మీ పిల్లల కొరకు మీరు ఏ లక్ష్యాలను ఉంచారు?
1 జీవితంలో సాఫల్యత అనేది ప్రయోజనకరమైన లక్ష్యాలను ఉంచుకోవడంపై మరియు సాధించడంపై ఆధారపడి ఉంటుంది. ఎవరైతే నిస్సారమైన లేక అవాస్తవికమైన లక్ష్యాలను వెంబడిస్తారో వారు నిరాశను మరియు అసంతృప్తిని చెందుతారు. “వాస్తవమైన జీవమును సంపాదించుకొను”టకు ఏ లక్ష్యాలను వెంబడించాలి అని వివేచించడానికి జ్ఞానం అవసరం. (1 తిమో. 6:19) యెహోవా తన వాక్యం ద్వారా, సంస్థ ద్వారా మనం ఏ దారిన వెళ్ళాలో కచ్చితంగా చూపిస్తున్నందున మనమెంత కృతజ్ఞులమో!—యెష. 30:21.
2 అలాంటి ప్రేమపూర్వకమైన నడిపింపును ఇవ్వడం ద్వారా, యెహోవా తలిదండ్రులకు మంచి మాదిరినుంచుతున్నాడు. ఏ మార్గం మంచిదో ఎన్నుకొనే పనిని అనుభవంలేని తమ పిల్లలకు వదిలేసే బదులు, జ్ఞానంగల తలిదండ్రులు వారు వెళ్ళవలసిన దారిలో వారికి తర్ఫీదునిస్తారు, వారు పెద్దవారైనప్పుడు, ‘దాని నుండి తొలగిపోరు.’ (సామె. 22:6) తాము తమ స్వబుద్ధిని ఆధారము చేసుకోలేరని, యెహోవాను ఆశ్రయించాలని క్రైస్తవ తలిదండ్రులు అనుభవం నుండి తెలుసుకున్నారు. (సామె. 3:5, 6) ఎక్కువ జ్ఞానం, అనుభవం లేని పిల్లలకు ఈ అవసరం ఇంకా ఎక్కువగా ఉంటుంది.
3 “శ్రేష్ఠమైన కార్యముల”పై శ్రద్ధ నిలపడానికి సహాయపడే ప్రయోజనకరమైన లక్ష్యాలను తలిదండ్రులు తమ పిల్లల ముందు పెట్టవచ్చు. (ఫిలి. 1:10) వారు కుటుంబ పఠనంతోనే దాని ప్రాముఖ్యతను గుణగ్రహించడానికి మరియు దానిని నుండి నేర్చుకోవడానికి పిల్లలను ప్రోత్సహించనారంభించగలరు. సంఘ కూటాల కొరకు ముందుగా పఠించే, తమ స్వంత మాటల్లో వ్యాఖ్యానాలను అందించేందుకు సిద్ధం అయ్యే అలవాటును చేసుకోవడం పిల్లలకు మంచిది. ప్రకటనా పనిలో క్రమంగా పాల్గొనడం ప్రాముఖ్యం. కరపత్రాలను అందించడం ద్వారా, లేఖనాలను చదవడం ద్వారా లేదా పత్రికలను అందించడం ద్వారా చిన్న పిల్లలు పాల్గొనవచ్చు. వారు చదవగలిగినప్పుడు, దైవపరిపాలనా పాఠశాలలో పేరును చేర్చడం వారి ఆత్మీయ అభివృద్ధిని త్వరితం చేస్తుంది. బాప్తిస్మం పొందని ప్రచారకునిగా యోగ్యతను పొందడం లేదా బాప్తిస్మానికి అంగీకరించబడడం అనేది ఓ పెద్ద ముందడుగు.
4 తమ పిల్లలు యౌవనారంభంలోని సంవత్సరాలను సమీపిస్తుండగా, మరీ తొలి సంవత్సరాలైనప్పటికీ, వృత్తిసంబంధమైన వారి లక్ష్యాలను గూర్చి తలిదండ్రులు వారితో యథార్థంగా మాట్లాడాలి. పాఠశాల సలహాదారులు మరియు తరగతి విద్యార్థులు లోక ఇష్టానికనుగుణంగా, వస్తుదాయక అన్వేషణలవైపుకు వారిని ప్రభావితం చేయవచ్చు. రాజ్యాసక్తులను వదిలివేయకుండా తమ వస్తుదాయక అవసరాలను తీర్చుకునేందుకు సంసిద్ధులను చేసే, ఆచరణాత్మక తర్ఫీదును ఇచ్చే పాఠశాల కోర్సులను ఎన్నుకోవడానికి తలిదండ్రులు తమ పిల్లలకు సహాయం చేయాలి. (1 తిమో. 6:6-10) వారు అవివాహితులుగా ఉండే “అనుగ్రహము”ను కాపాడుకోవడానికి ప్రోత్సహించవచ్చు, తర్వాత వారు వివాహం చేసుకోవాలని ఇష్టపడుతున్నట్లయితే, వివాహజీవితంలోని బరువైన బాధ్యతలను వహించే స్థితిలో వారు ఉంటారు. (మత్త. 19:10, 11; 1 కొరిం. 7:36-38) పయినీరింగ్, అవసరత ఎక్కువున్న చోట సేవ చేయడం, బేతేలు సేవ, లేదా మిషనరీ కార్యక్రమం మొదలగు వాటిని గురించి అనుకూలమైన విధంగా మాట్లాడడం, యెహోవాను ప్రీతిపర్చేవిధంగా, ఇతరులకు మేలు చేసే విధంగా, తమకు ఆశీర్వాదాలను తెచ్చే విధంగా తమ జీవితాలను ఉపయోగించుకోవాలనే కోరికను చిన్నతనం నుండే పిల్లల్లో కలిగించగలదు.
5 ఉన్నత క్రైస్తవ విలువలను కలిగి ఉండి, దైవపరిపాలనా లక్ష్యాలను వెంబడించే అనేకమంది యౌవనస్థులు సంస్థలో మనకు ఉండడం ఆకస్మికం కాదు. వారి సాఫల్యంలో అధికం వారి ప్రేమగల తలిదండ్రులకు ఆపాదించవచ్చు. మీరు తలిదండ్రులైతే, మీ పిల్లలు ఎటువైపుకు ప్రయాణిస్తున్నట్లు అనిపిస్తుంది? రాజ్యాసక్తులపై శ్రద్ధను కేంద్రీకరించే జీవితం వైపుకు వారు అభివృద్ధిని సాధిస్తున్నారా? మీరు చేయగలిగే ముఖ్యమైన పనుల్లో ఒకటేంటంటే, మీ పిల్లల్లో సత్యాన్ని పెంపొందించడం మరియు దానిని గూర్చి ప్రతిరోజు మాట్లాడడమేనని గుర్తుంచుకోండి. యెహోవాను నమ్మకంగా సేవించే కుటుంబంతో మీరు ఆశీర్వదించబడవచ్చు.—ద్వితీ. 6:6, 7; యెహో. 24:15.