కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w16 డిసెంబరు పేజీలు 24-28
  • తనను వెదికేవాళ్లకు యెహోవా ప్రతిఫలం దయచేస్తాడు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • తనను వెదికేవాళ్లకు యెహోవా ప్రతిఫలం దయచేస్తాడు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2016
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • తన సేవకుల్ని దీవిస్తానని యెహోవా మాటిస్తున్నాడు
  • “ఆత్మకు లంగరు”
  • యెహోవా వాళ్లకు ప్రతిఫలమిచ్చాడు
  • మనం చేసేవాటిని యెహోవా మర్చిపోడు
  • ఇప్పుడూ అలాగే భవిష్యత్తులో శాశ్వతంగా పొందే ప్రతిఫలాలు
  • దేవుడు ప్రతిఫలమిస్తాడా?
    తేజరిల్లు!—1994
  • యెహోవా “తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడు”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2005
  • యెహోవా అన్య జనాంగానికి ప్రతిఫలాన్ని ఇచ్చాడు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2017
  • విశ్వాస్యతకు ప్రతిఫలమివ్వబడుతుంది
    మన రాజ్య పరిచర్య—1997
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2016
w16 డిసెంబరు పేజీలు 24-28
పరదైసులో సముద్రాన్ని చూస్తూ ఆనందిస్తున్న ఓ జంట

తనను వెదికేవాళ్లకు యెహోవా ప్రతిఫలం దయచేస్తాడు

“దేవునియొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు, తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను.”—హెబ్రీ. 11:6.

పాటలు: 136, 139

మీరు వివరించగలరా?

  • యెహోవా తన సేవకులకు ఖచ్చితంగా ప్రతిఫలమిస్తాడని మనమెలా నమ్మవచ్చు?

  • యెహోవా తన సేవకుల్ని గతంలో ఏవిధంగా దీవించాడు?

  • యెహోవా మనకెలాంటి ప్రతిఫలాలు ఇస్తాడు?

1, 2. (ఎ) ప్రేమ, విశ్వాసం ఒకదానికొకటి ఎలా సంబంధం కలిగివున్నాయి? (బి) మనం ఏ ప్రశ్నల్ని పరిశీలిస్తాం?

నమ్మకమైన తన సేవకుల్ని దీవిస్తానని మన తండ్రైన యెహోవా మాటిస్తున్నాడు. ఆయన తన ప్రేమను చూపిస్తున్న విధానాల్లో అదొకటి. ‘ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు’ కాబట్టి మనం కూడా ఆయన్ను ప్రేమిస్తున్నాం. (1 యోహా. 4:19) యెహోవాపై మన ప్రేమ పెరిగేకొద్దీ, ఆయనపై మన విశ్వాసం మరింత బలపడుతుంది. అంతేకాదు, ఆయన ప్రేమించేవాళ్లకు ఖచ్చితంగా ప్రతిఫలమిస్తాడనే మన నమ్మకం మరింత పెరుగుతుంది.—హెబ్రీయులు 11:6 చదవండి.

2 యెహోవా ప్రతిఫలమిచ్చే దేవుడు. అలా ప్రతిఫలమివ్వడం ఆయన వ్యక్తిత్వంలో ఓ భాగం. ఆయన్ను వెదికేవాళ్లకు ఖచ్చితంగా ప్రతిఫలమిస్తాడనే నమ్మకం లేకపోతే మనకు పూర్తి విశ్వాసం లేనట్లే. ఎందుకంటే, ‘మనం ఎదురుచూసేవి తప్పక జరుగుతాయని బలంగా నమ్మడమే విశ్వాసం’ అని బైబిలు చెప్తోంది. (హెబ్రీ. 11:1, NW) అంటే, యెహోవా తన నమ్మకమైన సేవకుల్ని దీవిస్తాడనే గట్టి నమ్మకం కలిగివుండడమే విశ్వాసం. మరి ప్రతిఫలమిస్తాడనే నమ్మకం కలిగివుండడం వల్ల మనమెలాంటి ప్రయోజనం పొందుతాం? గతంలో, అలాగే మనకాలంలోని తన సేవకులకు యెహోవా ఎలా ప్రతిఫలమిచ్చాడు? ఇప్పుడు తెలుసుకుందాం.

తన సేవకుల్ని దీవిస్తానని యెహోవా మాటిస్తున్నాడు

3. మలాకీ 3:10వ వచనంలో యెహోవా ఏమని మాటిచ్చాడు?

3 తన నమ్మకమైన సేవకుల్ని దీవిస్తానని యెహోవా మాటిచ్చాడు. ఆయన కోసం మనం చేయగలిగినదంతా చేసి, మనల్ని తప్పకుండా దీవిస్తాడనే నమ్మకం కలిగివుండాలని ఆయన చెప్తున్నాడు. యెహోవా ఇలా అంటున్నాడు, ‘దయచేసి ఈ విషయంలో నన్ను పరీక్షించండి; నేను ఆకాశ తూముల్ని విప్పి, మీకు కొరత అనేదే లేకుండా ఉండేంతవరకు మీపై దీవెనల్ని కుమ్మరిస్తానో లేదో పరీక్షించి చూడండి.’ (మలా. 3:10, NW) తనను పరీక్షించమని యెహోవా చెప్పిన మాటకు లోబడినప్పుడు ఆయనపట్ల మనకు కృతజ్ఞత ఉందని చూపిస్తాం.

4. మత్తయి 6:33⁠లో యేసు ఇచ్చిన మాటను మనమెందుకు నమ్మవచ్చు?

4 రాజ్యానికి మొదటి స్థానమిస్తే దేవుని మద్దతు వాళ్లకు ఉంటుందని యేసు తన శిష్యులకు మాటిచ్చాడు. (మత్తయి 6:33 చదవండి.) దేవుడు ఏదైనా మాటిస్తే అది తప్పకుండా నిజమౌతుందని యేసుకు తెలుసు కాబట్టే ఆయన అలా చెప్పగలిగాడు. (యెష. 55:10, 11) మనం కూడా యెహోవాపై పూర్తి విశ్వాసం ఉంచితే “నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను” అని ఆయనిచ్చిన మాటను నిలబెట్టుకుంటాడనే నమ్మకంతో ఉండవచ్చు. (హెబ్రీ. 13:5) యెహోవా ఇచ్చిన ఈ మాట, మత్తయి 6:33⁠లో యేసు అన్న మాటలపై నమ్మకం ఉంచడానికి మనకు సహాయం చేస్తుంది.

వర్షానికి తడవకుండా బండచాటుకు వెళ్తున్న యేసు, ఆయన శిష్యులు

తన శిష్యులు చేసే త్యాగాలకు ప్రతిఫలం పొందుతారని యేసు చూపించాడు (5వ పేరా చూడండి)

5. యేసు పేతురుకు ఇచ్చిన జవాబు నుండి మనందరం ఎందుకు ప్రోత్సాహం పొందవచ్చు?

5 ఒకసారి అపొస్తలుడైన పేతురు, ‘మేము సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడించాము గనుక మాకేమి దొరకుతుంది’ అని యేసును అడిగాడు. (మత్త. 19:27) అలా అడిగినందుకు యేసు పేతురును కోప్పడలేదు. బదులుగా, వాళ్లు చేస్తున్న త్యాగాలకు ప్రతిఫలం పొందుతారని ఆయన తన శిష్యులకు చెప్పాడు. అపొస్తలులు అలాగే ఇతర నమ్మకమైన సేవకులు భవిష్యత్తులో యేసుతోపాటు పరలోకంలో రాజులుగా పరిపాలిస్తారు. అయితే ఇప్పుడు పొందే ప్రతిఫలాలు కూడా ఉన్నాయని యేసు చెప్పాడు. ఆయనిలా అన్నాడు, “నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడును నూరురెట్లు పొందును; ఇదిగాక నిత్యజీవమును స్వతంత్రించుకొనును.” (మత్త. 19:29) నేడు యేసును అనుసరించే వాళ్లందరూ సంఘాల్లో తండ్రుల్ని, తల్లుల్ని, అన్నదమ్ముల్ని, అక్కచెల్లెల్ని, పిల్లల్ని కనుగొంటున్నారు. ఈ ఆశీర్వాదం, దేవుని రాజ్యం కోసం మనం త్యాగం చేసిన వాటన్నిటికన్నా ఎంతో విలువైనది.

“ఆత్మకు లంగరు”

6. తన సేవకులకు ప్రతిఫలమిస్తానని యెహోవా ఎందుకు మాటిస్తున్నాడు?

6 ఇప్పుడు ఎన్నో అద్భుతమైన దీవెనల్ని ఆనందించడంతోపాటు, భవిష్యత్తులో పొందబోయే మరిన్ని గొప్ప దీవెనల కోసం మనం ఎదురుచూస్తున్నాం. (1 తిమో. 4:8) ప్రతిఫలమిస్తానని మాటివ్వడం ద్వారా, విశ్వాసానికి ఎదురయ్యే పరీక్షల్ని సహించడానికి యెహోవా తన సేవకులకు సహాయం చేస్తున్నాడు. ఆయన “తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడని” మనం పూర్తిగా విశ్వసించడం ద్వారా చివరివరకు నమ్మకంగా ఉండగలుగుతాం.—హెబ్రీ. 11:6.

7. నిరీక్షణ లంగరు లాంటిదని ఎలా చెప్పవచ్చు?

7 కొండమీది ప్రసంగంలో యేసు ఇలా చెప్పాడు, “సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి.” (మత్త. 5:12) దేవుని సేవకుల్లో కొంతమంది పరలోకంలో ప్రతిఫలం పొందుతారు. మిగిలినవాళ్లు పరదైసు భూమిపై నిత్యజీవాన్ని ప్రతిఫలంగా పొందుతారు. ‘సంతోషించి ఆనందించడానికి’ అది కూడా ఓ కారణం. (కీర్త. 37:11; లూకా 18:29, 30) కానీ మనందరికీ, మన నిరీక్షణ అనేది “నిశ్చలమును, స్థిరమునై, మన ఆత్మకు లంగరు” లాంటిది. (హెబ్రీ. 6:17-20) తుఫాను వచ్చినప్పుడు లంగరు ఎలాగైతే ఓడను స్థిరంగా ఉంచుతుందో, అదేవిధంగా బలమైన నిరీక్షణ మనల్ని స్థిరంగా ఉంచుతుంది. కష్టాలు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కోవడానికి కావాల్సిన బలాన్ని అది మనకిస్తుంది.

8. నిరీక్షణ మన ఆందోళనను ఎలా తగ్గిస్తుంది?

8 ఆందోళనల్ని తగ్గించుకోవడానికి నిరీక్షణ మనకు సహాయం చేస్తుంది. తైలం ఎలాగైతే మన చర్మానికి ఉపశమనాన్ని ఇస్తుందో, అదేవిధంగా దేవుని వాగ్దానాలు ఆందోళనతో ఉన్న మన హృదయానికి ఉపశమనాన్ని ఇస్తాయి. మన ఆందోళనల్ని యెహోవాపై వేసినప్పుడు ఆయన మనల్ని చూసుకుంటాడని తెలుసుకోవడం మనకు ఓదార్పునిస్తుంది. (కీర్త. 55:22) దేవునికి, ‘మనం అడిగేవాటన్నిటికంటే అత్యధికముగా’ ఇచ్చే శక్తి ఉందనే పూర్తి నమ్మకాన్ని మనం కలిగివుండవచ్చు. (ఎఫె. 3:20, 21) అవును, ఆయన కేవలం ఎక్కువగా కాదు, ‘అత్యధికంగా’ మనకు సహాయం చేస్తాడు.

9. యెహోవా ఖచ్చితంగా దీవిస్తాడని మనమెందుకు నమ్మవచ్చు?

9 యెహోవా ఇచ్చే ప్రతిఫలాన్ని పొందాలంటే మనకు ఆయనపై పూర్తి విశ్వాసం ఉండాలి, ఆయనిచ్చే నిర్దేశాల్ని పాటించాలి. ఇశ్రాయేలు జనాంగానికి మోషే ఇలా చెప్పాడు, ‘నీవు స్వాధీనపరచుకొనునట్లు నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యంగా ఇస్తున్న దేశంలో యెహోవా నిన్ను నిశ్చయంగా ఆశీర్వదిస్తాడు. కావున నేడు నేను నీకు ఆజ్ఞాపిస్తున్న ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనుటకు నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా వినాలి. ఏలయనగా నీ దేవుడైన యెహోవా నీతో చెప్పియున్నట్లు నిన్ను ఆశీర్వదిస్తాడు.’ (ద్వితీ. 15:4-6) యెహోవాకు నమ్మకంగా సేవ చేస్తే ఆయన ఖచ్చితంగా మిమ్మల్ని దీవిస్తాడనే పూర్తి నమ్మకం మీకుందా? అలా నమ్మడానికి సరైన కారణాలు ఉన్నాయి.

యెహోవా వాళ్లకు ప్రతిఫలమిచ్చాడు

10, 11. యెహోవా యోసేపుకు ఏవిధంగా ప్రతిఫలమిచ్చాడు?

10 బైబిల్లోని విషయాలన్నీ మన ప్రయోజనం కోసమే రాయబడ్డాయి. యెహోవా తన నమ్మకమైన సేవకులకు గతంలో ఏవిధంగా ప్రతిఫలమిచ్చాడో తెలియజేసే ఎన్నో ఉదాహరణలు అందులో ఉన్నాయి. (రోమా. 15:4) వాటిలో యోసేపు ఉదాహరణ అసాధారణమైనది. మొదట యోసేపు అన్నలు అతన్ని బానిసగా అమ్మేశారు. ఆ తర్వాత, అతని యజమాని భార్య మోపిన తప్పుడు నింద కారణంగా అతను ఈజిప్టు జైళ్లో ఉండాల్సి వచ్చింది. యోసేపు జైళ్లో ఉన్నప్పుడు, అతనికి, యెహోవాకు మధ్య దూరం ఏర్పడిందా? అస్సలు లేదు. ‘యెహోవా యోసేపుకు తోడుగా ఉండి, అతని పట్ల విశ్వసనీయ ప్రేమ చూపిస్తూ వచ్చాడు.’ అంతేకాదు ‘యెహోవా యోసేపుకు తోడుగా ఉన్నాడు, అతను ఏ పని చేసినా యెహోవా దాన్ని సఫలం చేశాడు’ అని బైబిలు చెప్తోంది. (ఆది. 39:21-23, NW) అలాంటి కష్టతరమైన పరిస్థితుల్లో కూడా యోసేపు ఓపిగ్గా ఉంటూ తన దేవునిపై ఆధారపడ్డాడు.

11 కొన్నేళ్ల తర్వాత ఫరో యోసేపును జైలు నుండి విడుదల చేశాడు. వినయంగల ఈ బానిస ఆ తర్వాత ఈజిప్టులోని రెండవ అత్యంత శక్తివంతమైన పరిపాలకుడు అయ్యాడు. (ఆది. 41:1, 37-43) యోసేపు దంపతులకు ఇద్దరు పిల్లలు పుట్టారు. యోసేపు, “దేవుడు నా సమస్త బాధను నా తండ్రి యింటి వారినందరిని నేను మరచిపోవునట్లు చేసెనని చెప్పి తన జ్యేష్ఠకుమారునికి మనష్షే అను పేరు పెట్టెను. తరువాత అతడు—నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించెనని చెప్పి, రెండవవానికి ఎఫ్రాయిము అను పేరు పెట్టెను.” (ఆది. 41:51, 52) యోసేపు నమ్మకంగా ఉన్నందుకు యెహోవా అతనికి ప్రతిఫలమిచ్చాడు. అతను యాకోబు కుటుంబాన్ని, ఐగుప్తీయుల్ని కరువు నుండి కాపాడగలిగాడు. తనకు ప్రతిఫలాన్నిచ్చింది, దీవించింది యెహోవాయేనని యోసేపుకు తెలుసు.—ఆది. 45:5-9.

12. పరీక్షలు ఎదురైనప్పుడు యేసు ఎలా నమ్మకంగా ఉండగలిగాడు?

12 యేసుక్రీస్తు కూడా ఎన్నో పరీక్షలు ఎదురైనప్పటికీ యెహోవాకు నమ్మకంగా ఉన్నాడు, అందుకే యెహోవా ఆయనకు ప్రతిఫలమిచ్చాడు. అయితే, నమ్మకంగా ఉండేందుకు యేసుకు ఏమి సహాయం చేసింది? దేవుని వాక్యం ఇలా వివరిస్తోంది, ‘ఆయన తనయెదుట ఉంచబడిన ఆనందం కోసం అవమానాన్ని నిర్లక్ష్యపెట్టి, సిలువను సహించాడు.’ (హెబ్రీ. 12:1, 2) దేవుని పేరును పరిశుద్ధపర్చ గలిగినందుకు యేసు ఆనందించాడు. అందుకు ప్రతిఫలంగా యేసు తన తండ్రి అనుగ్రహాన్ని, ఎన్నో అద్భుతమైన అవకాశాల్ని పొందాడు. ఆయన “దేవుని సింహాసనముయొక్క కుడిపార్శ్వమున ఆసీనుడైయున్నాడు” అని బైబిలు చెప్తోంది. అంతేకాదు ‘దేవుడు ఆయన్ను అధికంగా హెచ్చించి, ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించాడు’ అని చెప్తోంది.—ఫిలి. 2:11.

మనం చేసేవాటిని యెహోవా మర్చిపోడు

13, 14. మనం తనకోసం చేసేవాటిని యెహోవా ఎలా చూస్తాడు?

13 తన సేవ చేసేందుకు మనం చేసే ప్రతీదాన్ని యెహోవా విలువైనదిగా చూస్తాడనే నమ్మకంతో ఉండవచ్చు. మనకు మనపై లేదా మన సామర్థ్యాలపై నమ్మకం లేనప్పుడు యెహోవా మనల్ని అర్థంచేసుకుంటాడు. మన ఉద్యోగం గురించి లేదా కుటుంబాన్ని పోషించడం గురించి మనం ఆందోళనపడుతున్నప్పుడు ఆయన మనపై చాలా శ్రద్ధ చూపిస్తాడు. ఇప్పుడు మన ఆరోగ్యం బాగోలేకపోవడం వల్ల లేదా మనం కృంగిపోవడం వల్ల ఒకప్పుడు చేసినంత సేవ చేయలేకపోతుంటే ఆయన మనల్ని అర్థంచేసుకుంటాడు. సమస్యలు ఉన్నప్పటికీ మనం చూపిస్తున్న నమ్మకాన్ని ఆయన విలువైనదిగా ఎంచుతాడనే పూర్తి నమ్మకంతో మనం ఉండవచ్చు.—హెబ్రీయులు 6:10, 11 చదవండి.

14 యెహోవా ‘ప్రార్థన ఆలకించువాడని’ కూడా గుర్తుంచుకోండి. మన ప్రార్థనల్ని ఆయన వింటాడని మనం ఖచ్చితంగా నమ్మవచ్చు. (కీర్త. 65:2) “కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు,” మనం తనకు సన్నిహితంగా ఉండేందుకు అవసరమయ్యేవన్నీ ఇస్తాడు. అందుకోసం కొన్నిసార్లు మన తోటి సహోదరసహోదరీల్ని ఆయన ఉపయోగించుకుంటాడు. (2 కొరిం. 1:3) మనం ఇతరులపై కనికరం చూపించాలని యెహోవా కోరుకుంటున్నాడు. ‘బీదలను కనికరించేవాడు యెహోవాకు అప్పిచ్చువాడు వాని ఉపకారానికి ఆయన ప్రత్యుపకారము చేస్తాడు.’ (సామె. 19:17; మత్త. 6:3, 4) కాబట్టి మనం ఉదారతను చూపిస్తూ మన సహోదరులకు సహాయం చేసినప్పుడు, మనం చేసిన మంచిని తనకు ఇచ్చిన అప్పుగా యెహోవా భావిస్తాడు. అంతేకాదు మనం చూపించిన దయకు ప్రతిఫలమిస్తానని ఆయన మాటిస్తున్నాడు.

ఇప్పుడూ అలాగే భవిష్యత్తులో శాశ్వతంగా పొందే ప్రతిఫలాలు

15. మీరు ఏ ప్రతిఫలం కోసం ఎదురుచూస్తున్నారు? (ప్రారంభ చిత్రం చూడండి.)

15 అభిషిక్త క్రైస్తవులకు యేసు నుండి “నీతికిరీటము” అనే ప్రతిఫలం పొందే నిరీక్షణ ఉంది. (2 తిమో. 4:7, 8) ఒకవేళ మీకు ఆ నిరీక్షణ లేకపోతే మీరు యెహోవాకు అంత విలువైనవాళ్లు కాదని దానర్థంకాదు. లక్షల్లో ఉన్న యేసు “వేరే గొఱ్ఱెలు” పరదైసు భూమిపై నిత్యజీవితం కోసం ఆశగా ఎదురుచూస్తారు. అక్కడ వాళ్లు ‘బహు క్షేమము కలిగి సుఖిస్తారు.’—యోహా. 10:16; కీర్త. 37:11.

16. మనకు ఓదార్పునిచ్చే ఏ మాటలు 1 యోహాను 3:19, 20⁠లో ఉన్నాయి?

16 మనం యెహోవా సేవ అంతగా చేయట్లేదని కొన్నిసార్లు అనిపించవచ్చు లేదా మన సేవను చూసి యెహోవా సంతోషిస్తున్నాడో లేదోననే సందేహం రావచ్చు. అసలు మనం ఏ ప్రతిఫలం పొందడానికీ అర్హులం కాదని కూడా మనకు అనిపించవచ్చు. కానీ “దేవుడు మన హృదయముకంటె అధికుడై, సమస్తమును ఎరిగి యున్నాడు” అని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. (1 యోహాను 3:19, 20 చదవండి.) మనం యెహోవాపై విశ్వాసంతో, ప్రేమతో ఆయనకు సేవ చేసినప్పుడు ఆయన మనకు ప్రతిఫలమిస్తాడనే నమ్మకంతో ఉండవచ్చు. ఒకవేళ మనం చేసే సేవ మనకు చాలా తక్కువగా అనిపించినప్పటికీ ఆయన ప్రతిఫలమిస్తాడని నమ్మవచ్చు.—మార్కు 12:41-44.

17. ఇప్పుడు మనం ఆనందిస్తున్న కొన్ని ప్రతిఫలాలు ఏమిటి?

17 సాతాను దుష్టలోకంలోని ఈ చివరిరోజుల్లో కూడా యెహోవా తన ప్రజల్ని దీవిస్తున్నాడు. ప్రపంచవ్యాప్త సహోదరత్వంలో భాగంగా మనందరం ఎంతో జ్ఞానాన్ని, సంతోషాన్ని పొందేలా ఆయన చూస్తున్నాడు. (యెష. 54:13) అవును యేసు మాటిచ్చినట్లుగా, ప్రపంచవ్యాప్తంగా ప్రేమగల సహోదరసహోదరీల్ని ఇవ్వడం ద్వారా యెహోవా మనకు ఇప్పుడు ప్రతిఫలమిస్తున్నాడు. (మార్కు 10:29, 30) అంతేకాదు ఎంతో ప్రశాంతతను, తృప్తిని, సంతోషాన్ని ఇవ్వడం ద్వారా దేవుడు తనను వెదికేవాళ్లకు ప్రతిఫలమిస్తున్నాడు.—ఫిలి. 4:4-7.

18, 19. తాము పొందిన ప్రతిఫలాల గురించి దేవుని సేవకులు ఎలా భావిస్తారు?

18 ప్రపంచవ్యాప్తంగా ఉన్న యెహోవా సేవకులు మన తండ్రి నుండి అద్భుతమైన ప్రతిఫలాల్ని పొందారు. ఉదాహరణకు జర్మనీలో ఉంటున్న బీయాంక ఇలా అంటోంది, “నాకు ఎదురయ్యే ఆందోళనల్ని తట్టుకోవడానికి సహాయం చేస్తున్నందుకు, ప్రతీరోజు నాకు అండగా ఉంటున్నందుకు నేను యెహోవాకు ఎంత కృతజ్ఞత చెప్పినా సరిపోదు. లోకమంతా గందరగోళంగా, చెడుగా ఉంది. కానీ యెహోవాకు దగ్గరగా ఉంటూ పనిచేయడం వల్ల, ఆయన చేతుల్లో సురక్షితంగా ఉన్నట్లు నాకనిపిస్తోంది. నేను ఆయన కోసం ఏవైనా త్యాగాలు చేసిన ప్రతీసారి, ఆయన నాకు తిరిగి వందరెట్లు ఎక్కువ దీవెనల్ని ఇస్తున్నాడు.”

19 కెనడాలో ఉంటున్న 70 ఏళ్ల పౌల అనుభవాన్ని పరిశీలించండి. వెన్నెముకకు సంబంధించిన ఒక పెద్ద జబ్బుతో ఆమె బాధపడుతోంది. అయితే ఆ జబ్బు వల్ల ఎక్కువ కదల్లేకపోతున్నంత మాత్రాన తాను పరిచర్యను ఆపాలనుకోవట్లేదని ఆమె అంటోంది. అంతేకాదు ఆమె ఇలా చెప్తోంది, “నేను ఫోన్‌ సాక్ష్యం, అనియత సాక్ష్యం వంటివాటిని ఉపయోగించుకుని ప్రీచింగ్‌ చేస్తాను. నేను ఎప్పటికప్పుడు చదివి ప్రోత్సాహం పొందేందుకు వీలుగా, ఓ పుస్తకంలో లేఖనాల్ని, ప్రచురణలో వచ్చిన కొన్ని విషయాల్ని రాసుకుంటాను. నేను ఆ పుస్తకాన్ని ‘నన్ను బ్రతికించే పుస్తకం’ అని పిలుస్తాను. యెహోవా వాగ్దానాలపై మనసుపెడితే నిరుత్సాహం ఎంతోకాలం ఉండదు. మనమెలాంటి పరిస్థితుల్లో ఉన్నా, మనకు ఎల్లప్పుడూ సహాయం చేయడానికి యెహోవా ఉన్నాడు.” బహుశా మీ పరిస్థితి బీయాంక లేదా పౌల లాంటిది కాకపోవచ్చు. అయినప్పటికీ, యెహోవా మీకూ అలాగే మీ చుట్టూ ఉన్నవాళ్లకూ ఎలాంటి ప్రతిఫలాల్ని ఇచ్చాడో ఆలోచించవచ్చు. ఆయన ఇప్పుడు మీకెలా ప్రతిఫలాల్ని ఇస్తున్నాడో, భవిష్యత్తులో ఎలా ఇస్తాడో ఆలోచించడం ఎంత మంచిదో కదా!

20. మనం యెహోవా సేవలో చేయగలిగినదంతా చేస్తూ ఉన్నప్పుడు ఏమి పొందుతామని ఎదురుచూడవచ్చు?

20 మీరు చేసే హృదయపూర్వక ప్రార్థనలకు ‘గొప్ప ప్రతిఫలం’ పొందుతారని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. మీరు ‘దేవుని ఇష్టాన్ని నెరవేర్చిన తర్వాత,’ ‘వాగ్దానం చేసినదాన్ని పొందుతారని’ ఖచ్చితంగా నమ్మవచ్చు. (హెబ్రీ. 10:35, 36, NW) కాబట్టి మన విశ్వాసాన్ని బలపర్చుకుంటూ ఉందాం, యెహోవా సేవ చేసేందుకు చేయగలిగినదంతా చేద్దాం. ఎందుకంటే యెహోవా ప్రతిఫలమిస్తాడనే నమ్మకం మనకుంది.—కొలొస్సయులు 3:23, 24 చదవండి.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి