యెహోవా చేసిన దానిని వివరంగా చెప్పడం ఎంత ప్రయోజనకరమో!
1 కీర్తన 48 వ్రాసిన ప్రేరేపిత రచయిత ఇశ్రాయేలులో ఉన్నవారిని యిలా ఉద్బోధించాడు, ‘ముందు రాబోవు తరములకు దాని వివరము మీరు చెప్పునట్లు సీయోను చుట్టు తిరుగుచు దానిచుట్టు సంచరించుడి దాని బురుజులను లెక్కించుడి దాని ప్రాకారములను నిదానించి చూడుడి.’ యెహోవాయెడలగల ప్రేమవలన ప్రేరేపించబడి, భూసంబంధమైన దైవపరిపాలనా కేంద్రాన్ని గూర్చిన ప్రతి వివరంలోను వారు చాలా శ్రద్ధకలిగి ఉంటారు. ఈ నగరంపైనే యెహోవా తన నామాన్ని స్థాపించినందువల్ల యీ వివరాలు ఎంత అమూల్యమైనవో! వారు దీన్ని గురించి మాట్లాడుకునేవారు, వారు తమ హృదయాల్లో దాచుకున్న వివరాలు నిశ్చయంగా తమ సంతతివారు వినేటట్లు చేసేవారు.—కీర్త. 48:12, 13.
2 భూసంబంధమైన సీయోను కాక, పరలోకపు సీయోను కేంద్రంగా యెహోవా యొక్క మెస్సీయ దైవపరిపాలనా ప్రభుత్వం ఏలే సమయంలో మనమిప్పుడు జీవిస్తున్నాం. (హెబ్రీ. 12:22) యెహోవా ప్రభుత్వం యేసుక్రీస్తు చేతుల ద్వారా 1914 నుండి ఏలనారంభించింది. (ప్రక. 12:10) దాని క్రియాశీలత మనకు చాలా ఆసక్తికరమైనది. ఆ రాజ్యం యొక్క దృశ్య ప్రతినిధులుగా యెహోవా యిష్టాన్ని నెరవేర్చడానికి ఆయన భూమి మీది తన దాసులను ఏ విధంగా నడిపించాడన్న విషయంలో కూడా మనకు చాలా ఆసక్తివుంది. మన క్రొత్త పుస్తకమైన జెహోవాస్ విట్నెసెస్—ప్రొక్లైమర్స్ ఆఫ్ గాడ్స్ కింగ్డమ్ లో దీన్ని గూర్చిన ఆసక్తికరమైన విషయాలు వివరించబడ్డాయి. మన ఇటీవలి “దైవిక బోధ” జిల్లా సమావేశంలో మనం యీ పుస్తకాన్ని పొందడంలో ఎంత సంతోషిస్తున్నామో!
3 సెప్టెంబరు 1 నాటికే, ఈ పుస్తకం భూవ్యాప్తంగా 20 భాషల్లో ప్రచురించబడింది, యింకా యితర 13 భాషల్లో మాట్లాడేవారికొరకు యిది అనువాదం మరియు ప్రచురణ ఘట్టాల్లో ఉంది. మీ కుటుంబానికి కూడా అది లభించినట్లయితే, మీరుదాన్ని చదువుతున్నారా? మీరు దానిలో నుండి నేర్చుకున్న విషయాలను గూర్చి మాట్లాడుతున్నారా?
4 చిత్రాలను చూసి, వాటి వ్యాఖ్యానాలను చదివిన తర్వాత, సమావేశంలో యివ్వబడిన సలహా ప్రకారం, చాలామంది సహోదర సహోదరీలు వెంటనే ముఖ్య అంశాలను చదివారు. వాళ్ళ అభిప్రాయాలేంటి? ఇక్కడ కొన్ని అభిప్రాయాలు యివ్వబడ్డాయి.
5 ఒక సహోదరి యిలా వ్రాసింది: “నాకు దొరికిన పుస్తకాల్లోకెల్లా తొందరగా పూర్తిగా చదివి రెండవసారి చదవాలని ఆశిస్తున్న పుస్తకం యిది మాత్రమే. నేనిప్పుడు 25 వ అధ్యాయం చదువుతున్నాను, ఎంత ఎక్కువగా చదివితే, అంతగా కంట తడిపెట్టుకున్నాను, నా హృదయం యెహోవా పట్ల ప్రేమతో నిండిపోతుంది. ఈ పుస్తకం ఎంతో ప్రోత్సహించి, విశ్వాసాన్ని బలపరచేదిగా ఉంది.”
6 యెహోవాను 40 కంటే ఎక్కువ సంవత్సరాలుగా సేవిస్తున్న ఒక సహోదరుడు యిలా చెప్పాడు: “ఈ పుస్తకం ఎంత ఆకర్షిస్తుందో నేనూహించలేదు. ఆలస్యంగా పడుకుని, పెందలకడనే లేచి రెండు వారాల్లో ఈ పుస్తకాన్ని పూర్తిగా చదివాను. నేను చదివిన అన్ని పుస్తకాల్లోకెల్లా ఎక్కువగా ప్రేరేపించే పుస్తకం నిజంగా యిదొక్కటే. పరిశోధనకు అత్యుత్తమమైన పుస్తకం యిదే, అలాగే ప్రోత్సహించడానికి కూడా అత్యుత్తమమైన పుస్తకం యిదే.”
7 క్రమంగా చదివే కార్యక్రమం: ఈ పుస్తకమంతా త్వరగా చదివినవారు, దీన్ని మళ్ళీ ఒక సారి నెమ్మదిగా చదవాలని తీర్మానించుకున్నారు.
8 మీ యింట్లో ఒకరి కంటే ఎక్కువమంది సభ్యులు సత్యంలో ఉన్నట్లయితే, మీ కుటుంబ పఠనంలో యీ పుస్తకంలోని కొన్ని భాగాలను ఉపయోగించాలనుకోవచ్చు. సమావేశంలో ఒక పుస్తకం లభించిన కొన్ని రోజుల్లోనే కొన్ని కుటుంబాలు అలా చేయనారంభించాయి. దీని అర్థం ఇతర పఠనాలను, కావలికోట పఠనం కొరకు సిద్ధపడడాన్ని అలక్ష్యం చేయమని కాదు. అయితే, ప్రొక్లైమర్స్ పుస్తకాన్ని చదవడానికి, చర్చించడానికి మరో 15, 20 నిమిషాలు ఉపయోగించడం మీకు ప్రయోజనకరం కావచ్చు.
9 కొన్ని కుటుంబాలవారు రాత్రి, భోజనం ముగించి వెళ్ళక ముందు యీ పుస్తకంలోని రెండు మూడు పేజీలు—ఒకవేళ ఒకటో రెండో ఉపశీర్షికలు చదువుతున్నారు. వారు వ్యక్తిగతంగా దాదాపు పుస్తకమంతా చదివినవారే, కాని నెమ్మదిగా చదివి అందులోని అంశాలను చర్చించే అవకాశం పొందడం ద్వారా వారు ప్రయోజనం పొందుతున్నారు. ఇలా చేసే కొందరు అనేక సంవత్సరాల నుండి యెహోవాకు సేవ చేస్తున్నారు. వాళ్ళు చదువుతుండగా అనేక మధురస్మృతులు వారి మదిలో మెదిలాయి. వారు చదివిన సంఘటనలలోని వారి స్వంత పాత్రను పరస్పరం చర్చించుకున్నప్పుడు అది వారి హృదయాలకు సంతోషాన్ని కలుగజేసింది.
10 మీ యింటి పరిస్థితులనుబట్టి, మీరు ఒంటరిగా చదువుతుండవచ్చు. సొసైటీకి వ్రాసిన ఒక సహోదరి యిలా చెప్పింది: “నేను ప్రతి రాత్రి, పడుకునే ముందు కొంత సమయం ఈ పుస్తకం చదువుతున్నాను. ఈ పుస్తకం నాలో సత్యం యెడల ప్రగాఢమైన మెప్పును ప్రేమను కలిగిస్తుంది, యెహోవాకు మరింత దగ్గరైనట్లు నాకనిపిస్తుంది, ఆయన సంస్థలో నేనొక భాగమైనందుకు నేను ఎంతో కృతజ్ఞురాలిని, నేను చదివే ప్రతి పుటను నిజంగా యిష్టపడుతున్నాను.
11 పుస్తకం పెద్దదైనప్పటికీ, దానిలోవున్న భాగాలు పెద్దవేమీ కావు. కేవలం 108 పేజీల్లో ఉన్న మొదటి భాగం, హేబెలు దినముల నుండి 1992 వ సంవత్సరం వరకున్న కాలాన్ని అతి వేగంగాను, ఆసక్తికరంగాను చెప్పుకుంటూపోతుంది. ఇతర భాగాలు 13 నుండి 150 పేజీల వరకూ ఉన్నాయి. వీటిలో ప్రతి భాగం అనేక అధ్యాయాలుగా విభజించబడింది. అన్నింటినీ ఒకేసారి చదవకుండా, మొదట ఒక భాగాన్ని, ఒక అధ్యాయాన్ని, లేదా ఒక ఉపశీర్షికను చదవండి, ఆనందించండి, దాని నుండి ప్రయోజనం పొందండి.
12 మీరు చదివేదాన్ని గూర్చి ఆలోచించడానికి సమయం తీసుకోండి: మీరు చదువుతుండగా మీ ధ్యేయం ఏంటి? కేవలం పుస్తకంలోని పేజీలన్నిటిని తిరగవేయడమే అనగా పుస్తకాన్ని పూర్తిచేయడమే మీ లక్ష్యమై ఉండకూడదు. ప్రొక్లైమర్స్ పుస్తకంలో మీ ఆత్మీయ వారసత్వముంది. మీరు దాన్ని బాగా తెలుసుకోవాలి. మీరు చదివినదాన్ని ఎలా అన్వర్తించుకోవాలోనని ఆలోచించడానికి సమయం తీసుకోండి. ప్రాచీనకాల యెహోవాసాక్షుల సేవను పునరాలోచిస్తుండగా, వారి విశ్వాసాన్ని ఎలా అనుకరించాలో ఆలోచించండి. (హెబ్రీ. 12:1, 2) మతభ్రష్టత పెరుగుదలను గూర్చి మీరు చదువుతున్నపుడు, మీ స్వంత ఆత్మీయతను కాపాడుకునే దృష్టితో, త్రోవతప్పినవారిని ఉరిలో పడవేసిన అపాయాలేమిటో గమనించండి. మన ఆధునిక-దిన చరిత్రను మీరు సమీక్షిస్తుండగా దేవుడు ఉపయోగించుకున్నవారి ఆత్మీయ యోగ్యతలను, వారి జీవితాల్లో దేవుని యిష్టాన్ని నిర్వహించడమే అతి ప్రధానమని వారెలా చూపించారో, దేవుడు అనుమతించిన కొన్ని బహు క్లిష్టమైన పరిస్థితులను వారెలా ఎదుర్కొన్నారో పరిశీలించండి.—హెబ్రీ. 13:7.
13 మనమిప్పుడు కలిగియున్న బైబిలు సత్యాలను గూర్చి స్పష్టంగా గ్రహించడానికి, యెహోవా తన ప్రజలను నడిపించిన విధాన్ని గూర్చిన వివరాలను అన్వేషించడం విశ్వాసాన్ని బలపరుస్తుందని మీరు తెలుసుకుంటారు. సంస్థ అభివృద్ధిని గూర్చి మీరు బాగా తెలుసుకుంటున్న కొలది, యెహోవా ఉపయోగిస్తున్న దృశ్యమైన ఏర్పాట్లయెడల మీకు గల మెప్పు అధికమౌతుంది. ప్రవచన నెరవేర్పుగా సువార్త భూదిగంతముల వరకు వ్యాపించిందని మీరు చదివినప్పుడు మీరెంతో ఉత్తేజితులౌతారు. రాజ్యాన్ని ప్రకటించడానికి ప్రపంచంలోని అన్ని భాగాల్లో ఆసక్తితో సేవచేసిన నమ్మకస్థులైనవారి అనుభవాలనుబట్టి మీ హృదయం ఎంతో ఉప్పొంగుతుంది. యెహోవా యెడల తమకు గల ప్రేమనుబట్టి నమ్మకస్థులైన సహోదర సహోదరీలు యిప్పటికే సహించినదాన్ని గూర్చి మీరు చదివినప్పుడు, మీరు వ్యక్తిగతంగా పరీక్షలను ఎదుర్కోడానికి బలపర్చబడతారు.
14 మీరు ఏదైనా అంశంలోని ఒక భాగాన్ని చదివిన తర్వాత, దాని విలువను యితరులతో చర్చించడానికి, వివరాలను పునరాలోచించడానికి సమయం తీసుకోండి. మీకు చిన్న పిల్లలున్నట్లయితే, చిత్రాలను వివరించడానికి, అందులోవున్నవారిని గూర్చి వారికేం తెలుసో మీతో చెప్పడానికి వారిని కూడా కలుపుకోండి. మీరు ఒంటరిగా చదువుతున్నప్పటికీ, మీరు నేర్చుకున్నదాన్ని గూర్చి యితరులతో చెప్పడానికి ప్రయత్నం చేయండి. అనుకూలమైతే, పునర్దదర్శనాలు చేసేటప్పుడు, గృహ బైబిలు పఠనాలు నిర్వహించేటప్పుడు, యీ అంశాలను ఉపయోగించండి. మీరు మాటిమాటికి చెప్పడం వలన అది మీ మనస్సులోను, హృదయంలోను నాటుకుంటుంది, అంతేకాక, అది యితరులకు కూడ ప్రయోజనం చేకూర్చుతుంది.
15 వివరాల్లో ఆసక్తి చూపించండి: మీరు ప్రొక్లైమర్స్ పుస్తకం చదివే వేళలు ఆనందించగలవై, ప్రయోజనం పొందగలవై ఉండాలి.
16 మీ కుటుంబం యెహోవాసాక్షుల ప్రపంచ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించడానికి మీరు యిష్టపడతారా? ఒక శతాబ్దం క్రితం పిట్స్బర్గ్లో సొసైటీ ఉపయోగించిన సౌకర్యాలను 208-9 పేజీలు చూపిస్తున్నాయి. తర్వాత బ్రూక్లిన్లో ఉపయోగించిన భవనాలను 216-17 పేజీలు మీకు పరిచయం చేస్తాయి. నేటి ప్రపంచ ప్రధాన కార్యాలయాన్ని మీరు ఊహించడానికి 352-6 పేజీల్లోని చిత్రాలు సహాయపడతాయి. బేతేలులో చేయబడే పనిని గూర్చిన వివరాలతో 26, 27 అధ్యాయాలు నిండి ఉన్నాయి. బేతేలు జీవితాన్ని గూర్చి 295-8 పేజీలు అదనపు సమాచారాన్ని అందిస్తున్నాయి.
17 మనలో చాలామంది అనేక సొసైటీ బ్రాంచీలను సందర్శించలేరు. ప్రొక్లైమర్స్ పుస్తకంలోని 357-401 పేజీలు మిమ్మల్ని ప్రపంచ యాత్రకు తీసుకెళ్తాయి. పుస్తకమంతా వేగంగా తిరగేయనవసరం లేదు. ఒక్కో దేశం వచ్చినప్పుడు కొంత సేపు చూడండి, సంతోషించండి. ఒక్కో స్థలాన్ని గుర్తించడానికి 415-17 పేజీల్లోని ప్రపంచ పటాన్ని ఉపయోగించండి. ఒక్కో బ్రాంచి చిత్రం దగ్గర యివ్వబడిన సమాచారాన్ని చదవండి. పద సూచిక ద్వారా ఒక్కో దేశాన్ని గూర్చిన ఇతర ఆసక్తికరమైన వివరాలను కూడా మీరు చూడగలరు. ఇతర దేశాల్లోని మీ ఆత్మీయ కుటుంబ సభ్యులను తెలుసుకోడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి.
18 ప్రజలు సాంఘికంగా కలుసుకున్నప్పుడు, కొన్నిసార్లు వారి వినోదాల్లో లౌకిక విషయాలను గూర్చిన జ్ఞానం యిమిడి ఉంటుంది. దానికన్నా, ఆధునిక-దిన యెహోవా ప్రజల చరిత్రలోని గమనార్హమైన తేదీలను, సంఘటనలను గూర్చి తెలుసుకోవడం ప్రయోజనకరం కాదా? ప్రొక్లైమర్స్ పుస్తకంలోని 718-23 పేజీల్లో యిలాంటి అనేక వాస్తవాల పట్టీని మీరు చూడవచ్చు. ఆ పట్టీ ప్రాథమిక కార్యకలాపాలను సూచిస్తుంది; దీనితో మీరు యీ పుస్తకం యొక్క యితర భాగాల్లోని వివరాలను జతపరచవచ్చు. మీరు పునరాలోచించడానికి వీటిని ఆధారంగా ఉపయోగించవచ్చు. కుటుంబంలోని చిన్నలు వీటిని త్వరగా కంఠస్థం చేస్తారు. పెద్దవాళ్ళమైన మనలో కొందరు కొంచెం నెమ్మదిగానైనా కంఠస్థం చేసుకోవచ్చు. అయితే మనమందరం దైవపరిపాలనా చరిత్రను తెలుసుకొని ప్రయోజనం పొందగలగడానికి యివన్నీ కావలసిన వివరాలే. మీరు యీ తేదీలను, ప్రాథమిక వాస్తవాలను తెలుసుకున్న తర్వాత, వాటి ఆధారంగా మీ జ్ఞానాన్ని పెంపొందించుకోండి. ఒక్కో సంఘటనను గూర్చిన ఎన్ని వివరాలు గుర్తుతెచ్చుకోగలరో చూడండి. తర్వాత, దేవుని చిత్తాన్ని నిర్వహించిన ఒక్కో సంఘటనలోని భాగాన్ని గూర్చి మాట్లాడండి. తర్వాత, అది మీ స్వంత జీవితంపై ఎలా ప్రభావం చూపిందో, యెహోవా చేస్తున్నదానిలో మీ స్థానమేమిటో చర్చించండి.
19 మీ ముందు తెరవబడిన అవకాశాల కొరకు చూడండి: మీరు జెహోవాస్ విట్నెసెస్—ప్రొక్లైమర్స్ ఆఫ్ గాడ్స్ కింగ్డమ్ అనే పుస్తకాన్ని చదివి చర్చిస్తుండగా, యెషయా 60:22 వ వచనం యొక్క గొప్ప నెరవేర్పు మీ దృష్టికి మరి స్పష్టంగా కనబడుతున్నట్లు మీరు తెలుసుకుంటారు. ఈ పుస్తకం 519 వ పేజీలో యిలా చెబుతుంది: “‘ఒంటరియైనవాడు వేయిమందియగును’ అన్న వాగ్దానం నిశ్చయంగా, ఎంత విస్తారంగా నెరవేరింది! ‘ఒంటరియైనవాడు’ కూడ లేని—50 కన్నా ఎక్కువ దేశాల్లో, 1919 లో ఒక్క యెహోవాసాక్షి కూడా లేని ఒక్కో చోట, వారు ప్రకటించని చోట నేడు వెయ్యికన్నా ఎక్కువమంది యెహోవాను స్తుతించువారు ఉన్నారు. కొన్ని దేశాల్లో దేవుని రాజ్యాన్ని ఆసక్తితో ప్రకటించే యెహోవాసాక్షులు వేవేలకొలది ఉన్నారు, అవును లక్షకన్నా ఎక్కువ మందే ఉన్నారు! ప్రపంచవ్యాప్తంగా, యెహోవాసాక్షులు ‘బలమైన జనముగా’ ఉన్నారు, ఐక్య ప్రపంచ సంఘంగా—ప్రపంచంలో స్వయం-పరిపాలనగల కనీసం 80 దేశాల్లోని ఒక్కొక్క దేశ జనాభాకన్నా ఎక్కువ మందే ఉన్నారు.”
20 రాజ్య పని యొక్క అభివృద్ధి నిశ్చయంగా ముగియలేదు. దానికి బదులుగా యెహోవా అపూర్వమైన పరిమాణంలో యీ పని వేగాన్ని పెంచాడు. ఈ పనిలో మీరెంత వరకు పాలు పంచుకొంటారు? మీ ముందుంచబడిన అన్ని అవకాశాలను గూర్చి మీరు అప్రమత్తంగా ఉన్నారా? ఇతరులు ఏం చేస్తున్నారో మీరు తెలుసుకొనుచుండగా మన దినాల్లో యేసుక్రీస్తు ద్వారా మన ప్రేమగల దేవుడు నడిపించే గొప్ప పనిలో పూర్తిగా పాలుపంచుకోడానికి, మిమ్మల్ని మీరు అందుబాటులో ఉంచడానికి మీ హృదయం ప్రేరేపించును గాక.