అత్యవసర భావంతో సువార్తను అందించడం
1 దేవుని రాజ్య వాగ్దానాల ఎడల మన ప్రగాఢమైన మెప్పును, క్రైస్తవ పరిచర్యలో భాగం వహించడం ద్వారా కనపరుస్తాము. అత్యవసర భావంతో మనం ఈ పనిలో పాల్గొనాలి. ఎందుకు? ఎందుకంటే పనివారు కొద్దిమందే ఉన్నారు, ఈ దుష్టవిధానాంతం సమీపిస్తోంది మరి మన ప్రాంతంలో ఉన్న వారి ప్రాణాలు అపాయంలో ఉన్నాయి. (యెహె. 3:19; మత్త. 9:37, 38) అది అలాంటి బరువైన బాధ్యత కనుక పరిచర్యలో మనం శక్తిమేరకు ప్రయత్నించడం అవసరం. మన పరిచర్య పనిలో అత్యవసర భావాన్ని మనం ఎలా కనపర్చగలం? ముందుగానే మంచి అందింపులను సిద్ధపడడం ద్వారా, ప్రజలు ఎక్కడున్నా వారిని సమీపించడంలో శ్రద్ధకల్గివుండడం ద్వారా, ఆసక్తి కనపర్చేవారిని గూర్చి రాసిపెట్టుకోవడం ద్వారా, కనపర్చిన ఆసక్తిని పెంపొందించేందుకు తిరిగి వెళ్ళడం ద్వారా అంతేకాకుండా ఈ పనిలో జీవితాలు ఇమిడివున్నాయి కనుక మనం మన పరిచర్యను గంభీరంగా తీసుకోవాలని జ్ఞాపకం ఉంచుకోవడం ద్వారా మనం దాన్ని కనపరుస్తాము. ఫిబ్రవరి నెలలో, అత్యవసర భావంతో సువార్తను అందించేందుకు మనం సిద్ధపడడంలో ఈ కింది సలహాలు సహాయపడవచ్చు. మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు లేక మీ కుటుంబ జీవితమును సంతోషభరితముగా చేసికొనుము అనే పుస్తకాలను లేక రెండింటినీ అందించవచ్చు.
2 బహుశ సమాజంలో ఎదురయ్యే కొన్ని సమస్యలను గూర్చి చెబుతూ మీరు మీ సంభాషణను ప్రారంభించవచ్చు, మరి ఆ తర్వాత మీరు ఇలా చెప్పవచ్చు:
◼ “దేవుడున్నాడని చాలామంది నమ్ముతున్నారు కానీ, ‘మనకు ఆయన ఎలాంటి భవిష్యత్తునిస్తాడా?’ అని ఆలోచిస్తుంటారు. మీరైతే దానికి ఏమని చెబుతారు? [ప్రతిస్పందించనివ్వండి.] మానవజాతి విషయంలో దేవుని చిత్తం ఏమిటి, దాన్ని సాధించేందుకు ఆయన ఏ చర్యలను తీసుకుంటున్నాడు అనే విషయాలను గూర్చి బైబిలు ఏమి చెబుతుందో మీకు తెలుసా?” ప్రకటన 21:4 చదివి నిరంతరము జీవించగలరు పుస్తకంలోని 11వ పేజీలో ఉన్న చిత్రంతో ముడిపెట్టండి. మన భవిష్యత్తు ఎలా ఉంటుందో ఇంకా వివరంగా చూపించేందుకు 12-13 పేజీల్లోని చిత్రాలను చూపించండి. 12వ పేరాలో ఉన్న యెషయా 11:6-9ను చదవండి. పుస్తకాన్ని ప్రతిపాదించండి. మరలా వెళ్లి సంభాషణను కొనసాగించేందుకు అనువైన సమయాన్ని ఏర్పాటు చేసుకోండి.
3 ప్రకటన 21:4ను గూర్చి చేసిన చర్చను క్లుప్తమైన ఈ అందింపుతో మీరు పునఃప్రారంభించవచ్చు:
◼ “క్రితంసారి నేను వచ్చినప్పుడు, మానవాళి కొరకు నూతన లోకాన్ని తయారు చేస్తానని దేవుడు చేసిన వాగ్దానాన్ని గూర్చి మనం చర్చించుకున్నాం. [నిరంతరము జీవించగలరు పుస్తకంలోని 12-13 పేజీల్లోని చిత్రంవైపుకు వారి అవధానాన్ని మరలా మరల్చండి.] మీ కుటుంబం అలాంటి పరిసరాల్లో సంతోషంగా ఉండాలని మీరు కోరుకుంటున్నారా? [ప్రతిస్పందించనివ్వండి.] దేవుని వాగ్దానాలను ఎంత మటుకు నమ్మవచ్చు అన్నది ప్రశ్న. దీన్ని గూర్చి ఆయనే స్వయంగా ఏమి చెబుతున్నాడో దయచేసి గమనించండి.” తీతు 1:2వ వచనాన్నీ 56వ పేజీలోని 28వ పేరానూ చదవండి. అక్కడ ఇవ్వబడిన ప్రశ్నలోని (ఎ) భాగాన్ని అడగండి ఆ తర్వాత పేరా చివరి వాక్యంతో సహా దానిలోని జవాబువైపుకు అవధానాన్ని మరల్చండి. ఉచిత బైబిలు పఠనం నిర్వహిస్తామని చెప్పండి. తర్వాత దాన్ని ప్రదర్శించేందుకు ఏర్పాట్లను చేయండి.
4 కుటుంబంలో పెరుగుతున్న సమస్యల విషయంలో అనేకులకు చింత ఉంది కనుక, మొదటి సందర్శనంలో మీరు ఇలా చెప్పవచ్చు:
◼ “చాలామట్టుకు నేను కలిసిన వారందరూ ఈ రోజుల్లో కుటుంబాలకు ఎదురయ్యే సమస్యలను గూర్చి చింతిస్తున్నారు. [పాఠశాలల్లో కాలేజీల్లో మాదకద్రవ్యాల సమస్య, భార్యలు ఉద్యోగం చేయాల్సి వచ్చినప్పుడు ఇంటినీ పిల్లలను చూసుకోవడంలో వచ్చే ఇబ్బందుల వంటివాటిని కొన్నింటిని ప్రస్తావించండి.] దశాబ్దాలుగా మానవ సలహాదారులు ఈ విషయాలను గూర్చి సలహాలను ఇస్తూనేవచ్చారు మరి ప్రజలు వారు చెప్పినవాటిని వింటూవచ్చారు. అయినా పరిస్థితులు ఎందుకు విషమిస్తూనే ఉన్నాయంటారు? [ప్రతిస్పందించనివ్వండి.] పాతబడిపోయిందని కొందరు అనుకుంటున్నప్పటికీ అచరణాత్మమైనదిగా పదేపదే రుజువైన బైబిలు దీన్ని గూర్చి సలహాను అందిస్తోంది.” ఉదాహరణకు, కుటుంబ జీవితము పుస్తకంలోని 39వ పేజీలోని సామెతలు 10:19వ వచనాన్ని చదవండి. ఆ పేజీలోనూ ముందు పేజీలోనూ ఉన్న ఇతర లేఖనాలను చూపించి, ఈ పుస్తకం బైబిలులో ఉన్న కాలంతో నిమిత్తంలేని జ్ఞానాన్ని ఎలా ఆచరణయుక్తంగా అన్వయిస్తుందో వివరించండి. తిరిగి వెళ్లేందుకు ఏర్పాటు చేసుకుని కుటుంబ జీవితాన్ని ఎలా మెరుగుపర్చుకోవచ్చు అనే విషయాన్ని గూర్చి ఇంకా చర్చించండి.
5 ఒకరి కుటుంబ జీవితంలో ఆనందాన్ని ఎలా అధికంచేసుకోవచ్చో తెలిపేందుకు మరలా వస్తామని మీరు మాటిస్తే ప్రారంభంలో మీరు ఇలా చెప్పవచ్చు:
◼ “కుటుంబ జీవితాన్ని ఎలా మెరుగుపర్చాలి అన్నదానిపై మన చర్చను మనం కొనసాగించేందుకు నేను ప్రత్యేకంగా మీ దగ్గరికి మరలా వచ్చాను. పోయినసారి నేను వచ్చినప్పుడు, ఆ విషయంపై బైబిలు చక్కని సలహానిస్తోందని మనం చూశాంకదా.” కుటుంబ జీవితము పుస్తకంలోని ‘విషయ సూచిక’ తెరిచి గృహస్థున్ని తనకు ఇష్టమున్న అధ్యాయాన్ని ఎంచుకోనివ్వండి. పేజీలో చివర ఉండే ప్రశ్నలను ఉపయోగిస్తూ అందులోని సమాచారంనుండి తాను ఎక్కువ ప్రయోజనాన్ని ఎలా పొందగలడో చూపించండి. అతనితో కలిసి పఠిస్తామని చెప్పి వెంటనే పఠనాన్ని ప్రారంభించేందుకు ప్రయత్నించండి.
6 పర్యావరణం విషయంలో అనేకమందికి ఆసక్తి ఉంది కనుక సంభాషణను ప్రారంభించేందుకు మీరు ఇలా చెప్పవచ్చు:
◼ “కలుషితమైన గాలిని గూర్చి నీటిని గూర్చి ఆహారాన్ని గూర్చి ఇంచుమించు అందరూ ఆందోళన చెందుతున్నారని మేము చూశాము. కొన్ని దేశాల్లో పర్యావరణ పరిస్థితులు ఇప్పటికే జీవానికి అపాయకరంగా ఉన్నాయి. దేవుడు భూమికి సృష్టికర్త కనుక దీని విషయంలో ఆయన ఏమి చేస్తాడంటారు? [ప్రతిస్పందించనివ్వండి.] మనం ఈ గ్రహాన్ని ఉపయోగించే విధానాన్ని బట్టి దేవుడు మనలను బాధ్యులుగా ఎంచుతాడని బైబిలు చెబుతోంది. [ప్రకటన 11:18బి భాగాన్ని చదవండి.] కాలుష్యంలేని భూమ్మీద జీవించడాన్ని ఊహించుకోండి!” ప్రకటన 21:3, 4 సూచించినట్లుగా, దేవుడు వాగ్దానం చేసిన పరదైసును గూర్చి తెలియజేయండి. నిరంతరము జీవించగలరు పుస్తకంలోని చివరి చిత్రాన్ని చూపించి 156 నుండి 158 పేజీల్లో ఉన్న చిత్రాల మధ్య ఉన్న తేడాలను ఎత్తి చూపండి. పుస్తకాన్ని ఇచ్చి పునర్దర్శించేందుకు ఏర్పాట్లు చేయండి.
7 పరదైసు భూమిని గూర్చి ఆసక్తి కనపర్చిన వారి వద్దకు మరలా వెళ్లేటప్పుడు మీరు ఇలా చెప్పవచ్చు:
◼ “క్రితం సారి నేను వచ్చినప్పుడు కలుషితమైన భూమ్మీది సమస్యలను పరిష్కరించేందుకు దేవుడు మానవ కార్యాల్లో జోక్యం చేసుకోవాల్సివుంటుంది అన్న విషయంపై ఏకాభిప్రాయానికి వచ్చాం. అయితే ప్రశ్నేమిటంటే, దేవుడు స్థాపించే ఆ నూతన లోకంలో మనం ప్రవేశించాలంటే ఏమి చేయాలి?” యోహాను 17:3 చదవండి. ఈ ప్రత్యేకమైన జ్ఞానాన్ని పొందేందుకుగాను మనం ఇచ్చే ఉచిత బైబిలు పఠనం నుండి ప్రయోజనాన్ని పొందేందుకు గృహస్థున్ని ఆహ్వానించండి.
8 ఆధునికదిన కోతపనివారిగా ఉపయోగించబడడమూ ప్రాణాన్ని కాపాడే ప్రకటనా పని చేసేందుకు ఉపయోగించబడడమూ ఎంతటి ఆధిక్యతో కదా! ‘మన ప్రయాసము ఎన్నటికీ వ్యర్థముకాదని ఎరిగి’ మనమందరమూ సువార్తను అత్యవసర భావంతో ప్రకటించడంలో తీరికలేకుండా పనిచేద్దాము.—1 కొరిం. 15:58.