కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w97 5/1 పేజీలు 13-18
  • అబద్ధ సందేశకులకు శాంతి ఉండదు!

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • అబద్ధ సందేశకులకు శాంతి ఉండదు!
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • శాంతి సందేశకులని పిలువబడేవారు
  • ఐక్యరాజ్య సమితి శాంతి సంధాతగానా?
  • ‘ఘోరంగా ఏడవడానికి’ కారణాలు
  • ఆశ్చర్యకరమైన మర్మము బయల్పర్చబడింది
    ప్రకటన—దాని దివ్యమైన ముగింపు సమీపించింది
  • దైవిక శాంతి సందేశకులుగా సేవచేయడం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • నిజమైన శాంతి—ఏ మూలం నుండి?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • సరైన సందేశకుడిని గుర్తించడం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
w97 5/1 పేజీలు 13-18

అబద్ధ సందేశకులకు శాంతి ఉండదు!

“కీడు చేయువారు నిర్మూలమగుదురు . . . దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, బహు క్షేమము [“శాంతి,” NW] కలిగి సుఖించెదరు.”—కీర్తన 37:9, 11.

1. “అంత్యకాలము”లో మనం నిజమైన మరియు అబద్ధ సందేశకులను కనుగొంటామని ఎందుకు అపేక్షించవచ్చు?

అబద్ధ సందేశకులా లేక నిజమైన సందేశకులా? బైబిలు కాలాల్లో రెండు రకాల వాళ్లూ ఉన్నారు. కాని మన కాలం మాటేమిటి? ఒక పరలోక సందేశకుడు దేవుని ప్రవక్తకు ఇలా చెప్పడాన్ని దానియేలు 12:9, 10 నందు మనం చదవవచ్చు: “ఈ సంగతులు అంత్యకాలమువరకు మరుగుగా ఉండునట్లు ముద్రింపబడినవి. . . . అనేకులు తమ్మును శుద్ధిపరచుకొని ప్రకాశమానులును నిర్మలులును అగుదురు. దుష్టులు దుష్టకార్యములు చేయుదురు గనుక ఏ దుష్టుడును ఈ సంగతులను గ్రహింపలేకపోవును గాని బుద్ధిమంతులు గ్రహించెదరు.” ఇప్పుడు మనం ఆ “అంత్యకాలము”లో జీవిస్తున్నాము. ‘దుష్టులకు’ ‘బుద్ధిమంతులకు’ మధ్య మనం స్పష్టమైన వ్యత్యాసాన్ని చూస్తున్నామా? తప్పక చూస్తాము!

2. నేడు యెషయా 57:20, 21 ఎలా నెరవేరుతోంది?

2 దేవుని సందేశకుడైన యెషయా మాటలను 57వ అధ్యాయం 20, 21 వచనాల్లో మనమిలా చదువుతాము: “భక్తిహీనులు కదలుచున్న సముద్రమువంటివారు, అది నిమ్మళింపనేరదు. దాని జలములు బురదను మైలను పైకివేయును. దుష్టులకు నెమ్మదియుండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు.” ఈ ప్రపంచం 21వ శతాబ్దానికి చేరుకుంటుండగా ఈ మాటలు దాన్ని ఎంత కచ్చితంగా వర్ణిస్తున్నాయోకదా! ‘మనమెన్నడైనా ఆ శతాబ్దాన్ని చేరుకుంటామా?’ అని కొందరడుగుతారు కూడా. బుద్ధిమంతులైన సందేశకులు మనకేమి చెప్పాలనుకుంటున్నారు?

3. (ఎ) మొదటి యోహాను 5:19 నందు ఏ వ్యత్యాసం చూపించబడింది? (బి) ప్రకటన 7వ అధ్యాయంలో “బుద్ధిమంతులు” ఎలా వర్ణించబడ్డారు?

3 అపొస్తలుడైన యోహానుకు దైవికంగా ప్రేరేపించబడిన అంతర్దృష్టి ఉంది. 1 యోహాను 5:19 నందు ఇలా చెప్పబడింది: “మనము దేవుని సంబంధులమనియు, లోకమంతయు దుష్టుని యందున్నదనియు ఎరుగుదుము.” ఆత్మీయ ఇశ్రాయేలీయులైన 1,44,000 మంది ఈ ప్రపంచం నుండి భిన్నంగా ఉన్నారు, వృద్ధులౌతున్న వీరి శేషములోనివారు ఇప్పుడు ఇంకా మనతో ఉన్నారు. ‘ప్రతి జనములోనుండి, ప్రతివంశములోనుండి, ప్రజలలో నుండి, ఆ యా భాషలు మాటలాడువారిలోనుండి వచ్చిన గొప్ప సమూహంవారు’ నేడు వీరితో కలుస్తున్నారు, వారిప్పుడు 50 లక్షలకంటే ఎక్కువమంది ఉన్నారు, వారికి కూడా అంతర్దృష్టి ఉంది. ‘వారు మహాశ్రమల నుండి వచ్చేవారు.’ వారికి ఎందుకు ప్రతిఫలమివ్వబడింది? ఎందుకంటే వారు కూడా యేసు విమోచన బలియందు విశ్వాసముంచడం ద్వారా, ‘గొఱ్ఱెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకున్నారు.’ వెలుగు సందేశకులుగా, వారు కూడా ‘రాత్రింబగళ్లు దేవునికి పరిశుద్ధ సేవచేస్తున్నారు.’—ప్రకటన 7:4, 9, 14, 15.

శాంతి సందేశకులని పిలువబడేవారు

4. (ఎ) సాతాను ప్రపంచంలోని శాంతి సందేశకులని పిలువబడుతున్నవారు ఎందుకు విఫలమౌతున్నారు? (బి) ఎఫెసీయులు 4:18, 19 నేడు ఎలా అన్వయించబడుతుంది?

4 సాతాను లోక విధానంలో శాంతి సందేశకులని పిలువబడేవారి విషయమేమిటి? యెషయా 33వ అధ్యాయం 7వ వచనంలో మనమిలా చదువుతాము: “వారి శూరులు బయట రోదనము చేయుచున్నారు; సమాధాన రాయబారులు ఘోరముగా ఏడ్చుచున్నారు.” శాంతి తీసుకురావాలని ప్రయత్నిస్తూ ప్రపంచ రాజధానులలో ఒకదాని తర్వాత ఒకదాని దగ్గరికి ఆత్రంగా పరుగులు తీస్తున్నవారి విషయంలో ఇదెంత నిజమో కదా! ఎంత నిష్ప్రయోజనకరం! ఎందుకలా? ఎందుకంటే వారు ప్రపంచ సమస్యల మూల కారణాలతో పోరాడే బదులు వాటి లక్షణాలతో మాత్రమే తలపడుతున్నారు. మొదటగా, అపొస్తలుడైన పౌలు ‘ఈ యుగ సంబంధమైన దేవత’ అని వర్ణిస్తున్న సాతాను ఉనికి గురించి వారికి తెలియదు. (2 కొరింథీయులు 4:4) మానవజాతి మధ్య సాతాను దుష్టత్వపు విత్తనాలను నాటాడు, తత్ఫలితంగా అనేకమంది పరిపాలకులతోసహా అత్యధికులు, ఎఫెసీయులు 4:18, 19 నందలి ఈ వర్ణనకు ఇప్పుడు సరిపోతారు: “వారైతే అంధకారమైన మనస్సుగలవారై, తమహృదయ కాఠిన్యమువలన తమలోనున్న అజ్ఞానముచేత దేవునివలన కలుగు జీవములోనుండి వేరుపరచబడినవారై, తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. వారు సిగ్గులేనివారైయుండి నానావిధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మునుతామే కాముకత్వమునకు అప్పగించుకొనిరి.”

5. (ఎ) శాంతి సంధాతలుగా మానవ సంస్థలు ఎందుకు విఫలమౌతున్నాయి? (బి) కీర్తన 37 ఏ ఓదార్పుకరమైన సందేశాన్ని అందజేస్తుంది?

5 అపరిపూర్ణ మానవుల ఏ మూలము కూడా మానవుల హృదయాల్లో నుండి నేడు విస్తృతంగా వ్యాపించివున్న దురాశను, స్వార్థాన్ని, ద్వేషాన్ని తీసివేయలేదు. మన సృష్టికర్తా, సర్వోన్నత ప్రభువైన యెహోవా మాత్రమే అలా చేయగలడు! అంతేగాక, దీనులే అంటే మానవజాతిలోని కేవలం తక్కువమంది మాత్రమే ఆయన నడిపింపుకు లోబడడానికి ఇష్టపడుతున్నారు. వీరికి లభించే ఫలితాలకు, ఈ లోకంలోని దుష్టులకు లభించే ఫలితాలకు ఉన్న వ్యత్యాసాన్ని కీర్తన 37:9-11 నందు ఇలా చూపించబడింది: “కీడు చేయువారు నిర్మూలమగుదురు, యెహోవాకొరకు కనిపెట్టుకొనువారు దేశమును స్వతంత్రించుకొందురు. ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవుదురు, . . . దీనులు భూమిని స్వతంత్రించుకొందురు బహు క్షేమము [“శాంతి,” NW] కలిగి సుఖించెదరు.”

6, 7. శాంతి సందేశాన్నిచ్చేవిగా పనిచేయడంలో ప్రపంచ మతాలు విఫలమయ్యాయని వాటి ఏ వృత్తాంతం చూపిస్తుంది?

6 మరి రోగగ్రస్థమౌతున్న ఈ ప్రపంచ మతాల్లో శాంతి సందేశకులను కనుగొనవచ్చా? అయితే, ఇప్పటి వరకు మతానికున్న చరిత్ర ఏమిటి? శతాబ్దాల కాలంలో జరిగిన రక్తపాతంలో మతం భాగం వహించిందని అవును, అదే దానికి ఎక్కువగా కారణమని చరిత్ర చూపిస్తుంది. ఉదాహరణకు, మునుపటి యుగోస్లావియాలో జరిగిన అల్లకల్లోలం గురించి నివేదిస్తూ 1995 ఆగస్టు 30తో ప్రారంభమయ్యే వారానికి చెందిన క్రిస్టియన్‌ సెంచురి ఇలా తెలియజేసింది: “సెర్బులు ఆధిపత్యం వహిస్తున్న బోస్నియాలో, ప్రీస్టులు స్వయం నియమిత పార్లమెంటులోని ముందు వరుసల్లో కూర్చుంటారు, యుద్ధారంభానికి ముందు సైన్యాలు మరియు ఆయుధాలు ఆశీర్వదించబడే యుద్ధ రంగంలోనూ వారుంటారు.”

7 ఆఫ్రికాలో క్రైస్తవమత సామ్రాజ్య మిషనరీలు ఒక శతాబ్దంపాటు చేసిన పని ఏ మంచి ఫలితాలనూ తీసుకురాలేదు, 80 శాతం మంది కాథోలిక్కులు ఉన్నట్లు పేరుపొందిన దేశమైన రువాండాలో ఇది చక్కగా ఉదాహరించబడింది. 1995 జూలై 7కు చెందిన ది న్యూయార్క్‌ టైమ్స్‌ ఇలా నివేదించింది: “ల్యాన్స్‌ [ఫ్రాన్సు] నందు ప్రచురించబడే విశాల దృక్పథంగల, సామాన్యులకు చెందిన గాల్యా అనే కాథోలిక్‌ పత్రిక, గత సంవత్సరం రువాండాలో హత్యలు చేశారని లేక హత్య చేయడానికి ప్రోత్సహించారని అది చెబుతున్న రువాండాకు చెందిన మరి 27 మంది ప్రీస్టులు మరియు నలుగురు నన్‌ల పేర్లను తెలియజేయడానికి పథకం వేసింది.” లండన్‌ నందలి మానవ హక్కుల సంస్థయైన ఆఫ్రికన్‌ రైట్స్‌ ఇలా వ్యాఖ్యానించింది: “చర్చీలు తాము నిశ్శబ్దంగా ఉన్నందుకు జవాబివ్వడం కంటే, దాని ప్రీస్టులు, పాస్టర్లు, నన్‌లు కొంతమంది జనసంహారంలో చురుకుగా భాగం వహించినందుకు ఎక్కువగా జవాబివ్వవలసి ఉంది.” “నిర్దోషులైన దీనుల ప్రాణరక్తము నీ బట్ట చెంగులమీద కనబడుచున్నది” అని చెబుతూ, దాని పాలకులు, దాని యాజకులు, దాని ప్రవక్తలతోపాటు ఇశ్రాయేలు యొక్క “సిగ్గు” గురించి యెహోవా నిజ సందేశకుడైన యిర్మీయా వర్ణించినప్పుడు ఇశ్రాయేలులో ఉన్న పరిస్థితితో అది సారూప్యం కలిగివుంది.—యిర్మీయా 2:26, 34.

8. యిర్మీయా శాంతి సందేశకుడని ఎందుకు చెప్పవచ్చు?

8 యిర్మీయా తరచూ నాశనాన్ని ప్రకటించే ప్రవక్తగా పిలువబడ్డాడు, కాని ఆయనను దేవుని శాంతి సందేశకుడు అని కూడా పిలువవచ్చు. ఆయన కంటే ముందు యెషయా శాంతి గురించి ఎంత తరచుగా చెప్పాడో ఈయన కూడా అంత తరచుగానే చెప్పాడు. “నా కోపము రేపుటకు ఇశ్రాయేలువారును యూదా వారును వారి రాజులును వారి ప్రధానులును వారి యాజకులును వారి ప్రవక్తలును యూదా జనులును యెరూషలేము నివాసులును చూపిన దుష్‌ప్రవర్తన అంతటినిబట్టి, నా యెదుటనుండి వారి దుష్‌ప్రవర్తనను నేను నివారణచేయ ఉద్దేశించునట్లు, వారు ఈ పట్టణమును కట్టిన దినము మొదలుకొని ఇదివరకును అది నాకు కోపము పుట్టించుటకు కారణమాయెను” అని చెబుతూ యెరూషలేముపై తీర్పును ప్రకటించడానికి యెహోవా యిర్మీయాను ఉపయోగించుకున్నాడు. (యిర్మీయా 32:31, 32) నేడు క్రైస్తవమత సామ్రాజ్యంలోని పాలకులపై, మతనాయకులపై యెహోవా తీర్పుకు ఇది ముంగుర్తుగా ఉంది. నిజమైన శాంతి వ్యాపించాలంటే, చెడుతనాన్ని, దౌర్జన్యాన్ని పురికొల్పే వీరు నిర్మూలించబడాలి! వారు శాంతి సందేశకులు ఎంతమాత్రం కాదు.

ఐక్యరాజ్య సమితి శాంతి సంధాతగానా?

9. ఐక్యరాజ్య సమితి తనను తాను శాంతి సందేశాన్నిచ్చే దానిగా ఎలా చెప్పుకుంది?

9 ఐక్యరాజ్య సమితి నిజమైన శాంతి సంధాత కాలేదా? హిరోషిమాను అణుబాంబు నాశనం చేయడానికి కేవలం 41 రోజుల ముందు, 1945 జూన్‌లో సమర్పించబడిన దాని చార్టర్‌ యొక్క ప్రవేశిక, “ముందు తరాల వారిని యుద్ధ మహామారి నుండి కాపాడడం” దాని సంకల్పమని తెలియజేసింది. ఐక్యరాజ్య సమితి యొక్క 50 భావి సభ్య దేశాలు “అంతర్జాతీయ శాంతి భద్రతలను కాపాడడానికి [తమ] బలాన్ని ఐక్యపర్చవలసివుంది.” నేడు ఐక్యరాజ్య సమితిలో 185 సభ్య దేశాలు ఉన్నాయి, అవన్నీ ఆ సంకల్పం నిమిత్తమే సమర్పించబడినట్లు చెప్పబడుతుంది.

10, 11. (ఎ) మత నాయకులు ఐక్యరాజ్య సమితికి తమ మద్దతును ఎలా తెలియజేశారు? (బి) “దేవుని రాజ్య సువార్త”కు పోప్‌లు ఏ విధంగా తప్పుగా వర్ణించారు?

10 గడిచిన సంవత్సరాల్లో ఐక్యరాజ్య సమితి బిగ్గరగా స్తుతించబడింది, ప్రాముఖ్యంగా మత నాయకులు దాన్ని స్తుతించారు. 1963 ఏప్రిల్‌ 11న, “పాకెమ్‌ ఇన్‌ టెరిస్‌” (భూమిపై శాంతి) అనే పేరుగల తన పత్రంపై పోప్‌ జాన్‌ XXIII సంతకం చేశాడు, దానిలో ఆయనిలా తెలియజేశాడు: “ఐక్యరాజ్య సమితి దాని నిర్మాణంలోనూ వనరులలోనూ దాని పనులకు సంబంధించిన విస్తారతకు ఉదాత్తతకు సమానం కావాలన్నది మా హృదయపూర్వక కోరిక.” ఆ తర్వాత, 1965 జూన్‌లో, ప్రపంచ జనాభాలోని సగం వంతుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారని చెప్పబడుతున్న మతనాయకులు ఐక్యరాజ్య సమితి యొక్క 20వ జన్మదినాన్ని సాన్‌ ఫ్రాన్సిస్‌కోలో జరుపుకున్నారు. అంతేగాక 1965లో ఐక్యరాజ్య సమితిని దర్శించినప్పుడు పోప్‌ పాల్‌ VI దాన్ని “శాంతి సామరస్యాలకు అంతిమ నిరీక్షణ” అని వర్ణించాడు. 1986లో, ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ శాంతి సంవత్సరాన్ని ప్రచారం చేయడంలో పోప్‌ జాన్‌ పాల్‌ II సహకరించాడు.

11 మళ్లీ, 1995 అక్టోబరులో తన సందర్శన సమయంలో పోప్‌ ఇలా ప్రకటించాడు: “నేడు మనం దేవుని రాజ్య సువార్తను వేడుక చేసుకుంటున్నాము.” కాని నిజంగా ఆయన దేవుని రాజ్య సువార్త సందేశకుడేనా? ప్రపంచ సమస్యల గురించి మాట్లాడుతూ, ఆయనిలా చెప్పుకుపోయాడు: “మనం ఈ అపరిమితమైన సవాళ్లను ఎదుర్కొంటుండగా, ఐక్యరాజ్య సమితి పాత్రను మనమెలా గుర్తించకుండా ఉండగలము?” పోప్‌ దేవుని రాజ్యానికి బదులుగా ఐక్యరాజ్యసమితిని ఎంపిక చేసుకున్నాడు.

‘ఘోరంగా ఏడవడానికి’ కారణాలు

12, 13. (ఎ) యిర్మీయా 6:14 నందు వర్ణించబడిన విధంగా ఐక్యరాజ్య సమితి ఎలా ప్రవర్తించింది? (బి) యెషయా 33:7 నందలి వర్ణనలో ఐక్యరాజ్య సమితి నాయకత్వం కూడా ఎందుకు ఇమిడివుంది?

12 ఐక్యరాజ్య సమితి యొక్క 50వ వార్షికోత్సవాన్ని జరుపుకోవడం, “భూమిపై శాంతి”కి సంబంధించిన ఏ నిజమైన ఉత్తరాపేక్షను బయల్పర్చలేదు. కెనడాకు చెందిన ది  టోరన్‌టో స్టార్‌ నందు ఒక రచయిత ఒక కారణాన్ని సూచించాడు, ఆయనిలా వ్రాశాడు: “ఐక్యరాజ్య సమితి పళ్లులేని సింహంలాంటిది, మానవ పాశవికతను ఎదుర్కొన్నప్పుడు అది గర్జిస్తుంది, కాని అది కరవాలంటే ముందు దాని సభ్యులు దానికి కట్టుడు పళ్లు పెట్టాలి.” తరచుగా ఆ కరవడం కూడా మరీ బలహీనంగా, మరీ ఆలస్యంగా జరిగింది. ప్రస్తుత ప్రపంచ విధానంలో శాంతి సందేశకులు, ప్రాముఖ్యంగా క్రైస్తవమత సామ్రాజ్యంలో ఉన్నవారు యిర్మీయా 6:14 నందలి ఈ మాటలను ప్రతిధ్వనింపజేస్తున్నారు: “సమాధానములేని సమయమున—సమాధానము సమాధానమని చెప్పుచు, నా ప్రజలకున్న గాయమును పైపైన మాత్రమే బాగుచేయుదురు.”

13 ఐక్యరాజ్య సమితిని విజయవంతం చేయాలని ఐక్యరాజ్య సమితికి చెందిన క్రమాగత సెక్రెటరీ జనరల్‌లు యథార్థంగా కృషి చేశారనడంలో సందేహం లేదు. కాని యుద్ధాన్ని ఎలా అదుపు చేయాలి, పథకాలను ఎలా వేసుకోవాలి, ఆర్థిక వనరులను ఎలా ఉపయోగించాలి అనేవాటి గురించి వివిధ సంకల్పాలుగల 185 మంది సభ్యుల మధ్య ఎడతెగక కొనసాగుతున్న కలహం, విజయం సాధించగల ఉత్తరాపేక్షలకు అవరోధం కల్గించింది. 1995 కొరకైన తన వార్షిక నివేదికలో, అప్పటి సెక్రెటరీ జనరల్‌, “మానవజాతంతటి ఆర్థిక మరియు సామాజిక అభివృద్ధి కొరకు దేశాలు కలిసి పని చేయడానికి” మార్గాన్ని తెరవడంగా “భూగోళ అణు భూతాన్ని” వెనుకకు మళ్లించడం గురించి వ్రాశాడు. కాని ఆయనింకా ఇలా జత చేశాడు: “దుఃఖకరంగా, గత కొద్ది సంవత్సరాల్లో ప్రపంచ వ్యవహారాల నివేదిక ఆ ఆశాజనక నిరీక్షణలను ఎంతగానో వమ్ము చేసింది.” నిజంగా, శాంతి సందేశకులు కాగలవారు ‘ఘోరంగా ఏడుస్తున్నారు.’

14. (ఎ) ఐక్యరాజ్య సమితి ఆర్థికంగానూ నైతికంగానూ దివాళా తీసిందని ఎందుకు చెప్పవచ్చు? (బి) యిర్మీయా 8:15 ఎలా నెరవేరుతోంది?

14 కాలిఫోర్నియాకు చెందిన ది ఆరెంజ్‌ కౌంటీ రెజిస్టర్‌ పతాక శీర్షిక ఇలా తెలియజేసింది: “ఐక్యరాజ్య సమితి ఆర్థికంగా, నైతికంగా దివాలా తీసింది.” 1945 నుండి 1990 మధ్య కాలంలో 80 కంటే ఎక్కువ యుద్ధాలు జరిగాయని, అవి మూడు కోట్లకంటే ఎక్కువమంది ప్రాణాలను బలిగొన్నాయని ఆ శీర్షిక తెలియజేసింది. “ఐక్యరాజ్య సమితి యొక్క సైనిక కార్యకలాపాలు ‘సామర్థ్యం లేని కమాండర్లు, క్రమశిక్షణలేని సైనికులు, దురాక్రమణదారులతో మైత్రి, దారుణకృత్యాలను నివారించడంలో విఫలమవ్వడం, చివరికి కొన్నిసార్లు భీతికి దోహదపడడం’ అనే లక్షణాలతో గుర్తింపబడ్డాయని, అంతేగాక ‘వ్యర్థపర్చడం, మోసం, దుర్వినియోగం యొక్క స్థాయి విపరీతంగా ఉందని’ వివరిస్తున్న” రచయిత మాటలను అది రీడర్స్‌ డైజెస్ట్‌ 1995 అక్టోబరు సంచికలో ఎత్తివ్రాసింది. “ఐక్యరాజ్య సమితి యాభైలలో” అనే పేరుగల సెక్షన్‌ క్రింద ది న్యూయార్క్‌ టైమ్స్‌ “దుర్వ్యవహారం మరియు వ్యర్థం చేయడం ఐక్యరాజ్య సమితి యొక్క మంచి ఉద్దేశాలను హరించివేశాయి” అనే పతాక శీర్షికను ప్రచురించింది. “యాభ్బైలలో దుర్భలత—తన రూపాన్ని తిరిగి పొందడానికి ఐక్యరాజ్య సమితికి వ్యాయామం అవసరం” అనే మాటలను ఇంగ్లాండ్‌లోని లండన్‌కు చెందిన ది టైమ్స్‌ ఒక వ్యాసానికి శీర్షికగా ఉపయోగించింది. వాస్తవంగా, అది యిర్మీయా 8వ అధ్యాయం, 15వ వచనంలో మనం చదివేలా ఇలా ఉంది: “మనము సమాధానము కొరకు కనిపెట్టుకొనుచున్నాము గాని మేలేమియు రాదాయెను; క్షేమముకొరకు కనిపెట్టుచున్నాముగాని భీతియే కలుగుచున్నది అని చెప్పుదురు.” అణు విధ్వంసం యొక్క విపత్తు ఇంకా మానవజాతిని భయపెడుతూనే ఉంది. ఐక్యరాజ్య సమితి మానవజాతికి అవసరమైన శాంతి సందేశాన్నిచ్చేది కాదన్నది స్పష్టమౌతుంది.

15. ప్రాచీన బబులోను, దాని మతసంబంధమైన సంతానమూ నాశనకరమైనవిగా, మత్తుకల్గించేవిగా ఎలా నిరూపించబడ్డాయి?

15 దీనంతటి ఫలితమేమై ఉంటుంది? యెహోవా ప్రవచనార్థక వాక్యం ఎంతో స్పష్టంగా ఉంది. మొట్టమొదటిగా, ఐక్యరాజ్య సమితితో తరచూ మరీ స్నేహపూర్వకంగా ఉంటున్న ప్రపంచ అబద్ధ మతాల కొరకు ఏమి వేచివుంది? అవి విగ్రహారాధికురాలైన ఒకే మూలమగు ప్రాచీన బబులోను నుండి ఉత్పన్నమైనవే. దానికి తగినట్లుగానే అవి ప్రకటన 17:5 నందు, “వేశ్యలకును భూమిలోని ఏహ్యమైనవాటికిని తల్లియైన మహా బబులోను” అని వర్ణించబడ్డాయి. వేషధారణతో కూడిన ఈ శక్తుల సమ్మేళనం యొక్క నాశనాన్ని యిర్మీయా వర్ణించాడు. ఐక్యరాజ్య సమితిని ప్రలోభ పెట్టి, దాని సభ్యులైన రాజకీయ శక్తులతో అక్రమ సంబంధాలు పెట్టుకుని వేశ్యలా వారు భూ రాజకీయనాయకులను వశపర్చుకున్నారు. చరిత్రలోని యుద్ధాల్లో వారు ప్రముఖ పాత్ర వహించినవారిగా ఉన్నారు. భారతదేశంలోని మతసంబంధమైన యుద్ధకాండ గురించి ఒక వ్యాఖ్యాత ఇలా చెప్పాడు: “మతం సామాన్య ప్రజలకు నల్లమందు లాంటిదని కార్ల్‌ మార్క్స్‌ అన్నాడు. కాని ఆ వ్యాఖ్యానం సరి కాదు, ఎందుకంటే నల్లమందు కృంగదీసేది, అది ప్రజలు స్తబ్ధులయ్యేలా వారికి మత్తుకలుగజేస్తుంది. దానికి బదులుగా, మతం కొకెయిన్‌ వంటి మత్తుపదార్థం. అది విపరీతమైన దౌర్జన్యాన్ని రేకెత్తిస్తుంది, అది ఎంతో నాశనకరమైన శక్తి.” ఆ రచయిత చెప్పింది కూడా అంత సరికాదు. అబద్ధ మతం మత్తు కలుగజేస్తుందీ అలాగే నాశనకరమైనదీ.

16. యథార్థ హృదయంగల ప్రజలు ఇప్పుడు మహాబబులోను నుండి ఎందుకు పారిపోవాలి? (ప్రకటన 18:4, 5 కూడా చూడండి.)

16 కాబట్టి, మరి యథార్థహృదయులు ఏమి చేయాలి? దేవుని సందేశకుడైన యిర్మీయా మనకిలా సమాధానమిస్తున్నాడు: “బబులోనులోనుండి పారిపోవుడి, మీ ప్రాణములు రక్షించుకొనుడి. ఇది యెహోవాకు ప్రతీకారకాలము.” ప్రపంచ అబద్ధమత సామ్రాజ్యమైన మహా బబులోను బంధకాలలో నుండి లక్షలాదిమంది తప్పించుకుని పారిపోయినందుకు మనం ఆనందిస్తాము. వీరిలో మీరొకరా? భూ రాజ్యాలను మహాబబులోను ఎలా ప్రభావితం చేసిందో మీరు బాగా అర్థం చేసుకోవచ్చు: “దానిచేతి మద్యమును అన్యజనులు త్రాగి మత్తిల్లియున్నారు.”—యిర్మీయా 51:6, 7.

17. మహాబబులోనుపై ఏ తీర్పు అమలు చేయబడబోతుంది, ఆ చర్య తర్వాత ఏమి జరుగుతుంది?

17 త్వరలోనే, ఐక్యరాజ్య సమితికి చెందిన “మత్తిల్లి” ఉన్న సభ్యులు అబద్ధమతంపై దాడి చేసేలా యెహోవా వారిని పురికొల్పుతాడు, ప్రకటన 17:16 నందు అదిలా వర్ణించబడింది: “వారు ఆ వేశ్యను ద్వేషించి, దానిని దిక్కులేనిదానిగాను దిగంబరిగాను చేసి, దాని మాంసము భక్షించి అగ్నిచేత దానిని బొత్తిగా కాల్చివేతురు.” ఇది, మత్తయి 24:21 నందు చెప్పబడిన, సర్వశక్తిమంతుడైన దేవుని మహా దినమున జరిగే యుద్ధమైన అర్మగిద్దోను నందు ముగింపుకు చేరే మహా శ్రమ యొక్క ప్రారంభాన్ని సూచిస్తుంది. ప్రాచీన బబులోనులా మహా బబులోను యిర్మీయా 51:13, 25 నందు ప్రకటించబడిన ఈ తీర్పును పొందుతుంది: “విస్తారజలములయొద్ద నివసించుదానా, నిధుల సమృద్ధిగలదానా, నీ అంతము వచ్చినది, అన్యాయలాభము నీకిక దొరకదు—సర్వభూమిని నశింపజేయు నాశనపర్వతమా, నేను నీకు విరోధిని. ఇదే యెహోవా వాక్కు. నేను నీమీదికి నా చేయి చాపి శిలలపైనుండి నిన్ను క్రిందికి దొరలించుదును, చిచ్చుపెట్టిన కొండవలె ఉండజేయుదును.” యెహోవా ప్రతీకార దినం జనాంగాలపైకి కూడా వచ్చినప్పుడు, కలుషితమైన యుద్ధపిపాసులైన దేశాలు అబద్ధమతంతోపాటు నాశనమౌతాయి.

18. యెషయా 48:22 ఎప్పుడు మరియు ఎలా నెరవేరవలసి ఉంది?

18 దుష్టుల గురించి 1 థెస్సలొనీకయులు 5:3 నందు ఇలా చెప్పబడింది: “లోకులు—నెమ్మదిగా ఉన్నది, భయమేమియులేదని చెప్పుకొనుచుండగా, గర్భణిస్త్రీకి ప్రసవవేదన వచ్చునట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు.” “సమాధాన రాయబారులు ఘోరముగా ఏడ్చుచున్నారు” అని యెషయా ఎవరి గురించి చెప్పాడో వారు వీరే. (యెషయా 33:7) వాస్తవానికి, మనం యెషయా 48:22 నందు చదువునట్లు, “దుష్టులకు నెమ్మదియుండదని యెహోవా సెలవిచ్చుచున్నాడు.” కాని దైవిక శాంతి యొక్క నిజమైన సందేశకుల కొరకు ఏ భవిష్యత్తు వేచివుంది? మా తరువాతి శీర్షిక దాన్ని తెలియజేస్తుంది.

పునఃపరిశీలనా ప్రశ్నలు

◻ దేవుని ప్రవక్తలు ఏ శక్తివంతమైన మాటలతో అబద్ధ సందేశకులను బయల్పరిచారు?

◻ నిత్య శాంతిని తీసుకురావాలనే తమ ప్రయత్నంలో మానవ సంస్థలు ఎందుకు విఫలమౌతాయి?

◻ నిజమైన శాంతి సందేశకులకు, ఐక్యరాజ్య సమితికి మద్ధతునిచ్చేవారికి ఏ వ్యత్యాసం ఉంది?

◻ యెహోవా వాగ్దానం చేసిన శాంతినిబట్టి ఆనందాన్ని పొందాలంటే దీనులు ఏమి చేయాలి?

[15వ పేజీలోని చిత్రం]

అల్ప మానవులు చేసే శాంతి ప్రయత్నాల వైఫల్యం గురించి యెషయా, యిర్మీయా, దానియేలులు ప్రవచించారు

[16వ పేజీలోని చిత్రం]

“లోకమంతయు దుష్టునియందున్నది.”—అపొస్తలుడైన యోహాను

[17వ పేజీలోని చిత్రం]

‘వారైతే అంధకారమైన మనస్సుగలవారై ఉన్నారు.’—అపొస్తలుడైన పౌలు

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి