మీ యింటివారి రక్షణకొరకు కష్టించి పనిచేయండి
“ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి.”—ఎఫెసీయులు 6:4.
1, 2. నేడు తల్లిదండ్రులు ఏ సవాళ్లనెదుర్కొంటున్నారు?
ప్రఖ్యాతి గాంచిన ఒక పత్రిక దాన్ని విప్లవం అని పిలిచింది. ఇటీవలి సంవత్సరాల్లో కుటుంబంలో చోటుచేసుకున్న దిగ్భ్రాంతి కలిగించే మార్పులను వివరించిన శీర్షికలో ఇది ఉంది. అవి “విడాకులు, పునర్ వివాహం, మళ్లీ విడాకులు తీసుకోవడం, జారత్వం, విడిపోని కుటుంబాల్లోని క్రొత్త బాధలు వంటివాటి వలన కలిగిన ఫలితాలుగా” చెప్పబడ్డాయి. ఈ “అంత్యదినాల్లో” ప్రజలు “అపాయకరమైన కాలాలను” ఎదుర్కొనవలసి వస్తుందని బైబిలు ముందే ప్రవచించింది గనుక, అలాంటి ఒత్తిడులు, బాధలు కలగడంలో ఆశ్చర్యంలేదు.—2 తిమోతి 3:1-5.
2 మునుపటి తరాల వారికి తెలియని సవాళ్లను నేడు తల్లిదండ్రులు ఎదుర్కొంటున్నారు. మనలో కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలను “బాల్యం నుండి” దైవిక మార్గాల్లో పెంచినప్పటికీ, అనేక కుటుంబాలు కేవలం ఇటీవలనే “సత్యమును అనుసరించి నడవడం” ప్రారంభించారు. (2 తిమోతి 3:15; 3 యోహాను 4) తల్లిదండ్రులు తమ పిల్లలకు దేవుని మార్గాల గురించి నేర్పడం ప్రారంభించే నాటికి వారు పెద్దవారై యుండవచ్చు. అంతేగాక, మన మధ్య తల్లి లేదా తండ్రి మాత్రమే ఉన్న కుటుంబాలు, సవతి తల్లి లేక మారు తండ్రివున్న కుటుంబాలు అధిక సంఖ్యలో ఉన్నాయి. మీ పరిస్థితులు ఏవైనప్పటికీ, “ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి” అని చెప్పిన అపొస్తలుడైన పౌలు సలహా అనువర్తిస్తుంది.—ఎఫెసీయులు 6:4.
క్రైస్తవ తల్లిదండ్రులు, వారి పాత్రలు
3, 4. (ఎ) తండ్రుల పాత్ర తగ్గిపోవడానికి కారణమయ్యే కారకాలు ఏవి? (బి) క్రైస్తవ తండ్రులు ఆహారాన్ని సంపాదించేవారిగా కంటే ఎక్కువగా ఎందుకుండాలి?
3 ఎఫెసీయులు 6:4 నందు తన మాటలను పౌలు ప్రాముఖ్యంగా “తండ్రుల”కు సంబోధించి చెప్పాడని గమనించండి. ఒక రచయిత వివరిస్తున్నట్లు మునుపటి తరాల్లో “తమ పిల్లల నైతిక మరియు ఆత్మీయ ఎదుగుదలకు తమ పిల్లల విద్యకూ తండ్రులు బాధ్యులై యుండేవారు . . . కాని పారిశ్రామిక విప్లవం ఈ సన్నిహితత్వాన్ని అంతమొందించింది; తండ్రులు కర్మాగారాల్లో ఆ తర్వాత కార్యాలయాల్లో పనిచేయడానికి తమ పొలాలను, దుకాణాలను, ఇళ్లను విడిచిపెట్టి వెళ్తున్నారు. ఒకప్పుడు తండ్రులు బాధ్యులైయున్న అనేక పనులను ఇప్పుడు తల్లులు చేపట్టడం మొదలు పెట్టారు. పితృత్వం పేరుకు మాత్రమే మిగిలిపోయింది.”
4 క్రైస్తవ పురుషులారా: పిల్లలకు తర్ఫీదివ్వడం, వారికి బోధించడం వంటివాటిని మీ భార్యలకు వదిలేసి కేవలం ఆహారం సంపాదించడంతోనే తృప్తిపడవద్దు. సామెతలు 24:27 ప్రాచీన కాల తండ్రులను ఇలా కోరింది: “బయట నీ పని చక్క పెట్టుకొనుము ముందుగా పొలములో దాని సిద్ధపరచుము తరువాత ఇల్లు కట్టుకొనవచ్చును.” అలాగే నేడు, పనిచేసే వ్యక్తిగా, మీరు జీవనోపాధి కొరకు చాలా కష్టపడి, ఎక్కువ సమయం పనిచేయవలసి ఉండవచ్చును. (1 తిమోతి 5:8) అయితే ఆ తర్వాత, మానసికంగా, ఆత్మీయంగా ‘మీ ఇల్లు కట్టుకొనడానికి’ దయచేసి సమయం తీసుకోండి.
5. తమ కుటుంబ రక్షణ కొరకు క్రైస్తవ భార్యలు ఎలా ప్రయత్నించగలరు?
5 క్రైస్తవ భార్యలారా: మీరు కూడా మీ కుటుంబాల రక్షణ కొరకు కష్టపడి పనిచేయాలి. సామెతలు 14:1 ఇలా చెబుతున్నది: “జ్ఞానవంతురాలు తన చేతులతో తన యిల్లు కట్టును.” వివాహ భాగస్వాములుగా పిల్లలకు తర్ఫీదివ్వవలసిన బాధ్యతను మీరు మీ భర్త పంచుకోవాలి. (సామెతలు 22:6; మలాకీ 2:14) మీ పిల్లలను క్రమశిక్షణలో ఉంచడం, క్రైస్తవ కూటాలు మరియు ప్రాంతీయ పరిచర్య కొరకు వారిని సిద్ధం చేయడం, లేక మీ భర్త చేయలేనప్పుడు కుటుంబ పఠనాన్ని నిర్వహించడం వంటివి దానిలో చేరివుండవచ్చు. ఇంటి పనులు, మంచి మర్యాద, శరీర పరిశుభ్రత, అలాగే అనేక సహాయకరమైన విషయాలను మీ పిల్లలకు బోధించడంలో కూడా మీరు ఎంతో చేయవచ్చు. (తీతు 2:5) భార్యలు, భర్తలు ఈవిధంగా కలిసి పనిచేసినప్పుడు, వారి పిల్లల అవసరతలను వారు ఇంకా బాగుగా తీర్చగలరు. ఆ అవసరతలు కొన్ని ఏమిటి?
వారి భావోద్రేకపరమైన అవసరతల గురించి శ్రద్ధ తీసుకోవడం
6. తమ పిల్లల భావోద్రేక ఎదుగుదలలో తల్లులు మరియు తండ్రులు ఏ పాత్ర వహిస్తారు?
6 “స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించినప్పుడు,” వారు సురక్షితంగా, క్షేమంగా ఉన్నట్లు, ప్రేమించబడినట్లు భావిస్తారు. (1 థెస్సలొనీకయులు 2:7; కీర్తన 22:9) తమ పసివారి యెడల శ్రద్ధచూపాలనే కోరికను ఏ కొద్దిమంది తల్లులో ఆపుకోగలరు. ప్రవక్తయైన యెషయా ఇలా అడిగాడు: “స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండ తన చంటిపిల్లను మరచునా?” (యెషయా 49:15) అలా, పిల్లల భావోద్రేకపరమైన ఎదుగుదలలో తల్లులు ప్రముఖ పాత్ర వహిస్తారు. అయినప్పటికీ, ఈ విషయంలో తండ్రులు కూడా ప్రముఖ పాత్రనే వహిస్తారు. కుటుంబ విద్యాబోధకుడైన పాల్ లేవిస్ ఇలా చెబుతున్నారు: “తమ తండ్రితో మంచి సంబంధం కలిగివున్నట్లు బాలుడు [దోషి] చెప్పడం విన్న ఒక్క సంఘ సేవకుడిని కూడా నేను చూడలేదు. వందలో కనీసం ఒకరు కూడా అలా లేరు.”
7, 8. (ఎ) యెహోవా దేవునికి, ఆయన కుమారునికి మధ్య పటిష్ఠమైన బంధం ఉందనడానికి ఏ సాక్ష్యాధారం ఉంది? (బి) తమ పిల్లలతో ప్రేమపూర్వక బంధాన్ని తండ్రులు ఎలా ఏర్పరచుకోగలరు?
7 కాబట్టి క్రైస్తవ తండ్రులు తమ పిల్లలతో ఒక ప్రేమపూర్వక సంబంధాన్ని జాగ్రత్తగా ఏర్పరచుకోవడం అత్యవసరము. ఉదాహరణకు, యెహోవా దేవుడు యేసుక్రీస్తుల గురించి చూడండి. యేసు బాప్తిస్మమప్పుడు యెహోవా ఇలా ప్రకటించాడు: “నీవు నా ప్రియకుమారుడవు, నీయందు నేనానందించుచున్నాను.” (లూకా 3:22) ఆ కొన్ని మాటల్లో ఎంతో వ్యక్తపర్చబడింది! యెహోవా (1) తన కుమారున్ని గుర్తించాడు, (2) యేసు యెడల తన ప్రేమను బహిరంగంగా వ్యక్తపర్చాడు, (3) యేసును తాను అంగీకరిస్తున్నట్లు తెలియజేసాడు. అయినా, తన కుమారుని యెడల యెహోవా తన ప్రేమను వ్యక్తపర్చడం ఈ ఒక్కసారి మాత్రమే కాదు. తర్వాత యేసు తన తండ్రితో ఇలా అన్నాడు: “జగత్తు పునాది వేయబడకమునుపే నీవు నన్ను ప్రేమించితివి.” (యోహాను 17:24) నిజంగా, విధేయులైన కుమారులకు, కుమార్తెలకు తమ తండ్రుల గుర్తింపు, ప్రేమ, అంగీకారం అవసరం కాదా?
8 మీరు తండ్రి అయితే, ప్రేమను క్రియల ద్వారా, మాటల ద్వారా వ్యక్తపర్చడానికి క్రమంగా ప్రయత్నించడం ద్వారా మీరు మీ పిల్లలతో ప్రేమపూర్వక బంధాన్ని ఏర్పరచుకోడానికి ఎంతో చేయవచ్చు. నిజమే ప్రాముఖ్యంగా వారు తమ స్వంత తండ్రుల నుండి అలాంటి ప్రేమను పొందనప్పుడు తమ ప్రేమను వ్యక్తపర్చడం కొంతమంది పురుషులకు కష్టమే కావచ్చు. అయినా ప్రేమను వ్యక్తపర్చడానికి చివరకు మీరు చేసే మోటు ప్రయత్నం కూడా మీ పిల్లలపై బలమైన ప్రభావాన్ని చూపగలదు. ఎందుకంటే, “ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేయును.” (1 కొరింథీయులు 8:1) మీ పితృ ప్రేమను బట్టి మీ పిల్లలు సురక్షితంగా ఉన్నట్లు భావిస్తే, ‘నిజమైన కుమారులు, కుమార్తెలుగా’ ఉండడానికి వారు ఎక్కువ ఇష్టపడతారు, మీ యందు నమ్మకముంచడానికి వెనుకాడరు.—సామెతలు 4:3.
వారి ఆత్మీయ అవసరతల గురించి శ్రద్ధ తీసుకోవడం
9. (ఎ) తమ కుటుంబ ఆత్మీయ అవసరతల కొరకు దైవ భయముగల ఇశ్రాయేలు తల్లిదండ్రులు ఎలా శ్రద్ధ వహించేవారు? (బి) తమ పిల్లలకు తటస్థంగా బోధించడానికి క్రైస్తవులకు ఏ అవకాశాలు ఉన్నాయి?
9 పిల్లలకు కూడా ఆత్మీయ అవసరతలు ఉంటాయి. (మత్తయి 5:3) ఇశ్రాయేలు తల్లిదండ్రులకు మోషే ఇలా ఉద్బోధించాడు: “నేడు నేను నీకాజ్ఞాపించునట్లు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి, నీ యింట కూర్చుండునప్పుడును త్రోవను నడుచునప్పుడును పండుకొనునప్పుడును లేచునప్పుడును వాటిని గూర్చి మాటలాడవలెను, సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను.” (ద్వితీయోపదేశకాండము 6:6, 7) మీరు క్రైస్తవ తల్లిదండ్రులైతే, మీరు “త్రోవను నడుచునప్పుడు” అనుకొనని సందర్భంలో బోధించడానికి ఎంతో చేయవచ్చు. కుటుంబమంతా కలిసి ప్రయాణిస్తున్నప్పుడు, కొనుగోలుకు వెళ్తున్నప్పుడు, లేక క్రైస్తవ పరిచర్యలో మీ పిల్లలతో కలిసి ఇంటింటికి నడుస్తున్నప్పుడు గడిపే సమయాలు ప్రశాంతతతో ఉపదేశించడానికి మంచి అవకాశాలను కలుగజేస్తాయి. కుటుంబమంతా కలిసి సంభాషించుకోవడానికి ప్రత్యేకంగా భోజన వేళలు సముచితమైన సమయం. ఒక తల్లి ఇలా వివరిస్తున్నది: “దినమంతటిలోని విషయాలను గురించి మాట్లాడుకోడానికి మేము భోజన సమయాలను ఉపయోగించుకుంటాము.”
10. కుటుంబ పఠనం కొన్నిసార్లు ఎందుకు సవాలుతో కూడినదౌతుంది, తల్లిదండ్రులు ఏ తీర్మానాన్ని కలిగివుండాలి?
10 అయితే, మీ పిల్లలకు ఒక క్రమ బైబిలు పఠనం ద్వారా క్రమబద్ధమైన ఉపదేశం చేయడం కూడా అత్యవసరము. పిల్లల “హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును” అనేది అంగీకరించవలసిందే. (సామెతలు 22:15) వారి పిల్లలు కుటుంబ పఠనాన్ని సుళువుగా చెడగొట్టగలరని కొంతమంది తల్లిదండ్రులు చెబుతారు. ఎలా? విశ్రాంతి లేనట్లు విసుగు చెందినట్లు నటించడం ద్వారా, చిరాకు కలిగించే అవరోధాలు (తోబుట్టువులతో కీచులాడడం వంటివి) కలిగించడం ద్వారా లేక ప్రాథమిక బైబిలు సత్యాలు తెలియదన్నట్లు నటించడం ద్వారా అలా చేస్తారు. ఈ విషయంలో ఎవరి ఇష్టం నెరవేరాలి అనే స్థితికి పరిస్థితి మారినట్లైతే, తల్లిదండ్రుల ఇష్టమే నెరవేరాలి. క్రైస్తవ తల్లిదండ్రులు పిల్లలను వదిలేసి, వారే ఇంట్లో ఆధిపత్యం చెలాయించేలా అనుమతించకూడదు.—గలతీయులు 6:9 పోల్చండి.
11. కుటుంబ పఠనాన్ని ఆనందదాయకమైనదిగా ఎలా చేసుకోవచ్చు?
11 మీ పిల్లలు కుటుంబ పఠనాన్ని ఆనందించకపోతే, బహుశా కొన్ని మార్పులు చేయవచ్చు. ఉదాహరణకు, మీ పిల్లలు ఇటీవల చేసిన తప్పులను పునఃసమీక్షించడానికి ఒక నెపంగా పఠన సమయం ఉపయోగించబడుతుందా? అలాగైతే, అలాంటి సమస్యలను గురించి ఏకాంతంగా మాట్లాడడం బాగుంటుంది. మీ పఠనం క్రమంగా నిర్వహించబడుతుందా? మీకిష్టమైన టి.వి., కార్యక్రమం కొరకు లేదా క్రీడా విశేషం కొరకు దాన్ని మీరు రద్దు చేసినట్లైతే, మీ పిల్లలు కూడా పఠనాన్ని అంత గంభీరంగా తీసుకోరు. మీరు పఠనాన్ని పట్టుదలతో, ఉత్సాహవంతమైన విధంగా నిర్వహిస్తున్నారా? (రోమీయులు 12:8) అవును, పఠనం ఆనందించదగినదిగా ఉండాలి. పిల్లలందరినీ దానిలో ఇమడ్చడానికి ప్రయత్నించండి. మీ పిల్లలు పాల్గొనడాన్నిబట్టి వారిని ఆప్యాయంగా మెచ్చుకొంటూ, అనుకూలమైన దృక్పథంతో నిర్మాణాత్మకంగా ఉండండి. అయినా కేవలం సమాచారాన్ని పూర్తి చేయడానికే ప్రయత్నించకుండా, హృదయాలను చేరడానికి ప్రయత్నించండి.—సామెతలు 23:15.
నీతియందు శిక్షచేయుట
12. శిక్షించడంలో ఎప్పుడూ కొట్టడమే ఎందుకు చేరివుండదు?
12 పిల్లలను క్రమశిక్షణలో పెట్టవలసిన అవసరత కూడా బలంగా ఉంటుంది. తల్లిదండ్రులుగా మీరు వారికి పరిధులు ఏర్పరచాలి. సామెతలు 13:24 ఇలా చెబుతుంది: “బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించువాడు వానిని శిక్షించును.” అయినప్పటికీ, కేవలం కొట్టడం వల్ల మాత్రమే శిక్షించడం వీలౌతుందని బైబిలు భావము కాదు. సామెతలు 8:33 ఇలా తెలియజేస్తుంది: ‘ఉపదేశమును (క్రమశిక్షణ NW) వినుము,’ అంతేగాక మనకిలా చెప్పబడుతున్నది: “బుద్ధిహీనునికి నూరు దెబ్బలు నాటునంతకంటె బుద్ధిమంతునికి ఒక గద్దింపుమాట లోతుగా నాటును.”—సామెతలు 17:10.
13. పిల్లలను ఎలా క్రమశిక్షణలో పెట్టాలి?
13 కొన్నిసార్లు కొట్టి క్రమశిక్షణలో పెట్టడం కూడా తగినదైయుంటుంది. అయితే, దాన్ని ఆగ్రహంతో చేస్తే, అది అధికమైపోయి, ప్రభావహీనం కావచ్చు. బైబిలిలా హెచ్చరిస్తున్నది: “తండ్రులారా, మీ పిల్లల మనస్సు (హృదయం NW) క్రుంగకుండునట్లు వారికి కోపము పుట్టింపకుడి.” (కొలొస్సయులు 3:21) వాస్తవానికి, “బాధించుట జ్ఞానుని వెఱ్ఱివాని వలె ప్రవర్తించునట్లు చేయవచ్చును.” (ప్రసంగి 7:7 NW) ఆగ్రహం చెందిన యౌవనుడు నీతికట్టడలకు కూడా ఎదురు తిరగవచ్చు. అందుకే స్థిరంగా అయినా సమతూకమైన రీతిలో తమ పిల్లలను నీతియందు శిక్షించడానికి తల్లిదండ్రులు లేఖనాలను ఉపయోగించాలి. (2 తిమోతి 3:16) ప్రేమ, సాత్వికములతో దైవిక క్రమశిక్షణ ప్రయోగించబడుతుంది.—2 తిమోతి 2:24, 25 పోల్చండి.a
14. కోపాన్ని అదుపు చేసుకోలేమని తల్లిదండ్రులు భావించినప్పుడు వారు ఏమి చేయాలి?
14 నిజమే, “అనేకవిషయములలో మనమందరము తప్పిపోవుచున్నాము.” (యాకోబు 3:2) సాధారణంగా ప్రేమగా ప్రవర్తించే తండ్రి లేక తల్లి కూడా ఒత్తిడికిలోనైన క్షణంలో ఏదైనా నిర్దయగా అనవచ్చు లేక ఆగ్రహాన్ని చూపించవచ్చు. (కొలొస్సయులు 3:8) ఒకవేళ అదే జరిగితే, మీ పిల్లల కృంగిన స్థితిని లేదా మీ కోపోద్రేక స్థితిని సూర్యుడు అస్తమించేంత వరకు అనుమతించవద్దు. (ఎఫెసీయులు 4:26, 27) ఒకవేళ క్షమాపణ చెప్పడం సముచితమైతే, క్షమాపణ చెప్పి మీ పిల్లలతో వివాదాల్ని తీర్చుకోండి. (మత్తయి 5:23, 24 పోల్చండి.) అలాంటి దీనత్వాన్ని చూపించడం మిమ్మల్ని మీ పిల్లలను సన్నిహితం చేయవచ్చు. మిమ్మల్ని మీరు అదుపు చేసుకోలేమని, కోపాన్ని తగ్గించుకోలేమని మీరనుకుంటే సంఘంలోని నియమిత సంఘపెద్దల సహాయాన్ని కోరండి.
తల్లి లేదా తండ్రి మాత్రమే ఉన్న కుటుంబాలు, సవతితల్లి లేదా మారుడుతండ్రి ఉన్న కుటుంబాలు
15. తల్లి లేదా తండ్రి మాత్రమే ఉన్న కుటుంబాలలోని పిల్లలకు ఎలా సహాయం చేయవచ్చు?
15 అయితే పిల్లలందరికీ తల్లిదండ్రులిద్దరి మద్దతు ఉండకపోవచ్చు. అమెరికాలో, నలుగురు పిల్లల్లో ఒకరు ఒంటరి తల్లి లేదా ఒంటరి తండ్రిచే పెంచబడుతున్నారు. ‘తండ్రి లేని పిల్లలు’ బైబిలు కాలాల్లో సర్వసామాన్యంగా ఉండేవారు, వారిని గూర్చి శ్రద్ధ తీసుకోవడం గురించి లేఖనాల్లో అనేకసార్లు ప్రస్తావించబడింది. (నిర్గమకాండము 22:22) నేడు తల్లి లేదా తండ్రి మాత్రమే ఉన్న కుటుంబాలు అలాగే ఒత్తిడులను, కష్టాలను ఎదుర్కొంటున్నాయి, కాని యెహోవా “తండ్రిలేని వారికి తండ్రియు, విధవరాండ్రకు న్యాయకర్తయునై యున్నాడు” అని తెలుసుకోవడంలో వారు ఓదార్పు పొందుతున్నారు. (కీర్తన 68:5) “దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించ” వలెనని క్రైస్తవులు ఉద్బోధింపబడుతున్నారు. (యాకోబు 1:27) తల్లి లేదా తండ్రి మాత్రమే ఉన్న కుటుంబాలకు సహాయం చేయడంలో తోటి విశ్వాసులు ఎంతో చేయవచ్చు.b
16. (ఎ) తమ స్వంత కుటుంబాల కొరకు ఒంటరి తల్లి లేదా ఒంటరి తండ్రి ఏమి చేయాలి? (బి) క్రమశిక్షణ ఎందుకు కష్టం కావచ్చు, అయినా దానిని ఎందుకు అమలుపరచాలి?
16 మీరు ఒంటరి తల్లి లేదా ఒంటరి తండ్రి అయినట్లైతే, మీ కుటుంబ ప్రయోజనార్థం మీమట్టుకు మీరు ఏమి చేయగలరు? కుటుంబ బైబిలు పఠనం, కూటాలకు హాజరగుట, పరిచర్య వంటి వాటి గురించి మీరు శ్రద్ధ కలిగివుండాలి. అయినా, క్రమశిక్షణ ప్రత్యేకంగా కష్టమైన విషయంగా ఉండవచ్చు. బహుశా మరణమందు కోల్పోయిన మీ ప్రియమైన జతను బట్టి మీరు ఇంకా దుఃఖిస్తుండవచ్చు. లేక వివాహ విచ్ఛిన్నం కారణంగా మీరు అపరాధభావం లేక ఆగ్రహంతో సతమతమౌతుండవచ్చు. మీ పిల్లల బాధ్యతను మీరు, మీ మునుపటి జత పంచుకొంటున్నట్లైతే, మీ పిల్లలు వేరైపోయిన జతతో లేక విడాకులు పొందిన మీ జతతో ఉండుటకు ఇష్టపడతారేమోనని మీరు భయపడుతుండవచ్చు. అలాంటి పరిస్థితులు సమతూకమైన క్రమశిక్షణను ఏర్పాటు చేయడం భావోద్రేక పూరితమైన కష్టాన్ని కలిగించవచ్చు. అయినప్పటికీ, “అదుపులేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును” అని బైబిలు మనకు చెబుతున్నది. (సామెతలు 29:15) కాబట్టి అపరాధ భావం, దుఃఖం, లేక మునుపటి వివాహ జతనుబట్టి కలిగే భావోద్రేకపూరిత ఒత్తిడి వంటివాటికి తావివ్వకండి. కారణసహితమైన, స్థిరమైన ప్రమాణాలను ఏర్పరచుకోండి. బైబిలు సూత్రాలతో రాజీపడకండి.—సామెతలు 13:24.
17. తల్లి లేదా తండ్రి మాత్రమే ఉన్న కుటుంబంలో, కుటుంబ సభ్యుల పాత్రలు ఎలా అస్పష్టమైపోవచ్చు, దీన్ని అరికట్టడానికి ఏమి చేయవచ్చు?
17 ఒక ఒంటరి తల్లి తన కుమారున్ని తన భర్తకు సరిసాటియైనవానిగా అంటే కుటుంబాన్ని నడిపేవ్యక్తిగా చూస్తే, లేక తన కుమార్తెను ఆంతరంగీకురాలిగా భావించి ఆమెకు ఆంతరంగీక సమస్యలన్నీ చెబుతున్నట్లయితే, సమస్యలు తలెత్త వచ్చు. అలా చేయడం తగినదికాదు, అది పిల్లవాన్ని అయోమయానికి గురి చేస్తుంది. తల్లిదండ్రులు మరియు పిల్లల పాత్రలు అస్పష్టమైనప్పుడు, క్రమశిక్షణ వుండదు. తల్లి లేదా తండ్రి మీరే అని వారు తెలుసుకొనేలా చేయండి. బైబిలు ఆధారిత సలహా అవసరమైయున్న తల్లి మీరయితే, దాన్ని పెద్దల నుండి లేదా బహుశా పరిపక్వతకు ఎదిగిన ఒక వృద్ధ సహోదరి నుండి సహాయం పొందండి.—తీతు 2:3-5 పోల్చండి.
18, 19. (ఎ) సవతితల్లి లేదా మారుడుతండ్రి ఉన్న కుటుంబాలు ఎదుర్కొనే కొన్ని సవాళ్లు ఏమిటి? (బి) సవతితల్లి లేదా మారుడుతండ్రి ఉన్న కుటుంబాల్లోని తల్లిదండ్రులు మరియు పిల్లలు ఎలా జ్ఞానాన్ని, వివేచనను చూపించగలరు?
18 సవతితల్లి లేక మారుడు తండ్రి ఉన్న కుటుంబాలు కూడా అలాగే సవాళ్లను ఎదుర్కొంటాయి. తరచూ, సవతి తల్లిదండ్రులు “ఆకస్మిక ప్రేమ”ను పొందడం అంత సులభం కాదని తెలుసుకుంటారు. ఉదాహరణకు, స్వంత పిల్లల యెడల ఏమాత్రం ఎక్కువ అభిమానం చూపించినా మారుటి పిల్లలు చాలా సున్నితంగా స్పందించవచ్చు. (ఆదికాండము 37:3, 4 పోల్చండి.) వాస్తవానికి, విడిపోయిన తల్లి లేదా తండ్రి కొరకైన బాధతో మారుటి పిల్లలు తంటాలు పడుతుండవచ్చు, అలాగే సవతితల్లి లేదా తండ్రిని ప్రేమించడం ద్వారా తమ స్వంత తండ్రి లేదా తల్లి పట్ల ద్రోహంగా ప్రవర్తిస్తున్నామేమోననే భయం వారికి ఉండవచ్చు. తగిన క్రమశిక్షణ నివ్వాలనే ప్రయత్నం చేసినప్పుడు ‘నీవు నన్ను కన్న తల్లివి లేదా తండ్రివి కాదు!’ అనే కఠినమైన స్పందన ఎదురు కావచ్చు.
19 సామెతలు 24:3 ఇలా చెబుతున్నది: “జ్ఞానము వలన ఇల్లు కట్టబడును వివేచన వలన అది స్థిరపరచబడును.” అవును, మారుటి కుటుంబం విజయవంతమవ్వాలంటే అందరూ జ్ఞాన వివేచనలను చూపించవలసిన అవసరముంటుంది. పరిస్థితులు మారిపోయాయనే బాధాకరమైన వాస్తవాన్ని కాలగమనంలో పిల్లలు అంగీకరించవలసిందే. అలాగే మారుడు తల్లిదండ్రులు కూడా నిరాకరణను ఎదుర్కొనవలసి వచ్చినప్పుడు వెంటనే కోపం తెచ్చుకోకుండా, సహనం, దయకలిగి ఉండుటను నేర్చుకొనవల్సి వచ్చును. (సామెతలు 19:11; ప్రసంగి 7:9) మీరు శిక్షణ ఇచ్చే పాత్రను చేపట్టక ముందే, మారుటి పిల్లలతో స్నేహపూరితమైన సంబంధాన్ని ఏర్పరచుకోడానికి ప్రయత్నించండి. అలాంటి బంధం ఏర్పడేవరకు, స్వంత తల్లి లేదా తండ్రి వారికి క్రమశిక్షణ నివ్వడానికి అనుమతించడం మంచిదని కొందరు భావిస్తారు. ఒత్తిడులు వచ్చినప్పుడు, సంభాషించడానికి ప్రయత్నించాలి. సామెతలు 13:10 ఇలా చెబుతుంది: “ఆలోచన వినువానికి జ్ఞానము కలుగును.”c
మీ కుటుంబ రక్షణ కొరకు పాటుపడడంలో కొనసాగండి
20. క్రైస్తవ కుటుంబ శిరస్సులు ఏమి చేయడంలో కొనసాగాలి?
20 పటిష్ఠమైన క్రైస్తవ కుటుంబాలు వాటంతటవే ఏర్పడవు. మీ కుటుంబ రక్షణ కొరకు కుటుంబ శిరస్సులైన మీరు కష్టపడడంలో కొనసాగాలి. జాగ్రత్తగా వుండి, అనారోగ్యకరమైన లక్షణాలు లేక లోక దృక్పథాలు పొడచూపుతున్నాయేమో గమనించండి. మాట్లాడడం, ప్రవర్తన, ప్రేమ, విశ్వాసం, మంచితనం వంటి విషయాల్లో మంచి మాదిరి నుంచండి. (1 తిమోతి 4:12) దేవుని ఆత్మ ఫలాలను ప్రదర్శించండి. (గలతీయులు 5:22, 23) మీ పిల్లలకు దైవిక మార్గాలను బోధించుటకు చేసే మీ ప్రయత్నాలను ఓపిక, అవగాహన, క్షమాగుణం, మృదుత్వం వంటివి మరింత బలపరుస్తాయి.—కొలొస్సయులు 3:12-14.
21. ఒకరి గృహంలో ఒక స్నేహపూరితమైన, సంతోషభరితమైన వాతావరణాన్ని ఎలా కాపాడుకోగలరు?
21 దేవుని సహాయంతో, మీ గృహంలో సంతోషభరితమైన, స్నేహపూరితమైన వాతావరణాన్ని కాపాడుకోడానికి ప్రయత్నించండి. ప్రతిరోజు కనీసం ఒక్కపూటైనా కుటుంబ సమేతంగా కలిసి భోజనం చేయడానికి ప్రయత్నించడం ద్వారా సమయాన్ని కలిసి గడపండి. క్రైస్తవ కూటాలు, ప్రాంతీయ సేవ, కుటుంబ పఠనం తప్పనిసరి. అయినా, “నవ్వుటకు . . . నాట్యమాడుటకు” కూడా సమయము కలదు. (ప్రసంగి 3:1, 4) అవును, నిర్మాణాత్మక వినోదం కొరకు సమయాలను కేటాయించుకోండి. వస్తు ప్రదర్శన శాలలు, జంతు ప్రదర్శన శాలలు, అలాంటి మరితర స్థలాలు కుటుంబ సమేతంగా కలిసి సంతోషంగా గడపడానికి తగిన స్థలాలు. లేదా మీరు టివి ఆపేసి పాటలు పాడడం, సంగీతం వినడం, ఆటలు ఆడడం, మాట్లాడుకోవడం వంటివి చేస్తూ సమయం గడపవచ్చు. కుటుంబం సన్నిహితమవ్వడానికి ఇది సహాయపడుతుంది.
22. మీ కుటుంబ రక్షణ కొరకు మీరెందుకు కష్టపడి పనిచేయాలి?
22 “ప్రతి సత్కార్యములో సఫలులగుచు, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు” యెహోవాను ప్రీతిపర్చుటకు కృషిచేయడంలో క్రైస్తవ తల్లిదండ్రులైన మీరంతా కొనసాగుదురుగాక! (కొలొస్సయులు 1:10) దేవుని వాక్యానికి విధేయత చూపడమనే పటిష్ఠమైన పునాదిపై మీ కుటుంబాన్ని కట్టండి. (మత్తయి 7:24-27) మీరు “ప్రభువు (యెహోవా NW) యొక్క శిక్షలోను బోధలోను” మీ పిల్లలను పెంచాలనే మీ ప్రయత్నాలు ఆయన అంగీకారాన్ని పొందుతాయన్న ధైర్యాన్ని కలిగివుండండి.—ఎఫెసీయులు 6:4.
[అధస్సూచీలు]
a సెప్టెంబరు 8, 1992 అవేక్! నందలి “ది బైబిల్స్ వ్యూ పాయింట్: ‘ది రాడ్ ఆఫ్ డిసిప్లీన్’—ఈజ్ ఇట్ అవుట్-ఆఫ్-డేట్?” అనే శీర్షికను చూడండి.
b సెప్టెంబరు 15, 1980 ది వాచ్‌టవర్ 15-26 పేజీలు చూడండి.
c అక్టోబరు 15, 1984 ది వాచ్‌టవర్ 21-5 పేజీలు చూడండి.
మీరెలా సమాధానమిస్తారు?
◻ తమ కుటుంబాన్ని కట్టడంలో భార్యాభర్తలు ఎలా సహకరించగలరు?
◻ పిల్లల యొక్క భావోద్రేకపరమైన అవసరతలు ఏమిటి, అవి ఎలా తీర్చబడగలవు?
◻ కుటుంబ శిరస్సులు తమ పిల్లలకు వాడుకగా మరియు తటస్థంగా ఎలా బోధించగలరు?
◻ తల్లిదండ్రులు ఎలా నీతి యందు శిక్ష చేయగలరు?
◻ తల్లి లేక తండ్రి మాత్రమే ఉన్న కుటుంబాలు మరియు సవతితల్లి లేదా మారుడుతండ్రి ఉన్న కుటుంబాల ప్రయోజనార్థం ఏమి చేయబడవచ్చు?
[16వ పేజీలోని చిత్రం]
పిల్లవాని భావోద్రేక ఎదుగుదలకు తండ్రి యొక్క ప్రేమ, అంగీకారం ప్రాముఖ్యము