గురిచూసి కొట్టండి
1. మొదటి కొరింథీయులు 9:26, 27లోని సూత్రం పరిచర్యకు ఎలా వర్తిస్తుంది?
1 “నేను గురి చూడనివానివలె పరిగెత్తువాడను కాను, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు” అని అపొస్తలుడైన పౌలు రాశాడు. (1 కొరిం. 9:26, 27) ఆధ్యాత్మిక లక్ష్యాలను చేరుకోవడం మీదే తన మనసును పూర్తిగా లగ్నం చేయడం గురించి పౌలు మాట్లాడుతున్నాడు. చెప్పాలంటే ఈ సూత్రం పరిచర్యకు కూడా వర్తిస్తుంది. మంచి ఫలితాలు పొందాలంటే మనం గురిచూసి ‘కొట్టాలి’ లేదా తెలివిగా ప్రయత్నించాలి. ఎలా?
2. ఎప్పుడు, ఎక్కడ ప్రకటించాలో నిర్ణయించుకునే విషయంలో పౌలు, ఇతర తొలి సువార్తికులు చేసినదాన్ని మనం ఎలా పాటించవచ్చు?
2 ప్రజలు ఎక్కడుంటే అక్కడకు వెళ్ళండి: పౌలు, ఇతర తొలి సువార్తికులు సాధారణంగా ప్రజలు ఉండే చోట్లకు వెళ్ళి ప్రకటించేవారు. (అపొ. 5:42; 16:13; 17:17) మన ప్రాంతంలో ఎక్కువమంది సాయంకాలాల్లో ఇళ్ల దగ్గర ఉంటే, ఇంటింటి పరిచర్యను ఆ సమయాల్లో చేస్తే మంచిది. ఉదయాన లేదా సాయంత్రం ప్రజలు ఉద్యోగాలకు వెళ్తున్నప్పుడు, ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు మీ ప్రాంతంలోని బస్‌స్టేషన్‌లో లేదా రైల్వేస్టేషన్‌లో జనం ఎక్కువగా ఉంటారా? మీ ప్రాంతంలోని బజారు ఏ సమయాల్లో రద్దీగా ఉంటుంది? ఆ సమయాల్లో వీధి సాక్ష్యం ఇవ్వడానికి ప్రయత్నిస్తే మంచి ప్రయోజనం ఉండవచ్చు.
3. పరిచర్య ప్రాంతంలో పనిచేస్తున్నప్పుడు తెలివిగా ఎలా మసలుకోవచ్చు?
3 పరిచర్య ప్రాంతంలో తెలివిగా పనిచేయండి: పరిచర్య ప్రాంతంలో పనిచేస్తున్నప్పుడు కూడా తెలివిగా మసలుకోవాలి. ఉదాహరణకు, ఒకే ప్రాంతానికి ఎక్కువమందిని తీసుకువెళ్తే వాళ్లందరినీ సక్రమంగా పంపించడానికి, వాళ్ళకు కావాల్సినంత ప్రాంతాన్ని ఇవ్వడానికి ప్రయాసపడాల్సి ఉంటుంది, చాలా సమయం కూడా పడుతుంది. అందుకే చిన్నచిన్న గుంపులుగా పంపడం మంచిది. అలాగే, ఏదైనా గ్రామీణ ప్రాంతానికి వెళ్ళి పరిచర్య చేసేటప్పుడు, చిన్న గుంపుగా కలిసి వెళ్తే ప్రాంతాన్ని త్వరగా పూర్తి చేస్తాం, ఎక్కువమందితో మాట్లాడే అవకాశమూ ఉంటుంది. మన ఇంటి దగ్గర్లో మనకంటూ ఒక ప్రాంతాన్ని అడిగి తీసుకుంటే, ప్రయాణించడానికి ఎక్కువ సమయం పట్టదు.
4. ‘మనుష్యులను పట్టు జాలరులముగా’ మంచి ఫలితాలు సాధించాలంటే మనం ఏమి చేయాలి?
4 సువార్తికులను యేసు, “మనుష్యులను పట్టు జాలరులు” అన్నాడు. (మార్కు 1:17) జాలరి ఊరికే నీళ్లలో వల వేయడానికి వెళ్ళడు, చేపలు పట్టడానికి వెళ్తాడు. నైపుణ్యంగల జాలరులు ఎప్పుడు, ఎక్కడ చేపలు పడతాయో చూసుకుని, ఆలస్యం చేయకుండా అక్కడ వల వేస్తారు. వాళ్ళు తమ కష్టానికి తెలివిని జోడిస్తారు. వాళ్ళలాగే మనం కూడా పరిచర్యలో అలుపెరగకుండా పనిచేద్దాం.—హెబ్రీ. 6:11, 12.