ఇంటింటి పరిచర్యలో మన పత్రికలను ఉపయోగించుట
1 తేజరిల్లు! ప్రచురించబడే కారణం ప్రతి సంచికలోను 4వ పేజీనందు యివ్వబడింది: “ఈ పత్రిక 1914లో జరిగిన సంఘటనలను చూసిన తరం గతించక ముందే, శాంతి భద్రతలుగల ఒక నూతన లోకం వస్తుందని సృష్టికర్త చేసిన వాగ్దానమందు నమ్మకాన్ని వృద్ధిచేస్తుంది.” నిశ్చయంగా మన యింటింటి పరిచర్యలో అలాంటి పత్రిక సాధ్యమైనంత విరివిగా అందించబడాలి!
2 ఆత్మీయ దృష్టిలేని ప్రజల ఆసక్తిని పెంపొందించడానికి తేజరిల్లు! ఒక అద్భుతమైన సాధనం. ప్రతి సంచికను చదివేటప్పుడు యితరులతో పంచుకోటానికి తగిన అంశాల కొరకు వెదకండి. కొంతమంది ప్రచారకులు తమ స్వంతకాపీలో గుర్తుపెట్టుకుంటారు. ఆ సంచికతో ప్రాంతీయ సేవకు వెళ్లేముందు, యింటివారితో పంచుకునే నిర్దిష్ట అంశాలను మనస్సు నందుంచుకునేందుకు ఆలా గుర్తుపెట్టుకున్న వాటిని వారు పునఃసమీక్షిస్తారు.
3 మనం ఉపయోగించే తేజరిల్లు! సంచికలో చర్చించబడిన అంశంపై సూటిగా వ్యాఖ్యానించడంతో మనం మన అందింపును ప్రారంభించవచ్చు.
ఇంటివారు ఆసక్తిని కనపర్చినట్లైతే, యిలా చెప్పి మనం పత్రికను అందించవచు:
◼ “తేజరిల్లు! నందలి ఈ శీర్షిక ఈ అంశాన్ని లోతుగా పరిశీలిస్తుంది.” తర్వాత ముందుగా ఎంచుకున్న ఒకటి లేక రెండు వాక్యాలను చదివి యిలా అనండి: “ఈ అంశంపై మీకు ఆసక్తి ఉన్నట్లు కనిపిస్తుంది గనుక, ఈ తేజరిల్లు! పత్రికలోని ఈ శీర్షికను యితర సమయోచిత శీర్షికలను చదవటానికి మీరు యిష్టపడతారా? అలాగైతే, దీన్ని దీనితోటి పత్రికైన కావలికోటను రూ. 6.00కు మీకివ్వాలని నేను యిష్టపడుతున్నాను.”
4 ఇంటివారు ఆత్మీయ విషయాలపై తమకున్న ఆసక్తిని స్పష్టంగా కనపర్చితే, అంత్యదినాలను గూర్చి 2 తిమోతి 3:1-5 నందు చెప్పబడినటువంటి లేఖనాలను మనము చదవవచ్చును. ఆ తర్వాత, మన పత్రికలందు ఆసక్తిని రేకెత్తించడానికి కావలికోట క్రొత్త సంచికలో 2వ పేజీనందున్న “కావలికోట ఉద్దేశము” అనే అంశంతో ప్రారంభమయ్యే భాగాన్ని మనం చదువవచ్చు. ఆ తర్వాత, కావలికోట, తేజరిల్లు! క్రొత్త పత్రికలను వారికి అందించండి.
5 మతంలో ఆసక్తిగల ప్రజలున్న ప్రాంతాల్లో పత్రికలు అందించడానికి బదులు, మీరు యిలా అనవచ్చు:
◼ “ఈ ప్రాంతంలో, మా మతంకాని అనేక మతాచారాలుగల ప్రజలను కలుస్తుంటాం. దేవునిగూర్చి మానవుడు చేసిన అన్వేషణ వివిధ మార్గాలుగా విడిపోయింది. [అపొస్తలుల కార్యములు 17:26, 27 చదవండి.] సామాన్యంగా, ప్రజలు తాముగా దేవున్ని అన్వేషించకుండా, తమ తలిదండ్రుల మతాన్నే అనుసరిస్తారని మీరు ఒప్పుకుంటారా? [జవాబు చెప్పనివ్వండి.] మ్యాన్కైండ్స్ సర్చ్ ఫ్ర్ గాడ్ అనే ఈ పుస్తకమందలి మొదటి అధ్యాయంలో ఇదే చర్చించబడింది. [8వ పేజీలో 12వ పేరాలోని సమాచారాన్ని నొక్కితెల్పండి.] ఇతర మతాలను గూర్చి అధికంగా తెలుసుకోవడం జ్ఞానయుక్తం, విద్యాప్రయోజనం కూడా. లోకమందున్న ముఖ్యమైన మతాల ప్రారంభాన్ని, ఆచారాలను, బోధలను ఈ పుస్తకం వివరిస్తోంది.” సమయం అనుమతిస్తే, ఆ పుస్తకమునందలి అధ్యాయాల పట్టికనూ ఒకటి రెండు చిత్రాలను చూపించండి.
6 మనం యింటింటి పరిచర్య చేసేటప్పుడు, ప్రజలు ఆత్మీయ పురోభివృద్ధి సాధించునట్లు సహాయపడ్డానికి, ప్రపంచమందు రెండు చక్కటి ఉపకరణాలైన కావలికోట, తేజరిల్లు! అనే పత్రికలు మనకున్నాయని జ్ఞాపకముంచుకోండి. ఈ పత్రికలందు యింటివారికి ఆసక్తిని రేకెత్తించడానికి కృషి సల్పుతూ, ప్రతి అవకాశంలోను వాటిని మనం అందించుదాం.