ప్రశ్నా భాగం
◼ మనం లోనావ్లాలో ఉన్న బ్రాంచి కార్యాలయ వసతులను లేక బెంగుళూరులో నిర్మాణం జరుగుతున్న సొసైటీ స్థలాన్ని సందర్శించేటప్పుడు మనం వేసుకొనే దుస్తుల విషయంలో, కేశాలంకరణ విషయంలో మనమెందుకు ప్రత్యేక అవధానాన్నివ్వాలి?
క్రైస్తవులు వేషాలంకరణల్లో తగినవిధంగా ఉండాలని అపేక్షించబడుతున్నారు. అన్నివేళలా మన వస్త్రధారణలో, కేశాలంకరణలో యెహోవా దేవుని సేవకులకు తగినటువంటి సభ్యతా గౌరవాలు ప్రతిబింబించాలి. సొసైటీ కార్యాలయ సదుపాయాలు ప్రపంచంలో ఎక్కడున్నప్పటికీ వాటిని సందర్శించేటప్పుడు ఇది మరి విశేషంగా నిజమై ఉండాలి.
1998లో, ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో జిల్లా సమావేశాలూ, అంతర్జాతీయ సమావేశాలు నిర్వహించబడతాయి. అనేక దేశాల్లో నుండి వేలాదిమంది మన సహోదరులు న్యూయార్క్‌లోని సొసైటీ ప్రధాన కార్యాలయాల్నీ అలాగే ఇండియాలోని బ్రాంచి కార్యాలయంతోపాటూ ఇతర దేశాల్లోని బ్రాంచి కార్యాలయాలనూ సందర్శిస్తారు. ఈ వసతుల్ని సందర్శిస్తున్న సందర్భాల్లో మాత్రమే గాక మరే ఇతర సమయాల్లోనైనా సరే ‘దేవుని సేవకులుగా’ మనం తగిన వస్త్రధారణా కేశాలంకరణలతోసహా ‘ప్రతి విషయంలోనూ మన యోగ్యతలు కనుపరుచుకోవాల్సిన’ అవసరంవుంది.—2 కొరింతువారికి లేఖ 6:3, 4, పవిత్ర గ్రంథం వ్యాఖ్యాన సహితం.
సరియైన వస్త్రధారణా, కేశాలంకరణల ప్రాముఖ్యతను చర్చిస్తూ మన పరిచర్యను నెరవేర్చుటకు సంస్థీకరింపబడియున్నాము అనే పుస్తకం మనం ప్రాంతీయ పరిచర్యలో పాల్గొనేటప్పుడూ, క్రైస్తవ కూటాలకు హాజరయ్యేటప్పుడూ శారీరక పరిశుభ్రత కొరకైన, పొందికైన వస్త్రధారణ కొరకైన, చక్కని కేశాలంకరణ కొరకైన అవసరతపై వ్యాఖ్యానించింది. తర్వాత, 131వ పేజీలో 2వ పేరానందు అదిలా చెబుతోంది: “బ్రూక్లిన్ లేదా సొసైటి యొక్క ఏ ఉపకార్యాలయములోని బేతేలు గృహమును సందర్శించునపుడు అదే నియమం వర్తిస్తుంది. జ్ఞాపకముంచుకొనండి, బేతేలు అనగా ‘దేవుని గృహము’ గనుక మనం ఆరాధనకై రాజ్యమందిరానికి హాజరగునపుడు తయారయినట్లే, అక్కడకు వెళ్లునపుడు దానికి తగినట్లుగా తలదువ్వుకొని, దుస్తులు ధరించి, మంచి ప్రవర్తన కలిగివుండాలి.” చూడడానికి స్థానిక ప్రాంతాల నుండి వచ్చే రాజ్య ప్రచారకులూ, అలాగే బేతేలు కుటుంబ సభ్యులను చూడడానికీ, వారితో సహవసించడానికీ దూర ప్రాంతాలనుండి వచ్చే వాళ్లూ, బ్రాంచి భవన సముదాయాల్ని సందర్శించడానికి వచ్చే వాళ్లూ అదే ఉన్నత ప్రమాణాన్ని ఆచరించాలి.
యెహోవా సత్యారాధనను ఇతరులు దృష్టించే విధానంపై మనం వేసుకొనే దుస్తులు అనుకూల ప్రభావాన్ని చూపించాలి. అయితే, సొసైటీ భవన సముదాయాల్ని సందర్శిస్తున్నప్పుడు, కొంతమంది సహోదర సహోదరీలు తాము వేసుకొనే దుస్తుల్లో మరీ క్యాజువల్‌గా ఉంటున్న వైనం గమనించబడింది. బేతేలు గృహాల్లో వేటిని సందర్శిస్తున్నప్పుడైనా సరే అలాంటి వస్త్రధారణ సముచితం కాదు. మన క్రైస్తవ జీవితంలోని అన్ని అంశాల్లోల్లాగే ఈ విషయంలో కూడా, ఒకే ఉన్నత ప్రమాణాల్ని అంటే దేవుని మహిమ నిమిత్తం సమస్తాన్ని మనం చేయడం ద్వారా లోకం నుండి దేవుని ప్రజలను వేరుపరచే ఉన్నత ప్రమాణాల్ని అనుసరించాలి. (రోమీ. 12:2; 1 కొరిం. 10:31) మన బైబిలు విద్యార్థులతోనూ, మొదటిసారిగా బేతేలును సందర్శించాలని అనుకునే ఇతరులతోనూ మాట్లాడి, తగిన వస్త్రధారణా, కేశాలంకరణలకు అవధానాన్నివ్వవలసిన ప్రాముఖ్యతను గురించి వారికి గుర్తుచేయడం మంచిది.
కాబట్టి సొసైటీ భవన సముదాయాలను సందర్శిస్తున్నప్పుడు, మిమ్మల్ని మీరిలా ప్రశ్నించుకోండి: ‘నా వస్త్రధారణా, కేశాలంకరణలు పొందికైన రీతిలో ఉన్నాయా?’ (పోల్చండి మీకా 6:8.) ‘నేను ఆరాధించే దేవుణ్ణి అది సరియైన విధంగా ప్రతిబింబిస్తుందా? నేను కన్పించే విధానం ఇతరుల అవధానాన్ని మళ్ళిస్తుందా? లేక ఇతరులకు చికాకును కలిగిస్తుందా? బహుశా మొట్ట మొదటిసారిగా సందర్శిస్తున్న ఇతరులకు నేను తగిన మాదిరిని ఉంచుతున్నానా?’ మన వస్త్రధారణా, కేశాలంకరణల ద్వారా మనమన్ని వేళలా ‘అన్ని విషయములయందు మన రక్షకుడగు దేవుని ఉపదేశమును అలంకరిద్దాం.’—తీతు 2:9.