‘యెహోవా ఇల్లు కట్టించనియెడల. . . ’
మీరెక్కడ జీవించుచున్నను, మీరు నివసించు గృహమొకటి ఉండును. నివాసములు మరియు నిర్మాణముల రూపములు బహు రీతులలో యుండును. మట్టితో నిర్మించిన గుడిసెలు, కర్రలతో నిర్మించిన ఇళ్లు, ముందే సిద్ధముచేసియుంచిన కాంక్రీటు గృహములు—ఇలా అవి లెక్కలేనన్ని కలవు. గడ్డిగుడిసెలలో జీవించు కొందరు పక్కాఇండ్లలో జీవించువారున్నట్లే తామును ఇంటిలోయున్నామని భావింతురు. ఎందుకు?
హాయిగా ఉండుట, సంతృప్తిగాయుండుట ఎక్కువగా ఒకడు కలిగియుండు సహవాసము మీద ఆధారపడియుండును. (సామెతలు 18:24) లోకము ఎంత ఆకర్షణీయముగా ఉన్నను, మరియు జిలుగువెలుగులు ఎన్ని అందించినను సమాధానముకొరకు మరియు ఓదార్పుకొరకు ఒకడు తన ఇంటికి చేరవలెనని మనఃపూర్వకముగా కోరుకొనును. అయినను, ఆధునిక గృహజీవితమునుగూర్చిన నివేదికలనుబట్టిచూస్తే, ఒకడు అన్ని సమయములలో ఇంటియందు సమాధానమును మరియు ఓదార్పును కనుగొనునను నిశ్చయత లేదు. ఎక్కువ భాగము నీతో జీవించువారు—నీ కుటుంబము—నీతో సమాధానము పంచుకొనవచ్చును లేక దానిని బొత్తిగా పాడుచేయనువచ్చును. అట్లయిన, సంతోషదాయకమైన, నెమ్మదిగల కుటుంబమును కట్టుటలోని రహస్యమేమి?
గృహమును నిర్మించుట
“యెహోవా ఇల్లు కట్టించనియెడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే,” అని కీర్తన 127 మొదటి వచనము చెప్పుచున్నది. దేవుడైన యెహోవా ఆరాధన కొరకు భవనములను నిర్మించుటలో భాగము వహించువారు ఇది నిజమని కనుగొందురు. రాజ్యమందిరములను త్వరగా నిర్మించుటకు నిపుణతగల స్వచ్ఛందసేవకులు తమ సమయమును ప్రయత్నములను చేసినను, యెహోవా ఆశీర్వాదములే దాని విజయమును నిశ్చయపరచును. ప్రక్కనుండి చూచువారు సహితము జరుగుచున్న పనిలో తరచు అసాధారణమైనదేదో ఉండుటను చూడగలరు. ఉదాహరణకు, అటువంటి నిర్మాణపు పనినిగూర్చి వ్రాయుచు ఇంగ్లాండు కోల్‌చెస్టర్‌లోని ఒక పత్రిక ఈ శీర్షికనామమును ఉపయోగించినది, “పైకప్పును యెహోవా లేవదీసియున్నాడు.”
అయితే, అక్షరార్థమైన నిర్మాణపు పనులకు మారుగా ఇతర నిర్మాణపుపనుల ప్రయత్నములలోని విజయముకూడ యెహోవా ఆశీర్వాదముమీదనే ఆధారపడియుండును. కీర్తన 127లో మూడవ వచనమందలి సొలొమోను వ్రాసిన మాటలను ఆలోచించుము: “కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము; గర్భఫలము ఆయన యిచ్చు బహుమానమే.” కుటుంబముల విషయములోకూడ యెహోవా ఘనతవహించిన నిర్మాణకుడైయున్నాడు, మరియు తలిదండ్రులు ఆయనతో జతపనివారిగాను, లేక తోటి శ్రామికులుగాను ఉండు అద్భుతకరమైన ఆధికత్యను కలిగియున్నారు.a (హెబ్రీయులు 11:10) సృష్టికర్తయైన యెహోవా దేవునికి ఘనతనుతెచ్చు సంతోషదాయకమైన సమాధానకరమైన కుటుంబమును విజయవంతముగా నిర్మించుటలో ఆయనతో భాగస్వామ్యము వహించు ఈ ఆధిక్యతనుండి క్రైస్తవ తలిదండ్రులు ఎట్లు ప్రయోజనము పొందగలరు?
విజయవంతమైన కుటుంబమును—నిర్మించుట
విజయవంతముగా ఒక నిర్మాణము సాగవలెనంటే, దానికి సరియైన వాస్తుశిల్ప రూపము, లేక ఛాయాముద్రణ నమూనా చాలా ప్రాముఖ్యమైన విషయము. దేవుని స్తుతించు యౌవనులను తయారుచేయుటకు, ఆయన ప్రేరేపిత వాక్యమగు బైబిలును మించిన ఛాయాముద్రణ నమూనా మరొకటిలేదు. (2 తిమోతి 3:16, 17) “బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము. వాడు పెద్దవాడైనప్పుడును దానినుండి తొలగిపోడు” అని సొలొమోను వ్రాసెను. (సామెతలు 22:6) “నడువవలసిన త్రోవ” యెహోవా మార్గమైయున్నది, తలిదండ్రులు దానిని అనుసరించినప్పుడు వారు దేవుని నమ్మకమైన సేవకులుగా అభివృద్ధిచెందు ఉత్తరాపేక్షను తమ యౌవనులకు అందించినవారగుదురు.
సరియైన నిర్మాణమునకు సరియైన వస్తుసామగ్రి కావలెను. ఆఫ్రికా యాత్రికుడొకరు యూరపులో తాను చూసిన కట్టడములు వందలసంవత్సరముల పురాతనమైనవి చెప్పినప్పుడు అతడు కష్టముగా నమ్మెను. ఈ కట్టడములలో ఉపయోగింపబడిన మన్నికగల వస్తుసామగ్రిని చూచుట ఆయనకు ఒక రహస్యోద్ఘాటనగా యుండెను. మరొకవైపున, నిర్మాణకులు వస్తుసామగ్రిని సరిగా ఉపయోగించనట్లయిన, దానిఫలితము తరచు వినాశకరముగా, మరణకరముగాను ఉండును. పిల్లలను పెంచు విషయములోను ఇది సత్యమైయుండగలదు.
గర్భధారణ సమయములో, పాపము కారణముగా పిల్లలకు అసంపూర్ణ గుణములుగల జన్యుసంక్రమణ జరుగును. (కీర్తన 51:5) మరొకమాటలో చెప్పాలంటే ప్రారంభమునుండే వారు లోపముగలవారైయుందురు. తమ పిల్లలలో సహించునటువంటి, దైవిక లక్షణములను పెంపొందించుటకు కృషిసల్పుటద్వారా, క్రైస్తవ తలిదండ్రులు దీనికి ఎదురు పోరాడవలెను. (1 కొరింథీయులు 3:10-15) ఇలా చేయకపోయినట్లయిన, తలిదండ్రులు తమ కుమారులకు కుమార్తెలకు శ్రేష్ఠమైన ఆహారము, వస్త్రములు, వసతివంటి, ఇతర రంగములలో ఎంత కష్టించి పనిచేసినను, వారి నిర్మాణపుపని ప్రయత్నములు నిరర్థకమగును.
అందుకే తలిదండ్రులకు ప్రత్యేకముగా తండ్రులకు దైవిక ఉపదేశమేమనగా: “యెహోవా శిక్షలోను బోధలోను వారిని [పిల్లలను] పెంచుడి.” (ఎఫెసీయులు 6:4 NW) యెహోవా శిక్షలో మరియు బోధలో శ్రేష్ఠమైన ఛాయాముద్రణ నమూనాలు మరియు నిర్మాణ వస్తుసామగ్రి కలదు. వాటిని ఉపయోగించుట ఫలితముగా యావత్ కుటుంబమునకు నిత్యప్రయోజనము కలుగును.
సమయము వృధా కాని శిక్షణ
మంచి పథకమున్నను, ఏ నిర్మాణమైనను పనిసాగుచుండగా అన్నిసమయములలో అనుకొనని ప్రమాదములును జరుగును. అదేప్రకారము, తలిదండ్రులు తమ కుటుంబ సభ్యుల అనుదిన జీవితములలో అనుకొనని సమస్యలు వచ్చునని ఎదురుచూచుటకు నేర్చుకొని, వాటితో వ్యవహరించుటకు సిద్ధముగా ఉండవలెను. దీనిని ఎట్లు చేయవచ్చును?
తలిదండ్రులమధ్య సంభాషణ ప్రాముఖ్యము. తల్లి మరియు తండ్రి వారి పిల్లల పెరుగుదలను ప్రార్థనాపూర్వకముగా చర్చించినప్పుడు, వారిలో మెచ్చుకోదగిన మరియు మరిఎక్కువ “నిర్మాణము” అవసరమగు రంగములను కనుగొందురు. ఒకసారి అటువంటి బలహీనతను గుర్తించినప్పుడు, తలిదండ్రులిద్దరు పనిచేయుటకు ఆరంభించి, వాటితో వ్యవహరించుటకు సరియైన చర్యలు తీసుకొనవలెను.
అయితే మీకు పెద్దకుటుంబము ఉండవచ్చును, మరియు మీరిట్లు ఆలోచించవచ్చును: ‘మా పిల్లలందరి వ్యక్తిగత అవసరములకు తగినట్లు మా ప్రయత్నములను మేమెట్లు అనుసంధానపరచగలము?’ అలాంటప్పుడు పిల్లలు ఒకరినొకరు సహాయము చేసుకొనునట్లు, సమయము వృధాకాని శిక్షణ వారికి ఎందుకివ్వగూడదు? పనివానిదగ్గర నైపుణ్యములను నేర్చుకొనుటకు వృత్తివిద్యార్థులు కొన్నిసంవత్సరములు పనిచేయుదురు. బహుశ మీ కుటుంబ పఠనములో తమకంటె చిన్నవారికి కొన్ని విషయములను వివరించుమని పెద్దపిల్లలను అడుగుటకు మీరు ప్రయత్నించవచ్చును. నమ్మకత్వము, స్నేహితుల ఎంపిక, పాఠశాలలో చెడు ప్రభావములను ఎదిరించుటవంటి అంశములను పెద్దపిల్లలు ఆలాగే చిన్నపిల్లలుకూడ చక్కగా వివరించగలరు. పెద్దపిల్లలకు అటువంటి నిజజీవిత పథకములను నియమించుటద్వారా, పిల్లలు తెలుసుకొనవలసిన విషయములను వారికి బోధించుచునే, వారు మానసిక శక్తులను మరియు బోధనా సామర్థ్యమును పెంపొందించుకొనుటకు మీరు సహాయము చేయగలరు. (హెబ్రీయులు 5:14) ఇది పిల్లలమధ్య నిజమైన బాతృత్వమును పెంపొందించుటయొక్క మరొక ప్రయోజనమై యున్నది.
బహుశ మీ కుటుంబము కేవలము ఒకే పిల్లవాడున్న చిన్న కుటుంబము కావచ్చును. అప్పుడు మీ పిల్లవానిని ఎరుగుటకును అర్థముచేసుకొనుటకు మీరు ఎన్నో అవకాశములను కలిగియుందురు. అయితే, బాగా గారాబముచేసి మీ పిల్లవానిని పాడుచేయు ప్రమాదముయెడల జాగ్రత్తగాయుండుము. ఉన్నది మీరు ముగ్గురే కాబట్టి, కలిసి పనిచేయండి. ఇది అతడు ఇతరులతో సంభాషించుటకు మరియు ఒంటరిగాయుండే వ్యక్తిగా తయారుకాకుండ ఇతరులపై శ్రద్ధమళ్లించి వారితోను సంభాషించుటకు నేర్పించును.
కుటుంబ సన్నిహితత్వము కొరకైన లక్ష్యము
కుటుంబమును కట్టుటలో కేవలము బైబిలు పఠనమును జరిగించుట మరియు ఉపదేశమును, శిక్షణిచ్చుటకంటె ఎంతో ఎక్కువ చేరియున్నది. సొలొమోను ఇట్లుచెప్పెను: “అన్నపానములు పుచ్చుకొనుటకంటెను, తన కష్టార్జితముచేత సుఖపడుటకంటెను నరునికి మేలుకరమైనదేదియు లేదు.” (ప్రసంగి 2:24) రుచికరముగా వంట చేసినప్పుడు నిస్సందేహముగా మీ కుటుంబము ఆనందముగా భోజనము చేయును. కుటుంబసమేతముగా భోజనముచేయు ఏర్పాటు మీరు చేయుదురా? వివిధ కుటుంబసభ్యులు ఉద్యోగమునకు, పాఠశాలకు, మరొక పనిమీద వెళ్లినప్పుడు ఇది అన్నిసమయములలో సాధ్యపడకపోవచ్చును. రోజులో కనీసము ఒక్కసారైనను కుటుంబముగా మీరు కలిసి భోజనము చేయవచ్చును. కుటుంబ భోజనపు బల్లయొద్ద ఆరోగ్యదాయకమైన వాతావరణమునకు ఏమి దోహదపడగలదు?
ఒక సహోదరుడు అక్కడచేరియున్న వారందరు చర్చించుటకు ఒక బైబిలు ప్రశ్నను లేవదీయుటకు ఆ సందర్భమును ఉపయోగించును. జవాబు తెలియని వారు తత్తరపడకుండా ఉండునట్లు ఆయన దానిని ఉపయోగించును. ఇతరులు తమ ఇంటింటిసేవా అనుభవములను వివరింతురు. ఆత్మీయ విషయములకు అవధానమిచ్చుటద్వారా, భోజనసమయములు కుటుంబము యావత్తు కట్టబడు సందర్భములుగా తయారగును. (రోమీయులు 14:19 చూడుము) నిజమే, లోకములోని కొన్ని ప్రాంతములలో, భోజన సమయములో మాట్లాడుట ఆచారము కాదు. అయినను, సంతోషదాయకమైన వాతావరణము కాపాడుకొనుటకు మనఃపూర్వకమైన ప్రయత్నము ఆవశ్యకము. సామెతలు 15:17 ఇట్లుచెప్పుచున్నది: “పగవాని ఇంట క్రొవ్వినయెద్దు మాంసము తినుటకంటె, ప్రేమగలచోట కూరగాయల (NW) భోజనము తినుట మేలు.”
విశ్రాంతి, మార్పుదలకూడ క్రైస్తవ కుటుంబజీవనములో తమదైన స్థానమును కలిగియున్నవి. జ్ఞానులైన తలిదండ్రులు అటువంటి సమయములనుకూడ బలమైన దైవపరిపాలనా కుటుంబమును కట్టుటకు ఉపయోగింతురు. ఎట్లు?
యౌవనులు వెళ్లి తమ స్వంత ఆసక్తులను వెంబడించుటకు వారిని విడిచిపెట్టుట సులభమే, అయితే దీనియందు ప్రమాదము కలదు. ఉదాహరణకు, ప్రాణమునకు లేక అవయవములకు ప్రమాదమువాటిల్లు అవకాశముండగా క్రీడలలో బాగామునిగిపోయి ఉండుటకు యౌవనస్థులను అనుమతించుట ఎంత అవివేకయుక్తము! (1 తిమోతి 4:8) సాధ్యమైనంతమేరకు కుటుంబమందలి ప్రతిసభ్యుడు చేరియుండు కార్యక్రమములను ఎంపికచేసికొనుము. తండ్రి వారి అభిప్రాయములను, ఆలోచనలను సేకరించి, సిద్ధపడుటకు ప్రతివారికి ఏదోకొంత పని అప్పగించవలెను.
ప్రేమయందు మీ కుటుంబ విశాలతను ఎక్కువచేసి, మీ కుటుంబ ఆనందమందు భాగము వహించుటకు సంఘమందలి ఇతర సభ్యులను మీరు ఆహ్వానించగలరా? సంఘమందు వృద్ధులైన సభ్యులు, ప్రత్యేకముగా వారి స్వంత కుటుంబములు దగ్గరలో లేనట్లయిన లేక క్రైస్తవసూత్రముల ప్రకారము జీవించనట్లయిన, మీ కుటుంబ ఆత్మయందు భాగము వహించుటను తరచు ఆనందింతురు. (యాకోబు 1:27) అనేక సంఘములలో తలిదండ్రులలో కేవలము ఒకరు మాత్రమే ఉన్న కుటుంబములు కలవు. దైవపరిపాలనా శిరస్సత్వముయెడల మరియు క్రైస్తవ ఔచిత్యముయెడల సరియైన గౌరవముతో పెద్దలు మరియు ఇతరులు అటువంటి కుటుంబ సభ్యులకు ఆత్మీయ ఆశ్రయమివ్వగలరు. (యెషయా 32:1) పెద్దవాడును పరిపక్వతగల క్రైస్తవుడు చూపిన ప్రేమగల శ్రద్ధ ఫలితముగా “తండ్రిలేని” పిల్లలెందరో సమతూకముగల కుటుంబశిరస్సులుగా వికసించిరి.—కీర్తన 82:3.
క్రైస్తవ కుటుంబమును కట్టుట కష్టమైన పనియైయున్నది. అయితే యెహోవా సహాయముతో నిజముగా మీరు “కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము; గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే” అని గుణగ్రహించగల వారగుదురు. (కీర్తన 127:1, 3) వారు క్రైస్తవ తలిదండ్రులనే కాదు తమ సృష్టికర్తయగు యెహోవా దేవునికూడ కొనియాడుటకు కారణము కాగలరు. (w89 10/1)
[అధస్సూచీలు]
a వాస్తవానికి, “కట్టువారు” (1వ వచనము) మరియు “కుమారులు” (3వ వచనము) కొరకు ఉపయోగింపబడిన రెండు హెబ్రీపదములుకూడ “కట్టుట” అను మూలార్థముగల పదమునుండియే వచ్చినవి. అంతేకాకుండ, హెబ్రీలో “ఇల్లు” అను పదము “నివాసస్థలమును” లేక ఒక “కుటుంబమును” కూడా సూచించగలదు. (2 సమూయేలు 7:11, 16; మీకా 1:5) ఆ విధముగా, ఇల్లుకట్టుట కుటుంబమును పెంచుటకు సంబంధము కలిగియున్నది. ఈ రెండుపనులు చేయుటకు యెహోవా ఆశీర్వాదము ఆవశ్యకము.