“ప్రతిదానికి సమయము కలదు”
“ప్రతిదానికి సమయము కలదు ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు.”—ప్రసంగి 3:1.
1. అపరిపూర్ణ మానవులు ఏ కష్టాన్ని ఎదుర్కొంటారు, ఇది కొన్ని సందర్భాల్లో దేనికి నడిపించింది?
“నేనది ముందే చేసివుండాల్సింది” అని ప్రజలు తరచుగా అంటుంటారు. లేదా, సింహావలోకనం చేసుకుంటూ, “నేను కాస్త ఆగి ఉండాల్సింది” అనుకుంటారు. కొన్ని పనులు చేయడానికి సరైన సమయం ఏదన్నది నిర్ణయించడంలో అపరిపూర్ణులైన మానవులు అనుభవించే కష్టాన్ని ఇటువంటి తలంపులు ప్రతిబింబిస్తాయి. మానవుల్లోని ఈ అశక్తత వారి మధ్య సంబంధాలు దెబ్బతినేందుకు నడిపించింది. అది నిరాశా నిస్పృహలకు దారి తీసింది. అన్నింటికన్నా ఘోరమైన విషయం ఏమిటంటే అది యెహోవాపైనా ఆయన సంస్థపైనా కొంతమంది ప్రజలకున్న విశ్వాసాన్ని బలహీనపర్చింది.
2, 3. (ఎ) యెహోవా నిర్ణయించిన నియుక్త సమయాలను స్వీకరించడం ఎందుకు వివేకవంతమైన పని? (బి) బైబిలు ప్రవచన నెరవేర్పును గురించి ఎటువంటి సమతుల్యమైన దృక్కోణం మనకు ఉండాలి?
2 మానవుల్లో లోపించిన జ్ఞానమూ అంతర్దృష్టీ ఉన్న యెహోవా, తాను ఇచ్ఛయించినట్లైతే, ప్రతీ చర్యకు రాగల ఫలితాన్ని ముందే తెలుసుకోగలడు. ఆయన “పూర్వకాలమునుండి యింక జరుగనివాటిని” తెలుసుకోగలడు. (యెషయా 46:10) అందుకని, ఆయన ఏమి చేయాలనుకున్నా అందుకు అత్యంత యుక్తమైన సమయాన్ని ఏమాత్రం పొరబాటు చేయకుండా ఎంపిక చేసుకోగలడు. కాబట్టి, సరైన సమయం ఏదన్నది నిర్ణయించే విషయంలో మనలో ఉన్న లోపభూయిష్టమైన శక్తిని నమ్మడానికి బదులుగా, యెహోవా నిర్ణయించిన నియుక్త సమయాలను స్వీకరించడం వివేకవంతమైన పని!
3 ఉదాహరణకు, పరిణతి చెందిన క్రైస్తవులు కొన్ని బైబిలు ప్రవచనాల నెరవేర్పు విషయంలో యెహోవా నియుక్త సమయం కోసం యథార్థతతో వేచివుంటారు. వారాయన సేవలో బిజీగా ఉంటూనే, విలాపవాక్యములు 3:26లోని సూత్రాన్ని మనస్సులో స్పష్టంగా ఉంచుకుంటారు: “నరులు ఆశకలిగి యెహోవా అనుగ్రహించు రక్షణకొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది.” (పోల్చండి హబక్కూకు 3:16.) అదే సమయంలో, యెహోవా ప్రకటించిన తీర్పు యొక్క అమలు, “ఆలస్యముగా వచ్చినను . . . అది తప్పక జరుగును, జాగుచేయక వచ్చును” అని వాళ్లు ఒప్పించబడ్డారు.—హబక్కూకు 2:3.
4. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండటానికి మనకు ఆమోసు 3:7 మరియు మత్తయి 24:45 ఎలా సహాయం చేయాలి?
4 మరోవైపు, ఒకవేళ మనం కొన్ని బైబిలు లేఖనాలను గానీ లేదా వాచ్ టవర్ ప్రచురణల్లోని వివరణలను గానీ పూర్తిగా అర్థం చేసుకోలేక పోయినట్లైతే సహనం కోల్పోవడానికి కారణం ఉందా? విషయాల్ని స్పష్టపర్చడానికి యెహోవా యొక్క నియుక్త సమయం కోసం వేచివుండటం జ్ఞానయుక్తమైన పని. “తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించినదానిని బయలు పరచకుండ ప్రభువైన యెహోవా యేమియు చేయడు.” (ఆమోసు 3:7) ఎంత గొప్ప వాగ్దానం! కానీ యెహోవా తాను సంకల్పించిన దానిని తాను యుక్తమని ఎంచిన సమయంలో బయలుపరుస్తాడన్నది మనం గ్రహించాలి. ఆ సంకల్పం నిమిత్తం దేవుడు, తన ప్రజలకు “తగినవేళ [ఆధ్యాత్మిక] అన్నము పెట్టుటకు” ‘నమ్మకమైన వాడును బుద్ధిమంతుడునైన దాసునికి’ అధికారం ఇచ్చాడు. (ఇటాలిక్కులు మావి.) (మత్తయి 24:45) అందుకని, కొన్ని విషయాలు పూర్తిగా వివరించబడలేదని మనం అతిగా చింతించడానికి, లేదా చివరికి కలవరపడటానికి ఏ కారణమూ లేదు. అలా చేయడానికి బదులుగా, మనం సహనంతో యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉన్నట్లైతే ఆయన తన నమ్మకమైన దాసుని ద్వారా “తగినవేళ” అవసరమైనది అందిస్తాడని మనం నిశ్చయత కల్గివుండవచ్చు.
5. ప్రసంగి 3:1-8 వచనాల్ని పరిశీలించడం నుండి ఏమి ప్రయోజనం లభిస్తుంది?
5 జ్ఞానియైన సొలొమోను రాజు 28 వేర్వేరు విషయాల గురించి చెబుతూ, వాటిలో ప్రతిదానికీ “సమయము కలదు” అన్నాడు. (ప్రసంగి 3:1-8) సొలొమోను చెప్పినదాని అర్థమేమిటో దాని అన్వయింపులు ఏమిటో గ్రహించడం ద్వారా మనం, దేవుడు దృష్టించే రీతిలో ఫలాని విషయాలకు సరైన సమయం ఏదో, ఏది సరైన సమయం కాదో నిర్ణయించడానికి సహాయాన్ని పొందుతాము. (హెబ్రీయులు 5:14) దానికి అనుగుణ్యంగా మనం మన జీవితాలను ఆ నమూనాలో మలచుకోవడానికి అవకాశం లభిస్తుంది.
‘ఏడ్చుటకు, నవ్వుటకు సమయం ఉంది’
6, 7. (ఎ) నేడు చింతగల ప్రజలు ‘ఏడ్చేలా’ చేస్తున్నదేమిటి? (బి) ఈ లోకం తానున్న గంభీరమైన పరిస్థితిని త్రిప్పికొట్టడానికి అది ఎలా ప్రయత్నిస్తుంది?
6 ‘ఏడ్చుటకు, నవ్వుటకు సమయం’ ఉన్నప్పటికీ, ఏడ్వడం కన్నా నవ్వడమే ఎక్కువగా కోరుకోని వారెవరు? (ప్రసంగి 3:4) విచారకరంగా, ఏడ్వడానికే ఎక్కువ కారణాలను ఇస్తున్న లోకంలో మనం జీవిస్తున్నాము. వార్తా మాధ్యమాలు మన మనస్సుల్ని క్రుంగిపోయేలా చేసే వార్తలతో నిండిపోయి ఉన్నాయి. యౌవనస్థులు స్కూల్లో తమ తోటి విద్యార్థుల్ని తుపాకీలతో కాల్చివేసిన ఉదంతాల్ని విన్నప్పుడు, తల్లిదండ్రులు తమ పిల్లలపై అత్యాచారం చేశారన్న వార్తలు విన్నప్పుడు, ఉగ్రవాదులు అమాయకులైన ప్రజల్ని చంపిన లేదా కాళ్లు చేతులు నరికేసిన వార్తలు విన్నప్పుడు, ప్రకృతి విపత్తులు ప్రజల ప్రాణాలతో ఆస్తులతో చెలగాటమాడాయన్న వార్తలు విన్నప్పుడు మనం భయవిహ్వలులమౌతాము. ఆకలితో అలమటిస్తూ కళ్లు గుంటలు పడిన పిల్లలు, ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని పారిపోతున్న శరణార్థులు టీవీ తెరలపై మన అవధానం కోసం పోటీపడుతుంటారు. ఇంతకు ముందు మనమెరుగని జాతి ప్రక్షాళన, ఎయిడ్స్, క్రిమి యుద్ధం, ఎల్ నీన్యో వంటి పదాలు—ప్రతీదీ తన స్వంత విధానంలోనే—మన మనస్సుల్లో మన గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి.
7 అందులో సందేహమే లేదు, నేటి లోకం విషాదంతోను, మానసిక క్షోభతోను నిండిపోయి ఉంది. అయినా, పరిస్థితి తీవ్రతను తక్కువచేసి చూపించడానికన్నట్లు, ఇతరులు అనుభవిస్తున్న దుస్థితిపట్ల మనం నిర్లక్ష్య భావంతో ఉండేలా మనల్ని తప్పుదోవ పట్టించేందుకు, వినోద పరిశ్రమ సారహీనమైన, అసభ్యమైన, తరచూ అనైతికమైన, హింసాత్మకమైన ప్రదర్శనల్ని మనముందుంచుతుంది. కానీ అటువంటి వినోదం వల్ల ఉత్పన్నమయ్యే మూర్ఖమైన హాస్యమూ నిరర్థకమైన నవ్వూ కలగలిసిన ఏమీ పట్టని దృక్పథమే నిజమైన సంతోషమని పొరబడకూడదు. దేవుని ఆత్మ ఫలాల్లో ఒకటైన సంతోషం, ఈ సాతాను లోకం ఏమాత్రం మనకివ్వలేనటువంటిది.—గలతీయులు 5:22, 23; ఎఫెసీయులు 5:3, 4.
8. నేడు క్రైస్తవులు ఏడ్వడానికి ప్రాధాన్యత నివ్వాలా లేదా నవ్వడానికా? వివరించండి.
8 ప్రస్తుతం ఈ లోకం ఉన్న దయనీయమైన స్థితిని గుర్తిస్తూ, నవ్వుకు ప్రాముఖ్యతనివ్వడానికిది ఏమాత్రం సమయం కాదని అర్థం చేసుకోగలము. వేడుకల్లోను వినోద కార్యకలాపాల్లోను మాత్రమే జీవించడానికిది సమయం కాదు, లేదా ఆధ్యాత్మిక విషయాలను వెనక్కి నెట్టివేసి, “కులాసాగా కాలం వెళ్లబుచ్చడానికి” ప్రాధాన్యతనివ్వటానికి ఇది సమయం కాదు. (పోల్చండి ప్రసంగి 7:2-4.) “ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలెను” అని అపొస్తలుడైన పౌలు అన్నాడు. ఎందుకు? ఎందుకంటే, “ఈ లోకపు నటన గతించుచున్నది.” (1 కొరింథీయులు 7:31) నిజ క్రైస్తవులు ప్రతి రోజు మనం జీవిస్తున్న కాలాల గంభీరతను పూర్తిగా గుర్తిస్తూ జీవిస్తారు.—ఫిలిప్పీయులు 4:8.
ఏడుస్తున్నప్పటికీ, నిజమైన సంతోషం!
9. జలప్రళయానికి ముందటి రోజుల్లో ఎటువంటి విచారకరమైన పరిస్థితి ఉంది, ఇది నేడు మనకు ఏ భావాన్ని కల్గివుంది?
9 భౌగోళిక జలప్రళయం కాలంలో జీవించిన ప్రజలకు జీవాన్ని గురించిన గంభీరమైన దృష్టికోణం లోపించింది. ‘భూలోకము బలాత్కారముతో నిండివున్నా’ వారు ఉపేక్షాభావంతో తమ దైనందిన కార్యకలాపాల్లో మునిగిపోయి, ‘భూమిమీద గొప్పగా ఉన్న నరుల చెడుతనమును’ గురించి ఏడ్వలేదు. (ఆదికాండము 6:5, 11) విచారకరమైన ఆ పరిస్థితిని గురించి యేసు ప్రస్తావించాడు, మన రోజుల్లోని ప్రజల్లో కూడా అటువంటి దృక్పథమే ఉంటుందని ఆయన ముందే చెప్పాడు. ఆయనిలా హెచ్చరించాడు: “జలప్రళయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్లిన దినమువరకు, వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసికొనుచు పెండ్లికిచ్చుచునుండి జలప్రళయమువచ్చి అందరిని కొట్టుకొనిపోవు వరకు ఎరుగక పోయరి; ఆలాగుననే మనుష్యకుమారుని రాకడ ఉండును.”—మత్తయి 24:38, 39.
10. హగ్గయి దినాల్లో జీవించిన ఇశ్రాయేలీయులు తమకు యెహోవా నియుక్త సమయంపట్ల మెప్పుదల కొరవడిందని ఎలా చూపించారు?
10 జలప్రళయం తర్వాత దాదాపు 1,850 సంవత్సరాలకు హగ్గయి దినాల్లో ఇశ్రాయేలీయులు ఆధ్యాత్మిక విషయాలపట్ల అలాంటి గంభీరమైన నిర్లక్ష్యభావాన్నే ప్రదర్శించారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసమైన పనుల్లో మునిగిపోయి వారు అది యెహోవా ఆసక్తులకు ప్రాధాన్యతనివ్వడానికైన సమయం అని గ్రహించడంలో విఫలమయ్యారు. మనమిలా చదువుతాము: “సమయమింకరాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయమింక రాలేదని యీ జనులు చెప్పుచున్నారే. అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్తయగు హగ్గయి ద్వారా సెలవిచ్చిన దేమనగా—ఈ మందిరము పాడైయుండగా మీరు సరంబీవేసిన యిండ్లలో నివసించుటకు ఇది సమయమా? కాబట్టి సైన్యములకధితియగు యెహోవా సెలవిచ్చునదేమనగా—మీ ప్రవర్తననుగూర్చి ఆలోచించుకొనుడి.”—హగ్గయి 1:1-5.
11. మనల్ని మనం యుక్తమైన రీతిలో ఏ ప్రశ్నలు వేసుకోవచ్చు?
11 యెహోవాసాక్షులముగా మనం నేడు, హగ్గయి కాలంనాటి ఇశ్రాయేలీయులకు యెహోవా ఎదుట ఉన్న లాంటి బాధ్యతలూ ఆధిక్యతలూ గలవారమై, మనం కూడా మన ప్రవర్తననుగూర్చి ఆలోచించుకోవడం—పూర్తి గాంభీర్యంతో ఆలోచించుకోవడం మంచిది. లోక పరిస్థితుల విషయమై, దేవుని నామంపై అవి తీసుకువచ్చే అపకీర్తి విషయమై మనం ‘ఏడుస్తామా’? దేవుడే లేడని ప్రజలు అన్నప్పుడు లేదా ఆయన నీతియుక్తమైన సూత్రాలను వారు నిస్సిగ్గుతో నిర్లక్ష్యం చేసినప్పుడు మనకు బాధ కలుగుతుందా? యెహెజ్కేలు 2,500 సంవత్సరాల క్రితం ఒక దర్శనంలో చూసిన గురుతు వేయబడిన వారిలా మనం ప్రతిస్పందిస్తామా? వారి గురించి మనమిలా చదువుతాము: “యెహోవా—యెరూషలేమను ఆ పట్టణములో ప్రవేశించి చుట్టు తిరిగి, దానిలో జరిగిన హేయకృత్యములనుగూర్చి మూల్గులిడుచు ప్రలాపించుచున్నవారి లలాటముల గురుతు వేయుమని [లేఖకుని సిరాబుడ్డితో ఉన్న వ్యక్తి] కాజ్ఞాపిం[చెను].”—యెహెజ్కేలు 9:4.
12. నేటి ప్రజలకు యెహెజ్కేలు 9:5, 6 ఎటువంటి ప్రాముఖ్యతను కలిగివుంది?
12 ఈ వృత్తాంతం నేడు మనకెంత ప్రాముఖ్యమైనదన్నది, హతముచేసే ఆయుధాలు ఉన్న ఆరుగురు వ్యక్తులకు ఇవ్వబడిన ఈ నిర్దేశాలను చదివినప్పుడు స్పష్టమౌతుంది: “మీరు పట్టణములో వాని వెంట పోయి నా పరిశుద్ధస్థలము దగ్గర మొదలుపెట్టి, కటాక్షమైనను కనికరమైనను లేకుండ అందరిని హతము చేయుడి. అందరు నశించునట్లు ఎవరిని విడిచిపెట్టక, పెద్దవారిని చిన్నవారిని కన్యకలను పిల్లలను స్త్రీలను చంపవలెను గాని, ఆ గురుతు ఎవరికుండునో వారిని ముట్టకూడదు.” (యెహెజ్కేలు 9:5, 6) అతి శీఘ్రంగా సమీపిస్తున్న ఆ మహాశ్రమల గుండా మనం సజీవంగా బయటికి రావడం అనేది, నేడు ప్రాథమికంగా ఏడ్వడానికైన సమయమని మనం గుర్తించడంపై ఆధారపడివుంది.
13, 14. (ఎ) ఎటువంటి ప్రజలు ధన్యులని యేసు ప్రకటించాడు? (బి) ఈ వర్ణన యెహోవాసాక్షులకు సరిగ్గా సరిపోతుందని మీరెందుకు భావిస్తున్నారో వివరించండి.
13 అయితే యెహోవా సేవకులు నేటి లోక వ్యవహారాల దుర్దశ విషయమై ‘ఏడుస్తున్నారంటే’ దానర్థం వారు సంతోషంగా ఉండరని కాదు. వాస్తవం దానికి పూర్తి విరుద్ధంగా ఉంది ! వారు నిజానికి భూమ్మీదనున్న వారిలో అత్యధిక సంతోషాన్ని అనుభవిస్తున్న ప్రజలు. యేసు, “ఆత్మవిషయమై దీనులైనవారు ధన్యులు, . . . దుఃఖపడువారు ధన్యులు, . . . సాత్వికులు ధన్యులు, . . . నీతికొరకు ఆకలిదప్పులు గలవారు ధన్యులు, . . . కనికరముగలవారు ధన్యులు, . . . హృదయశుద్ధిగలవారు ధన్యులు, . . . సమాధానపరచువారు ధన్యులు, . . . నీతినిమిత్తము హింసింపబడువారు ధన్యులు” అని చెప్పినప్పుడు, సంతోషానికి గీటురాయి ఏమిటో వివరించాడు. (మత్తయి 5:3-10) ఈ వర్ణన ఏ ఇతర మత సంస్థకన్నా ఒక సమూహముగా యెహోవాసాక్షులకు సరిగ్గా సరిపోతుందని చెప్పడానికి రుజువులు సమృద్ధిగా ఉన్నాయి.
14 ప్రాముఖ్యంగా సత్యారాధన 1919లో పునరుద్ధరించబడినప్పటి నుండి సంతోషభరితులైన యెహోవా ప్రజలు ‘నవ్వడానికి’ మంచి కారణం ఉంది. వారు సా.శ.పూ. ఆరవ శతాబ్దంలో బబులోను నుండి తిరిగి వచ్చినవారి అదే విధమైన ఉత్తేజాన్ని ఆధ్యాత్మికంగా అనుభవించారు: “సీయోనుకు తిరిగి వచ్చినవారిని యెహోవా చెరలోనుండి రప్పించినప్పుడు మనము కలకనినవారివలె నుంటిమి మన నోటి నిండ నవ్వుండెను మన నాలుక ఆనందగానముతో నిండియుండెను. . . . యెహోవా మనకొరకు గొప్పకార్యములు చేసి యున్నాడు, మనము సంతోషభరితులమైతిమి.” (కీర్తన 126:1-3) అయినప్పటికీ, ఆధ్యాత్మికంగా నవ్వుతున్నా యెహోవాసాక్షులు జ్ఞానయుక్తంగా ఈ సమయం యొక్క గంభీరతను మనస్సునందుంచుకుంటారు. ఒక్కసారి నూతన లోకం వాస్తవరూపం దాల్చిన తర్వాత, భూనివాసులు “వాస్తవమైన జీవమును సంపాదించు”కున్న తర్వాత, ఇక ఏడ్పు స్థానాన్ని నిత్యమూ నవ్వు ఆక్రమించే సమయమై ఉంటుంది.—1 తిమోతి 6:18, 19; ప్రకటన 21:3, 4.
‘కౌగలించుటకు, కౌగలించుట మానుటకు సమయము’
15. క్రైస్తవులు స్నేహితుల్ని ఎంపిక చేసుకునే విషయంలో ఎందుకు జాగ్రత్తగా ఉంటారు?
15 క్రైస్తవులు తాము స్నేహితులుగా ఎవరిని హత్తుకుంటారన్న విషయంలో జాగ్రత్తగా ఎంపిక చేసుకునేవారిగా ఉంటారు. “మోసపోకుడి, దుష్టసాంగత్యము మంచి నడవడిని చెరుపును” అన్న పౌలు హెచ్చరికను వారు మనస్సులో ఉంచుకుంటారు. (1 కొరింథీయులు 15:33) జ్ఞానియైన సొలొమోను రాజు ఇలా వ్యాఖ్యానించాడు: “జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానముగలవాడగును, మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును.”—సామెతలు 13:20.
16, 17. యెహోవాసాక్షులు స్నేహాన్నీ, డేటింగ్‌నూ, వివాహాన్నీ ఎలా దృష్టిస్తారు, ఎందుకు?
16 యెహోవా సేవకులు, యెహోవాపట్లా ఆయన నీతిపట్లా తమకున్నటువంటి అదే ప్రేమ ఉన్న వారినే తమ స్నేహితులుగా ఎంపిక చేసుకుంటారు. వారు తమ స్నేహితుల సాంగత్యాన్ని అమూల్యమైనదిగా ఎంచుతూ దాన్నుండి ఆనందాన్ని అనుభవిస్తున్నప్పటికీ, డేటింగ్ విషయంలో నేడు కొన్ని దేశాల్లో ప్రబలమైపోయి ఉన్న స్వేచ్ఛాయుతమైన దృక్కోణాన్ని విసర్జిస్తారు. హానిరహితమైన సరదాగా దృష్టిస్తూ దానిలో పాల్గొనడానికి బదులుగా, వారు డేటింగ్‌ను వివాహానికి నడిపించే ఒక గంభీరమైన చర్యగా, ఒకరు కేవలం శాశ్వతమైన భాగస్వామ్యంలోకి ప్రవేశించడానికి శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా—అలాగే లేఖనాధారంగా స్వతంత్రంగా ఉన్నప్పుడు మాత్రమే తీసుకోవల్సిన చర్యగా దృష్టిస్తారు.—1 కొరింథీయులు 7:36.
17 డేటింగ్ విషయంలోను వివాహం విషయంలోను అటువంటి దృక్కోణం కల్గివుండటం పాతకాలపు విధానమని కొందరు భావించవచ్చు. కానీ యెహోవాసాక్షులు తాము స్నేహితుల్ని ఎంపిక చేసుకునే విషయాన్నీ లేదా డేటింగ్, వివాహంవంటి వాటిల్లో నిర్ణయం తీసుకోవడాన్నీ తోటివారి ఒత్తిడి ప్రభావితం చేయడానికి అనుమతించరు. “జ్ఞానము జ్ఞానమని దాని క్రియలనుబట్టి తీర్పుపొందున[ని]” వారికి తెలుసు. (మత్తయి 11:19) అతి శ్రేష్ఠమైనదేమిటో యెహోవాకు ఎల్లప్పుడు తెలుసు, అందుకని “ప్రభువునందు మాత్రమే పెండ్లిచేసికొనవలెను” అని ఆయన ఇచ్చే సలహాను వారు గంభీరంగా దృష్టిస్తారు. (1 కొరింథీయులు 7:39; 2 కొరింథీయులు 6:14) ఒకవేళ వైవాహిక సంబంధం విఫలమైతే, విడాకులు తీసుకోవడం లేదా వేరుకావడం అనేవి ప్రత్యామ్నాయాలుగా ఎంపిక చేసుకోవచ్చన్న తప్పుడు తలంపుతో వివాహం విషయంలో త్వరపడటాన్ని వారు నివారిస్తారు. ఒక్కసారి వివాహ ప్రమాణాలు చేసుకున్న తర్వాత, “వారికను ఇద్దరుకాక ఏకశరీరముగా ఉన్నారు, గనుక దేవుడు జతపరచినవారిని మనుష్యుడు వేరుపరచకూడదని” చెబుతున్న యెహోవా చట్టం వర్తిస్తుందని గ్రహిస్తూ, వారు యోగ్యమైన భాగస్వామిని వెదకడానికి కావాల్సినంత సమయం తీసుకుంటారు.—మత్తయి 19:6.—మార్కు 10:9.
18. సంతోషభరితమైన వైవాహిక జీవితానికి ఏది చక్కని ఆరంభమవ్వగలదు?
18 వివాహం అనేది జీవితాంతం ఉండే వాగ్దానం, అందుకు జాగరూకతతో కూడిన ప్రణాళిక అవసరం. ‘ఆమె నిజంగా నాకు సరిగ్గా సరిపోయే వ్యక్తేనా?’ అని పురుషుడు తనను తాను తార్కికంగా ప్రశ్నించుకుంటాడు. కానీ, ‘నేను ఆమెకు సరిగ్గా సరిపోయే వ్యక్తినేనా? నేను పరిణతి చెందిన క్రైస్తవుణ్ణా, ఆమె ఆధ్యాత్మిక అవసరాలపట్ల శ్రద్ధవహించగలనా?’ అని ఆయన ప్రశ్నించుకోవటం కూడా అంతే ప్రాముఖ్యం. భావి భార్యాభర్తలిరువురికీ, యెహోవా ఎదుట ఆధ్యాత్మికంగా బలంగా ఉండాల్సిన, దైవిక అంగీకారాన్ని పొందే దృఢమైన వైవాహిక ఐక్యతను రూపొందించుకోవాల్సిన బాధ్యత ఉంది. పుచ్చుకోవడం కన్నా ఇవ్వటానికే పూర్తికాల పరిచర్య ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తుంది గనుక, దాన్లోకి ప్రవేశించడం సంతోషభరితమైన వైవాహిక జీవితానికి అద్భుతమైన ఆరంభమనటానికి వేలాదిమంది క్రైస్తవ దంపతులు ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నారు.
19. కొందరు క్రైస్తవులు ఎందుకు అవివాహితులుగా ఉండిపోతారు?
19 కొందరు క్రైస్తవులు సువార్త నిమిత్తం అవివాహితులుగా ఉండాలని ఎంపిక చేసుకోవడం ద్వారా ‘కౌగలించుట మానుతారు.’ (ప్రసంగి 3:5) మరితరులు తమకు సరిపోయే వివాహజతను ఆకర్షించేందుకు తాము ఆధ్యాత్మికంగా అర్హులమయ్యామని భావించేంత వరకు వివాహాన్ని వాయిదా వేస్తారు. కానీ వివాహబంధంలోని సాన్నిహిత్యం కోసమూ, ప్రయోజనాల కోసమూ పరితపిస్తున్నా ఇంకా భాగస్వామి దొరకని ఆ అవివాహిత క్రైస్తవుల్ని కూడా గుర్తుంచుకుందాము. వారు వివాహం వెనకబడి, దైవిక సూత్రాల విషయంలో రాజీపడటానికి నిరాకరిస్తున్నందున యెహోవా వారి విషయమై ఆనందిస్తాడని మనం పూర్తి నమ్మకం కల్గివుండవచ్చు. మనం వారి యథార్థతను మెచ్చుకుంటూ వారికి యోగ్యమైన యుక్తమైన మద్దతును ఇవ్వడం కూడా మంచిది.
20. వివాహ భాగస్వాములు కూడా ఎందుకు కొన్నిసార్లు ‘కౌగలించుట మానుకుంటారు’?
20 వివాహితులైన దంపతులు కూడా అప్పుడప్పుడు ‘కౌగలించుట మానుకోవాలా’? ఒక భావంలో చూస్తే అది సరియే అన్పిస్తుంది, ఎందుకంటే పౌలు ఇలా వ్యాఖ్యానించాడు: “సహోదరులారా, నేను చెప్పునదేమనగా, కాలము సంకుచితమై యున్నది గనుక ఇకమీదట భార్యలు కలిగినవారు భార్యలు లేనట్టు . . . ఉండవలెను.” (1 కొరింథీయులు 7:29-31) దానికి అనుగుణ్యంగా కొన్నిసార్లు, దైవపరిపాలనా బాధ్యతలకు మొదటి స్థానమిచ్చి వివాహబంధంలోని ఆనందాలూ ఆశీర్వాదాలకు రెండవ స్థానమివ్వాలి. ఈ విషయంలో సమతుల్యమైన దృక్కోణం కల్గివుండటం, వివాహబంధాన్ని బలహీనపర్చదు గానీ దాన్ని పటిష్ఠపరుస్తుంది ఎందుకంటే, దంపతులిద్దరికీ తమ బంధంలో యెహోవా ఎల్లప్పుడూ స్థిరత్వాన్నిచ్చే కేంద్ర స్థానంలో ఉండాలని గుర్తు చేయడానికి అది సహాయం చేస్తుంది.—ప్రసంగి 4:12.
21. వివాహిత దంపతులు తల్లిదండ్రులుగా మారే విషయంలో వారిని మనం ఎందుకు తీర్పు తీర్చకూడదు?
21 దానికితోడు, కొందరు వివాహిత దంపతులు తాము దేవునికి చేసే సేవలో మరింత స్వేచ్ఛను కలిగివుండటానికి పిల్లల్ని కనకుండా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇది వారి వైపునుండి త్యాగమే, యెహోవా దానికి అనుగుణ్యంగానే వారికి ప్రతిఫలమిస్తాడు. గమనించాల్సిన విషయం ఏమిటంటే, సువార్త నిమిత్తం అవివాహితులుగా ఉండటాన్ని బైబిలు ప్రోత్సహిస్తుండగా, అదే కారణాన పిల్లల్ని కనకుండా ఉండటం గురించి ఏ సూటియైన వ్యాఖ్యానమూ చేయడం లేదు. (మత్తయి 19:10-12; 1 కొరింథీయులు 7:38; పోల్చండి మత్తయి 24:19 మరియు లూకా 23:28-30.) అందుకని, వివాహిత దంపతులందరూ వ్యక్తిగత పరిస్థితుల ఆధారంగా, తమ స్వంత మనస్సాక్షి భావాల ఆధారంగా స్వంత నిర్ణయం తీసుకోవాలి. వాళ్లు ఎటువంటి నిర్ణయం తీసుకున్నప్పటికీ వివాహిత దంపతుల్ని విమర్శించకూడదు.
22. ఏది నిర్ణయించడం మనకు ప్రాముఖ్యం?
22 అవును, “ప్రతిదానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు.” చివరికి “యుద్ధము చేయుటకు సమాధానపడుటకు [“శాంతికి,” NW]” కూడా సమయము ఉంది. (ప్రసంగి 3:1, 8) ఇప్పుడు ఆ రెండింటిలో ఏది చేయవలసిన సమయము అన్నది నిర్ణయించడం మనకు ఎందుకు ప్రాముఖ్యమో తర్వాతి శీర్షిక వివరిస్తుంది.
మీరు వివరించగలరా?
◻ “ప్రతిదానికి సమయము కలదు” అని మనం తెలుసుకోవడం ఎందుకు ప్రాముఖ్యం?
◻ నేడు ప్రాముఖ్యంగా ఎందుకు ‘ఏడ్వడానికి’ సమయమై ఉంది?
◻ క్రైస్తవులు ‘ఏడుస్తున్నప్పటికీ’ ఎందుకు వారు నిజంగా సంతోషభరితమైనవారు?
◻ కొందరు క్రైస్తవులు ప్రస్తుత సమయం ‘కౌగలించుట మానుకోవాల్సిన’ సమయమని తాము దృష్టిస్తున్నట్లు ఎలా చూపిస్తారు?
[6, 7వ పేజీలోని చిత్రం]
లోక పరిస్థితుల మూలంగా క్రైస్తవులు ‘ఏడుస్తున్నప్పటికీ’ . . .
. . . వారు నిజానికి ప్రపంచంలోని అత్యంత ఆనందభరితులైన ప్రజలు
[8వ పేజీలోని చిత్రం]
ఆనందభరితమైన వివాహానికి పూర్తికాల పరిచర్య అద్భుతమైన ఆధారాన్నిస్తుంది