బైబిలు పఠనాన్ని ఎవరు అంగీకరించవచ్చు?
1 ఇశ్రాయేలు దేశంలో క్షామం ఉంటుందని ప్రవక్తయైన ఆమోసు తెలియజేశాడు, “అది అన్న పానములు లేకపోవుటచేత కలుగు క్షామముకాక యెహోవా మాటను వినకపోవుటవలన కలుగు క్షామముగా ఉండును.” (ఆమో. 8:11) ఎవరైతే ఆధ్యాత్మికంగా ఆకలిదప్పులతో ఉన్నారో వారి ప్రయోజనార్థమై, యెహోవా సంస్థ విస్తారమైన బైబిలు సాహిత్యాలను ప్రపంచవ్యాప్తంగా పంచిపెడుతూ ఉంది.
2 ఇప్పటివరకూ, మనం 7 కోట్ల జ్ఞానము పుస్తకాలు, 9 కోట్ల 10 లక్షల దేవుడు కోరుతున్నాడు బ్రోషూర్లను ముద్రించాము. సత్యాన్ని బోధించేటప్పుడు, సరళమైన, ప్రభావవంతమైన ఈ ప్రచురణల పట్ల మనం మెప్పుదల కలిగివుంటాము. అయితే, మన ప్రచురణలను పొందిన అనేకమంది ప్రజలు ఇంకా మనతో పఠనాన్ని ప్రారంభించలేదు. దీని విషయమై మనమేమి చేయవచ్చు?
3 సాహిత్యం అందించిన ప్రతీచోట బైబిలు పఠనాన్ని ప్రారంభించవచ్చు! మొదటిసారి మాట్లాడినప్పుడే, బైబిలు పఠనాన్ని ప్రతిపాదించిన ఒక ప్రచారకుని అనుభవాన్ని పరిశీలించండి. ఆమె వెంటనే అంగీకరించింది. “బైబిలు పఠనం నిర్వహిస్తానని చెప్పిన మొదటి వ్యక్తివి నీవే” అని ఆమె అతనితో చెప్పింది. మీ ప్రాంతంలో, ఇప్పటికే మన సాహిత్యం ఉన్న ఎంతమంది ప్రజలు అలా చెబుతున్నారు? సాహిత్యాన్ని అందించిన ప్రతీచోట పునర్దర్శనం, బైబిలు పఠనం ఏర్పడే అవకాశం ఉంది.
4 ఇప్పటికే మన ప్రచురణలు ఉన్న ప్రజలు మనకు తరచు తారసపడుతుంటారు గనుక, మన ప్రచురణల్లో ఏమి ఉందో నేర్చుకొనేందుకు ఎలా వారి ఆసక్తిని రేకెత్తించగలం? గృహస్థురాలికి ఏమైనా బైబిలు ప్రశ్నలు ఉన్నాయా అని ఒక సాక్షి అడిగినప్పుడు, ఆమె “లేవు” అని చెప్పింది. ఆ సహోదరి పట్టువిడువకుండా “ప్రశ్నలు తప్పకుండా ఉండేవుంటాయి” అన్నది. ఆమెకు ఉన్నాయి, పఠనం ప్రారంభమయ్యింది. వారికి చింత కలిగించే ఏదైనా ప్రశ్న లేదా ఏదైనా విషయమై బైబిలు ఉద్దేశం ఏమై ఉందో నేర్చుకొనేందుకు వారు ఇష్టపడుతున్నారేమో గృహస్థులని ఎందుకు అడగకూడదు? వారికి ఎలాంటి సందేహమూ లేనప్పుడు మీరే ఆసక్తి రేకెత్తించే ప్రశ్నను అడిగేందుకు సిద్ధంగా ఉండండి. అలాంటి చర్చలు, ప్రాథమిక బైబిలు సత్యాలను క్రమంగా నేర్చుకొనేందుకు మార్గాన్ని సిద్ధం చేస్తాయి.
5 బైబిలు పఠన పని మన పరిచర్యకు కేంద్రమై ఉంది. బైబిలు పఠనాన్ని ఎవరు అంగీకరిస్తారో మనకు తెలియదు కాబట్టి, మనం కలిసే ప్రతి ఒక్కరికీ బైబిలు పఠనాన్ని ప్రతిపాదించటానికి వెనుకాడవద్దు. విషయాన్ని ప్రార్థనలో యెహోవా ఎదుటకి తీసుకువెళ్ళి, ప్రార్థనకు అనుగుణ్యంగా మీరు పనిని కూడా చేయండి. మీరు పఠనాన్ని ప్రతిపాదించినప్పుడు అంగీకరించే వారిని మీరు త్వరలో కనుగొంటారు!—1 యోహా. 5:14, 15.