దేవుని వాక్యమును అంగీకరించి, అన్వయించి, ప్రయోజనము పొందుట
1 లక్షలాదిమంది ప్రజలు బైబిలును కల్గియున్నను, అనేకులు దానిని దేవుని వాక్యమని అంగీకరించరు. వివేకవంతమైన దాని సలహాను ఎక్కువమంది అన్వయించుటలేదు. అందుచేత కొద్దిమంది మాత్రమే దానినుండి ప్రయోజనము పొందుతున్నారు. అయితే ఇది దేవుని వాక్యమని, అన్ని విషయములలో అది ప్రయోజనకరమైనదేనని యెహోవా ప్రజలు నిజంగా నమ్ముతున్నారు. (2 తిమో. 3:16, 17) కనుక, 1993 సేవాసంవత్సరపు ప్రాంతీయ సమావేశ కార్యక్రమము యొక్క ముఖ్యాంశమేమనగా “దేవుని వాక్యమును అంగీకరించి, అన్వయించి, ప్రయోజనము పొందుట.”
2 మనలను ప్రోత్సహించుటకు, దేవునివాక్యముయెడల మనకున్న మెప్పుదలను అధికము చేయుటకు, జీవితములో అన్ని రంగములందు దానిని మరింత ఎక్కువగా అన్వయించుటకు మనకు సహాయముచేయు ప్రసంగములు ప్రదర్శనలు, ముఖాభినయాలు, అనుభవాలు, పరిచయాలు ఉంటాయి. వినోదము, సహవాసము, వస్తుసంపదాపేక్ష సంబంధముగా కుటుంబవలయమునకు కావలసిన సలహా, క్రమశిక్షణను గూర్చి శనివారం మధ్యాహ్న కార్యక్రమమునందు చర్చించబడును. మనము లోకమునకు వేరైయుండి దాని చెడు అలవాట్లను, అమర్యాదకరమైన అసహ్యమైన మాటలను అలవర్చుకొనకుండ ఎట్లుండవలెనో అది చూపును. అదనంగా, ఒంటరియైన భార్య/భర్తలకు, అనాధలైన పిల్లలకు ప్రయోజనకరమగు ప్రోత్సాహము అందించబడును.
3 అంతేగాకుండ, క్రొత్తగా సమర్పించుకొన్నవారు శనివారం, బాప్తిస్మమనే అంశముమీద లేఖన సంబంధమైన ప్రసంగము వినిన తరువాత బాప్తిస్మము పొందు అవకాశమున్నది. ప్రాంతీయ సమావేశములో బాప్తిస్మము పొంద తలంచువారు తమ సంఘ అధ్యక్షునికి తమ కోరికను సాధ్యమైనంత త్వరలో తెలియజేయవలెను. అప్పుడు, బాప్తిస్మ అభ్యర్ధులతో ప్రశ్నలు చర్చించడానికి పెద్దలను ఏర్పాటుచేయు నిమిత్తము ఆయనకు తగినంత సమయముంటుంది.
4 దేవుని వాక్యమును అన్వయించుట మూలంగా మనము లోకమునుండి ప్రత్యేకముగా ఉండే విధానాలను గూర్చి ఆదివారం ఉదయకాల కార్యక్రమమునందు పరిశీలించబడును. మన రూపురేఖలకెంత ప్రాధాన్యత నివ్వాలి, మన మనస్సును చెరిపివేసికొనకుండా తప్పించుకునేదెలా అనే అంశాలు పరిశీలించబడును. మధ్యాహ్నమందు “బైబిలు సత్యసంధతను గుర్తించున దేమి?” అనే బహిరంగ ప్రసంగమును జిల్లాకాపరి అందిస్తారు. ఈ శ్రేష్టమైన కార్యక్రమమునకు ఆసక్తిగల వ్యక్తులను ఆహ్వానించుటకు నిశ్చయించుకుందాము.
5 ఈ ప్రాంతీయ సమావేశ కార్యక్రమ ప్రదేశములను, తారీఖులను మీ ప్రాంతీయ కాపరి తెలియజేస్తారు. దేవుని వాక్య సలహాను అంగీకరించి, అన్వయించి, ప్రయోజనము పొందుటకు దీనికి హాజరుకమ్మని మేము అందరిని ప్రోత్సహించుచున్నాము.—యాకో. 1:22-25.