కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w97 12/1 పేజీలు 10-14
  • యెహోవా, “క్షమించుటకు సిద్ధమైన మనస్సుగల” దేవుడు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవా, “క్షమించుటకు సిద్ధమైన మనస్సుగల” దేవుడు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • యెహోవా ఎందుకు “క్షమించుటకు సిద్ధమైన మనస్సుగల”వాడు?
  • యెహోవా ఎంత సంపూర్ణంగా క్షమిస్తాడు?
  • “వారి పాపములను ఇక నెన్నడును జ్ఞాపకము చేసికొనను”
  • పరిణామాల విషయమేమిటి?
  • “క్షమించడానికి సిద్ధంగా” ఉండే దేవుడు
    యెహోవాకు దగ్గరవ్వండి
  • యెహోవా మిమ్మల్ని క్షమించాడని నమ్మండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
  • క్షమించి, మర్చిపోవడం—ఎలా సాధ్యం?
    తేజరిల్లు!—1995
  • యెహోవా మిమ్మల్ని క్షమిస్తున్నాడు—మీరెలా ప్రయోజనం పొందవచ్చు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
w97 12/1 పేజీలు 10-14

యెహోవా, “క్షమించుటకు సిద్ధమైన మనస్సుగల” దేవుడు

“ప్రభువా, [“యెహోవా,” NW] నీవు దయాళుడవు క్షమించుటకు సిద్ధమైన మనస్సుగలవాడవు.”—కీర్తన 86:5.

1. రాజైన దావీదు ఏ భారాన్ని మోశాడు, ఆయన తన హృదయ వేదనకు ఓదార్పును ఎలా కనుగొన్నాడు?

అపరాధ భావన ఎంత భారమైనదిగా ఉండగలదో ప్రాచీన ఇశ్రాయేలు రాజైన దావీదుకు తెలుసు. ఆయనిలా వ్రాశాడు: “నా దోషములు నా తలమీదుగా పొర్లిపోయినవి; నేను మోయలేని బరువువలె అవి నామీద మోపబడియున్నవి. నేను సొమ్మసిల్లి బహుగా నలిగియున్నాను; నా మనోవేదననుబట్టి కేకలు వేయుచున్నాను.” (కీర్తన 38:4, 8) అయితే, దావీదు తన హృదయ వేదనకు ఓదార్పును కనుగొన్నాడు. యెహోవా పాపాన్ని ద్వేషించినప్పటికీ, నిజంగా పశ్చాత్తాపపడి తన పాపమార్గం నుండి వైదొలిగిన పాపిని ద్వేషించడని దావీదుకు తెలుసు. (కీర్తన 32:5; 103:3) పశ్చాత్తాపపడిన వారిపట్ల దయను కనుపర్చేందుకు యెహోవా సిద్ధంగా ఉంటాడన్న పూర్తి నమ్మకంతో దావీదు ఇలా అన్నాడు: “ప్రభువా, [“యెహోవా,” NW] నీవు దయాళుడవు క్షమించుటకు సిద్ధమైన మనస్సుగలవాడవు.”—కీర్తన 86:5.

2, 3. (ఎ) మనం పాపం చేసినప్పుడు, దాని ఫలితంగా మనం ఏ భారాన్ని మోస్తుండవచ్చు, ఇది ఎందుకు ఆరోగ్యకరం? (బి) అపరాధ భావనలో “మునిగి”పోవడంలో ఏ ప్రమాదం ఉంది? (సి) క్షమించడానికి యెహోవాకున్న ఇష్టతను గురించి బైబిలు ఏ హామీనిస్తుంది?

2 మనం పాపం చేసినప్పుడు, మనం కూడా మన మనస్సాక్షి మూలాన నలుగగొట్టే భారాన్ని మోస్తుండవచ్చు. ఈ తీవ్రమైన పశ్చాత్తాప భావాలు సహజమే, ఆరోగ్యకరం కూడాను. అవి మన తప్పుల్ని దిద్దుకునేందుకుగాను అనుకూలమైన చర్యలను చేపట్టడానికి కదిలించగలవు. అయితే, కొంతమంది క్రైస్తవులు అపరాధ భావాలు తమను ముంచెత్తుతున్నట్లుగా భావించారు. తాము ఎంత పశ్చాత్తాపం చెందినప్పటికీ, ఆత్మనింద మోపుతున్న తమ హృదయాలు దేవుడు తమను పూర్తిగా క్షమించడని పదేపదే చెబుతుండవచ్చు. “యెహోవా మనల్ని ఇక ఎంతమాత్రం ప్రేమించకపోవచ్చన్న భావన చాలా ఘోరమైంది” అని ఒక సహోదరి తాను చేసిన ఒక పొరపాటును గుర్తుతెచ్చుకుంటూ చెప్పింది. ఆమె పశ్చాత్తాపం చెంది, సంఘ పెద్దల నుండి దిద్దుబాటు సలహాను పొందిన తర్వాత కూడా, ఆమె దేవుని క్షమాపణకు తాను పాత్రురాలను కానని భావిస్తూనే ఉంది. ఆమె ఇలా వివరిస్తుంది: “యెహోవాను క్షమాపణ కొరకు అడగకుండా ఒక్క రోజు కూడా గడవదు.” మనం అపరాధ భావనలో “మునిగి”పోతున్నట్లైతే, మనం ఆశలు వదులుకునేలా చేయడానికి, మనం యెహోవాకు సేవ చేసేందుకు అర్హులము కామని భావించేలా చేయడానికి సాతాను ప్రయత్నించవచ్చు.—2 కొరింథీయులు 2:5-7, 11.

3 కానీ యెహోవా నిశ్చయంగా విషయాల్ని ఆ విధంగా దృష్టించడు! మనం యథార్థమైన హృదయపూర్వకమైన పశ్చాత్తాపాన్ని ప్రదర్శించినప్పుడు యెహోవా క్షమించడానికి ఇష్టపడుతున్నాడు, అవును, అందుకు ఆయన సిద్ధంగా ఉన్నాడని ఆయన వాక్యం హామీనిస్తుంది. (సామెతలు 28:13) కాబట్టి దేవుని క్షమ పొందడం మీకు అసాధ్యం అని ఎప్పుడైనా అన్పిస్తే, ఆయన ఎందుకు, ఏ విధంగా క్షమిస్తాడు అన్న విషయాల గురించిన సరైన అవగాహన బహుశ మీకు అవసరము.

యెహోవా ఎందుకు “క్షమించుటకు సిద్ధమైన మనస్సుగల”వాడు?

4. మన స్వభావం గురించి యెహోవా ఏమి గుర్తుచేసుకుంటాడు, ఇది ఆయన మనతో వ్యవహరించే పద్ధతిని ఎలా ప్రభావితం చేస్తుంది?

4 మనం ఇలా చదువుతాము: “పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరచి యున్నాడు. తండ్రి తన కుమారులయెడల జాలిపడునట్లు యెహోవా తనయందు భయభక్తులు గలవారి యెడల జాలిపడును.” జాలిపడడానికి యెహోవా ఎందుకంత సుముఖతతో ఉన్నాడు? తర్వాతి వచనం జవాబిస్తుంది: “మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసేయున్నది మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసికొనుచున్నాడు.” (కీర్తన 103:12-14) అవును, మనం మంటినుండి తీయబడిన ప్రాణులమన్న విషయాన్ని—అపరిపూర్ణత ఫలితంగా మనం నిర్బలులమన్న విషయాన్ని, బలహీనులమన్న విషయాన్ని—యెహోవా మర్చిపోడు. “మనము నిర్మింపబడిన రీతి” ఆయనకు తెలుసు అన్న వ్యక్తీకరణ, యెహోవాను కుమ్మరికి, మనల్ని ఆయన చేసే మట్టిపాత్రలకు బైబిలు పోల్చడాన్ని మనకు గుర్తుకు తెస్తుంది.a (యిర్మీయా 18:2-6) వాటి స్వభావం సదా మనస్సులో ఉంచుకుని, ఒక కుమ్మరి తన మట్టిపాత్రలను స్థిరంగా, కానీ సున్నితంగా పట్టుకుంటాడు. అదే విధంగా గొప్ప కుమ్మరి అయిన యెహోవా మనతో తన వ్యవహారాలను మన పాపభరిత స్వభావానికి, నిర్బలతకు అనుగుణ్యంగా మార్చుకుంటాడు.—2 కొరింథీయులు 4:7 పోల్చండి.

5. మన అపరిపూర్ణ శరీర స్వభావంపైన పాపపు శక్తివంతమైన పట్టును రోమీయుల పుస్తకం ఎలా వర్ణిస్తుంది?

5 పాపము ఎంత శక్తివంతమైనదో యెహోవా అర్థం చేసుకుంటాడు. తన మరణపాశములో మానవుని బంధించివున్న ఒక ప్రభావవంతమైన శక్తి అని లేఖనాలు పాపాన్ని వర్ణిస్తున్నాయి. పాపపు పట్టు అసలు ఎంత బలమైనది? ప్రేరేపిత అపొస్తలుడైన పౌలు రోమీయుల పుస్తకంలో దీన్ని విలక్షణమైన పదాల్లో వివరిస్తున్నాడు: తమ సైన్యాధిపతి క్రిందనున్న సైనికులవలె మనము “పాపమునకు లోనై” ఉన్నాము (రోమీయులు 3:9); అది మానవజాతిపైన రాజుగా ‘ఏలింది’ (రోమీయులు 5:21); అది మనలోనే ‘నివసిస్తుంది’ (రోమీయులు 7:17, 20); దాని “నియమము” మనలో కార్యం చేస్తుంది, తద్వారా మన గమనాన్ని నియంత్రించడానికి ప్రయత్నిస్తుంది. (రోమీయులు 7:23, 25) మన అపరిపూర్ణ స్వభావంపైన పాపపు శక్తివంతమైన పట్టును ఎదిరించడానికి మనం ఎంత కష్టతరమైన పోరాటాన్ని పోరాడాల్సివస్తుంది!—రోమీయులు 7:21, 24.

6. నలిగిన హృదయంతో తన దయను కోరేవారిని యెహోవా ఎలా దృష్టిస్తాడు?

6 అందుకని, మన హృదయాలు ఆయనకు పరిపూర్ణమైన విధేయతను కనపర్చాలని ఎంతగా కోరుకున్నప్పటికీ అది మనకు సాధ్యంకాదని మన దయగల దేవునికి తెలుసు. (1 రాజులు 8:46) మనం నలిగిన హృదయంతో, తండ్రిగా తాను చూపే దయను మనం కోరితే తాను క్షమిస్తానని ఆయన ప్రేమపూర్వకంగా హామీనిస్తున్నాడు. కీర్తనల గ్రంథకర్త దావీదు ఇలా చెప్పాడు: “విరిగిన మనస్సే దేవునికిష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు.” (కీర్తన 51:17) అపరాధ భావాల భారంతో విరిగి, నలిగిన హృదయాన్ని యెహోవా ఎన్నడూ నిరాకరించడు, త్రోసిపుచ్చడు. యెహోవా క్షమించడానికి సిద్ధమైన మనస్సు కలిగివుండడాన్ని అదెంత రమ్యంగా వర్ణిస్తుందో కదా!

7. మనం దేవుని దయను ఎందుకు సాకుగా ఉపయోగించకూడదు?

7 అయితే, మన పాపభరిత స్వభావాన్ని ఒక సాకుగా ఉపయోగిస్తూ దేవుని దయను దుర్వినియోగం చేయవచ్చనా దీనర్థం? ఎంతమాత్రం కాదు! యెహోవా కేవలం సున్నిత భావాలతో నడిపించబడడు. ఆయన దయకు అవధులున్నాయి. ఏమాత్రం పశ్చాత్తాపం చూపకుండా హానికరమైన, బుద్ధిపూర్వకమైన పాపాన్ని చేయడంలో హృదయ కాఠిన్యంతో కొనసాగుతూ ఉన్నవారిని ఆయన ఎన్నడూ క్షమించడు. (హెబ్రీయులు 10:26-31) మరోవైపు, “విరిగి నలిగిన” హృదయాన్ని యెహోవా చూసినప్పుడు “క్షమించుటకు సిద్ధమైన మనస్సు” కలిగివుంటాడు. (సామెతలు 17:3) దైవిక క్షమాపణ యొక్క పూర్ణత్వాన్ని వర్ణించడానికి బైబిలులో ఉపయోగించబడిన భావగర్భితమైన భాషను మనం కొంత పరిశీలిద్దాము.

యెహోవా ఎంత సంపూర్ణంగా క్షమిస్తాడు?

8. మన పాపాల్ని క్షమించినప్పుడు యెహోవా నిజానికి ఏమి చేస్తాడు, ఇది మనపై ఎలాంటి ప్రభావాన్ని కలిగివుండాలి?

8 పశ్చాత్తాపపడిన రాజైన దావీదు ఇలా అన్నాడు: “నా దోషమును కప్పుకొనక నీ యెదుట నా పాపము ఒప్పుకొంటిని—యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని. నీవు నా పాపదోషమును పరిహరించియున్నావు.” (ఇటాలిక్కులు మావి.) (కీర్తన 32:5) “పరిహరించి” అన్న వ్యక్తీకరణ, “పైకి ఎత్తివేయు,” “భరించు, మోయు” అన్న ప్రాథమిక అర్థాలుగల హెబ్రీ పదం నుండి అనువదించబడింది. ఇక్కడ దాని ఉపయోగం, ‘అపరాధాన్ని, పాపాన్ని, అతిక్రమమును తీసివేయడాన్ని’ సూచిస్తుంది. కాబట్టి యెహోవా దావీదు పాపాల్ని ఎత్తివేశాడు, చెప్పాలంటే ఒక విధంగా వాటిని తీసివేశాడు. (లేవీయకాండము 16:20-22 పోల్చండి.) దావీదు మోస్తున్న అపరాధ భావాలను ఇది నిస్సందేహంగా శాంతపర్చివుండవచ్చు. (కీర్తన 32:3 పోల్చండి.) యేసుక్రీస్తు విమోచన క్రయధన బలిమీద తమ విశ్వాసం ఆధారంగా క్షమాపణను అర్థించేవారి పాపాల్ని పరిహరించే దేవునిలో మనం కూడా పూర్తి నమ్మకాన్ని కలిగివుండవచ్చు. (మత్తయి 20:28; యెషయా 53:12 పోల్చండి.) ఎవరి పాపాలను యెహోవా ఆ విధంగా ఎత్తివేసి, వాటిని తీసివేస్తాడో అటువంటివారు గతంలో తాము చేసిన పాపాలను బట్టి అపరాధ భావాల భారాన్ని ఇక మోయనవసరం లేదు.

9. “మా ఋణములను క్షమించుము” అనే యేసు మాటలకు అర్థమేమిటి?

9 యెహోవా ఎలా క్షమిస్తాడో వివరించడానికి యేసు ఋణదాతలకు ఋణస్థులకు మధ్యనున్న సంబంధాన్ని దృష్టాంతపర్చాడు. ఉదాహరణకు, “మా ఋణములను క్షమించుము” అని ప్రార్థించమని యేసు మనల్ని కోరాడు. (మత్తయి 6:12) యేసు ఆ విధంగా “పాపములను” “ఋణముల”తో పోల్చాడు. (లూకా 11:4) మనం పాపం చేసినప్పుడు, మనం యెహోవాకు “ఋణస్థుల”మవుతాము. “క్షమించు” అని అనువదించబడిన గ్రీకు క్రియాపదం “ఒక అప్పును తీర్చమని కోరకుండా దానిని విడిచిపెట్టు, వదిలివేసుకొను” అని అర్థమివ్వగలదు. ఒక విధంగా చూస్తే, యెహోవా క్షమించినప్పుడు, మన ఖాతాలో జమ కాగల అప్పును ఆయన కొట్టివేస్తాడన్నమాట. పశ్చాత్తాపపడిన పాపులు ఆ విధంగా దుఃఖనివృత్తి పొందగలరు. తాను కొట్టివేసిన అప్పును చెల్లించమని యెహోవా మళ్లీ ఎన్నడూ కోరడు!—కీర్తన 32:1, 2; మత్తయి 18:23-35 పోల్చండి.

10, 11. (ఎ) అపొస్తలుల కార్యములు 3:19లో ఉన్న ‘తుడిచివేయబడు’ అనే మాట ద్వారా ఏ భావం వ్యక్తీకరించబడింది? (బి) యెహోవా క్షమాపణా పూర్ణత్వం ఎలా దృష్టాంతపర్చబడింది?

10 దేవుని క్షమాపణను వర్ణించడానికి అపొస్తలుల కార్యములు 3:20లో బైబిలు విస్పష్టమైన అలంకారిక భాషను ఉపయోగిస్తుంది: ‘మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము మారుమనస్సునొంది తిరుగుడి.’ ‘తుడిచివేయబడు’ అని అనువదించబడిన గ్రీకు క్రియాపదాన్ని రూపకాలంకారంగా ఉపయోగించినప్పుడు, “తుడిచిపెట్టు, రూపుమాపు, కొట్టివేయు లేక నాశనం చేయు” అని అర్థం ఇవ్వగలదు. కొంతమంది విద్వాంసుల ప్రకారం చేతివ్రాతను తుడిచివేయడమన్న భావం ఇక్కడ వ్యక్తం చేయబడింది. ఇదెలా సాధ్యం? ప్రాచీన కాలాల్లో సాధారణంగా ఉపయోగించే సిరాలో బొగ్గు, జిగురు, నీళ్లు ఉంటాయి. అటువంటి సిరాతో వ్రాసిన తర్వాత వెంటనే ఒక తడి స్పంజిని తీసుకుని ఆ వ్రాతను తుడిచివేయవచ్చు.

11 ఇక్కడ యెహోవా క్షమాపణా పూర్ణత్వాన్ని గురించిన ఒక అందమైన వర్ణన ఉంది. ఆయన మన పాపాల్ని క్షమించినప్పుడు, ఒక స్పంజిని తీసుకొని వాటిని తుడిచివేసినట్లే ఉంటుంది. అటువంటి పాపాల్ని ఆయన భవిష్యత్తులో మనకు విరుద్ధంగా జమచేస్తాడన్న భయం మనకు ఉండనవసరం లేదు. ఎందుకంటే బైబిలు యెహోవా దయను గూర్చి నిజంగా ఎంతో గమనార్హమైన ఒక విషయాన్ని వెల్లడి చేస్తుంది: ఆయన ఒక్కసారి క్షమించిన తర్వాత ఇక దాని గురించి మర్చిపోతాడు.

“వారి పాపములను ఇక నెన్నడును జ్ఞాపకము చేసికొనను”

12. యెహోవా మన పాపాల్ని మర్చిపోతాడని బైబిలు చెబుతున్నప్పుడు, వాటిని జ్ఞాపకం చేసుకోవడం ఆయనకు సాధ్యం కాదనా దానర్థం, మీ జవాబుకు కారణం ఏమిటి?

12 ప్రవక్తయైన యిర్మీయా ద్వారా క్రొత్త నిబంధనలో ఉన్నవారి గురించి యెహోవా ఇలా వాగ్దానం చేశాడు: “నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక నెన్నడును జ్ఞాపకము చేసికొనను.” (యిర్మీయా 31:34) యెహోవా క్షమించిన తర్వాత ఆ పాపాల్ని జ్ఞాపకం చేసుకోవడం ఆయనకు ఇక సాధ్యం కాదనా దీనర్థం? అది కాదు విషయం. దావీదు పాపాలతో సహా అనేకమంది వ్యక్తుల పాపాల్ని యెహోవా క్షమించడాన్ని గురించి బైబిలు చెబుతుంది. (2 సమూయేలు 11:1-17; 12:1-13) వారు చేసిన తప్పిదాలు యెహోవాకు విశదముగానే తెలుసు, మనకు కూడా తెలిసివుండాలి. వారి పాపాల వృత్తాంతం, అలాగే వారి పశ్చాత్తాపాన్ని గురించిన, దేవుని క్షమాపణను గురించిన వృత్తాంతం మన ప్రయోజనార్థం భద్రపర్చబడి ఉంది. (రోమీయులు 15:4) మరైతే యెహోవా, తాను క్షమించినవారి పాపాలను “జ్ఞాపకము” చేసికొనడు అని బైబిలు చెబుతున్నప్పుడు దాని భావమేమిటి?

13. (ఎ) ‘జ్ఞాపకము చేసికొను’ అని అనువదించబడిన హెబ్రీ క్రియాపదం అర్థంలో ఏమి చేరివుంది? (బి) “వారి పాపములను ఇక నెన్నడును జ్ఞాపకము చేసికొనను” అని చెబుతున్నప్పుడు, ఆయన మనకు ఏ హామీనిస్తున్నాడు?

13 ‘జ్ఞాపకము చేసికొను’ అని అనువదించబడిన హెబ్రీ క్రియాపదం కేవలం గతాన్ని గుర్తు తెచ్చుకోవడం కంటే ఎక్కువే సూచిస్తుంది. థియోలాజికల్‌ వర్డ్‌బుక్‌ ఆఫ్‌ ది ఓల్డ్‌ టెస్టమెంట్‌ అనే పుస్తకం ప్రకారం, ఆ క్రియాపదంలో “యుక్తమైన చర్యను తీసుకోవడం అన్న అదనపు అర్థం” కూడా ఉంది. కాబట్టి ఈ అర్థంలో, పాపాన్ని “జ్ఞాపకము” చేసుకోవడంలో పాపులకు విరుద్ధంగా చర్యను తీసుకోవడం కూడా చేరివుంది. దారితప్పిన ఇశ్రాయేలీయుల గురించి, “యెహోవా వారి దోషమును జ్ఞాపకము చేసికొనుచున్నాడు” అని ప్రవక్తయైన హోషేయ చెప్పినప్పుడు, వారు పశ్చాత్తాపపడనందుకు వారికి విరుద్ధంగా యెహోవా చర్య తీసుకుంటాడని ఆ ప్రవక్త మాటలకు అర్థం. అందుకనే ఆ వచనంలోని తర్వాతి భాగం ఇంకా ఇలా చెబుతుంది: “వారి పాపములకై ఆయన వారికి శిక్ష విధించును.” (హోషేయ 9:9) మరోవైపు, “వారి పాపములను ఇక నెన్నడును జ్ఞాపకము చేసికొనను” అని యెహోవా చెబుతున్నప్పుడు, తాను పశ్చాత్తాపపడిన పాపిని ఒక్కసారి క్షమించిన తర్వాత, ఎప్పుడో భవిష్యత్తులో ఆ పాపాల నిమిత్తం ఆ పాపికి విరుద్ధంగా తాను చర్య తీసుకోనని హామీనిస్తున్నాడు. (యెహెజ్కేలు 18: 21, 22) ఆ విధంగా, ఆయన మర్చిపోతాడు అంటే మనల్ని నిందించడానికో లేక శిక్షించడానికో మన పాపాలను మళ్లీ మళ్లీ బయటకు తీసుకురాడని దాని అర్థం. ఈ విధంగా ఇతరులతో మనం వ్యవహరించే పద్ధతిలో మనం అనుకరించడానికి యెహోవా ఒక అద్భుతమైన మాదిరిని ఉంచుతున్నాడు. అభిప్రాయ భేదాలు తలెత్తినప్పుడు, క్షమిస్తానని మునుపు మీరు ఒప్పుకున్న పూర్వపు అపరాధాలను వెలికితీయకుండా ఉండడం శ్రేష్ఠం.

పరిణామాల విషయమేమిటి?

14. క్షమాపణకు అర్థం, పశ్చాత్తాపపడిన పాపి తన తప్పుడు మార్గం యొక్క పరిణామాలన్నింటి నుండి మినహాయించబడ్డాడనే భావం ఎందుకు కాదు?

14 క్షమించడానికి యెహోవా సంసిద్ధంగా ఉన్నాడు అంటే దాని అర్థం, పశ్చాత్తాపపడిన పాపి తన తప్పుడు మార్గం యొక్క పరిణామాలన్నింటి నుండి మినహాయించబడ్డాడనా? ఎంత మాత్రం కాదు. మన పాపానికి శిక్ష తప్పకుండా ఉంటుంది. పౌలు ఇలా వ్రాశాడు: “మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును.” (గలతీయులు 6:7) మన చర్యలకు కొన్ని పరిణామాలను లేక సమస్యలను మనం అనుభవించవలసి రావచ్చు, కానీ యెహోవా క్షమాపణను అందించిన తర్వాత మనకు ప్రతికూల పరిస్థితులు ఏర్పడనీయడు. సమస్యలు ఉత్పన్నమైనప్పుడు ‘బహుశ నేను గతంలో చేసిన పాపాలకు యెహోవా నన్ను శిక్షిస్తున్నాడేమో’ అని ఒక క్రైస్తవుడు భావించకూడదు. (యాకోబు 1:13 పోల్చండి.) మరోవైపు, మన తప్పుడు చర్యల మూలంగా కలిగే పరిణామాలన్నింటి నుండి యెహోవా మనలను కాపాడడు. విడాకులు, అవాంఛిత గర్భధారణ, లైంగికంగా సంక్రమించే వ్యాధులు, నమ్మకము లేదా గౌరవము కోల్పోవడము—ఇవన్నీ పాపం వల్ల వచ్చే విషాదకరమైన పరిణామాలై ఉండవచ్చు, యెహోవా వాటి నుండి మనల్ని కాపాడడు. బత్షెబ, ఊరియాల సంబంధంగా దావీదు చేసిన పాపాలను యెహోవా క్షమించినప్పటికీ, అటుతర్వాత సంభవించిన వినాశనకరమైన పరిణామాల నుండి ఆయన దావీదును కాపాడలేదు.—2 సమూయేలు 12:9-15.

15, 16. లేవీయకాండము 6:1-7లో నమోదు చేయబడిన నియమము బాధితునికి, అపరాధికి ఇద్దరికీ ఎలా ప్రయోజనం చేకూర్చింది?

15 మన పాపాలకు ఇతర పరిణామాలు కూడా ఉండవచ్చు. ఉదాహరణకు, లేవీయకాండము 6వ అధ్యాయంలోని వృత్తాంతాన్ని పరిశీలించండి. దొంగతనం ద్వారానో, బలవంతంగానో, లేక మోసం చేయడం ద్వారానో తోటివాని వస్తువులను తీసికొని గంభీరమైన తప్పిదం చేసిన ఒక వ్యక్తి గురించి ఇక్కడ మోషే ధర్మశాస్త్రం చెబుతుంది. తర్వాత ఆ పాపి తాను దోషియన్న విషయాన్ని ఖండించి, చివరికి ధైర్యంగా అబద్ధ ప్రమాణాలు కూడా చేస్తాడు. రెండుపక్షాల వారివద్దా రుజువులు లేవు. అయితే అటుతర్వాత, అపరాధి తన మనస్సాక్షి పెట్టే బాధను తట్టుకోలేక తన పాపాన్ని ఒప్పుకుంటాడు. దేవుని క్షమాపణను సంపాదించడానికి ఆయన ఇంకా మూడు పనులు చేయాలి: తాను తీసుకున్నవి తిరిగి ఇచ్చివేయాలి, బాధితునికి 20 శాతం జరిమానా చెల్లించాలి, అపరాధ పరిహారార్థ బలిగా ఒక పొట్టేలును అర్పించాలి. అటుతర్వాత, ధర్మశాస్త్రం ఇలా చెబుతుంది: “యాజకుడు యెహోవా సన్నిధిని అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా . . . తాను చేసిన వాటన్నిటిలో ప్రతిదాని విషయమై అతనికి క్షమాపణ కలుగును.”—లేవీయకాండము 6:1-7; మత్తయి 5:23, 24 పోల్చండి.

16 ఈ నియమము దేవుని దయాపూర్వకమైన ఏర్పాటు. బాధితునికి ఆస్తి తిరిగి ఇచ్చివేయడం జరుగుతుంది కాబట్టి ఈ నియమము ఆయనకు ప్రయోజనం చేకూరుస్తుంది. అపరాధి ఎట్టకేలకు తన పాపాన్ని ఒప్పుకున్నప్పుడు ఆయన ఉపశమనాన్ని నిస్సందేహంగా పొందివుంటాడు. అదే సమయంలో, తన అపరాధాన్ని చివరికి ఒప్పుకుని, తప్పును సరిదిద్దుకునేందుకు తన మనస్సాక్షి కదిలించడంతో ఆ వ్యక్తికి కూడా ఈ నియమం ప్రయోజనం చేకూరుస్తుంది. ఒకవేళ అలా చేయడానికి తాను నిరాకరించి ఉంటే ఆయనకు దేవుని క్షమాపణ ఉండేదే కాదు.

17. ఇతరులు మన పాపాల మూలాన గాయపడినప్పుడు, మనం ఏమి చేయాలని యెహోవా అపేక్షిస్తున్నాడు?

17 మనం మోషే ధర్మశాస్త్రం క్రింద లేనప్పటికీ, అది మనకు క్షమాపణ విషయంలో దేవుని దృక్పథాన్ని గురించి ఆయన మనస్సు గురించి అమూల్యమైన అంతర్దృష్టిని అందజేస్తుంది. (కొలొస్సయులు 2:13, 14) ఇతరులు మనం చేసిన పాపాల మూలాన గాయపడితే లేక మోసపోతే అప్పుడు ‘తప్పును సరిదిద్దడానికి’ మనం చేయగలిగినంత చేసినప్పుడు యెహోవా సంతోషిస్తాడు. (2 కొరింథీయులు 7:11, NW) ఇందులో మన పాపాన్ని గుర్తించడం, మన అపరాధాన్ని ఒప్పుకోవడం, చివరికి బాధితునికి క్షమాపణలు చెప్పడం కూడా ఇమిడివుంది. అప్పుడు మనం యేసు బలి ఆధారంగా యెహోవాకు విన్నవించుకోగలము. అంతేగాక నిర్మలమైన మనస్సాక్షితో ఉపశమనాన్నీ, దేవుడు మనల్ని క్షమించాడన్న నిశ్చయతను అనుభవించగలము.—హెబ్రీయులు 10:21, 22.

18. యెహోవా క్షమాపణతోపాటు ఎటువంటి క్రమశిక్షణ తోడు కావచ్చు?

18 ప్రేమగల ప్రతి తల్లి లేక తండ్రి చేసినట్లుగానే, యెహోవా కూడా క్షమాపణతోపాటు కాస్త క్రమశిక్షణను కూడా ఇవ్వవచ్చు. (సామెతలు 3:11, 12) పశ్చాత్తాపపడిన ఒక క్రైస్తవుడు ఒక పెద్దగా, ఒక పరిచర్య సేవకునిగా, లేక ఒక పయినీరుగా సేవచేసే ఆధిక్యతను కోల్పోవల్సి రావచ్చు. తను ఎంతో విలువైనవిగా ఎంచే ఆధిక్యతలను కొంతకాలంపాటు కోల్పోవడం ఆయనకు బాధాకరంగానే ఉండవచ్చు. అయితే, అటువంటి క్రమశిక్షణకు అర్థం ఆయన యెహోవా అనుగ్రహాన్ని కోల్పోయాడనో లేక యెహోవా క్షమాపణను నిలిపివేశాడనో కాదు. దానికితోడు, యెహోవా నుండి వచ్చే క్రమశిక్షణ ఆయన ప్రేమకు రుజువు అని మనం గుర్తుంచుకోవాలి. దాన్ని స్వీకరించి మన జీవితాల్లో అన్వయించుకోవడం మన శ్రేయస్సు కొరకే పనిచేస్తుంది, అంతేకాదు నిత్యజీవానికి కూడా నడిపించగలదు.—హెబ్రీయులు 12:5-11.

19, 20. (ఎ) ఒకవేళ మీరు తప్పిదాలు చేస్తే, యెహోవా దయకు మీరు పాత్రులు కాలేరని ఎందుకు భావించకూడదు? (బి) తర్వాతి శీర్షికలో ఏమి చర్చించబడుతుంది?

19 “క్షమించుటకు సిద్ధమైన మనస్సుగల” దేవున్ని మనం సేవిస్తున్నామని తెలుసుకోవడం ఎంత సేదదీర్పుగా ఉంది! మన పాపాలూ తప్పిదాలకన్నా యెహోవా ఎక్కువే చూస్తాడు. (కీర్తన 130:3, 4) మన హృదయాల్లో ఏముందో ఆయనకు తెలుసు. గతంలోని తప్పుల వలన మీ హృదయం విరిగి నలిగినది అని మీరు భావిస్తే యెహోవా దయకు మీరు పాత్రులు కారన్న ముగింపుకు రాకండి. మీరు చేసిన తప్పులు ఏవైనప్పటికీ, మీరు నిజంగా పశ్చాత్తాపం చెందినట్లైతే, తప్పును సరిదిద్దడానికి చర్యలను తీసుకున్నట్లైతే, యేసు చిందించిన రక్తం ఆధారంగా యెహోవా క్షమాపణ కొరకు హృదయపూర్వకంగా ప్రార్థించినట్లైతే, అప్పుడు 1 యోహాను 1:9లోని ఈ మాటలు మీకు వర్తిస్తాయని మీరు పూర్తి నమ్మకం కలిగివుండగలరు: “మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతినుండి మనలను పవిత్రులనుగా చేయును.”

20 ఇతరులతో మనం వ్యవహరించే పద్ధతిలో, యెహోవా క్షమాపణను అనుకరించమని బైబిలు మనల్ని ప్రోత్సహిస్తుంది. అయితే, ఇతరులు మనకు విరుద్ధంగా పాపం చేసినప్పుడు ఎంతమేరకు మనం వారిని క్షమించి ఇక దాని గురించి మర్చిపోవాలని మననుండి అపేక్షించబడుతుంది? ఇది తర్వాతి శీర్షికలో చర్చించబడుతుంది.

[అధస్సూచీలు]

a ఆసక్తికరంగా, “మనము నిర్మింపబడిన రీతి” అని అనువదించబడిన హెబ్రీ పదం, కుమ్మరి చేసిన మట్టిపాత్రలకు సంబంధించి ఉపయోగించబడింది.—యెషయా 29:16.

మీరెలా జవాబిస్తారు?

◻ యెహోవా ఎందుకు “క్షమించుటకు సిద్ధమైన మనస్సుగల”వాడు?

◻ యెహోవా క్షమాపణా పూర్ణత్వాన్ని గురించి బైబిలు ఎలా వర్ణిస్తుంది?

◻ యెహోవా క్షమించినప్పుడు, ఆయన ఏ భావంలో మర్చిపోతాడు?

◻ ఇతరులు మన పాపాల మూలాన గాయపడినప్పుడు, మనం ఏమి చేయాలని యెహోవా అపేక్షిస్తున్నాడు?

[12వ పేజీలోని చిత్రం]

మన పాపాల మూలాన ఇతరులు గాయపడినప్పుడు, మనం పరిహారం చెల్లించాలని యెహోవా అపేక్షిస్తున్నాడు

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి