క్రొత్త ప్రాంతీయ సమావేశ కార్యక్రమం
ప్రస్తుత విధానం నిత్యం నిలుస్తుందనే భ్రమను లోకం మనలో కలుగజేస్తుంది. అయితే, దేవుని వాక్యం దానికి భిన్నమైన విషయాన్ని చెబుతుంది. (1 యోహా. 2:15-17) భూమ్మీద ధనం దాచుకోవడం వ్యర్ధమని అర్థం చేసుకోవడానికి అది సహాయం చేస్తుంది. దేవుని ప్రజల్ని బలపర్చడానికి, 2007వ సేవా సంవత్సర ప్రాంతీయ సమావేశ కార్యక్రమం “పరలోకమందు . . . ధనమును కూర్చుకొనుడి” అనే ముఖ్యాంశాన్ని వివరిస్తుంది.—మత్త. 6:19, 20.
ఎఫెసీయులు 2:2 లో ‘వాయుమండల సంబంధమైన అధిపతిగా, అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తి’గా పేర్కొనబడినవాటిలో వస్తుసంబంధమైన ఆలోచనా దృక్పథం కూడా ఉంది. ఏ విధంగా గాలి అంతటా వ్యాపించి పీల్చుకోవడానికి అందుబాటులో ఉందో, అదేవిధంగా “లౌకికాత్మ” ఈ లోకంలో వ్యాపించివుంది. (1 కొరిం. 2:12) దాని ప్రభావం చాలా శక్తివంతమైనది కాబట్టి అది “అధిపతి” అని పిలువబడింది. క్రొత్త ప్రాంతీయ సమావేశ కార్యక్రమం, ప్రపంచ వస్తుసంబంధ దృక్కోణాన్ని విసర్జించి, అతి ప్రాముఖ్య విషయాలను మనసులో స్పష్టంగా ఉంచుకునేందుకు సహాయం చేస్తుంది. (మత్త. 6:33) అంతేకాకుండా ఒత్తిళ్ళు, శోధనలు మనకు ఎదురైనా యెహోవాపై ఆధారపడి మన పరిచర్యను కొనసాగించడానికి సహాయం చేస్తుంది.
ఆ రెండు రోజులూ మీరు హాజరై “విశేష జాగ్రత్త”తో అవధానం నిలిపేందుకు చర్యలు తీసుకోండి. (హెబ్రీ. 2:1) మీ జీవితంలో, పరిచర్యలో అన్వయించుకోదగ్గ విషయాలను క్లుప్తంగా వ్రాసుకోండి. ఆధ్యాత్మికంగా బలపర్చే ఈ కార్యక్రమానికి మొదటి నుండి చివరి వరకూ ఉండడం ద్వారా, మీరు ఎల్లప్పుడూ ‘పరలోకంలో ధనం కూర్చుకోవడానికి’ ప్రోత్సహించబడి, బలపర్చబడతారు.