కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w23 అక్టోబరు పేజీలు 12-17
  • “ఆయన మిమ్మల్ని బలపరుస్తాడు”

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “ఆయన మిమ్మల్ని బలపరుస్తాడు”
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2023
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ప్రార్థన, అధ్యయనం మీకు బలాన్నిస్తాయి
  • బ్రదర్స్‌-సిస్టర్స్‌ మీకు బలాన్నిస్తారు
  • భవిష్యత్తు మీదున్న ఆశను శ్వాసగా మార్చుకోండి
  • ఆయన తన తప్పుల నుండి నేర్చుకున్నాడు
    వాళ్లలా విశ్వాసం చూపించండి
  • ఆయన తన తప్పుల నుండి నేర్చుకున్నాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2009
  • యెహోవా కనికరాన్ని గూర్చి యోనా నేర్చుకొనుట
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • ఇతరులను యెహోవా చూసినట్లే చూడడానికి ప్రయత్నించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2023
w23 అక్టోబరు పేజీలు 12-17

అధ్యయన ఆర్టికల్‌ 43

“ఆయన మిమ్మల్ని బలపరుస్తాడు”

“[యెహోవా] మిమ్మల్ని స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు, గట్టి పునాది మీద మిమ్మల్ని నిలబెడతాడు.”—1 పేతు. 5:10.

పాట 38 ఆయనే నిన్ను బలపరుస్తాడు

ఈ ఆర్టికల్‌లో . . .a

1. గతంలో యెహోవా తన సేవకులకు ఎలా శక్తినిచ్చాడు?

బైబిలు విశ్వాసం చూపించినవాళ్లను బలవంతులని లేదా శక్తిమంతులని చెప్తుంది. కానీ కొన్నిసార్లు అలాంటివాళ్లకు కూడా బలహీనంగా, నిస్సత్తువగా అనిపించింది. ఉదాహరణకు, ఒక సందర్భంలో దావీదు రాజు “పర్వతంలా బలంగా” ఉన్నాను అని చెప్పాడు. కానీ ఇంకొన్ని సందర్భాల్లో ఆయన భయంతో ‘బెదిరిపోయాడు.’ (కీర్త. 30:7) అంతేకాదు, సమ్సోనుకు దేవుని పవిత్రశక్తి వచ్చినప్పుడు చెప్పలేనంత కండబలం వచ్చేది. ఒకవేళ అది లేకపోతే ఆయనకున్న బలం తగ్గిపోయి అందరిలాగే మామూలు మనిషిలా ఉంటాడని ఆయనకు తెలుసు. (న్యాయా. 14:5, 6; 16:17) నిజమే, ఆ బలవంతులకు అంత బలం ఇచ్చింది యెహోవాయే!

2. “నేను ఎప్పుడు బలహీనుణ్ణో అప్పుడే బలవంతుణ్ణి” అని అపొస్తలుడైన పౌలు ఎందుకు అన్నాడు? (2 కొరింథీయులు 12:9, 10)

2 యెహోవా ఇచ్చే శక్తి తనకు అవసరమని అపొస్తలుడైన పౌలు కూడా అర్థంచేసుకున్నాడు. (2 కొరింథీయులు 12:9, 10 చదవండి.) ఆయన కూడా మనలా మామూలు మనిషే. మనకున్నలాంటి అనారోగ్య సమస్యలు ఆయనకూ ఉండేవి. (గల. 4:13, 14) కొన్నిసార్లు, సరైంది చేయడానికి ఆయన పెద్ద పోరాటాన్నే చేయాల్సి వచ్చింది. (రోమా. 7:18, 19) ఇంకొన్నిసార్లు తన జీవితంలో ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో తెలీక భయపడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. (2 కొరిం. 1:8, 9) అయినా, పౌలు “నేను ఎప్పుడు బలహీనుణ్ణో అప్పుడే బలవంతుణ్ణి” అని అన్నాడు. అదెలా? ఆయనలో శక్తి ఆవిరైపోయినప్పుడు యెహోవా తన పవిత్రశక్తిని నింపాడు. అలా పౌలు బలవంతుడయ్యాడు!

3. ఈ ఆర్టికల్‌లో ఏ ప్రశ్నలు పరిశీలిస్తాం?

3 యెహోవా మనల్ని కూడా బలపరుస్తానని మాటిస్తున్నాడు. (1 పేతు. 5:10) కానీ, దానికోసం మనం ఊరికే చేతులు కట్టుకొని కూర్చుంటే సరిపోదు. మనవంతు కృషి మనం చేయాలి. ఉదాహరణకు, ఒక పళ్లెం నిండా రకరకాల ఆహారం తీసుకొచ్చి మనముందు పెట్టారనుకోండి. అది చూస్తూ కూర్చుంటే మన ఆకలి తీరదు. మనం దాన్ని తీసుకొని, తినాలి. అదేవిధంగా, యెహోవా మనకు శక్తిని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఆయనిచ్చే శక్తిని పొందాలంటే మనం చేయాల్సిన పనులు కూడా కొన్ని ఉన్నాయి. యెహోవా మనల్ని బలపర్చడానికి ఏమేం ఇచ్చాడు? ఆయనిచ్చే బలాన్ని పొందాలంటే మనమేం చేయాలి? యోనా ప్రవక్త, యేసు తల్లియైన మరియ, అపొస్తలుడైన పౌలుకు యెహోవా ఎలా శక్తినిచ్చాడో పరిశీలించినప్పుడు ఆ ప్రశ్నలకు జవాబులు తెలుసుకోగలుగుతాం. అంతేకాదు, వాళ్లకు శక్తినిచ్చినట్టే ఇప్పుడున్న నమ్మకమైన తన సేవకులకు యెహోవా ఎలా శక్తినిస్తాడో పరిశీలిస్తాం.

ప్రార్థన, అధ్యయనం మీకు బలాన్నిస్తాయి

4. యెహోవా ఇచ్చే శక్తిని పొందాలంటే మనం ఏమేం చేయాలి?

4 మనం శక్తిని పొందే మొదటి మార్గమేమిటంటే, ప్రార్థనలో యెహోవాను అడగడం. అలా అడిగినప్పుడు యెహోవా మన ఊహకందని శక్తినిస్తాడు! (2 కొరిం. 4:7) రెండోది బైబిల్ని చదివి, చదివిన దానిగురించి లోతుగా ఆలోచించినప్పుడు మనం శక్తిని పొందుతాం. (కీర్త. 86:11) ఎందుకంటే, బైబిలు “చాలా శక్తివంతమైనది.” (హెబ్రీ. 4:12) యెహోవాకు ప్రార్థన చేసినప్పుడు, బైబిల్ని చదివినప్పుడు కష్టాల్ని సహించడానికి, మన ఆనందాన్ని కాపాడుకోవడానికి, కష్టమైన నియామకాల్ని కూడా చేయడానికి కావల్సిన బలం పొందుతాం. అయితే, యోనా ప్రవక్తకు యెహోవా ఎలా శక్తినిచ్చాడో ఇప్పుడు చూద్దాం.

5. యోనా ప్రవక్తకు ఎందుకు శక్తి అవసరమైంది?

5 యోనా ప్రవక్తకు చాలా శక్తి అవసరమైంది. యెహోవా ఒక కష్టమైన నియామకం ఇచ్చినప్పుడు ఆయన దాన్ని తప్పించుకుని పారిపోయాడు. దానివల్ల, ఒక బీభత్సమైన తుఫానులో ఆయన అలాగే ఆయనతోపాటు పడవలో ఉన్న వాళ్లందరి ప్రాణాలు అలలతో పాటు కొట్టుకుపోయేంత పనైంది. అప్పుడు ఆ పడవలో ఉన్నవాళ్లు యోనాను సముద్రంలో పడేశారు. కాసేపు అయ్యాక ఆయన కళ్లు తెరిచి చూస్తే చుట్టూ చీకటే, ఎక్కడున్నాడో ఆయనకు అస్సలు అర్థంకాలేదు. ఆయన ఏ మనిషి ఎన్నడూ ఊహించని ఒక చోట ఉన్నాడు! ఆయన ఒక పెద్ద చేప కడుపులో పడ్డాడు. అప్పుడు యోనాకు ఎలా అనిపించివుంటుందో ఆలోచించండి. ఇక చేప కడుపే తన సమాధి అనుకున్నాడా? యెహోవా తనని తిరస్కరించాడని అనుకున్నాడా? యోనా ఆ చేప కడుపులో బిక్కుబిక్కుమంటూ ఉండివుంటాడు!

చిత్రాలు: 1. చేప కడుపులో తీవ్రంగా ప్రార్థన చేస్తున్న యోనా. 2. ఒక బ్రదర్‌ తన బెడ్‌రూమ్‌లో తీవ్రంగా ప్రార్థన చేస్తున్నాడు. ఆయన పక్కన ఒక బైబిలు, స్మార్ట్‌ఫోన్‌ అలాగే ఇయర్‌ ఫోన్స్‌ ఉన్నాయి.

యోనాలాగే మనం కూడా కష్టాల్లో ఎలా బలాన్ని పొందవచ్చు? (6-9 పేరాలు చూడండి)

6. యోనా 2:1, 2, 7 ప్రకారం, చేప కడుపులో ఉన్న యోనాకు ఏది ధైర్యాన్నిచ్చింది?

6 చేప కడుపులో ఉన్న యోనా గొంతుపోయేలా అరిచినా సహాయం కోసం ఎవరైనా వస్తారా? మరి యోనా ఏం చేశాడు? మొదటిగా, యెహోవాకు ప్రార్థన చేశాడు. (యోనా 2:1, 2, 7 చదవండి.) యెహోవా చెప్పిన పని చేయకుండా పారిపోయినా, తప్పు తెలుసుకొని, వినయంగా ప్రార్థన చేస్తే ఆయన తప్పకుండా వింటాడనే నమ్మకం యోనాకు ఉంది. రెండోది, ఆయన లేఖనాల గురించి ఆలోచించాడు. అలాగని ఎందుకు చెప్పవచ్చు? ఎందుకంటే, ఆయన చేసిన ప్రార్థనలో ఉపయోగించిన చాలా పదాలు, మాటలు, కీర్తనల పుస్తకంలో నుండి తీసుకున్నవే. మనం ఆ ప్రార్థనను యోనా 2వ అధ్యాయంలో చూస్తాం. (ఉదాహరణకు, యోనా 2:2, 5 లేఖనాన్ని కీర్తన 69:1; 86:7తో పోల్చండి.) అంటే ఆ లేఖనాలు యోనాకు కొట్టినపిండి అని అర్థమౌతుంది. కష్టమొచ్చినప్పుడు ఆ లేఖనాల్ని గుర్తుచేసుకోవడం వల్ల యెహోవా సహాయం చేస్తాడనే ధైర్యం యోనాకు వచ్చింది. ఆ తర్వాత, యోనా నేలమీద పడ్డాడు. అప్పుడు యెహోవా ఇచ్చిన నియామకాన్ని పూర్తిచేయడానికి వెన్ను చూపకుండా ముందుకెళ్లాడు!—యోనా 2:10–3:4.

7-8. తైవాన్‌లో ఉన్న ఒక బ్రదర్‌కి కష్టాల్ని తట్టుకునే బలం ఎలా వచ్చింది?

7 మనకు రకరకాల కష్టాలు వచ్చినప్పుడు యోనా గురించి ఆలోచించడం సహాయం చేస్తుంది. ఉదాహరణకు, తైవాన్‌లో ఉండే జిమింగ్‌b అనే బ్రదర్‌ గురించి ఆలోచించండి. ఆయనకు చాలా పెద్దపెద్ద అనారోగ్య సమస్యలు ఉన్నాయి. దానికితోడు, యెహోవాసాక్షి అయినందుకు ఆయన కుటుంబ సభ్యులు బాగా వ్యతిరేకించేవాళ్లు. ఆయన ప్రార్థన, అధ్యయనం చేయడం ద్వారా బలాన్ని పొందాడు. ఆయన ఇలా అంటున్నాడు: “కొన్నిసార్లు నాకున్న సమస్యలు నన్ను ఎంత తొలిచేసేవంటే, కుదురుగా కూర్చుని వ్యక్తిగత అధ్యయనం చేయడానికి కూడా మనసొచ్చేది కాదు.” అయినా, ఆయన వెన్ను చూపలేదు! ఆయన ఇలా అంటున్నాడు: “ముందుగా నేను యెహోవాకు ప్రార్థన చేసుకుంటాను. తర్వాత, ఇయర్‌ ఫోన్స్‌ పెట్టుకుని మన పాటలు వింటాను. కొన్నిసార్లు వాటిని పాడుకుంటాను. అప్పుడు నా మనసు కాస్త కుదుటపడేది. ఆ తర్వాత చదవడం మొదలుపెట్టేవాణ్ణి.”

8 వ్యక్తిగత అధ్యయనం జిమింగ్‌కు ఊహించని విధాలుగా బలాన్నిచ్చింది. ఎందుకంటే, ఒక సందర్భంలో ఆయనకు ఓ అరుదైన ఆపరేషన్‌ చేయాల్సి వచ్చింది. అయితే, ఆయనకు రక్తం చాలా తక్కువ ఉంది కాబట్టి ఆపరేషన్‌ తర్వాత కోలుకోవాలంటే రక్తం ఎక్కించుకోవాల్సిందే అని నర్సు చెప్పింది. కానీ జిమింగ్‌ ఆపరేషన్‌ ముందురోజు రాత్రి ఒక సిస్టర్‌ అనుభవాన్ని చదివాడు. ఆ సిస్టర్‌కి కూడా ఈయనకు జరిగినలాంటి ఆపరేషనే అయ్యింది. పైగా, ఈయన కంటే తక్కువ రక్తం ఉంది. అయినాసరే, ఆమె రక్తం ఎక్కించుకోకుండా ఆపరేషన్‌ చేయించుకుని, పూర్తిగా కోలుకుంది. ఆ అనుభవం జిమింగ్‌కు నమ్మకంగా ఉండడానికి కావల్సిన బలాన్నిచ్చింది.

9. ఏదైనా కష్టం వల్ల మీరు బలహీనపడితే ఏం చేయవచ్చు? (చిత్రాలు కూడా చూడండి.)

9 మీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు, మీ మనసులో ఉన్న బాధంతా యెహోవాకు చెప్పుకోవడం కష్టమైందా? లేదా అధ్యయనం చేయలేనంత బలహీనంగా అనిపించిందా? అయితే, మీ పరిస్థితిని యెహోవా అర్థంచేసుకున్నంత బాగా ఎవ్వరూ అర్థంచేసుకోలేరని గుర్తుంచుకోండి. కాబట్టి మీరు చిన్న ప్రార్థన చేసినాసరే, యెహోవా మీకు సరిగ్గా కావల్సింది ఇస్తాడనే నమ్మకంతో ఉండవచ్చు. (ఎఫె. 3:20) బైబిలు చదవడానికి, అధ్యయనం చేయడానికి మీకు మనసు రాకపోతే, ఓపిక లేకపోతే బైబిలు ఆడియోను గానీ, మన ప్రచురణల ఆడియోను గానీ పెట్టుకుని వినవచ్చు. అలాగే మన పాటల్లో ఏదోక దాన్ని వినవచ్చు. లేదా jw.orgలో ఒక వీడియోను చూడవచ్చు. అలా యెహోవాకు మీరు ప్రార్థన చేసి, ఆయన ఇచ్చే జవాబు కోసం బైబిల్లో, బైబిలు ఆధారిత ప్రచురణల్లో వెదికినప్పుడు ఆయన మీకు కావల్సిన బలాన్నిస్తాడు.

బ్రదర్స్‌-సిస్టర్స్‌ మీకు బలాన్నిస్తారు

10. బ్రదర్స్‌-సిస్టర్స్‌ మనల్ని ఎలా బలపరుస్తారు?

10 యెహోవా మనల్ని బలపర్చడానికే బ్రదర్స్‌-సిస్టర్స్‌ని ఇచ్చాడు. మనకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు లేదా కష్టమైన నియామకాన్ని చేయడానికి కిందామీదా పడుతున్నప్పుడు మన బ్రదర్స్‌-సిస్టర్స్‌ మనకు “ఎంతో ఊరటను” ఇస్తారు. (కొలొ. 4:10, 11) మన కష్టాల్లో మన భుజం తట్టే స్నేహితులు మనకు చాలా అవసరం. (సామె. 17:17) కాబట్టి మన బ్రదర్స్‌-సిస్టర్స్‌ అలాంటి స్నేహితులుగా ఉంటూ మనకు సరిగ్గా అవసరమైంది ఇస్తారు, ఓదారుస్తారు, యెహోవా సేవను నమ్మకంగా చేసేలా ప్రోత్సహిస్తారు. అయితే, యేసు తల్లియైన మరియ ఇతరుల నుండి ఎలా బలం పొందిందో ఇప్పుడు చూద్దాం.

11. మరియకు ఎందుకు ధైర్యం అవసరమైంది?

11 యెహోవా ఇచ్చిన నియామకాన్ని చేయడానికి మరియకు చాలా ధైర్యం అవసరమైంది. ఆ నియామకం గురించి గబ్రియేలు దూత మరియకు చెప్పినప్పుడు ఆమె ఎంత టెన్షన్‌ పడి ఉంటుందో ఆలోచించండి. ఆమెకు పెళ్లి కాలేదు. కానీ గర్భవతి కాబోతుంది. పైగా ఆమెకు పిల్లల్ని పెంచిన అనుభవమేమీ లేదు, కానీ మెస్సీయను పెంచాలి. అన్నిటికి మించి తను గర్భవతినని మరియ తనకు కాబోయే భర్తయైన యోసేపుకు చెప్పాలి.—లూకా 1:26-33.

12. లూకా 1:39-45 ప్రకారం, మరియ ఎలా బలం పొందింది?

12 మరియ అంత అసాధారణమైన, పెద్ద బాధ్యతను చేయడానికి ఎలా ధైర్యం కూడగట్టుకోగలిగింది? ఆమె వేరేవాళ్ల సహాయం అడిగింది. ఉదాహరణకు, తన నియామకానికి సంబంధించి మరిన్ని వివరాలు ఇవ్వమని ఆమె గబ్రియేలు దూతను అడిగింది. (లూకా 1:34) ఆ తర్వాత కొంతకాలానికే, ఆమె “పర్వత ప్రాంతంలో ఉన్న యూదయలోని” తన బంధువు ఎలీసబెతును కలవడానికి సుదూర ప్రయాణం చేసి వెళ్లింది. ఆ కష్టం వృథా కాలేదు. ఎందుకంటే, పవిత్రశక్తి ప్రేరణతో మరియను మెచ్చుకుంటూ ఆమెకు పుట్టబోయే కొడుకు గురించి ఎలీసబెతు ఒక ప్రవచనం చెప్పింది. (లూకా 1:39-45 చదవండి.) ఆ తర్వాత, యెహోవా “తన బాహువుతో శక్తివంతమైన పనులు చేశాడు” అని మరియ అంది. (లూకా 1:46-51) యెహోవా గబ్రియేలు దూత ద్వారా, ఎలీసబెతు ద్వారా మరియకు కావల్సిన బలాన్నిచ్చాడు.

13. బ్రదర్స్‌-సిస్టర్స్‌ సహాయం అడగడం వల్ల దాసురికి ఏం జరిగింది?

13 మరియలాగే తోటి బ్రదర్స్‌-సిస్టర్స్‌ నుండి మీరూ బలం పొందవచ్చు. బొలీవియాలో ఉంటున్న దాసురి అనే సిస్టర్‌ గురించి పరిశీలించండి. ఆమెకు చాలా శక్తి అవసరమైంది. వాళ్ల నాన్న ఓ పెద్ద జబ్బుతో హాస్పిటల్‌ పాలయ్యాడు. ఆయన్ని హాస్పిటల్‌లో దగ్గరుండి చూసుకునే బాధ్యతను దాసురి తన భుజాల మీద వేసుకుంది. (1 తిమో. 5:4) ఆమె ఇలా ఒప్పుకుంటుంది: “ఇక నావల్ల కాదని చాలాసార్లు అనిపించింది.” మరి ఆమె ఎవర్నైనా సహాయం అడిగిందా? ఆమె ఇలా అంటుంది: “నేను బ్రదర్స్‌ని ఇబ్బంది పెట్టడం ఎందుకులే అని మొదట్లో అనుకున్నాను. నిజానికి నాకు కావల్సిన సహాయం చేసేది యెహోవా కదా అని అనిపించేది. కానీ నా సమస్యల్ని నేనొక్కదాన్నే ఒంటిచేత్తో ఎదుర్కోలేనని ఆ తర్వాత గుర్తించాను.” (సామె. 18:1) దాసురి ఆ తర్వాత సంఘంలో ఉన్న కొంతమంది ఫ్రెండ్స్‌కి తన పరిస్థితిని వివరించింది. ఆమె ఇలా చెప్తుంది: “బ్రదర్స్‌-సిస్టర్స్‌ నాకు చేసిన సహాయాన్ని మాటల్లో వర్ణించలేను. హాస్పిటల్‌లో ఉన్నప్పుడు వాళ్లు నాకోసం భోజనం తీసుకొచ్చారు. నన్ను ఓదార్చడానికి మంచి లేఖనాల్ని చూపించారు. నేను ఒంటరిదాన్ని కాదు నాకోసం బ్రదర్స్‌-సిస్టర్స్‌ అందరూ ఉన్నారు అన్న ఫీలింగ్‌ చాలా గొప్పది. నిజానికి, మనందరం యెహోవా కుటుంబానికి చెందినవాళ్లం. మన కుటుంబం చాలా పెద్దది. మనకు కష్టం వస్తే సహాయం చేయడానికి వాళ్ల చేతులు ముందుకొస్తాయి. మనం ఏడిస్తే వాళ్ల కళ్లల్లో నీళ్లొస్తాయి. మన పోరాటంలో వాళ్ల అడుగులు కూడా కలుస్తాయి.”

14. మనం ఎందుకు సంఘపెద్దల సహాయం తీసుకోవాలి?

14 యెహోవా సంఘపెద్దల్ని ఉపయోగించుకుని కూడా మనకు బలాన్నిస్తాడు. మనల్ని బలపర్చడానికి, మనలో కొత్త ఉత్సాహాన్ని నింపడానికి యెహోవా ఇచ్చిన బహుమతులే సంఘపెద్దలు! (యెష. 32:1, 2) కాబట్టి రకరకాల ఆలోచనలు మీకు ఊపిరాడకుండా చేసినప్పుడు, మీ ఆలోచనల్ని సంఘపెద్దలకు చెప్పండి. వాళ్లిచ్చే సహాయాన్ని తీసుకోవడానికి మొహమాటపడకండి. ఎందుకంటే వాళ్లను ఉపయోగించుకుని మీకు బలాన్నిచ్చేది యెహోవాయే!

భవిష్యత్తు మీదున్న ఆశను శ్వాసగా మార్చుకోండి

15. క్రైస్తవులుగా మనందరికి ఎలాంటి భవిష్యత్తు ఉంది?

15 భవిష్యత్తు గురించి బైబిలు ఇచ్చే ఆశ మనలో శక్తిని నింపగలదు. (రోమా. 4:3, 18-20) క్రైస్తవులుగా మనకు పరదైసు భూమ్మీద గానీ, పరలోకంలో గానీ శాశ్వతకాలం జీవించే అవకాశం ఉంటుంది. దానికి ఏదీ సాటిరాదు! భవిష్యత్తు మీదున్న ఆశ మనకు వచ్చే కష్టాల్ని తట్టుకోవడానికి, మంచివార్త ప్రకటించడానికి, సంఘంలో వేర్వేరు నియామకాలు చేయడానికి కావల్సిన బలాన్నిస్తుంది. (1 థెస్స. 1:3) అపొస్తలుడైన పౌలుకు అలాంటి ఆశే బలాన్నిచ్చింది.

16. అపొస్తలుడైన పౌలుకు ఎందుకు బలం అవసరమైంది?

16 పౌలుకు బలం అవసరమైంది. ఆయన కొరింథీయులకు రాసిన ఉత్తరంలో తనను తాను మట్టి పాత్రతో పోల్చుకున్నాడు. “కష్టాలు” ఆయన్ని “అన్నివైపులా” చుట్టుముట్టాయి, ఆయన “అయోమయంలో” ఉన్నాడు, ‘హింసించబడ్డాడు,’ ‘పడగొట్టబడ్డాడు.’ అంతేకాదు, ఆయన చావు అంచుల దాకా వెళ్లొచ్చాడు. (2 కొరిం. 4:8-10) నిజానికి, పౌలు ఆ మాటల్ని తన మూడో మిషనరీ యాత్ర చేస్తున్నప్పుడు రాశాడు. అంతటితో ఆయన కష్టాలు తీరిపోలేదు. ఎందుకంటే, ఆయన అల్లరిమూక దాడిని ఎదుర్కొన్నాడు, అరెస్టు అయ్యాడు, ఆయన వెళ్లే ఓడ బద్దలైంది, ఆఖరికి జైలుకు కూడా వెళ్లాడు.

17. రెండో కొరింథీయులు 4:16-18 ప్రకారం, పౌలు తన కష్టాల్ని ఎలా తట్టుకోగలిగాడు?

17 పౌలు తన ఆశనే శ్వాసగా మార్చుకున్నాడు కాబట్టి కష్టాల్ని తట్టుకోవడానికి కావల్సిన బలం పొందాడు. (2 కొరింథీయులు 4:16-18 చదవండి.) తన శరీరం “కృశించిపోయినా” తను ఏమాత్రం కృంగిపోనని ఆయన కొరింథీయులకు చెప్పాడు. పౌలు తన భవిష్యత్తు మీద మనసుపెట్టాడు. పరలోకంలో శాశ్వతకాలం జీవించాలనే తన ఆశ చాలాచాలా గొప్పది. కాబట్టి దాని ముందు ఏ కష్టమైనా ‘చాలా చిన్నది.’ పౌలు ఆ బహుమతి గురించి బాగా ఆలోచించాడు కాబట్టి “రోజురోజుకీ” తనలో కొత్త ఉత్సాహం నిండేది.

18. టిహోమిర్‌కి, ఆయన కుటుంబానికి భవిష్యత్తు మీదున్న ఆశ వల్ల ఎలా బలం వచ్చింది?

18 బల్గేరియాలో ఉంటున్న టిహోమిర్‌ అనే బ్రదర్‌కి భవిష్యత్తు మీదున్న ఆశ వల్ల బలం వచ్చింది. కొన్ని సంవత్సరాల క్రితం ఆయన తమ్ముడు స్ట్రాకో ఒక యాక్సిడెంట్‌లో చనిపోయాడు. దానివల్ల, టిహోమిర్‌ గుండె పగిలిపోయి చెప్పలేనంత వేదనను అనుభవించాడు. ఆయన, ఆయన కుటుంబం దాన్ని తట్టుకోవడానికి, వాళ్ల తమ్ముడు పునరుత్థానమై వస్తే ఎలా ఉంటుందో ఊహించుకునేవాళ్లు. ఆయన ఇలా చెప్తున్నాడు: “ఉదాహరణకు, మా తమ్ముడు పునరుత్థానమై వస్తే వాణ్ణి ఎక్కడ కలుస్తామో, వాడికోసం ఏమేమి వంటలు చేస్తామో, ఆ పార్టీకి ఎవరెవరిని పిలుస్తామో మాట్లాడుకునేవాళ్లం. ఆ తర్వాత చివరి రోజుల గురించి వాడికి బోలెడన్ని కబుర్లు చెప్తున్నట్టు ఊహించుకునేవాళ్లం.” టిహోమిర్‌ భవిష్యత్తు మీదున్న ఆశను తన శ్వాసగా చేసుకోవడం వల్ల ఆయన, ఆయన కుటుంబం ఆ బాధను తట్టుకోవడానికి, భవిష్యత్తులో యెహోవా తన తమ్ముణ్ణి ప్రాణాలతో వాళ్లముందు నిలబెట్టే వరకు ఓపిగ్గా ఉండడానికి సహాయం చేస్తుందని చెప్తున్నాడు.

వినికిడిలేని ఒక సిస్టర్‌ “కొత్తలోకం రాబోతుంది” అనే వీడియోను సంజ్ఞా భాషలో చూస్తుంది. కొత్త లోకంలో ఆమె జీవితాన్ని ఊహించుకుంటుంది. ఆమె వేరే వాళ్లతో కలిసి మ్యూజిక్‌ వాయిస్తున్నట్టు ఊహించుకుంటుంది.

కొత్తలోకంలో మీరేం చేస్తున్నట్టు ఊహించుకుంటున్నారు? (19వ పేరా చూడండి)c

19. భవిష్యత్తు మీద మీకున్న ఆశను బలపర్చుకోవడానికి ఏం చేయవచ్చు? (చిత్రం కూడా చూడండి.)

19 భవిష్యత్తు మీదున్న ఆశను మీరెలా బలపర్చుకోవచ్చు? ఉదాహరణకు, మీరు భూమ్మీద శాశ్వతకాలం జీవించాలనే ఆశతో ఉంటే, పరదైసు గురించి బైబిలు ఏం చెప్తుందో చదివి, దానిగురించి బాగా ఆలోచించండి. (యెష. 25:8; 32:16-18) కొత్తలోకంలో మీరున్నట్టు, అక్కడ జీవిస్తున్నట్టు ఊహించుకోండి. మీకు అక్కడ ఎవరు కనిపిస్తున్నారు? మీకు ఏ శబ్దాలు వినిపిస్తున్నాయి? కొత్తలోకంలో అటూఇటూ తిరుగుతున్నప్పుడు మీకెలా అనిపిస్తుంది? మీ ఊహలకు రెక్కలు రావడానికి మన ప్రచురణల్లో పరదైసు గురించి ఉన్న బొమ్మలు చూడవచ్చు. లేదా కొత్త లోకం రాబోతుంది, కనుచూపుమేరలోనే ఉంది (ఇంగ్లీష్‌), భవిష్యత్తు ఊహించుకుందాం లాంటి మ్యూజిక్‌ వీడియోలు చూడవచ్చు. మన మనసంతా కొత్తలోకం గురించిన ఆలోచనతో నిండి ఉంటే మన సమస్యలు ‘కొంతకాలమే ఉంటాయని, అవి చాలా చిన్నవి’ అని అనిపిస్తాయి. (2 కొరిం. 4:17) అలా యెహోవా మనకు ఇచ్చిన నిరీక్షణ ద్వారా మనం బలాన్ని పొందుతాం.

20. మన బలం తగ్గితే ఏం చేయవచ్చు?

20 మన బలం తగ్గిపోయినట్టు అనిపించినా “దేవుణ్ణి బట్టి [మనం] బలం పొందుతాం.” (కీర్త. 108:13) మనకు కావల్సిన బలాన్ని ఇవ్వడానికి యెహోవా ఇప్పటికే కొన్ని ఏర్పాట్లు చేసిపెట్టాడు. కాబట్టి ఒక నియామకాన్ని చేయడానికి, ఏదైనా కష్టాన్ని తట్టుకోవడానికి, మన సంతోషాన్ని కాపాడుకోవడానికి కావల్సిన సహాయం కోసం ప్రార్థనలో యెహోవాను అడగండి. వ్యక్తిగత అధ్యయనం చేసి, ఆయన నిర్దేశం కోసం వెదకండి. తోటి బ్రదర్స్‌-సిస్టర్స్‌ ఇచ్చే ప్రోత్సాహాన్ని తీసుకోండి. భవిష్యత్తు మీద మీ హృదయంలో నాటుకున్న ఆశకు నీళ్లు పోస్తూ ఉండండి. అప్పుడు “మీరు ఓర్పుతో, సంతోషంతో అన్నిటినీ సహించేలా దేవుని గొప్పశక్తి మీకు కావాల్సిన బలాన్ని” ఇస్తుంది.—కొలొ. 1:11.

ఈ కింది వాటినుండి మీరు ఎలా బలం పొందవచ్చు?

  • ప్రార్థన, అధ్యయనం

  • బ్రదర్స్‌-సిస్టర్స్‌

  • భవిష్యత్తు మీదున్న ఆశ

పాట 33 మీ భారాన్ని యెహోవాపై వేయండి

a మేము పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయాం లేదా ఫలానా నియామకం చేయడం మావల్ల కాదు అని అనుకునేవాళ్ల కోసమే ఈ ఆర్టికల్‌. అయితే, యెహోవా మనకు ఎలా శక్తినిస్తాడో, ఆ శక్తిని పొందాలంటే మనమేం చేయాలో దీంట్లో పరిశీలిస్తాం.

b అసలు పేర్లు కావు.

c చిత్రాల వివరణ: వినికిడిలేని ఒక సిస్టర్‌ బైబిలు మాటిస్తున్న వాటిగురించి ఆలోచిస్తుంది, కొత్తలోకంలో తన జీవితం ఎలా ఉంటుందో ఊహించుకోవడానికి ఒక మ్యూజిక్‌ వీడియో చూస్తుంది.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి