1 కొరింథీయులు
9 నేను ఏది అనుకుంటే అది చేసే స్వేచ్ఛ నాకు లేదా? నేను అపొస్తలుణ్ణి కానా? మన ప్రభువైన యేసును నేను చూడలేదా? ప్రభువు సేవలో నేను పడిన కష్టానికి మీరు ఫలితం కాదా? 2 నేను ఇతరులకు అపొస్తలుణ్ణి కాకపోయినా, మీకైతే అపొస్తలుణ్ణే! నేను ప్రభువుకు అపొస్తలుణ్ణని రుజువుచేసే ముద్ర మీరే.
3 నన్ను విచారణ చేసేవాళ్లకు నా వాదన వినిపిస్తున్నాను: 4 వేరేవాళ్ల దగ్గర తినే హక్కు,* తాగే హక్కు మాకు లేదా? 5 మిగతా అపొస్తలుల్లా, ప్రభువు తమ్ముళ్లలా, కేఫాలా* విశ్వాసియైన భార్యను* వెంట తీసుకెళ్లే హక్కు మాకు లేదా? 6 నేను, బర్నబా మాత్రం జీవనం కోసం కష్టపడాలా? 7 ఏ సైనికుడైనా సొంత ఖర్చుతో సైన్యంలో పనిచేస్తాడా? ద్రాక్షతోట వేసి దాని పండ్లు తిననివాళ్లు ఎవరైనా ఉంటారా? మందను కాసి, వాటి పాలు తాగనివాళ్లు ఎవరైనా ఉంటారా?
8 నేను చెప్పే విషయాలు కేవలం మనుషుల ఆలోచన మీదే ఆధారపడి ఉన్నాయా? ధర్మశాస్త్రం కూడా ఈ విషయాలు చెప్పట్లేదా? 9 మోషే ధర్మశాస్త్రంలో ఇలా రాసివుంది: “నూర్చే ఎద్దు మూతికి చిక్కం వేయకూడదు.” దేవుడు కేవలం ఎడ్ల గురించి ఆలోచించే ఆ మాట అన్నాడా? 10 లేక, మన కోసం ఆ మాట అన్నాడా? దున్నేవాడు, నూర్చేవాడు పంటలో కొంత దొరుకుతుందనే ఆశతో పనిచేయడం సరైనదే, కాబట్టి అది నిజంగా మన కోసమే రాయబడింది.
11 మీ మధ్య దేవునికి సంబంధించిన విషయాలు విత్తిన మేము, మా అవసరాలకు కావాల్సినవి మీ దగ్గర తీసుకోవడం తప్పా? 12 మీ దగ్గర తీసుకునే హక్కు వేరేవాళ్లకే ఉంటే, మాకు ఇంకెంత ఉండాలి? అయినా, మేము ఈ హక్కును* వినియోగించుకోలేదు. క్రీస్తు గురించిన మంచివార్త వ్యాప్తికి ఏ రకంగానూ అడ్డుపడకూడదని మేము అన్నిటినీ సహిస్తున్నాం. 13 ఆలయంలో పవిత్ర సేవలు చేసేవాళ్లు ఆలయంలోనివి తింటారనీ, ఎప్పుడూ బలిపీఠం దగ్గర సేవచేసేవాళ్లు బలిపీఠం మీద అర్పించిన దానిలో కొంతభాగం పొందుతారనీ మీకు తెలీదా? 14 ఈ విధంగా కూడా, మంచివార్త ప్రకటించేవాళ్లు మంచివార్త ద్వారానే పోషించబడాలని ప్రభువు ఆజ్ఞాపించాడు.
15 కానీ నేను ఈ ఏర్పాట్లలో ఒక్కటి కూడా ఉపయోగించుకోలేదు. అలాగని, ఇప్పుడు మీరు నాకు అవన్నీ చేయాలనే ఉద్దేశంతో ఈ విషయాలు రాయట్లేదు. ఏమీ తీసుకోకుండా మంచివార్త ప్రకటిస్తున్నానని నేను గొప్పగా చెప్పుకునే అవకాశాన్ని పోగొట్టుకోవడం కన్నా చావడం మేలు. 16 అయితే నేను మంచివార్త ప్రకటిస్తున్నానంటే, అందులో గొప్పలు చెప్పుకోవాల్సిందేమీ లేదు, ఎందుకంటే ప్రకటించడం నా బాధ్యత. నేను మంచివార్త ప్రకటించకపోతే నిజంగా నాకు శ్రమ! 17 నేను ఆ పనిని ఇష్టంగా చేస్తే నాకు ప్రతిఫలం దక్కుతుంది; ఒకవేళ నేను ఆ పనిని ఇష్టం లేకుండా చేసినా, దేవుడు అప్పగించిన బాధ్యత నా మీద అలాగే ఉంటుంది. 18 మరైతే నాకు వచ్చే ప్రతిఫలం ఏమిటి? మంచివార్త ప్రకటించే విషయంలో నాకున్న అధికారాన్ని* దుర్వినియోగం చేయకుండా ఉండడానికి దాన్ని ఉచితంగా ప్రకటించడమే నాకు వచ్చే ప్రతిఫలం.
19 నేను ఏ మనిషికీ దాసుణ్ణి కాకపోయినా, ఎంతమందిని వీలైతే అంతమందిని సంపాదించుకోవడానికి నన్ను నేను అందరికీ దాసునిగా చేసుకున్నాను. 20 యూదుల్ని సంపాదించుకోవడానికి యూదులకు యూదునిలా అయ్యాను; నేను ధర్మశాస్త్రం కింద లేకపోయినా, ధర్మశాస్త్రం కింద ఉన్నవాళ్లను సంపాదించుకోవడానికి ధర్మశాస్త్రం కింద ఉన్నవాడిలా అయ్యాను; 21 ధర్మశాస్త్రం లేనివాళ్ల కోసం నేను ధర్మశాస్త్రం లేనివాడిలా అయ్యాను. నిజానికి నేను దేవుని ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాను, క్రీస్తు నియమం కింద కూడా ఉన్నాను. అయినా, ధర్మశాస్త్రం లేనివాళ్లను సంపాదించుకోవడానికి ధర్మశాస్త్రం లేనివాడిలా అయ్యాను. 22 బలహీనుల్ని సంపాదించుకోవడానికి బలహీనులకు బలహీనుణ్ణి అయ్యాను. ఎలాగైనా కొందరిని రక్షించాలనే ఉద్దేశంతో, అన్నిరకాల ప్రజలకు సహాయం చేయడానికి శాయశక్తులా కృషి చేశాను. 23 మంచివార్త కోసం, దాన్ని ఇతరులకు ప్రకటించడం కోసం నేను అన్నీ చేస్తాను.
24 పరుగుపందెంలో అందరూ పరుగెత్తినా, ఒక్కరే బహుమతి గెల్చుకుంటారని మీకు తెలియదా? అందుకే మీరు బహుమతి గెల్చుకునేలా పరుగెత్తండి. 25 పోటీలో పాల్గొనే ప్రతీ ఒక్కరు* అన్ని విషయాల్లో నిగ్రహం పాటిస్తారు. వాళ్లు అలా చేసేది పాడైపోయే కిరీటం కోసం; కానీ మనం పాడవ్వని కిరీటం కోసం చేస్తున్నాం. 26 కాబట్టి, నేను గమ్యం లేకుండా పరుగెత్తట్లేదు; నేను చేసే ప్రయత్నాలు గాలిని గుద్దినట్టు ఉండకుండా చూసుకుంటున్నాను; 27 అయితే ఇతరులకు ప్రకటించిన తర్వాత, ఏవిధంగానూ దేవుడు నన్ను తిరస్కరించే* పరిస్థితి రాకూడదని నేను నా శరీరాన్ని అదుపులో పెట్టుకుంటున్నాను,* దాన్ని నా బానిసగా చేసుకుంటున్నాను.