కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w04 12/15 పేజీలు 12-17
  • యెహోవా మన సహాయకుడు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవా మన సహాయకుడు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2004
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • నిరంతర సహాయానికి మూలం
  • దేవదూతల ద్వారా సహాయం
  • పరిశుద్ధాత్మ ద్వారా సహాయం
  • దేవుని వాక్యం ద్వారా సహాయం
  • తోటి విశ్వాసుల ద్వారా సహాయం
  • మీరు యెహోవా సహాయాన్ని అంగీకరిస్తారా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2004
  • దేవుని దూతలు సహాయం చేస్తారు
    గొప్ప బోధకుడు—ఆయన దగ్గర నేర్చుకోండి
  • దేవదూతలు మీకు ఎలా సహాయం చేయగలరంటే
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • దేవదూతలు మనపై ఎలా ప్రభావం చూపిస్తారు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2006
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2004
w04 12/15 పేజీలు 12-17

యెహోవా మన సహాయకుడు

“యెహోవావలననే నాకు సహాయము కలుగును, ఆయన భూమ్యాకాశములను సృజించినవాడు.”—కీర్తన 121:2.

1, 2. (ఎ) ఆయా సమయాల్లో మనకందరికీ సహాయం అవసరమని ఎందుకు చెప్పవచ్చు? (బి) యెహోవా ఎలాంటి సహాయకుడు?

మనలో సహాయం అవసరం లేనివారు ఎవరున్నారు? నిజానికి, మనందరికి కొన్ని సమయాల్లో అంటే ఒక జటిల సమస్యను అధిగమించడానికి, బాధాకరమైన నష్టాన్ని సహించడానికి, కష్టభరితమైన పరీక్షను తట్టుకోవడానికి సహాయం అవసరమవుతుంది. సహాయం అవసరమైనప్పుడు ప్రజలు తరచూ శ్రద్ధచూపే స్నేహితునివైపు తిరుగుతారు. అలాంటి స్నేహితునితో భారాన్ని పంచుకుంటే, దానిని భరించడం తేలికవుతుంది. అయితే తోటి మానవుడు చేయగల సహాయానికి పరిమితి ఉంది. అంతేకాక, సహాయం అవసరమైనప్పుడల్లా ఇతరులు స్పందించే స్థితిలో ఉండకపోవచ్చు.

2 కానీ, అపరిమితమైన శక్తి, వనరులున్న సహాయకుడు ఒకరున్నారు. అంతేకాక, మనలను ఎన్నటికీ విడిచిపెట్టనని కూడా ఆయన మనకు హామీ ఇస్తున్నాడు. ఆయనెవరో తెలియజేస్తూ, కీర్తనకర్త ఆయనపై పూర్తి నమ్మకంతో ఇలా ప్రకటించాడు: “యెహోవావలననే నాకు సహాయము కలుగును.” (కీర్తన 121:2) యెహోవాయే తనకు సహాయం చేస్తాడని ఈ కీర్తనకర్త ఎందుకు దృఢంగా నమ్మాడు? ఆ ప్రశ్నకు జవాబు కనుగొనడానికి మనం 121వ కీర్తనను పరిశీలిద్దాం. అలా పరిశీలించడం, మనం కూడా మన సహాయకునిగా యెహోవావైపు నమ్మకంగా ఎందుకు చూడవచ్చో తెలుసుకోవడానికి మనకు సహాయం చేస్తుంది.

నిరంతర సహాయానికి మూలం

3. కీర్తనకర్త ఏ కొండలవైపు తన కన్నులెత్తి చూసి ఉండవచ్చు, ఎందుకు?

3 యెహోవా సృష్టికర్త అన్న వాస్తవమే నమ్మకానికి ఆధారమని వివరిస్తూ కీర్తనకర్త ఇలా అంటున్నాడు: “కొండలతట్టు నా కన్ను లెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడనుండి వచ్చును? యెహోవావలననే నాకు సహాయము కలుగును, ఆయన భూమ్యాకాశములను సృజించినవాడు.” (కీర్తన 121:1, 2) కీర్తనకర్త ఏదో ఒక కొండవైపు చూడలేదు. ఈ మాటలు వ్రాసే సమయానికి యెహోవా దేవాలయం యెరూషలేములో ఉంది. యూదాలోని ఎత్తైన కొండలపై నెలకొనివున్న ఆ పట్టణం, యెహోవా అలంకారార్థ నివాస స్థలం. (కీర్తన 135:21) కీర్తనకర్త సహాయం కోసం నమ్మకంగా యెహోవావైపు చూస్తూ, యెహోవా దేవాలయమున్న యెరూషలేములోని కొండలవైపు తన కన్నులెత్తి చూసి ఉండవచ్చు. యెహోవా తనకు సహాయం చేయగలడని కీర్తనకర్త ఎందుకంత బలంగా నమ్మాడు? ఎందుకంటే “ఆయన భూమ్యాకాశములను సృజించినవాడు.” నిజానికి, ‘సర్వశక్తిగల సృష్టికర్త నాకు సహాయం చేయకుండా ఏదీ అడ్డగించలేదు’ అని కీర్తనకర్త చెబుతున్నాడు.—యెషయా 40:26.

4. యెహోవా తన ప్రజల అవసరాలపట్ల ఎల్లప్పుడూ శ్రద్ధ చూపిస్తాడని కీర్తనకర్త ఎలా వివరించాడు, అది ఎందుకు ఓదార్పుకరమైన తలంపు?

4 కీర్తనకర్త ఆ తర్వాత, యెహోవా తన సేవకుల అవసరాలపట్ల ఎల్లప్పుడూ శ్రద్ధ చూపిస్తాడని వివరిస్తూ ఇలా అన్నాడు: “ఆయన నీ పాదము తొట్రిల్లనియ్యడు నిన్ను కాపాడువాడు కునుకడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు.” (కీర్తన 121:3, 4) దేవుడు తనను నమ్మినవారిని “తొట్రిల్లనియ్యడు” లేదా కోలుకోలేనంతగా వారిని పడిపోనియ్యడు. (సామెతలు 24:16) ఎందుకు? ఎందుకంటే, యెహోవా నిద్రపోకుండా తన గొర్రెలను కాపాడే కాపరిని పోలియున్నాడు. అది ఓదార్పుకరమైన తలంపు కాదా? ఆయన తన ప్రజల అవసరాల విషయంలో క్షణమాత్రమైనా కునుకడు. రాత్రింబగళ్లు ఆయన వారిని కనిపెట్టుకొని ఉంటాడు.

5. యెహోవా “కుడిప్రక్కన” ఉన్నట్లు ఎందుకు చెప్పబడింది?

5 యెహోవా తన ప్రజల యథార్థ రక్షకుడనే నమ్మకంతో కీర్తనకర్త ఇలా వ్రాశాడు: “యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడిప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బయైనను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బయైనను నీకు తగులదు.” (కీర్తన 121:5, 6) మధ్యప్రాచ్య దేశాల్లో కాలినడకన ప్రయాణంచేసే వ్యక్తికి ఎండదెబ్బ తగలకుండా నీడగల ప్రదేశం అతన్ని కాపాడుతుంది. అదేవిధంగా, యెహోవా తన ప్రజలకు విపత్తనే ఎండదెబ్బ తగలకుండా కాపాడే నీడలా ఉన్నాడు. యెహోవా “కుడిప్రక్కన” ఉన్నట్లు చెప్పబడిందని గమనించండి. ప్రాచీనకాల యుద్ధాల్లో సైనికుడు ఎడమచేత్తో డాలు పట్టుకునేవాడు, కాబట్టి కుడివైపున రక్షణ అంతగా ఉండేది కాదు. విశ్వసనీయ స్నేహితుడు అతని కుడిప్రక్కన నిలబడి యుద్ధం చేయడం ద్వారా అతన్ని కాపాడే అవకాశం ఉంది. అలాంటి స్నేహితునిలానే, యెహోవా తన ఆరాధకులకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉంటూ నమ్మకంగా వారి చేరువలోనే ఉంటాడు.

6, 7. (ఎ) యెహోవా తన ప్రజలకు సహాయం చేయడాన్ని ఎన్నటికీ మానేయడని కీర్తనకర్త మనకెలా హామీ ఇస్తున్నాడు? (బి) కీర్తనకర్తలానే మనం కూడా ఎందుకు నమ్మవచ్చు?

6 యెహోవా తన ప్రజలకు సహాయం చేయడం ఎప్పుడైనా మానేస్తాడా? అలా ఎన్నటికీ జరగదు. కీర్తనకర్త ఇలా ముగించాడు: “ఏ అపాయమును రాకుండ యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడును.” (కీర్తన 121:7, 8) రచయిత విషయ ప్రాముఖ్యతను వర్తమానం నుండి భవిష్యత్తుకు మార్చాడని గమనించండి. అంతకుముందు 5వ వచనంలో కీర్తనకర్త ‘యెహోవాయే నిన్ను కాపాడువాడు’ అని చెప్పాడు. అయితే ఈ వచనాల్లో ‘యెహోవా నిన్ను కాపాడును’ అని కీర్తనకర్త వ్రాశాడు. కాబట్టి సత్యారాధకులకు భవిష్యత్తులో కూడా యెహోవా సహాయం ఉంటుందని హామీ ఇవ్వబడింది. వారు ఎక్కడికి వెళ్లినా, ఎలాంటి విపత్తు ఎదుర్కొన్నా యెహోవా సహాయ హస్తం చేరుకోలేనంత దూరంలో వారు ఉండరు.—సామెతలు 12:21.

7 అవును, సర్వశక్తిగల సృష్టికర్త శ్రద్ధగల కాపరిలా, నిద్రపోకుండా అప్రమత్తంగా ఉండే కావలివానిలా తన సేవకులను కనిపెడతాడనే గట్టి నమ్మకాన్ని 121వ కీర్తన రచయిత కనబరిచాడు. యెహోవా మార్పులేనివాడు కాబట్టి మనం కూడా కీర్తనకర్తలానే గట్టి నమ్మకంతో ఉండవచ్చు. (మలాకీ 3:6) అంటే మనకు ఎల్లప్పుడూ భౌతిక రక్షణ లభిస్తుందని దానర్థమా? కాదు, కానీ మన సహాయకునిగా మనమాయనవైపు చూసినంత కాలం మనకు ఆధ్యాత్మిక హాని తీసుకురాగల అన్ని విషయాలనుండి ఆయన మనలను రక్షిస్తాడు. అయితే ‘యెహోవా మనకు ఎలా సహాయం చేస్తాడు?’ అని ప్రశ్నించడం సహజమే. ఆయన సహాయం చేసే నాలుగు విధానాలను మనం పరిశీలిద్దాం. ఈ ఆర్టికల్‌లో, ఆయన బైబిలు కాలాల్లో తన సేవకులకు ఎలా సహాయం చేశాడో పరిశీలిద్దాం. తర్వాతి ఆర్టికల్‌లో, నేడు తన సేవకులకు ఆయన ఎలా సహాయం చేస్తున్నాడో పరిశీలిస్తాం.

దేవదూతల ద్వారా సహాయం

8. దేవుని భూసంబంధ సేవకుల సంక్షేమం విషయంలో దేవదూతలకు నిజమైన ఆసక్తి ఉండడం ఎందుకు ఆశ్చర్యకరమైనది కాదు?

8 యెహోవా ఆజ్ఞకు లోబడే కోట్లకొలది దేవదూతలు ఆయన దగ్గర ఉన్నారు. (దానియేలు 7:9, 10) ఈ ఆత్మసంబంధ కుమారులు నమ్మకంగా ఆయన చిత్తాన్ని నెరవేరుస్తారు. (కీర్తన 103:20) యెహోవా తన మానవ ఆరాధకులను అధికంగా ప్రేమిస్తున్నాడనీ, వారికి సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడనీ వారికి తెలుసు. కాబట్టి దేవుని భూసంబంధ సేవకుల విషయంలో ఆ దేవదూతలకు ఆసక్తి ఉండడంలో ఆశ్చర్యం లేదు. (లూకా 15:10) కాబట్టి, మానవులకు సహాయం చేయడంలో యెహోవాచేత ఉపయోగించుకోబడుతున్నందుకు దేవదూతలు నిశ్చయంగా ఆనందిస్తారు. ప్రాచీన కాలాల్లో తన మానవ సేవకులకు సహాయం చేసేందుకు యెహోవా తన దూతలను ఎలా ఉపయోగించుకున్నాడు?

9. నమ్మకమైన మానవులను కాపాడేందుకు దేవుడు తన దూతలకు అధికారమివ్వడానికి సంబంధించిన ఒక ఉదాహరణ చెప్పండి.

9 నమ్మకస్థులైన మానవులను కాపాడి, విడుదలచేసే అధికారాన్ని దేవుడు తన దూతలకు ఇచ్చాడు. ఇద్దరు దేవదూతలు లోతు, ఆయన కుమార్తెలు సొదొమ గొమొర్రాల నాశనాన్ని తప్పించుకొనేలా సహాయం చేశారు. (ఆదికాండము 19:1, 15-17) యెరూషలేమును బెదిరిస్తున్న అష్షూరు సైన్యంలో 1,85,000 మందిని ఒకే ఒక్క దేవదూత సంహరించాడు. (2 రాజులు 19:35) దానియేలు సింహపు గుహలో వేయబడినప్పుడు, యెహోవా తన దూతను పంపి ‘సింహముల నోళ్లు మూయించాడు.’ (దానియేలు 6:21, 22) ఒక దేవదూత అపొస్తలుడైన పేతురును చెరసాల నుండి విడిపించాడు. (అపొస్తలుల కార్యములు 12:6-11) “యెహోవాయందు భయభక్తులు గలవారి చుట్టు ఆయనదూత కావలియుండి వారిని రక్షించును” అని చెబుతున్న కీర్తన 34:7లోని మాటలను ధృవీకరిస్తూ దేవదూతలు కాపాడే విషయానికి సంబంధించిన ఎన్నో ఉదాహరణలను బైబిలు పేర్కొంటోంది.

10. దానియేలు ప్రవక్తను ప్రోత్సహించేందుకు యెహోవా తన దూతను ఎలా ఉపయోగించుకున్నాడు?

10 ఒక సందర్భంలో, నమ్మకమైన మానవులను ప్రోత్సహించి బలపరిచేందుకు యెహోవా తన దూతలను ఉపయోగించుకున్నాడు. దానియేలు 10వ అధ్యాయంలో మనస్సును స్పృశించే ఉదాహరణ ఒకటి ఉంది. ఆ సమయంలో దానియేలుకు బహుశా 100 సంవత్సరాల వయసు ఉండవచ్చు. యెరూషలేము నిర్జనమై పోవడం, దేవాలయ పునర్నిర్మాణం ఆలస్యమవుతున్న కారణంగా ఆ ప్రవక్త చాలా నిరుత్సాహపడ్డాడు. అలాగే ఒక శక్తిమంతమైన దర్శనం చూసిన తర్వాత కూడా ఆయన కలతచెందాడు. (దానియేలు 10:2, 3, 8) ఆయనను ప్రోత్సహించడానికి దేవుడు దయతో ఆయన దగ్గరకు ఒక దేవదూతను పంపించాడు. దేవుని దృష్టిలో “బహు ప్రియుడవు” అని ఒకటి కంటే ఎక్కువసార్లు ఆ దేవదూత దానియేలుకు జ్ఞాపకం చేశాడు. ఫలితం? ఆ వృద్ధ ప్రవక్త దేవదూతతో ఇట్లన్నాడు: “నీవు నన్ను ధైర్యపరచితివి.”—దానియేలు 10:11, 19.

11. సువార్త ప్రకటనా పనిని నిర్దేశించడానికి దేవదూతలు ఉపయోగించుకోబడ్డారని చెప్పడానికి ఒక ఉదాహరణ ఏమిటి?

11 సువార్త ప్రకటనా పనిని నిర్దేశించడానికి కూడా యెహోవా తన దూతలను ఉపయోగించుకున్నాడు. ఐతియోపీయుడైన నపుంసకునికి క్రీస్తు గురించి ప్రకటించడానికి ఒక దేవదూత ఫిలిప్పును నిర్దేశించాడు, ఆ తర్వాత ఆ ఐతియోపీయుడు బాప్తిస్మం తీసుకున్నాడు. (అపొస్తలుల కార్యములు 8:26, 27, 36, 38) ఆ తర్వాత కొద్ది కాలానికి, సున్నతిపొందని అన్యులకు సువార్త ప్రకటించబడాలని దేవుడు ఇచ్ఛయించాడు. దైవభక్తిగల అన్యుడైన కొర్నేలీకి దర్శనంలో ఒక దేవదూత కనబడి అపొస్తలుడైన పేతురును పిలవడానికి మనుష్యులను పంపించమని నిర్దేశించాడు. కొర్నేలీ పంపిన మనుష్యులు పేతురును కనుగొన్నప్పుడు, వారు ఆయనతో, “కొర్నేలీ . . . నిన్ను తన యింటికి పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినవలెనని పరిశుద్ధ దూత వలన బోధింపబడెను” అని చెప్పారు. పేతురు ఆ మాటలకు స్పందించడంతో, సున్నతిపొందని మొదటి అన్యులు క్రైస్తవ సంఘంలో భాగమయ్యారు. (అపొస్తలుల కార్యములు 10:22, 44-48) సరైన మనోవైఖరిగల వ్యక్తిని కలిసేందుకు ఒక దేవదూత మీకు సహాయపడిందని తెలుసుకున్నప్పుడు మీరెలా భావిస్తారో ఊహించుకోండి!

పరిశుద్ధాత్మ ద్వారా సహాయం

12, 13. (ఎ) పరిశుద్ధాత్మ తమకు సహాయం చేస్తుందని నమ్మేందుకు యేసు అపొస్తలులకు ఎందుకు మంచి కారణముంది? (బి) పరిశుద్ధాత్మ మొదటి శతాబ్దపు క్రైస్తవులను ఏ విధంగా బలపరిచింది?

12 యేసు తాను చనిపోవడానికి ముందు రాత్రి, అపొస్తలులు సహాయం లేనివారిగా విడిచిపెట్టబడరని వారికి అభయమిచ్చాడు. తండ్రి వారికి ‘ఆదరణకర్తను, అంటే పరిశుద్ధాత్మను’ అనుగ్రహిస్తాడు. (యోహాను 14:26) పరిశుద్ధాత్మ తమకు సహాయం చేస్తుందని నమ్మడానికి ఆ అపొస్తలులకు మంచి కారణం ఉంది. యెహోవా తన సేవకులకు సహాయం చేసేందుకు అన్ని శక్తులకంటే అత్యంత బలమైన శక్తియైన పరిశుద్ధాత్మ శక్తిని ఎలా ఉపయోగించాడో తెలియజేసే ఉదాహరణలు ప్రేరేపిత లేఖనాల్లో కోకొల్లలుగా ఉన్నాయి.

13 అనేక సందర్భాల్లో, యెహోవా చిత్తం చేయడానికి మానవులను బలపరిచేందుకు పరిశుద్ధాత్మ ఉపయోగించుకోబడింది. ఇశ్రాయేలీయులను విడిపించేందుకు పరిశుద్ధాత్మ న్యాయాధిపతులను బలపరిచింది. (న్యాయాధిపతులు 3:9, 10; 6:34) ఎలాంటి వ్యతిరేకత ఉన్నా ధైర్యంగా ప్రకటనా పనిలో కొనసాగేందుకు అదే పరిశుద్ధాత్మ మొదటి శతాబ్దపు క్రైస్తవులను బలపరిచింది. (అపొస్తలుల కార్యములు 1:8; 4:31) వారు విజయవంతంగా పరిచర్యను జరిగించడం పరిశుద్ధాత్మ పనితీరుకు బలమైన రుజువునిస్తోంది. అలా కానట్లైతే, “విద్యలేని పామరులు” ఆనాటి ప్రపంచమంతా రాజ్య సందేశాన్ని ఎలా ప్రకటించగలిగి ఉండేవారు?—అపొస్తలుల కార్యములు 4:13; కొలొస్సయులు 1:23.

14. యెహోవా తన ప్రజలకు మరింత అవగాహనను ఇవ్వడానికి తన పరిశుద్ధాత్మను ఎలా ఉపయోగించుకున్నాడు?

14 యెహోవా తన ప్రజలకు మరింత అవగాహన ఇవ్వడానికి కూడా తన పరిశుద్ధాత్మను ఉపయోగించాడు. దేవుని పరిశుద్ధాత్మ సహాయంతో యోసేపు ఫరోకు వచ్చిన ప్రవచనార్థక కలలను వివరించగలిగాడు. (ఆదికాండము 41:16, 38, 39) యెహోవా తన పరిశుద్ధాత్మ మూలంగా వినయస్థులకు తన సంకల్పాలు బయలుపరిచి, అహంకారులకు వాటిని మరుగుచేశాడు. (మత్తయి 11:25) కాబట్టి, యెహోవా “తన్ను ప్రేమించువారికి” అనుగ్రహించే వాటి గురించి అపొస్తలుడైన పౌలు ఇలా చెప్పాడు: “మనకైతే దేవుడు వాటిని తన ఆత్మవలన బయలుపరచి యున్నాడు.” (1 కొరింథీయులు 2:7-10) కేవలం పరిశుద్ధాత్మ సహాయం వల్లనే ఒక వ్యక్తి దేవుని చిత్తాన్ని నిజంగా అర్థం చేసుకోగలడు.

దేవుని వాక్యం ద్వారా సహాయం

15, 16. జ్ఞానయుక్తంగా ప్రవర్తించేందుకు ఏమి చేయమని యెహోషువకు చెప్పబడింది?

15 యెహోవా ప్రేరేపిత వాక్యం ‘ఉపదేశించడానికి ప్రయోజనకరమైనదే’ కాక, అది దేవుని సేవకులు ‘సన్నద్ధులై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడియుండడానికి’ సహాయం చేస్తుంది. (2 తిమోతి 3:16, 17) ప్రాచీన కాలాల్లో అప్పటికే వ్రాయబడివున్న దేవుని వాక్యపు భాగాల నుండి ఆయన ప్రజలు ఎలా సహాయం పొందారో తెలియజేసే ఉదాహరణలు ఎన్నో బైబిల్లో ఉన్నాయి.

16 లేఖనాలు దేవుని ఆరాధకులకు సరైన నిర్దేశమివ్వడంలో సహాయం చేశాయి. ఇశ్రాయేలీయులను నడిపించే బాధ్యత యెహోషువకు అప్పగించబడినప్పుడు ఆయనకు ఇలా చెప్పబడింది: “[మోషే వ్రాసిన] ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్తపడునట్లు దివారాత్రము దాని ధ్యానించినయెడల నీ మార్గమును వర్ధిల్లజేసికొని చక్కగా ప్రవర్తించెదవు.” యెహోషువకు అద్భుతరీతిలో జ్ఞానాన్ని ప్రసాదిస్తానని దేవుడు వాగ్దానం చేయలేదని గమనించండి. బదులుగా, యెహోషువ ఆ “ధర్మశాస్త్ర గ్రంథమును” చదివి, ధ్యానిస్తేనే ఆయన జ్ఞానయుక్తంగా ప్రవర్తిస్తాడు.—యెహోషువ 1:8; కీర్తన 1:1-3.

17. దానియేలు, యోషీయా రాజు తమకు అందుబాటులో ఉన్న లేఖనాలవల్ల ఎలా సహాయం పొందారు?

17 దేవుని లిఖిత వాక్యం ఆయన చిత్తాన్ని, సంకల్పాన్ని బయలుపరచడానికి కూడా సహాయం చేసింది. ఉదాహరణకు, యెరూషలేము ఎంతకాలం పాడుగా ఉంటుందో యిర్మీయా వ్రాతల నుండి దానియేలు తెలుసుకున్నాడు. (యిర్మీయా 25:11; దానియేలు 9:2) అలాగే యూదా రాజైన యోషీయా పరిపాలనలో ఏమి జరిగిందో ఆలోచించండి. ఆ సమయానికి, జనాంగం యెహోవా నుండి దూరమైపోయింది, రాజులు ధర్మశాస్త్రపు వ్యక్తిగత ప్రతులు తయారు చేసుకొని దానిని అనుసరించడం మానేసినట్లుగా స్పష్టమవుతోంది. (ద్వితీయోపదేశకాండము 17:18-20) అయితే దేవాలయానికి మరమ్మతు జరుగుతున్న సమయంలో, బహుశా మోషే స్వయంగా వ్రాసిన, “ధర్మశాస్త్ర గ్రంథము” లభించింది. అది దాదాపు 800 సంవత్సరాల పూర్వం పూర్తి చేయబడిన అసలు ప్రతి అయివుండవచ్చు. యోషీయా రాజు, దానిలోని విషయాలు చదవబడినప్పుడు వినిన తర్వాత, ఆ జనాంగం యెహోవా చిత్తం చేయడం నుండి ఎంత దూరం వెళ్లిపోయిందో గ్రహించి, ఆ గ్రంథంలో వ్రాయబడిన దానికి అనుగుణంగా చేయడానికి గట్టి చర్యలు తీసుకున్నాడు. (2 రాజులు 22:8; 23:1-7) దీనినిబట్టి, ప్రాచీన కాలాల్లోని దేవుని సేవకులు తమకు అందుబాటులో ఉన్న పవిత్ర లేఖనాలవల్ల సహాయం పొందారనే విషయం స్పష్టం కావడం లేదా?

తోటి విశ్వాసుల ద్వారా సహాయం

18. ఒక సత్యారాధకుడు మరొక సత్యారాధకుడికి సహాయం చేసినప్పుడల్లా దానికి మూలం యెహోవాయే అని మనమెందుకు చెప్పవచ్చు?

18 యెహోవా అందించే సహాయం ఎక్కువగా తోటి విశ్వాసుల ద్వారా వస్తుంది. సత్యారాధకులు పరస్పరం సహాయం చేసుకున్నప్పుడు, ఆ సహాయానికి మూలం దేవుడే. అలాగని మనమెందుకు చెప్పగలం? దానికి రెండు కారణాలు ఉన్నాయి. మొదటిది, దేవుని పరిశుద్ధాత్మ ప్రమేయం. ఆ ఆత్మ ప్రభావాన్ని అనుమతించే వారిలో అది ప్రేమ, మంచితనంలాంటి ఫలాలు ఫలింపజేస్తుంది. (గలతీయులు 5:22) కాబట్టి, పరస్పరం సహాయం చేసుకొనేలా దేవుని సేవకులు పురికొల్పబడినప్పుడు, అది యెహోవా ఆత్మ పనిచేస్తుందనడానికి రుజువు. రెండవది, మనం దేవుని స్వరూపంలో చేయబడ్డాం. (ఆదికాండము 1:26) అంటే దేవుని దయ, కనికరంతోపాటు ఆయన లక్షణాలను ప్రతిబింబించే సామర్థ్యం మనకుందని దాని భావం. కాబట్టి ఒక యెహోవా సేవకుడు మరొక సేవకుడికి సహాయం చేశాడంటే, ఆ సహాయానికి అసలైన మూలం దేవుడే, ఆయన దేవుని లక్షణాన్ని ప్రతిబింబిస్తున్నాడు.

19. బైబిల్లో వ్రాయబడిన ప్రకారం, తోటి విశ్వాసుల ద్వారా యెహోవా ఎలా సహాయం అందించాడు?

19 బైబిలు కాలాల్లో, తోటి విశ్వాసుల ద్వారా యెహోవా ఎలా సహాయం అందించాడు? యెహోవా తరచూ తన సేవకులు ఒకరు మరొకరికి సలహా ఇచ్చేలా చూశాడు. యిర్మీయా బారూకుకు ఈ విధంగానే ప్రాణాన్ని రక్షించే సలహా ఇచ్చాడు. (యిర్మీయా 45:1-5) ఆయా సందర్భాల్లో, సత్యారాధకులు తమ తోటి విశ్వాసులకు భౌతిక సహాయం అందించేందుకు పురికొల్పబడ్డారు. ఈ విధంగా, యెరూషలేములో కష్టాల్లోవున్న తమ సహోదరులకు మాసిదోనియలోని, అకయలోని క్రైస్తవులు ఉత్సాహంగా సహాయం చేశారు. అలాంటి ఔదార్యంవల్ల సరైన విధంగానే “దేవునికి కృతజ్ఞతాస్తుతులు” చెల్లించబడ్డాయని అపొస్తలుడైన పౌలు వ్రాశాడు.—2 కొరింథీయులు 9:11.

20, 21. ఎలాంటి పరిస్థితుల్లో అపొస్తలుడైన పౌలు రోమునుండి వచ్చిన సహోదరులచే బలపరచబడ్డాడు?

20 యెహోవా సేవకులు పరస్పరం బలపరచుకోవడానికి, ప్రోత్సహించుకోవడానికి ఎలా ప్రయత్నించారో తెలియజేసే వృత్తాంతాలు ప్రత్యేకంగా మనసును స్పృశిస్తాయి. అపొస్తలుడైన పౌలుకు సంబంధించిన ఒక ఉదాహరణకు పరిశీలించండి. ఖైదీగా రోముకు వెళ్లే ప్రయాణంలో పౌలు, అప్పీయా రహదారి అనే రోము ప్రధాన రహదారిలో ప్రయాణించాడు. ఆ ప్రయాణపు చివరి భాగం మరీ కష్టంగా ఉంటుంది, ఎందుకంటే ఆ రహదారిపై ప్రయాణించేవారు చిత్తడిగా ఉండే లోతట్టు ప్రాంతాన్ని చేరుకుంటారు.a పౌలు వస్తున్నాడనే సంగతి రోములో ఉన్న సంఘంలోని సహోదరులకు తెలిసింది. దాంతో వారేమి చేశారు? పౌలు పట్టణంలోకి ప్రవేశించేంతవరకు వారు ఆ పట్టణంలోనే తమ గృహాల్లోనే సుఖంగావుండి, ఆ తర్వాత వెళ్ళి ఆయనను పలకరించారా?

21 ఆ ప్రయాణంలో పౌలుతోపాటు వెళ్లిన, బైబిలు రచయితయైన లూకా ఏమి జరిగిందో మనకు ఇలా వివరిస్తున్నాడు: “అక్కడ [రోము] నుండి సహోదరులు మా సంగతి విని అప్పీయా సంతపేట వరకును త్రిసత్రములవరకును మమ్మును ఎదుర్కొనుటకు వచ్చిరి.” మీరు ఆ దృశ్యాన్ని ఊహించుకోగలరా? పౌలు వస్తున్నాడని తెలుసుకొని ఆయనను కలుసుకోవడానికి, సహోదరుల బృందమొకటి రోము నుండి బయలుదేరింది. వారిలో కొందరు, రోముకు దాదాపు 58 కిలోమీటర్ల దూరంలోవున్న విశ్రాంతి స్థలమైన త్రిసత్రముల దగ్గర ఆగి అక్కడ వేచివుండగా, మిగిలిన సహోదరులు రోముకు దాదాపు 74 కిలోమీటర్ల దూరంలోవున్న పేరుగాంచిన అప్పీయా సంతపేట వరకూ వచ్చి అక్కడ వేచివున్నారు. పౌలు ఎలా స్పందించాడు? లూకా ఇలా నివేదిస్తున్నాడు: “పౌలు వారిని చూచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ధైర్యము తెచ్చుకొనెను.” (అపొస్తలుల కార్యములు 28:15) శ్రమ తీసుకొని అంత దూరం వచ్చిన ఆ సహోదరులను చూడడమే పౌలును ఎంత బలపరిచి, ఓదార్చి ఉంటుందో ఒక్కసారి ఊహించండి! ఈ సహాయకర మద్దతుకు పౌలు ఎవరికి కృతజ్ఞతలు చెల్లించాడు? ఆయన దానికి మూలమైన యెహోవా దేవునికే కృతజ్ఞతలు చెల్లించాడు.

22. రెండువేల ఐదవ సంవత్సరపు మన వార్షిక వచనమేమిటి, తర్వాతి ఆర్టికల్‌లో ఏమి పరిశీలించబడుతుంది?

22 దేవుని వ్యవహారాలు వ్రాయబడివున్న ప్రేరేపిత లిఖిత వాక్యం యెహోవా సహాయకుడనే విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఆయన సాటిలేని సహాయకుడు. సముచితంగానే, కీర్తన 121:2లోని “యెహోవావలననే నాకు సహాయము కలుగును” అనే వచనం యెహోవాసాక్షుల 2005వ సంవత్సరపు వార్షిక వచనంగా ఉంటుంది. అయితే నేడు యెహోవా మనకెలా సహాయం చేస్తున్నాడు? ఈ విషయం తర్వాతి ఆర్టికల్‌లో పరిశీలించబడుతుంది.

[అధస్సూచి]

a ఆ మార్గంలోనే ప్రయాణించిన రోమన్‌ కవి హోరెస్‌ (సా.శ.పూ. 65-8), ఆ ప్రయాణపు చివరి భాగంలో ఎదురయ్యే ఇబ్బందులపై వ్యాఖ్యానించాడు. అప్పీయా సంతపేట “పడవలు నడిపేవారితో, సత్రాలు నడిపే పిసినిగొట్టు వ్యాపారులచే క్రిక్కిరిసి ఉంటుంది” అని హోరెస్‌ వర్ణించాడు. “జుగుప్సాకరమైన జోరీగలు, కప్పల” గురించి, “అపరిశుభ్రమైన” నీటి గురించి ఆయన ఫిర్యాదు చేశాడు.

మీకు జ్ఞాపకమున్నాయా?

యెహోవా

• తన దూతల ద్వారా ఎలా సహాయం అందించాడు?

• తన పరిశుద్ధాత్మ ద్వారా ఎలా సహాయం అందించాడు?

• తన ప్రేరేపిత వాక్యం ద్వారా ఎలా సహాయం అందించాడు?

• తోటి విశ్వాసుల ద్వారా ఎలా సహాయం అందించాడు?

[15వ పేజీలోని బ్లర్బ్‌]

2005 వార్షిక వచనం: “యెహోవావలననే నాకు సహాయము కలుగును.”—కీర్తన 121:2.

[16వ పేజీలోని చిత్రం]

పౌలు రోములోని సహోదరులనుండి తాను పొందిన సహాయానికి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాడు

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి