మనలను మనం ఇష్టపూర్వకంగా అర్పించుకోవడం
1 యెహోవా ప్రజలు “తమ్మును తాము ఇష్టపూర్వకముగా అర్పించుకుంటారు” అంటే “తక్షణ స్వచ్ఛంద సేవకులుగా” అర్పించుకుంటారని కీర్తన గ్రంథకర్తయైన దావీదు ప్రవచించాడు. (కీర్త. 110:3, NW అధఃస్సూచి) మన ప్రపంచవ్యాప్త సహోదరుల్లో ఇది నెరవేరుతోందన్నది నిజమే. గత నాలుగు సేవా సంవత్సరాల్లో యెహోవా ప్రజలు రాజ్య సువార్తను ప్రకటించడంలో సంవత్సరానికి నూరుకోట్ల గంటలకంటే ఎక్కువ సమయాన్ని గడిపారు. ఇతరులకు సహాయపడడంలో ఇష్టపూర్వకంగా మనలను మనం అర్పించుకోవడంలో ప్రకటించి, శిష్యులను తయారుచేసే పనికి తోడుగా అనేక ఇతర మార్గాలున్నాయి.
2 మన ఇష్టతను కనపర్చే మార్గాలు: కూటాలకు హాజరవ్వడానికి సంఘంలోవున్న కొందరికి సహాయం అవసరం కావచ్చు. వారిని మీతో తీసుకువెళ్ళేందుకు ఎందుకు ప్రయత్నించకూడదు? మరికొందరు అనారోగ్యంతోగానీ, కదలలేని స్థితిలోగానీ ఉండవచ్చు, లేక ఆసుపత్రిలో ఉండవచ్చు. వారిని సందర్శించేందుకో లేక ఏదోక రీతిలో వారికి సహాయపడేందుకో మీరు చొరవ తీసుకోగలరా? ప్రోత్సాహం అవసరమైన ఒక వ్యక్తిగానీ ఓ కుటుంబంగానీ ఉండవచ్చు. అప్పుడప్పుడు మీ కుటుంబ పఠనానికి చేరమని అలాంటి వారిని కూడా ఆహ్వానించాలని మీరనుకున్నారా? బహుశ ఓ పయినీరుకో ఓ ప్రచారకునికో పరిచర్యలో తోడు కావాల్సివుందేమో. సేవలో కలిసి పనిచేద్దామని మీరెందుకు అనకూడదు? విశ్వాస గృహంలోని మన సంబంధులకు స్వచ్ఛందంగా మేలు చేయడంలోని కొన్ని మార్గాలివి.—గల. 6:10.
3 పెద్దలకూ పరిచారకులకూ అవసరమైన అర్హతలను చేరుకునేందుకు గట్టి కృషిచేయడం ద్వారా యెహోవా సంస్థ తమను ఉపయోగించాలనే తమ ఇష్టతను సహోదరులు కనపర్చవచ్చు. (1 తిమో. 3:2-10, 12, 13; తీతు 1:5-9) మన సంఖ్య పెరుగుతున్నకొలదీ, ప్రకటించడమూ బోధించడమూ మరియు సంఘాలను కాయడం వంటి విషయాల్లో ఇష్టపూర్వకంగా నడిపింపునిచ్చే అర్హతగల సహోదరుల అవసరం ఉంది.—1 తిమో. 3:1.
4 బహుశ మనలో కొందరు అప్పుడప్పుడు సహాయ పయినీర్లుగా పనిచేయడం ద్వారా, యెహోవా సేవలో ఎక్కువ చేసేందుకు మనలను మనం సంసిద్ధం చేసుకోవచ్చు. మరి మన కార్యక్రమంలో సమంజసమైన సర్దుబాటు కొంతమేరకు చేసుకుంటే, బహుశ దాన్ని అలాగే కొనసాగించవచ్చు లేక క్రమపయినీరు సేవను చేపట్టవచ్చు. మన పరిస్థితులు, సహాయం ఎక్కువగా అవసరమున్న ప్రాంతానికి మనం వెళ్ళగల్గేట్లు ఉన్నాయా? ప్రపంచవ్యాప్త పని అభివృద్ధి చెందడానికి నేరుగా దోహదపడుతూ బేతేలులో సేవచేసేందుకు మనం సంసిద్ధులంగా ఉండగలమా? ప్రపంచమంతటా రాజ్యమందిర నిర్మాణాలూ, అసెంబ్లీ హాలుల నిర్మాణాలూ బ్రాంచి భవనాల నిర్మాణాల విషయంలో కూడా ఎంతో పని జరుగుతోంది. పని చేసేందుకు సిద్ధమనస్సు ఉన్నవారి అవసరత అక్కడ ఎక్కువగా ఉంది. ఈ చక్కని పనుల కొరకు తమను తాము అర్పించుకున్నవారిని ఎంతగానో మెచ్చుకోవడం జరుగుతోంది అంతేకాకుండా వారు గొప్ప ఆశీర్వాదాలను పొందుతున్నారు కూడా!—లూకా 6:38.
5 ఇవి ఎంతో ఉత్సాహభరితమైన సమయాలు. యెహోవా తన ఆత్మ ద్వారా, భూమిపైనవున్న ఇష్టపూర్వకంగా అర్పించుకునే తన ప్రజలనుపయోగించి అద్భుతమైన పనిని సాధిస్తున్నాడు! యెహోవా తన సంస్థ ద్వారా రాజ్య పనిలో ఎక్కువ చేయమని మనలను ఆహ్వానించినప్పుడు, ‘ఇప్పటికీ నన్ను నేను ఇష్టపూర్వకంగా అర్పించుకుంటున్నానా?’ అని ప్రశ్నించుకోవడం మంచిది. ఆ తర్వాత మనం ప్రార్థనా పూర్వకంగా మన హృదయాన్నీ, పరిస్థితులనూ పరిశీలించి చూసుకోవాలి. పరిశుద్ధ సేవలో మనం చేయగల్గినదంతా చేసేలా మన దైవిక సమర్పణ మనలను పురికొల్పుతుంది, అప్పుడది యెహోవా హృదయాన్ని సంతోషపరుస్తుంది!—జెఫ. 3:17.