1993 “దైవిక బోధ” జిల్లా సమావేశము నుండి పూర్తిగా ప్రయోజనం పొందుట
1 “యెహోవా, నాకు బోధింపుము.” (కీర్తన. 86:11) ఇది ప్రతి ఒక్క సమర్పిత దేవుని సేవకుని హృదయపూర్వక విన్నపమై యుండాలి. మనం ఎన్నడూ నేర్చుకోవడం, మనం నేర్చుకొన్నవాటిని అవలంభించడం ఆపకూడదని గట్టిగా నిర్ణయించుకోవాలి. కొన్నిసార్లు మనం మళ్లీ సరిచేయబడలసిన అవసరత వుండవచ్చు, కీర్తనల రచయిత చేసినట్లు, మన హృదయం విభాగింపబడకుండునట్లు ఏకదృష్టిని కలుగజేయమని దేవుణ్ణి వేడుకోవాలి. ఈ విధానపు వత్తిడుల మధ్య యెహోవాను నమ్మకంగా సేవించుటకు మనల్ని మనం మళ్లీ సరిచేసుకొనుటకు అవసరమైన ఆచరణాత్మక సూచనలను “దైవిక బోధ” జిల్లా సమావేశ కార్యక్రమము అందజేస్తుంది.
2 నాలుగు-రోజుల సమావేశము: ఇండియా మొత్తంలో 16 అనుకూల ప్రాంతాలలో కార్యక్రమం అందజేయబడుతుంది. ఈ ప్రాంతాల పేర్లపట్టిక కావలికోట ఇంగ్లీషులో అయితే జూలై 15, 1993, ప్రాంతీయ భాషలలో అయితే మే 15, 1993 సంచికలలో ఇవ్వబడింది. కార్యక్రమం ఇంగ్లీషులోనే కాక, అస్సామి, బెంగాలీ, గుజరాతి, హిందీ, కన్నడ, కొంకని, మలయాళం, మరాఠి, తమిళం మరియు తెలుగు భాషలలో ఆయా ప్రాంతాలలో అందించబడుతుంది. చాలా ప్రాంతాలలో, గురువారం మధ్యాహ్నం 1:20 నిమి.లకు కార్యక్రమం ప్రారంభమై, దాదాపు ఆదివారం మధ్యాహ్నం 4:15 నిమి.లకు ముగుస్తుంది.
3 మనకొరకు ఏమి దాచబడివుంది? ప్రసంగాలు, ప్రదర్శనలు, ఇంటర్వ్యూలు, రెండు నాటకములతో పుష్కలంగా వివిధ రకాలుగా అందజేయబడే మంచి ఆత్మీయాహారం. ఈ ముఖ్యమైన ఉపదేశాల్లో దేన్ని చేజారనివ్వకండి! దానికి తోడు పాత సహవాసాలను పునరుద్ధరించి అనేక క్రొత్త సహవాసాల కొరకు మనము ఎదురుచూస్తున్నాము. విషేశ నియామకాలలో సేవచేస్తున్న మిషనరీలు మీ సమావేశానికి హాజరుకావచ్చు. ఈ నమ్మకస్థులైన సహోదర సహోదరీలను పరిచయం చేసుకొనే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీరు తల్లి లేక తండ్రి అయితే, మీ పిల్లలను కూడ సంభాషణలో యిమడ్చండి. సంతోషభరితులైన, స్వయం త్యాగశీలత గల ఈ మిషనరీలు మీ పిల్లల్లో పూర్తికాల సేవను తమ గమ్యంగా చేసుకొనుటకు పునాది వేయవచ్చు.
4 దశమ భాగాన్నంతటిని మీరు కొట్లలోకి తెస్తారా? మలాకీ 3:10 నందు, మొత్తం దశమభాగాలను కొట్లలోకి తెచ్చి తనను శోధించినట్లైతే, పట్టజాలనంత విస్తారంగా ఆశీర్వదిస్తానని యెహోవా ఇశ్రాయేలీయులకు వాగ్దానం చేశాడు.
5 కొంతమందికి, యెహోవాను శోధించడం అంటే సమావేశానికి హాజరు కావటానికి శెలవు కావాలని తమ యజమానిని సాధ్యమైనంత త్వరగా అడగటమవుతుంది. కొన్ని సార్లు దీనిని సమావేశానికి హాజరు కావటానికి యజమాని సెలవియ్యడని అనుకొని సహోదరులు యజమానిని అడగడానికి వెనుకాడారు. అయినా, ఆత్మీయ సంగతులు కాని విషయాలలో తాము ఏమి చేయాలని ఇష్టపడుతున్నారో యజమానికి తెలియజేయుటకు వెనుకాడరు లేదా అసలు యిబ్బందేపడరు.
6 మనల్ని మనమే ఇలా ప్రశ్నించుకోవాలి: మన ప్రియ స్నేహితుడు వేరే ప్రాంతంలో వివాహం చేసుకొంటుంటే, వివాహానికి హాజరగుటకు శెలవు కావాలని మనం మన యజమానిని అడగమా? అతను సంకోచిస్తుంటే, మనం వెళ్లడం ఎంత ప్రాముఖ్యమో అతనికి మర్యాదపూర్వకంగా వివరించమా? వివాహానికి హాజరవ్వడం కంటే యెహోవాచేత ఉపదేశింపబడడం నిజంగా చాలా ప్రాముఖ్యం! సమావేశ కార్యక్రమం నిజంగా మన ఆత్మీయ పెరుగుదలకు అత్యంత అవసరమని మనం భావిస్తే, సమావేశానికి హాజరు కావటానికి శెలవు ఇచ్చునట్లు యజమానిని ఒప్పించడం సులభమవుతుంది.—యాకోబు 1:7, 8.
7 ఇశ్రాయేలులో దశమభాగం అంటే యెహోవా ఆరాధనా స్థలం కొరకు వస్తురూపేణా మద్దతునివ్వడం అని అర్ధం. మన కాలంలో దశమభాగం, యెహోవా సేవలో మరియు రాజ్యపనికి మద్దతులో సూటిగా ఉపయోగింపబడే సమయం, శక్తి, ఆర్థిక సహాయాలను సూచిస్తుంది. దశమభాగంలో మనం కూటములలో, చిన్న, పెద్ద సమావేశాలలో, అలాగే మన సమావేశ స్థలాలను శుభ్రపరచి, వాటిని కాపాడుటలో గడిపే సమయం కూడ యిమిడివుంటుంది. యెహోవా ఆత్మీయ కొట్లలోకి మొత్తం దశమభాగాలను తేవటానికి “దైవిక బోధ” జిల్లా సమావేశం మనకు ఎన్నో అవకాశాలను ఇస్తుంది. వీటిలో కొన్ని ఏవి?
8 సమావేశ కార్యక్రమాన్ని ఆసక్తితో వినడం ద్వారా, ప్రతి కింగ్డమ్ సాంగ్‌ను ఉత్సాహవంతంగా పాడడం ద్వారా, హృదయపూర్వకంగా ఆమెన్ అనగల్గేలా ప్రతి ప్రార్థనను శ్రద్ధగా వినడం ద్వారా మనం మన దశమభాగాన్ని తీసుకురావచ్చు.
9 సత్యమందు మన అభివృద్ధి మనమెలా వింటామనే దానిపై చాలా వరకు ఆధారపడి వుంటుంది. పెద్ద స్టేడియంలో లేక ఆడిటోరియంలో, మన చుట్టూన్న ఇతరులు చేస్తున్నదానినిబట్టి మన ఏకాగ్రత దెబ్బతినడం సులువు, అందుచేత మనం ఏకాగ్రత నిలపాలి. మీ బైబిలు, పాటల పుస్తకం, పెన్ను, కాగితం, ఆ వారం చదువబడే కావలికోట సంచికను తీసుకుని సమావేశానికి పూర్తిగా సిద్ధపడి వస్తే, ప్రతి ప్రసంగీకుడు ఉపయోగించే లేఖనాలను, విషయాలను వ్రాసుకొనుటకు సహాయపడుతుంది. నోట్సు క్లుప్తంగా వ్రాసుకోండి; ఎక్కువ నోట్సు వ్రాసుకుంటుంటే మన ఏకాగ్రత దెబ్బతినవచ్చు. శ్రద్ధగా వినుటకు పిల్లలకు తర్ఫీదివ్వాలి. వీలైనంత శ్రద్ధగా కార్యక్రమాన్ని వినడం ద్వారా తమ తలిదండ్రులతోపాటు పిల్లలు దశమభాగాన్ని తీసుకురాగలరు.
10 కొంతమంది తలిదండ్రులు ప్రతిరోజు ఇంటివద్ద వారి పిల్లలు సంస్థ ప్రచురణలలోని చిత్రాలను చూడటానికి, లేదా చదవటానికి నిశ్శబ్ద సమయాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ఈ మంచి తర్ఫీదు పిల్లలు కూటములలో, సమావేశాల్లో నిశ్శబ్దంగా కూర్చోవటాన్ని సులభతరం చేస్తుంది. మాదిరికరమైన పిల్లలను పెంచిన తల్లిదండ్రులు, తాము ఎప్పుడూ పిల్లలు కూటములకు రంగులువేసే పుస్తకాలను లేక బొమ్మలను తెచ్చుకోవటాన్ని అనుమతించలేదని చెప్తారు. కూటములకు హాజరయ్యేది యెహోవాను ఆరాధించటానికని అతి చిన్న పిల్లలు కూడ తెలుసుకోవచ్చు. కొట్లలోనికి దశమభాగాన్నంతటిని తేవడమంటే ఏమిటో తమ పిల్లలకు నేర్పే తలిదండ్రులు నిజంగా మెచ్చుకొనదగినవారు!
11 సమావేశ వ్యవస్థీకరణకు సహాయం చేయటానికి మన సమయాన్ని, శక్తిని స్వచ్ఛందంగా ఇవ్వడం ద్వారా కూడ మనం దశమభాగాన్ని తేవచ్చు. చాలా ప్రాంతాలలో సమావేశం ప్రారంభం కావటానికి ఒకటి లేక రెండు రోజులు ముందే శుభ్రపరిచే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు. మీరు దగ్గరలో నివసిస్తుంటే, కుటుంబమంతా పాల్గొనుటకు ఎందుకు ఏర్పాటు చేసుకోకూడదు? కొంతమంది సహోదరులు అభివృద్ధి చెందుతున్న తమ బైబిలు విద్యార్థులు యెహోవా ఆరాధనకు మద్దతునిచ్చుటలో ఏమి ఇమిడివుందో బాప్తిస్మం తీసుకొనకముందే తెలుసుకొనులాగున తమతోపాటు తీసుకువచ్చారు. సమావేశం సజావుగా సాగేలా చేయుటకు ఎంతో చేయవలసింది వుంది. కుటుంబంగా మీరెందుకు స్వచ్ఛంద సేవ చేయకూడదు?
12 సమావేశానికి మన ఆర్థిక మద్దతు కూడ దశమభాగాన్ని తెచ్చుటకు ఒక మార్గం. స్వచ్ఛారాధనకు మద్దతు నిచ్చుటకు వస్తుసంబంధ అర్పణలు ఎలా ఇవ్వవచ్చో తెలియజేస్తూ, యెహోవా ఇశ్రాయేలు జనాంగానికి ఇలా ఆజ్ఞాపించెను: “వారు వట్టిచేతులతో యెహోవా సన్నిధిని కనబడక, నీ దేవుడైన యెహోవా నీ కనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతివాడును తన శక్తికొలది యియ్యవలెను.” (ద్వితీ. 16:16,1 17) ప్రజలు సమృద్ధిగా యివ్వగల్గినా లేక కొంచెమివ్వగల్గినా ముందుగా సిద్ధం చేయబడిన అర్పణ యెహోవాకు ప్రీతిపాత్రంగా ఉండేది. అలాగే, అనేకమంది సహోదరులు తామిచ్చే విరాళం గురించి, డబ్బు రూపేణా లేక వస్తు రూపేణా ఏదయినా, దాని గురించి ప్రార్థనాపూర్వకంగా ఆలోచిస్తారు. మీ చిన్న పిల్లలు చందాపెట్టెలో డబ్బు వేయుటకు మీరు అనుమతిస్తారా?
13 మన రక్షకుడైన దేవుని ఉపదేశాన్ని అలంకరించుకొనుము: మన మంచి మర్యాద, మంచి ప్రవర్తన ద్వారా మనం “అన్ని విషయములయందు మన రక్షకుడగు దేవుని ఉపదేశమును అలంకరించుకొనగలం.” (తీతు 2:10) అంటే సమావేశం వద్దనే, దైవిక బోధ మన జీవితాల్లో అన్వయించబడుతుందని మనం చూపించవచ్చు.
14 మన మర్యాద విషయమేమిటి? ఈనాటి ప్రపంచంలో ఇతరుల గురించి పట్టించుకోవటం అరుదు. కాని లేఖనాధార సూత్రాలచే నడిపించబడుతున్న యెహోవా ప్రజలు, వారి స్వంత ప్రయోజనాన్ని గురించి కాదు గాని తమ తోటివారి ప్రయోజనమును గూర్చి ఆలోచిస్తారు. (ఫిలిప్పీ. 2:4) మన చుట్టూవున్న వారి గురించి మనం శ్రద్ధ కలిగివుంటాము. ఆహారం లేదా ప్రచురణల కొరకు లైనులో నిలబడివున్నప్పుడు మనం తోసుకోము, నెట్టుకోము. మనం వృద్ధుల యెడల తమ తలిదండ్రులతో కలిసి వరుసలో నిలబడివున్న చిన్న పిల్లల యెడల, వారిని గమనించని పెద్దవారిచే సుళువుగా నెట్టివేయబడగల పిల్లల గురించి శ్రద్ధ తీసుకుంటాము. రెస్టారెంట్‌ల్లో పనిచేసేవారితో మర్యాదగా, దయగలవారమై వుంటాము కాని, మన అంచనాల ప్రకారం వారి సేవలు లేవని వాళ్లతో అధికారంగా మాట్లాడం, కఠినంగా వ్యవహరించం. వారి సేవల గురించి కారణసహితమైన టిప్స్నిచ్చే వాడుక అమలుపరచుటకు మనం సంతోషిస్తాము.
15 మన చుట్టూ వున్న వారిపై మన దైవభక్తిగల ప్రవర్తన నిజమైన ప్రభావాన్ని చూపుతుంది. గత సంవత్సరం ఒక సమావేశ నగరంలో, పోలీసు దళమందు 21 సంవత్సరాల నుండి సేవచేస్తున్న ఒక పోలీసు ఇలా చెప్పాడు: “మీ ప్రజల క్రమశిక్షణను చూసి నేను ప్రభావితుడనయ్యాను. [వారు] విశిష్టమైన వ్యక్తులు; వారు ఎవరూ చెప్పకముందే చెత్తను తీసివేస్తారు, వారు క్రమమైనవారు, మీ సమావేశం కూడా బాగా సంస్థీకరింపబడింది. మీ ప్రజలు మమ్మల్ని చూసినప్పుడు చిరునవ్వు నవ్వుతారు. అది మంచి సూచన. మేము దానికొరకు చూస్తాము. అది స్నేహభావానికి గుర్తు అందులో దాపరికమేమిలేదు. పిల్లలు కూడా ఎలా తమ తలిదండ్రులతో, మంచి క్రమశిక్షణలో వున్నారో కూడా మేము గమనించాము. నన్ను నమ్మండి నేను ప్రభావితుడనయ్యాను. ఇక్కడ పనిమీద నియమింపబడటం ఆనందదాయకం.”
16 తమ నగరంలో సమావేశం ఏర్పాటు చేయమని ఆహ్వానించుటకు కొంతమంది అధికారులు బేతేలుకు ప్రత్యేకంగా పనికట్టుకొని వచ్చారు. సంస్థ వారి దయాపూర్వక ఆహ్వానాన్ని అంగీకరించింది, వారు నిరుత్సాహపడలేదు. డిప్యూటి సిటీ మేనేజరు ఇలా అన్నారు: “మా నగరంలో మీవంటి గౌరవప్రదమైన గుంపు మాతో సమావేశమవుతున్నందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాము. మిమ్మల్ని ఇక్కడికి రప్పించుటకు మేము చాలా కష్టపడ్డాము . . . మేము ఇంతకంటే సంతోషించడానికి వేరే ఏముంది? తమ మంచి ప్రవర్తన ద్వారా ప్రతి సహోదరుడు, సహోదరి అక్కడ ఒక అద్భుతమైన సాక్ష్యానిచ్చారు.
17 మన రక్షకుడైన దేవుని ఉపదేశాన్ని మీ మాదిరికరమైన ప్రవర్తన ద్వారా వ్యక్తిగతంగా అలంకరిస్తారా? ఇది చేయటానికి ఇక్కడ అనేక విధానాలున్నాయి:
దుస్తులు మరియు కేశాలంకరణ: మనం సమావేశానికి హాజరవుతున్న సమయంలో మనం సెలవుల్లో వున్నట్లు భావించరాదు. మనం యెహోవా చేత ఉపదేశింపబడుటకు మనం ఆయన యెదుటకు వెళ్తున్నాము. అలాగైతే, కింగ్డం హాలులో కూటములకు హాజరవుతున్నప్పుడు ధరించినరీతిగా మనం వస్త్రాలు ధరించవద్దా? (1 తిమో. 2:9, 10) దానికి తోడు, సమావేశం అయిపోయిన తరువాత మనమే వస్త్రాలు ధరిస్తామనే దాన్ని గూర్చి జాగ్రత్తగా ఆలోచించాలి. మన వసతికి తిరిగివచ్చిన తరువాత, మన వయస్సు ఏదైనప్పటికీ, సమావేశానికి వేసుకున్న మంచి గౌరవప్రదమైన వస్త్రాలకు బదులు అసహ్యమైన వస్త్రాలు ధరించుట సబబుగా వుంటుందా? మనం కూటములకు ధరించే వస్త్రాలు కేవలం వేషమేకాని మన జీవిత విధానాన్ని ప్రతిబింబించేవి కాదన్న భావాన్ని ఇది కలుగజేయదా? మనం యెహోవా నామాన్ని ధరిస్తున్నామని, సత్యానికి వ్యతిరేకంగా సహేతుకమైన ఆరోపణ రాకుండ మనలో ప్రతిఒక్కరము చూడాలని గుర్తుంచుకోండి.
లోకసంబంధమైన నినాదాలతో, లోగోస్తో, లేక వ్యాపార ప్రకటనలతో వున్నటి చొక్కాలను బాప్తిస్మం పొందే పవిత్ర సందర్భంలో వేసుకోవడం తగదని బాప్తిస్మం తీసుకునే వారికి గుర్తుచేయాలి. బాప్తిస్మమునకు సంబంధించిన ప్రశ్నలు ముందే పునఃసమీక్షించబడునట్లు, ప్రతి అభ్యర్థికి అతడు బాప్తిస్మం కొరకు ఆమోదింపబడ్డాడో లేదో సమయానికి ముందుగానే తెలియజేయునట్లు పెద్దలు చూసుకోవాలి. (ప్రశ్నలు పరిశీలిస్తున్నప్పుడే, బాప్తిస్మానికి మంచి, మర్యాదపూర్వకమైన వస్త్రాల గురించి సలహాలు ఇవ్వటానికి తగిన సమయం.)
హోటళ్లు: మీ హోటలు అవసరతలను కోరుతున్నప్పుడు ఆత్మ ఫలాలను ప్రదర్శించండి. తక్కువ సమయంలో పెద్ద గుంపు వ్యవహారాలను హోటలు సిబ్బంది నిర్వహించ లేకపోవచ్చు. సహనంతో వుండండి, సానుభూతి కలిగివుండి, తగిన విధంగా టిప్స్ ఇవ్వండి.
హోటలు ఆస్తిపాస్తుల యెడల గౌరవం చూపించడం ద్వారా, అక్కడి సదుపాయాలను ఉపయోగించుకొనుటకు వున్న రూల్స్‌ను పాటించడం ద్వారా పిల్లలు తమ వంతు తాము చేయవచ్చు. సమావేశానికి ముందు తల్లిదండ్రులు తమ పిల్లలతో ఎటువంటి ప్రవర్తన కలిగివుండాలి, ప్రవర్తన విషయంలో క్రైస్తవ కట్టడలకు అనుగుణ్యంగా వుండుటలో వారి వ్యక్తిగత బాధ్యత ఏమిటో గుర్తు చేసి వారితో పునఃసమీక్షించుటకు కొంత సమయం గడపటం సహాయకరంగా వుంటుంది.
రికార్డింగు సాధనాలు: వీడియో కెమెరాలు అనుమతించబడినప్పటికీ, మీరు ఇతరుల యెడల శ్రద్ధకలిగివుంటారని మాకు తెలుసు. కార్యక్రమాన్ని చిత్రీకరిస్తున్నప్పుడు తోటి సమావేశకుల దృష్టికి అడ్డువెళ్లటం మంచిదికాదు. మీ స్థలం నుండే మీరు జ్ఞానయుక్తంగా రికార్డు చేసుకొనగలిగితే, మీరు అలా చేయుటకు అభ్యంతరమేమి వుండదు. సమావేశం వద్దవున్న ఎలక్ట్రికల్ లేదా సౌండు సిస్ట్మ్కు కెమెరాలుగాని, లేక రికార్డు చేసే సాధనాలుగాని కనెక్ట్ చేయరాదు, నడిచే ప్రదేశంలోగాని లేక సీట్లమధ్య స్థలంలోగాని పరికరాలను పెట్టరాదు.
కూర్చునే స్థలాలు: మీ కుటుంబ సభ్యులకొరకు, లేదా మీతోపాటు మీ కారులో ప్రయాణిస్తున్నవారికి మాత్రమే సీట్లు వుంచవచ్చునని గుర్తుంచుకోండి. కొన్ని సమావేశాలలో వృద్ధులకు, వికలాంగులకు ప్రత్యేక విభాగాలు వుంటాయి. వృద్ధులకొరకు కేటాయింపబడిన సీట్లలో పిల్లలు కూర్చున్నందువల్ల కొన్నిసార్లు వృద్ధసహోదరులకు ఇబ్బంది కలిగే స్థలాలలో సీట్ల కొరకు చూడవలసి వచ్చింది. ఎలర్జీ వంటి సమస్యలున్న వారికొరకు వేరుగా స్థలాలుగాని, రూములుగాని ఏర్పాటు చేయమని చేసె విన్నపములకు తగినట్లు ఏర్పాటు చేయుటకు మాకు సాధ్యంకాదు గనుక చింతిస్తున్నాము.
వ్యక్తిగత వస్తువులు: మీరు సమావేశానికి తీసుకొని వచ్చే వ్యక్తిగత వస్తువులు చాలా తక్కువగా తెచ్చుకోవాలని సలహా ఇవ్వబడుతుంది. ఏదైనా వస్తువు మీ సీటు క్రింద సరిపోకపోతే, దాన్ని ఇంటివద్దగాని, కారులోగాని వదిలి రావడం బాగుంటుంది. సురక్షిత కారణాలను బట్టి, పెద్ద నీళ్ల జగ్గులు సీట్ల మధ్య పెట్టుటకు అనుమతించబడవు, మీ ప్రక్క సీట్లో పెట్టుకున్నట్లైతే ఎవరికైనా సీటు లేకుండా పోవచ్చు.
సాహిత్యం మరియు ఆహార సేవలు: ఏదీ వ్యర్థం చేయబడకుండ, దేవుని మంచి ఈవులన్నిటి కొరకు మెప్పు చూపించాలని మనందరమూ కోరుకుంటాము. (యోహాను 6:12) మీకు అవసరమైన దాని కంటే ఎక్కువ తీసుకోకుండా జాగ్రత్తపడండి. ఆహారాన్ని వ్యర్థం చేయకూడదని తలిదండ్రులు పిల్లలతో చెప్పాలి. సాహిత్యం అందజేయబడుతున్నపుడు ఇతరుల యెడల ప్రేమపూర్వక శ్రద్ధను కనపర్చండి.
18 ఇతరుల పట్ల ప్రేమపూర్వక శ్రద్ధ చూపించుటలో, ప్రతి రోజు ముఖ్యంగా గురువారంనాడు, సీట్లు మరియు వాహనాలు నిలిపే స్థలాల కొరకు సాధారణంగా ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి త్వరగా రావటానికి పథకం వేసుకొనండి.
19 యెహోవాచే ఉపదేశింపబడుటకు మనమెంత ఆధిక్యతగలవారము! ఈ వేసవిలో “దైవిక బోధ” జిల్లా సమావేశానికి మద్దతునిచ్చుటకు మన సమయాన్ని, శక్తిని, వస్తుసంపత్తిని ఉపయోగించడం వల్ల మనకు, మన కుటుంబానికి నిత్య ఆత్మీయ ప్రయోజనం లభిస్తుంది.
[6వ పేజీలోని బాక్సు]
జిల్లా సమావేశ జ్ఞాపికలు
సరైన ప్రవర్తన: సమావేశ స్థలాన్ని “దేవుని ఇల్లు”గా గౌరవపూర్వకంగా దృష్టించి, సమావేశానికి హాజరగు వారందరు తగిన మర్యాద పాటించుట ప్రాముఖ్యము. (కీర్తన. 55:14) ప్రసంగాలు, నాటకములు, పాటలు, ముఖ్యంగా ప్రార్థనల సమయంలోను కార్యక్రమాన్ని వినుచున్న ఇతరుల ఏకాగ్రతను చెడగొట్టే దేనిని చేయకండి. అనవసరంగా ఇటుఅటు తిరగడం, సంభాషిస్తుండడం, లేక ఏకాగ్రతతో వినటానికి ప్రయత్నిస్తున్న వారి ఆసక్తిని పాడుచేసే విధంగా ఫ్లాష్గల కెమెరాలు లేదా వీడియో రికార్డర్లను ఉపయోగించటం మర్యాదకాదు. మన ఆధ్యాత్మిక చింత, మంచి ప్రవర్తన మనం నిజంగా దైవిక బోధను మెచ్చుకుంటున్నామని, యెహోవా చేత ఉపదేశింపబడటానికి వచ్చామని తెలియజేస్తాయి.
వసతి: సమావేశము యొక్క రూములు కేటాయించే విభాగంతో మీ సహకారం ఎంతో మెచ్చుకొనదగినది. సరైన సమావేశ చిరునామాకు రూముల కొరకైన వినతిపత్రాలు చేరేలా సంఘ సెక్రటరీలు చూడాలి. మీరు ఇప్పటికే రిజర్వు చేయించుకొనకపోతే, వెంటనే ఆ పని చేయండి. మీ రిజర్వేషన్‌ను కేన్సిల్ చేయించుకోవాలనుకుంటే సమావేశ హెడ్‌క్వార్టర్స్ చిరునామాకు వ్రాయడంకాని లేదా ఫోను చేయడం కాని చేయాలి, వీలయితే, హోటలుకు సాధ్యమైనంత త్వరగా తెలియజేస్తే ఇతరులకు రూము దొరకవచ్చు. మీకు ఒకవేళ ప్రయివేటు స్థలం దొరికినట్లైతే, మీరు ఎవరివద్ద వుంటున్నారో ఆ వ్యక్తికి, అలాగే సమావేశ హెడ్‌క్వార్టర్స్‌కు వీలయినంత త్వరగా తెలియజేయండి.
బాప్తిస్మము: బాప్తిస్మం తీసుకునే అభ్యర్థులు శనివారం ఉదయం కార్యక్రమం ప్రారంభంకాక మునుపు వారికొరకు కేటాయించిన స్థలంలో వారి సీట్లలో ఉండాలి. బాప్తిస్మం తీసుకోవాలనుకునే ప్రతి ఒక్కరు మంచి వస్త్రాలు, ఒక తువాలు తెచ్చుకోవాలి. బాప్తిస్మం ప్రసంగము, ప్రసంగీకుడు చేసే ప్రార్థన అయిన తరువాత, కార్యక్రమ అధ్యక్షుడు బాప్తిస్మం తీసుకునే అభ్యర్థులకు కొన్ని సూచనలు ఇచ్చిన పిదప పాట పాడుటకు ఆహ్వానించును. ఆఖరి చరణం ముగించిన తరువాత, అటెండెంట్లు బాప్తిస్మం తీసుకునే అభ్యర్థులను బాప్తిస్మ స్థలానికి లేక వాహనాల యొద్దకు వారిని తీసుకుని వెళతారు. ఒక వ్యక్తి సమర్పణను సూచించే బాప్తిస్మం అనేది ఆ వ్యక్తికి, యెహోవాకు మధ్య వుండే సన్నిహిత మరియు వ్యక్తిగత విషయం, బాప్తిస్మం తీసుకునేటప్పుడు చేతులు పట్టుకుని లేదా ఒకరిని ఒకరు పట్టుకుని ఇద్దరు లేక ఎక్కువమంది కలిసి తీసుకునే భాగస్వామ్య బాప్తిస్మ ఏర్పాట్లు లేవు.
స్వచ్ఛంద సేవ: జిల్లా సమావేశం చక్కగా నిర్వహించబడుటకు స్వచ్ఛంద సేవకుల సహాయం అవసరము. మీరు కేవలం సమావేశ కొంతభాగంలో మాత్రమే పనిచేయ గలిగినా మీ సేవలు మెచ్చుకొనబడతాయి. మీరు సహాయం చేయగలిగితే, సమావేశం యొక్క స్వచ్ఛంద సేవా విభాగానికి తెలియజేయండి. పదహారు సంవత్సరాలకంటే తక్కువ వయస్సున్నవారు కూడా సమావేశం విజయవంతమవ్వటానికి దోహదపడవచ్చు, కాని వారు తల్లి లేక తండ్రితో గాని లేదా ఒక బాధ్యతాయుత వ్యక్తితోగాని కలిసి పనిచేయాలి.
బ్యాడ్జి కార్డులు: సమావేశానికి వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు, సమావేశంలోను ప్రత్యేకంగా రూపొందించబడిన బ్యాడ్జికార్డులను ధరించండి. ప్రయాణిస్తున్నప్పుడు మంచి సాక్ష్యం ఇవ్వటానికి ఇది మనకు అవకాశం కల్పిస్తుంది. విశదంగా వ్రాయబడివున్న బ్యాడ్జికార్డుచే సమావేశ ప్రతినిధిగా గుర్తింపబడటమే కాక, అది ఆహార సరఫరా ఏర్పాటును సులభతరం చేస్తుంది. బ్యాడ్జి కార్డులు సమావేశం వద్ద లభించవు గనుక, వాటిని మీ సంఘము ద్వారా పొందాలి.
వ్యక్తిగత గుర్తింపు: “దైవిక బోధ” సమావేశ లేపల్ కార్డులతోపాటు, వారివారి మెడికల్ డైరెక్టివ్ కార్డును కూడా దగ్గర వుంచుకోవాలని ప్రోత్సహిస్తున్నాము. బేతేలు కుటుంబ సభ్యులు, పయినీర్లు కూడ తమ గుర్తింపు కార్డులను తమ దగ్గర వుంచుకోవాలి.
హెచ్చరిక మాటలు: మీరు ఎక్కడ నిలిపినప్పటికీ, మీరు మీ వాహనాలకు అన్ని వేళలా తాళంవేయాలి, బయటికి కనిపించేలా ఏది ఎప్పుడూ వుంచవద్దు. మీ వస్తువులను వీలయితే లోపలే తాళంవేసి వుంచండి. పెద్ద గుంపులచే ఆకర్షింపబడే జేబుదొంగలను గూర్చి దొంగలను గూర్చి కూడా జాగ్రత్తగా వుండండి. సమావేశం వద్ద ఎవరూ లేనప్పుడు సీట్లలో ఏదయినా విలువైన వస్తువులను విడిచిపెట్ట వద్దు. సమావేశ స్థలం నుండి పిల్లలను దూరంగా తీసుకువెళ్లుటకు అపనమ్మకస్థులైన వ్యక్తులు ప్రయత్నించిన రిపోర్టులు కూడా వున్నాయి. దయచేసి జాగ్రత్తగా వుండండి.
కొన్ని హోటళ్లు అవినీతితో కూడిన లేక అశ్లీల సంబంధమైన దూరదర్శన్ సినిమాలను కూడా వేస్తున్నాయని రిపోర్టు అందింది. ఈ వసతి స్థలాలలో పిల్లలు పెద్దల పర్యవేక్షణలేకుండ టీవి చూడటాన్ని అరికట్టవలసిన అవసరతను ఇది ఉన్నతపరుస్తుంది.
కొంతమంది సహోదరులు, ఆసక్తిగలవారు సమావేశ హాలు యొక్క యాజమాన్యాన్ని సమావేశ ప్రారంభ సమయాలను గూర్చిన సమాచారాన్ని, ఇంకా ఇతర విషయాలను తెలుసుకొనుటకు ఫోను చేశారు. దయచేసి అలా చేయకండి. మీకు అవసరమైన సమాచారం కావలికోట లేక మన రాజ్య పరిచర్య నందు కనుగొనలేకపోతే, జూలై 1993 మన రాజ్య పరిచర్య నందలి లిస్టు నుండి తగిన సమావేశ చిరునామాకు మీరు వ్రాయండి.