్మిత భవిష్యద్‌ వాణుల్లా లేవు?

17 “ఒకడు తన ఊహనుబట్టి చెప్పుటవలన లేఖనములో ఏ ప్రవచనమునుపుట్ట[దు]” అని 2 పేతురు 1:20 చెబుతోంది. బైబిలు ప్రవక్తలు తమ కాలంలోవున్న ప్రపంచ వ్యవహార ధోరణుల్ని విశ్లేషించి, తర్వాత ఆ పురోభివృద్ధులను గూర్చిన తమ వ్యక్తిగత భావాంతరీకరణపై ఆధారపడి ఊహించి చెప్పలేదు. లేక భవిష్యత్తులో జరగబోయే ఏ సంఘటనకైనా చక్కగా అతికిపోగల్గేలా వాళ్ల భవిష్యద్‌ వాణులు అనిర్థిష్టమైన పదాల్లో లేవు. ఉదాహరణకు, ఎంతో నిర్దిష్టంగానూ, ఆ కాలంలోని ప్రజలు ఎదురు చూసిన దానికి పూర్తి భిన్నంగానూ ప్రవచించబడిన ఒక బైబిలు ప్రవచనాన్ని మనం పరిశీలిద్దాం.

18. ప్రాచీన బబులోను నివాసులు నిస్సందేహంగా తాము భద్రంగా ఉన్నామని ఎందుకు తలంచారు? అయినప్పటికీ యెషయా బబులోను గురించి ఏమని ప్రవచించాడు?

18 బబులోను సా.శ.పూ. ఏడవ శతాబ్దంనాటికి, బబులోను సామ్రాజ్యపు దుర్భేద్యమైన రాజధానిగా కన్పించేది. ఆ నగరం యూఫ్రటీసు నదికి ఇరువైపులా వ్యాపించివుంది. ఆ నదీ జలాలు విశాలమైన లోతైన కందకంగానూ ఒకదానితో మరొకటి కలుపబడిన కాలువలుగానూ రూపొందించబడ్డాయి. అంతేగాకుండా, పటిష్ఠమైన అనేక రక్షణసౌధాలతో కూడిన రెండు వరుసల గోడల సముదాయంతో ఆ నగరం భద్రపరచబడింది. బబులోను నివాసులు తాము నిస్సందేహంగా భద్రంగా ఉన్నామని తలంచి ఉంటారు. అయినప్పటికీ, సా.శ.పూ. ఎనిమిదవ శతాబ్దంలో అంటే బబులోను దాని ఉన్నతమైన కీర్తి శిఖరాలకు చేరుకోక మునుపు, ప్రవక్తయైన యెషయా ఇలా ప్రవచించాడు: “బబులోను దేవుడు పాడుచేసిన సొదొమ గొమొఱ్ఱాలవలెనగును. అది మరెన్నడును నివాసస్థలముగా నుండదు. తరతరములకు దానిలో ఎవడును కాపురముండడు. అరబీయులలో ఒకడైనను అక్కడ తన గుడారము వేయడు. గొఱ్ఱెలకాపరులు తమ మందలను అక్కడ పరుండ నియ్యరు.” (యెషయా 13:19, 20) బబులోను నాశనం చేయబడుతుందని మాత్రమేగాక శాశ్వతంగా దానిలో ఎవ్వరూ నివసించబోరని కూడా ప్రవచనం ప్రవచించడాన్ని గమనించండి. ఎంత నిర్భయంగా తెలియజేసిన ప్రవచనమో కదా! యెషయా నాశనం చేయబడిన బబులోనును చూసిన తర్వాత తన ప్రవచనాన్ని రాసి ఉంటాడా? లేదని చరిత్ర చెబుతోంది.

19. సా.శ.పూ. 539 అక్టోబరు 5న, యెషయా ప్రవచనం పూర్తిగా ఎందుకు నెరవేరలేదు?

19 సా.శ.పూ. 539 అక్టోబరు 5న, రాత్రివేళ కోరెషు ది గ్రేట్‌ ఆధ్వర్యంలోని మాదీయ పారశీక సైన్యాల చేతిలో బబులోను కూలిపోయింది. అయితే, ఆ సమయంలో యెషయా ప్రవచనం పూర్తిగా నెరవేరలేదు. కోరేషు ఆక్రమించిన తర్వాత, బబులోను అధమస్థాయిలోనే ఉన్నప్పటికీ, అనేక శతాబ్దాల వరకూ అది నివాసయోగ్యంగానే ఉంది. సా.శ.పూ. రెండవ శతాబ్దంలో అంటే బహుశ యెషయా మృత గ్రంథపు చుట్ట నకలుచేయబడిన ఆ కాలంలోనే బబులోను పార్తీయుల ఆధీనంలోకి వెళ్ళింది. దాన్ని ఆ కాలంలో ఎంతో కోరదగినదిగా దృష్టించేవారు, దాని కోసం చుట్టు ప్రక్కలున్న దేశాలు పోరాడేవి. సా.శ.పూ. మొదటి శతాబ్దంలో, యూదుల్లో ‘అనేకులు’ బబులోనులో నివసిస్తూండేవారని యూదా చరిత్రకారుడైన జోసీఫస్‌ నివేదించాడు. ది కేమ్‌బ్రిడ్జ్‌ ఏన్షియంట్‌ హిస్టరీ ప్రకారంగా, సా.శ. 24లో బబులోను నందు పురోభివృద్ధి చెందిన వర్తక కోలనీని పాల్‌మరెన్‌ వర్తకులు కనుగొన్నారు. కాబట్టి సా.శ. మొదటి శతాబ్దపు చివరి వరకూ బబులోను పూర్తిగా నాశనం చేయబడలేదు; కానీ యెషయా గ్రంథం అంతకు మునుపే ఎంతో కాలం క్రిందట పూర్తిచేయబడింది.—1 పేతురు. 5:13.

20. బబులోను చివరకు కేవలం “కసవు దిబ్బలుగా” మారిందనడానికి ఏ రుజువు ఉంది?

20 నిర్మానుష్యంగా తయారైన బబులోనును చూడ్డానికి యెషయా జీవించిలేడు. కానీ ప్రవచించినట్లుగానే, బబులోను కేవలం “కసవు దిబ్బలుగా” మారింది. (యిర్మీయా 51:37) (సా.శ. నాల్గవ శతాబ్దంలో జన్మించిన) హెబ్రీ పండితుడైన జెరోమ్‌ అభిప్రాయం ప్రకారం, బబులోను తన కాలానికెల్లా వేటాడే స్థలంగా మారింది. అందులో “సకల మృగాలు” తిరిగేవి. బబులోను ఈనాటి వరకూ నిర్మానుష్యంగానే ఉంది. పర్యటనకు ఆకర్షణీయమైన స్థలంగా బబులోనును తీర్చిదిద్దేందుకు చేసే పునరుద్ధరణలేవైనా సందర్శకుల్ని ఆకట్టుకోవచ్చేమో గానీ యెషయా ప్రవచించినట్లుగానే బబులోను ‘కుమారుడూ మనుమడూ’ శాశ్వతంగా గతించిపోయారు.—యెషయా 14:22.

21. విశ్వాసులైన ప్రవక్తలు భవిష్యత్తును గురించి ఎంతో ఖచ్చితంగా ఎందుకు చెప్పగలిగారు?

21 ప్రవక్తయైన యెషయా భవిష్యత్తులో జరగబోయే దేనికైనా సరిగ్గా అతికినట్లుండే అస్పష్టమైన ప్రవచనాల్ని ప్రవచించలేదు. లేక ప్రవచనంలా కన్పించే విధంగా ఆయన చరిత్రను తిరగరాయనూ లేదు. యెషయా నిజమైన ప్రవక్త. అలాగే విశ్వాసులైన బైబిలు ప్రవక్తలందరూ కూడా నిజమైన ప్రవక్తలే. భవిష్యత్తును గురించి అంత ఖచ్చితంగా ఏ ఇతర మానవులూ చెప్పలేని వాటిని ఈ మనుష్యులు ఎలా చెప్పగలిగారు? జవాబు స్పష్టమైనదే. ప్రవచనాలు “ఆదినుండి . . . కలుగబోవువాటిని తెలియజేయు”చున్న ప్రవచన దేవుడైన యెహోవా నుండే వచ్చాయి.—యెషయా 46:10.

22. యథార్థవంతులైన ప్రజలు తమకుగా తాము బైబిల్ని పరిశీలించేలా, వారిని ప్రేరేపించేందుకు మనం చేయగలిగినంతా ఎందుకు చేయాలి?

22 కాబట్టి బైబిలు పరిశీలనకు యోగ్యమైనదేనా? అది యోగ్యమైనదేనని మనకు తెలుసు! అయితే అనేకమంది అలా ఒప్పించబడలేదు. వాళ్లు బైబిల్ని ఎన్నడూ చదవకపోయినా, దాని విషయంలో అభిప్రాయాల్ని ఏర్పర్చుకున్నారు. దీనికి ముందున్న శీర్షికారంభంలో ప్రస్తావించబడిన ప్రొఫెసరును జ్ఞప్తికి తెచ్చుకోండి. ఆయన బైబిలు పఠనం చేయడానికి ఒప్పుకున్నాడు. బైబిల్ని జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత, అది దేవుని నుండి వచ్చిన గ్రంథమనే నిర్ధారణకు ఆయన వచ్చాడు. చివరకు ఆయన యెహోవాసాక్షుల్లో ఒకరిగా బాప్తిస్మం తీసుకున్నాడు. మరి ఆయన నేడు ఒక పెద్దగా సేవచేస్తున్నాడు! యథార్థవంతులైన ప్రజలు తమకుగా తాము బైబిల్ని పరిశీలించి, ఆపై దాని విషయంలో ఒక అభిప్రాయాన్ని ఏర్పర్చుకొనేలా వారిని ప్రేరేపించేందుకు మనం చేయగలిగినంతా చేద్దాం. వాళ్లు యథార్థంగా తమకు తాముగా పరిశీలించినట్లైతే అసమాన గ్రంథమైన ఈ బైబిలు నిశ్చయంగా సర్వమానవాళి కొరకైన గ్రంథమని గ్రహిస్తారనే నమ్మకం మనకుంది!

మీరు వివరించగలరా?

◻ బైబిలు మానవుని మూలంగా కలిగినది కాదని చూపించేందుకు మీరు మోషే ధర్మశాస్త్రాన్ని ఎలా ఉపయోగించగలరు?

◻ బైబిల్లోని కాలపరిమితిలేని ఏ సూత్రాలు, ఆధునిక జీవన విధానానికి ఆచరణాత్మకమైనవై ఉన్నాయి?

◻ యెషయా 13:19, 20లలో ఉన్న ప్రవచనం, అందులో ప్రస్తావించబడిన సంఘటన జరిగిపోయిన తర్వాత రాయబడినదై ఎందుకు ఉండదు?

◻ యథార్థవంతులైన ప్రజలు ఏం చేయాలని మనం ప్రోత్సహించాలి, ఎందుకు?

[19వ పేజీలోని బాక్సు]

రుజువుపర్చబడలేని సమాచారం విషయమేమిటి?

దేనిపైనా ఆధారపడని భౌతిక నిదర్శనాల్లేని వివిధ వ్యాఖ్యానాలు బైబిల్లో ఉన్నాయి. ఉదాహరణకు, ఆత్మ వ్యక్తులు నివసిస్తున్న అదృశ్య సామ్రాజ్యాన్ని గురించి అది చెబుతున్న వాటిని విజ్ఞానశాస్త్రపరంగా రుజువు చేయలేకపోవొచ్చు—లేక తప్పుయని రుజువు చేయలేకపోవొచ్చు. అలాంటి రుజువుపర్చలేని లేఖనాలు బైబిల్ని విజ్ఞానశాస్త్రానికి విరుద్ధమైనదిగా చేస్తాయా?

కొన్ని సంవత్సరాల క్రిందట యెహోవాసాక్షులతో బైబిలు పఠించడాన్ని ఆరంభించిన ప్లానిటరీ జియాలజిస్ట్‌కు ఇదే ప్రశ్న తలెత్తింది. “బైబిల్లోని కొన్ని వ్యాఖ్యానాల్ని నేను విజ్ఞానశాస్త్రపరంగా రుజువుపర్చలేను గనుక మొదట్లో బైబిల్ని అంగీకరించడం నాకు కష్టంగానే ఉండేదని నేను ఒప్పుకోవాల్సిందే”నని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఈ యథార్థవంతుడైన వ్యక్తి బైబిలు పఠనాన్ని కొనసాగించాడు, లభ్యమౌతున్న రుజువులు బైబిలు దేవుని వాక్యమని చూపిస్తున్నాయని చివరకు ఒప్పించబడ్డాడు. “దేనిపైనా ఆధారపడకుండా ఉన్న ప్రతీ బైబిలు వాస్తవమూ రుజువుపర్చబడాలనే నా కోరికను ఇది తగ్గించివేస్తుంది, విజ్ఞానశాస్త్రపరమైన మక్కువ ఉన్న వ్యక్తి ఆధ్యాత్మిక దృక్పథం నుండి బైబిల్ని పరిశీలించడానికి సుముఖత చూపించాలి, లేకపోతే అతడెన్నటికీ సత్యాన్ని అంగీకరించలేడు. బైబిల్లోని ప్రతీ వ్యాఖ్యానాన్ని నిరూపించడానికి తగిన ఆధారాల్ని విజ్ఞానశాస్త్రం నుండి ఎదురుచూడకూడదు. కానీ కొన్ని వ్యాఖ్యానాలకు రుజువు చూపలేనంత మాత్రాన అవి అసత్యాలని దాని భావం కాదు. ప్రాముఖ్యమైన విషయమేంటంటే బైబిలు ఖచ్చితత్వం ఎక్కడెక్కడైతే రుజువు పర్చబడడానికి సాధ్యమౌతుందో అక్కడల్లా రుజువైంది” అని ఆయన వివరిస్తున్నాడు.

[17వ పేజీలోని చిత్రం]

ఆ కాలంకన్నా మరెంతో ముందున్న పారిశుద్ధ్య నియమాల్ని మోషే నమోదు చేశాడు

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి