కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w07 4/15 పేజీలు 20-24
  • సంఘం యెహోవాను స్తుతించును గాక

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సంఘం యెహోవాను స్తుతించును గాక
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2007
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • దేవుని అభిషిక్త సంఘము
  • మరితర భావాల్లో “సంఘము”
  • సంఘాలు యెహోవాను స్తుతిస్తాయి
  • సంఘం క్షేమాభివృద్ధి పొందనివ్వండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2007
  • సంఘం ఎలా సంస్థీకరించబడింది?
    యెహోవా ఇష్టం చేస్తున్న సంస్థ
  • యెహోవా సంఘంలో మీరు విలువైన వాళ్లు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2020
  • సంఘంలో మీ స్థానాన్ని విలువైనదిగా పరిగణించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2009
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2007
w07 4/15 పేజీలు 20-24

సంఘం యెహోవాను స్తుతించును గాక

“నీ నామమును నా సహోదరులకు ప్రచురపరతును, సమాజము [‘సంఘము,’ NW] మధ్య నీ కీర్తిని గానము చేతును.”​—హెబ్రీయులు 2:11-12.

1, 2. సంఘం ఎందుకంత ప్రయోజనకరమైనది, అది పోషించే కీలక పాత్ర ఏమిటి?

చ రిత్రంతటిలో, మనుష్యులు ప్రాథమిక కుటుంబ పరిధిలోనే సహవాసాన్ని, భద్రతను కనుగొన్నారు. అయితే, నేడు ప్రపంచవ్యాప్తంగా అనేకమంది అసాధారణ సహవాసాన్ని, భద్రతను ఆస్వాదిస్తున్న మరో పరిధిని బైబిలు గుర్తిస్తోంది. అదే క్రైస్తవ సంఘం. మీరు సన్నిహితమైన, ఆసరాయిచ్చే కుటుంబంలో భాగమైనా, కాకపోయినా సంఘ ఏర్పాటు ద్వారా దేవుడనుగ్రహించిన దానిని మీరు విలువైనదిగా ఎంచవచ్చు, ఎంచాలి కూడా. మీరిప్పటికే యెహోవాసాక్షుల సంఘంతో సహవసిస్తుంటే అక్కడ మీరు ఆస్వాదించే స్నేహపూర్వక సహవాసం గురించి, మీకున్న భద్రతా భావం గురించి రూఢీగా చెప్పగలరు.

2 ఆ సంఘం కేవలం సామాజికంగా కలుసుకునే గుంపు కాదు. అది ఒకేలాంటి నేపథ్యం నుండి వచ్చిన లేదా ఏదైనా క్రీడలో లేక వ్యాపకంలో ఒకే విధమైన ఆసక్తిగల ప్రజలు కూడుకునే సామాజిక సభ లేదా క్లబ్బు కాదు. బదులుగా, ఆ సంఘ ఏర్పాటు ప్రాథమికంగా యెహోవా దేవుణ్ణి స్తుతించడానికే. కీర్తనల పుస్తకం నొక్కిచెబుతున్నట్లుగా దీర్ఘకాలంగా అలాగే జరుగుతోంది. కీర్తన 35:18 లో మనమిలా చదువుతాం: “మహాసమాజములో నేను నిన్ను స్తుతించెదను; బహు జనులలో నిన్ను నుతించెదను.” అదే విధంగా, కీర్తన 107:31, 32 వచనాలు మనల్నిలా ప్రోత్సహిస్తున్నాయి: “ఆయన కృపనుబట్టియు నరులకు ఆయనచేయు ఆశ్చర్య కార్యములనుబట్టియు వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక. జనసమాజములో వారాయనను ఘనపరచుదురుగాక.”

3. పౌలు చెప్పిన మాటల ప్రకారం సంఘం ఏమిచేస్తుంది?

3 క్రైస్తవ అపొస్తలుడైన పౌలు, ‘జీవముగల దేవుని సంఘము, సత్యమునకు స్తంభము ఆధారమునైన’ “దేవుని మందిరము” గురించి ప్రస్తావించినప్పుడు, ఆ సంఘం పోషించే మరో ప్రాముఖ్యమైన పాత్రను నొక్కిచెప్పాడు. (1 తిమోతి 3:15) పౌలు ఏ సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాడు? “సంఘము” అనే పదాన్ని బైబిలు ఏయే విధాలుగా ఉపయోగిస్తోంది? అది మన జీవితంపై, మన ఉత్తరాపేక్షలపై ఎలాంటి ప్రభావం చూపించాలి? దీనికి జవాబు తెలుసుకునేందుకు, దేవుని వాక్యంలో “సంఘం” అనే పదం ఏయే విధాలుగా ఉపయోగించబడిందో మనం మొదట పరిశీలిద్దాం.

4. హీబ్రూ లేఖనాల్లో “సమూహము” లేదా “సమాజము” అనే పదం సాధారణంగా ఏ భావంలో ఉపయోగించబడింది?

4 “సంఘము,” “సమాజము,” “సమూహము,” “దండు” అని తెలుగు బైబిల్లో తరచూ అనువదించబడిన హీబ్రూ పదం “కూర్చుట” లేదా “కూడివచ్చుట” అనే మూలపదం నుండి వచ్చింది. (ద్వితీయోపదేశకాండము 4:10; 9:10) కీర్తనకర్త ఈ హీబ్రూ పదాన్నే పరలోకంలోని దూతల సంబంధంగా ఉపయోగించాడు, దానినే దుష్టుల గుంపునుద్దేశించి కూడా ఉపయోగించవచ్చు. (కీర్తన 26:5; 89:5-7) అయితే హీబ్రూ లేఖనాలు అత్యంత తరచుగా ఆ మాటను ఇశ్రాయేలీయులకు అన్వయిస్తాయి. యాకోబు ‘జనముల సమూహము’ అవుతాడని దేవుడు సూచించాడు, అలాగే జరిగింది. (ఆదికాండము 35:11; 48:4) ఇశ్రాయేలీయులు ‘యెహోవా సమాజముగా,’ ‘దేవుని సమాజముగా’ ఉండేందుకు పిలవబడ్డారు లేదా ఎన్నుకోబడ్డారు.​—సంఖ్యాకాండము 20:4; నెహెమ్యా 13:1; యెహోషువ 8:35; 1 సమూయేలు 17:47; మీకా 2:5.

5. ఏ గ్రీకు పదం సాధారణంగా “సంఘము” అని అనువదించబడుతుంది, ఈ పదాన్ని ఎలా అన్వయించవచ్చు?

5 దీనికి సరిసమానమైన గ్రీకు పదం ఎక్లీసియా, ఇది “బయట,” “పిలుపు” అనే అర్థాలున్న రెండు గ్రీకు పదాలనుండి వచ్చింది. ఆ పదాన్ని, ఎఫెసులో పౌలుకు వ్యతిరేకంగా దేమేత్రి రెచ్చగొట్టిన “సభ” వంటి మతేతర గుంపుకు కూడా అన్వయించవచ్చు. (అపొస్తలుల కార్యములు 19:32, 39, 41) అయితే బైబిలు ఆ పదాన్ని సాధారణంగా క్రైస్తవ సంఘానికే ఉపయోగిస్తుంది. కొన్ని అనువాదాలు ఈ పదాన్ని “చర్చీ” అని అనువదిస్తున్నాయి, కానీ అది “బహిరంగ ఆరాధన కోసం క్రైస్తవులు సమకూడే అక్షరార్థమైన భవంతిని ఏ మాత్రం . . . సూచించదని” ది ఇంపీరియల్‌ బైబిల్‌ డిక్షనరీ నివేదిస్తోంది. అయితే ఆసక్తికరంగా, క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో “సంఘము” అనే పదం కనీసం నాలుగు విధాలుగా అన్వయించబడడాన్ని మనం చూస్తాం.

దేవుని అభిషిక్త సంఘము

6. దావీదు, యేసు సంఘంలో ఏమి చేశారు?

6కీర్తన 22:22లో దావీదు పలికిన మాటలను యేసుకు అన్వయిస్తూ, అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “నీ నామమును నా సహోదరులకు ప్రచురపరతును, సమాజముమధ్య [లేక సంఘముమధ్య] నీ కీర్తిని గానము చేతును. . . . కావున . . . దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమునుగల ప్రధానయాజకుడగు నిమిత్తము, అన్ని విషయములలో ఆయన [యేసు] తన సహోదరులవంటివాడు కావలసివచ్చెను.” (హెబ్రీయులు 2:11, 17, అధస్సూచి) దావీదు ప్రాచీన ఇశ్రాయేలు సమాజము మధ్య దేవుణ్ణి స్తుతించాడు. (కీర్తన 40:9) యేసు “సంఘముమధ్య” దేవుణ్ణి స్తుతించాడు అని చెప్పినప్పుడు పౌలు దేనిని సూచిస్తున్నాడు? అది ఏ సంఘం?

7. “సంఘము” అనే పదాన్ని క్రైస్తవ గ్రీకు లేఖనాలు ఏ ప్రాథమిక భావంలో ఉపయోగిస్తున్నాయి?

7 హెబ్రీయులు 2:11, 17లో మనం చదివేది చాలా విశేషమైనది. అది, క్రీస్తు తన సహోదరులకు దేవుని నామాన్ని ప్రకటించిన సంఘంలో, ఆయన కూడా ఒక సభ్యుడేనని చూపిస్తోంది. ఆ సహోదరులు ఎవరు? వారు ‘అబ్రాహాము సంతానంలో’ పాలిభాగస్థులును, “పరలోకసంబంధమైన పిలుపులో పాలుపొందిన” క్రీస్తు ఆత్మాభిషిక్త సహోదరులునై ఉన్నారు. (హెబ్రీయులు 2:16-3:1; మత్తయి 25:40) అవును, క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో ప్రస్తావించబడిన “సంఘము” దాని ప్రాథమిక భావంలో క్రీస్తు ఆత్మాభిషిక్త అనుచరుల సంయుక్త గుంపును సూచిస్తోంది. ఈ 1,44,000 మంది అభిషిక్తులు “పరలోకమందు వ్రాయబడియున్న జ్యేష్ఠుల సంఘముగా” ఏర్పడతారు.​—హెబ్రీయులు 12:23.

8. క్రైస్తవ సంఘం నెలకొల్పబడుతుందని యేసు ముందే ఎలా సూచించాడు?

8 ఈ క్రైస్తవ “సంఘము” నెలకొల్పబడనుందని యేసు సూచించాడు. తన మరణానికి దాదాపు ఒక సంవత్సరం ముందు ఆయన ఒక అపొస్తలునితో ఇలా అన్నాడు: “నీవు పేతురువు; ఈ బండమీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని యెదుట నిలువనేరవు.” (మత్తయి 16:18) యేసే ప్రవచింపబడిన బండ అని పేతురు, పౌలు సరిగా అర్థం చేసుకున్నారు. క్రీస్తు అనే బండపై కట్టబడిన ఆ ఆధ్యాత్మిక మందిరంలో “సజీవమైన రాళ్లవలె” ఉన్నవారు, తమను పిలిచిన వాని ‘గుణాతిశయములను ప్రచురము చేయడానికి దేవుని సొత్తయిన ప్రజలుగా’ ఉన్నారని పేతురు వ్రాశాడు.​—1 పేతురు 2:4-9; కీర్తన 118:22; యెషయా 8:14; 1 కొరింథీయులు 10:1-4.

9. దేవుని సంఘం రూపుదిద్దుకోవడం ఎప్పుడు ప్రారంభమైంది?

9 ఈ “దేవుని సొత్తయిన ప్రజలు” క్రైస్తవ సంఘంగా రూపొందడం ఎప్పుడు ప్రారంభమైంది? సా.శ. 33 పెంతెకొస్తు దినాన దేవుడు యెరూషలేములో సమకూడిన శిష్యులపై పరిశుద్ధాత్మను కుమ్మరించినప్పుడు అది ప్రారంభమైంది. అదే రోజున ఆ తర్వాత, పేతురు యూదుల, యూదామత ప్రవిష్టుల గుంపునుద్దేశించి నైపుణ్యవంతంగా ప్రసంగించాడు. చాలామంది యేసు మరణం విషయమై హృదయంలో నొచ్చుకొని, పశ్చాత్తాపపడి, బాప్తిస్మం తీసుకున్నారు. అలా మూడువేలమంది చేర్చబడి ఎదుగుచున్న, దేవుని క్రొత్త సంఘంలో భాగస్థులయ్యారని బైబిలు చారిత్రక నివేదికలో మనం చూస్తాం. (అపొస్తలుల కార్యములు 2:1-4, 14, 37-47) అది ఎదుగుతూ వచ్చింది ఎందుకంటే అంతకంతకు ఎక్కువమంది యూదులు, యూదామత ప్రవిష్టులు సహజ ఇశ్రాయేలు ఇంకెంత మాత్రం దేవుని సంఘంగా లేదనే వాస్తవాన్ని అంగీకరించారు. బదులుగా, ఆధ్యాత్మిక “దేవుని ఇశ్రాయేలుగా” రూపొందిన అభిషిక్త క్రైస్తవులు దేవుని నిజమైన సంఘంగా ఏర్పడ్డారు.​—గలతీయులు 6:16; అపొస్తలుల కార్యములు 20:28.

10. దేవుని సంఘంతో యేసుకు ఎలాంటి సంబంధం ఉంది?

10 “క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు” వంటి పదబంధంలో ఉన్నట్లుగా బైబిలు తరచూ యేసుకు, అభిషిక్తులకు మధ్య భేదాన్ని చూపిస్తుంది. ఈ ఆత్మాభిషిక్త క్రైస్తవుల సంఘానికి యేసు శిరస్సుగా ఉన్నాడు. దేవుడు “సమస్తముపైని ఆయనను [యేసును] సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము” అని పౌలు వ్రాశాడు. (ఎఫెసీయులు 1:22, 23; 5:23, 32; కొలొస్సయులు 1:18, 24) నేడు, ఈ సంఘ అభిషిక్త సభ్యుల చిన్న శేషము మాత్రమే భూమ్మీద ఉంది. అయితే వారి శిరస్సైన యేసుక్రీస్తు వారిని ప్రేమిస్తున్నాడని మనం నమ్మవచ్చు. వారిపట్ల ఆయన మనోవైఖరి ఎఫెసీయులు 5:25లో ఇలా వర్ణించబడింది: ‘క్రీస్తుకూడ సంఘమును ప్రేమించి, దానికొరకు తన్నుతాను అప్పగించుకొనెను.’ ఆయన వారిని ప్రేమిస్తున్నాడు, ఎందుకంటే వారు యేసు భూమ్మీద ఉన్నప్పుడు చేసినట్లే దేవునికి ‘స్తుతియాగము చేయుచు, ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వఫలము’ అర్పించడంలో నిమగ్నమై ఉన్నారు.​—హెబ్రీయులు 13:15.

మరితర భావాల్లో “సంఘము”

11. క్రైస్తవ గ్రీకు లేఖనాలు “సంఘమును” ఏ రెండవ భావంలో ఉపయోగిస్తున్నాయి?

11 కొన్నిసార్లు బైబిలు “సంఘము” అనే పదాన్ని ‘దేవుని సంఘంగా’ రూపొందిన 1,44,000 అభిషిక్తుల గుంపంతటికి అన్వయించకుండా మరింత పరిమితమైన లేదా భిన్నమైన భావంలో ఉపయోగిస్తుంది. ఉదాహరణకు, ఒక క్రైస్తవ గుంపుకు పౌలు ఇలా వ్రాశాడు: “యూదులకైనను, గ్రీసుదేశస్థులకైనను, దేవుని సంఘమునకైనను అభ్యంతరము కలుగజేయకుడి.” (1 కొరింథీయులు 10:32) కాబట్టి, ప్రాచీన కొరింథులోని ఓ క్రైస్తవుడు అనుచితంగా ప్రవర్తిస్తే, అది కొందరు అభ్యంతరపడేందుకు కారణం కావచ్చు. ఆ అనుచిత ప్రవర్తన పౌలు కాలం నుండి మనకాలం వరకు గ్రీసు దేశస్థులను, యూదులను లేదా అభిషిక్తులందరినీ అభ్యంతరపర్చే అవకాశముందా? లేదు. కాబట్టి ఈ వచనంలోని “దేవుని సంఘము” ఒక నిర్దిష్టమైన కాలంలో నివసిస్తున్న క్రైస్తవులకు వర్తిస్తుందన్నట్లు అనిపిస్తోంది. తదనుగుణంగా, దేవుడు సంఘానికి నిర్దేశమివ్వడం, సహాయం చేయడం లేక ఆశీర్వదించడం అనే విషయం గురించి మాట్లాడినప్పుడు, అది ఒక నిర్దిష్ట కాలంలోని క్రైస్తవులందరినీ వారు ఎక్కడున్నా వారందరనీ ఉద్దేశించి చెప్పబడినట్లు అర్థం చేసుకోవచ్చు. లేదా క్రైస్తవ సహోదరత్వమంతటి గురించి అనే భావంలో, నేడు దేవుని సంఘంలోవున్న సంతోషం, సమాధానం గురించి మాట్లాడవచ్చు.

12. ఏ మూడవ భావంలో బైబిలు “సంఘమును” ఉపయోగిస్తోంది?

12 “సంఘమును” బైబిలు ఉపయోగించే మూడవ విధానం ఒక ప్రాంతంలోని క్రైస్తవులందరికీ అన్వయిస్తుంది. మనమిలా చదువుతాం: “యూదయ గలిలయ సమరయ దేశములందంతట సంఘము క్షేమాభివృద్ధినొందుచు సమాధానము కలిగియుండెను.” (అపొస్తలుల కార్యములు 9:31) విస్తారమైన ఆ ప్రాంతంలో క్రైస్తవ గుంపులు ఒకటికన్నా ఎక్కువేవున్నాయి, అయితే యూదయ, గలిలయ, సమరయల్లోని ఆ గుంపులన్నీ కలిపి “సంఘము” అని చెప్పబడ్డాయి. సా.శ. 33 పెంతెకొస్తు దినాన, ఆ తర్వాత బాప్తిస్మం తీసుకున్నవారి సంఖ్యను పరిగణలోకి తీసుకుంటే, యెరూషలేము ప్రాంతంలో ఒకటికన్నా ఎక్కువ గుంపులు క్రమంగా కూడుకొని ఉంటాయి. (అపొస్తలుల కార్యములు 2:41, 46, 47; 4:4; 6:1, 7) హేరోదు అగ్రిప్ప సా.శ. 44లో చనిపోయేవరకు యూదయను పరిపాలించాడు, 1 థెస్సలొనీకయులు 2:14 స్పష్టం చేస్తున్నట్లుగా కనీసం సా.శ. 50కల్లా యూదయలో అనేక సంఘాలు ఏర్పడ్డాయి. కాబట్టి, హేరోదు ‘సంఘపువారిలో కొందరిని బాధపెడుతున్నాడని’ మనం చదివినప్పుడు, ఇది యెరూషలేములో కూడుకున్న ఒకటికన్నా ఎక్కువ గుంపులనే సూచిస్తుండవచ్చు.​—అపొస్తలుల కార్యములు 12:1.

13. బైబిలు “సంఘమును” ఉపయోగించిన నాల్గవ, సామాన్య విధానమేమిటి?

13 నాల్గవది మరింత పరిమితంగా, సామాన్యంగా ఉపయోగించబడే “సంఘము” అనే మాట ఒక ఇంట్లో కూడుకునే స్థానిక సంఘంగా రూపొందిన క్రైస్తవులను సూచిస్తుంది. పౌలు “గలతీయ సంఘములను” పేర్కొన్నాడు. ఆ విశాల రోమ్‌ పాలిత ప్రాంతంలో అలాంటి సంఘాలు ఒకటికన్నా ఎక్కువే ఉన్నాయి. గలతీయను ప్రస్తావించినప్పుడు పౌలు రెండుసార్లు “సంఘములు” అని బహువచనం ఉపయోగించాడు, వాటిలో అంతియొకయ, దెర్బే, లుస్త్ర, ఈకొనియ ఉండవచ్చు. ఈ స్థానిక సంఘాల్లో అర్హులైన పెద్దలు లేదా పైవిచారణకర్తలు నియమించబడ్డారు. (1 కొరింథీయులు 16:1; గలతీయులు 1:2; అపొస్తలుల కార్యములు 14:19-23) లేఖనాధారంగా అవన్నీ ‘దేవుని సంఘములు.’​—1 కొరింథీయులు 11:16; 2 థెస్సలొనీకయులు 1:4.

14. కొన్ని వచనాల్లో “సంఘము” ఉపయోగించబడిన రీతినిబట్టి మనమే నిర్ధారణకు రావచ్చు?

14 కొన్ని సందర్భాల్లో, క్రైస్తవ కూటాల్లోని గుంపులు ఒక ఇంట్లో కూర్చోగలిగినంత చిన్నవిగా ఉండేవి. అయినప్పటికీ, అలాంటి కొన్ని గుంపులకు “సంఘము” అనే మాట అన్వయించబడింది. అలాంటివాటిలో అకుల ప్రిస్కిల్ల, నుంఫా, ఫిలేమోను ఇళ్లలోవున్న సంఘాలు మనకు తెలుసు. (రోమీయులు 16:3-5; కొలొస్సయులు 4:15; ఫిలేమోను 2) చాలాచిన్నగా ఉన్నప్పటికీ ఒక ఇంట్లో క్రమంగా కూడుకునే నేటి స్థానిక సంఘాలకు ఇదెంతో ప్రోత్సాహాన్నివ్వాలి. యెహోవా అలాంటి సంఘాలను మొదటి శతాబ్దంలో గుర్తించాడు, అలాగే నేడు కూడా వాటిని గుర్తించడమే కాక, ఆయన తన పరిశుద్ధాత్మ ద్వారా వాటికి మార్గనిర్దేశమిస్తూ, వాటిని బలపరుస్తున్నాడు.

సంఘాలు యెహోవాను స్తుతిస్తాయి

15. తొలి సంఘాల్లో కొన్నింటిలో పరిశుద్ధాత్మ పనిచేయడం ఎలా వెల్లడిచేయబడింది?

15 కీర్తన 22:22 నెరవేర్పుగా యేసు సంఘముమధ్య దేవుణ్ణి స్తుతించాడని మనం గమనించాం. (హెబ్రీయులు 2:11) నమ్మకమైన ఆయన అనుచరులు కూడా అలాగే చేయాలి. మొదటి శతాబ్దంలో నిజ క్రైస్తవులు దేవుని కుమారులై, ఆ విధంగా క్రీస్తు సహోదరులయ్యేలా పరిశుద్ధాత్మచేత అభిషేకించబడినప్పుడు, ఆ ఆత్మ కొందరిలో అదనంగా, ప్రత్యేక రీతిలో పనిచేయడం ఆరంభించింది. వారు ఆత్మసంబంధమైన అద్భుత కృపావరాల్ని పొందారు. అలా వారిలో ప్రత్యక్షపర్చబడిన ఆ వరాల్లో కొన్ని ప్రత్యేక బుద్ధితో లేదా జ్ఞానంతో మాట్లాడడం, స్వస్థపరిచే లేదా ప్రవచించే శక్తి లేదా వారికి తెలియని భాషల్లో మాట్లాడే సామర్థ్యం ఉన్నాయి.​—1 కొరింథీయులు 12:4-11.

16. ఆత్మసంబంధమైన అద్భుత కృపావరాల ఒక లక్ష్యమేమిటి?

16 భాషల్లో మాట్లాడడం గురించి పౌలు ఇలాచెప్పాడు: “ఆత్మతో పాడుదును, మనస్సుతోను పాడుదును.” (1 కొరింథీయులు 14:15) ఇతరులు తన స్తుతి గీతంలోని మాటలను అర్థం చేసుకొని తద్వారా ఉపదేశం పొందవలసిన ప్రాముఖ్యతను ఆయన గ్రహించాడు. సంఘంలో యెహోవాను స్తుతించాలన్నది పౌలు లక్ష్యం. ఆత్మసంబంధ వరాలున్నవారు ఎక్కడైతే తమ వరాన్ని కనబర్చారో ఆ స్థానిక “సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగునిమిత్తము అవి మీకు విస్తరించునట్లు ప్రయత్నము చేయుడి” అని ఆయన వారిని పురికొల్పాడు. (1 కొరింథీయులు 14:4, 5, 12, 23) కాబట్టి, క్రైస్తవులకు ప్రతీ సంఘంలో దేవుణ్ణి స్తుతించే అవకాశాలుంటాయని ఎరిగిన పౌలు స్థానిక సంఘాలపట్ల ఆసక్తి చూపించాడు.

17. నేటి స్థానిక సంఘాల విషయంలో మనమే నమ్మకంతో ఉండవచ్చు?

17 యెహోవా తన సంఘాన్ని ఉపయోగించుకుంటూ, దానిని బలపరుస్తున్నాడు. నేడు భూమ్మీదున్న అభిషిక్త క్రైస్తవుల సంయుక్త గుంపును ఆయన ఆశీర్వదిస్తున్నాడు. దేవుని ప్రజలు బలవర్ధకమైన ఆధ్యాత్మిక ఆహారాన్ని సమృద్ధిగా పొందడం నుండి దీనిని చూడవచ్చు. (లూకా 12:42) ఆయన ప్రపంచవ్యాప్త సహోదరత్వాన్ని సంపూర్ణంగా ఆశీర్వదిస్తున్నాడు. మన క్రియల ద్వారా, క్షేమాభివృద్ధికరమైన ఆధ్యాత్మిక వ్యాఖ్యానాల ద్వారా మన సృష్టికర్తను స్తుతించే స్థానిక సంఘాలను ఆయన ఆశీర్వదిస్తున్నాడు. మన స్థానిక సంఘానికి హాజరవలేని ఇతర సందర్భాల్లో కూడా దేవుణ్ణి స్తుతించగలిగేలా మనమక్కడ విద్యను, శిక్షణను పొందుతున్నాం.

18, 19. ఏ స్థానిక సంఘంలోనైనా విశ్వాసపాత్రమైన క్రైస్తవులు ఏమి చేయాలని కోరుకుంటారు?

18 ‘దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు, మీరు యేసుక్రీస్తువలననైన నీతిఫలములతో నిండికొనిన వారైయుండవలెనని ప్రార్థించుచున్నాను’ అని మాసిదోనియలోని ఫిలిప్పీలోవున్న స్థానిక సంఘ క్రైస్తవులను అపొస్తలుడైన పౌలు పురికొల్పాడని గుర్తుతెచ్చుకోండి. అందులో యేసుపట్ల తమకున్న విశ్వాసం గురించి, తమ అద్భుతమైన నిరీక్షణ గురించి ఇతరులతో, సంఘం వెలుపటివారితో మాట్లాడడం ఇమిడివుంది. (ఫిలిప్పీయులు 1:9-11; 3:8-11) తదనుగుణంగా పౌలు తోటి క్రైస్తవులను ఇలా ప్రోత్సహించాడు: “ఆయన [యేసు] ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడును స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు, జిహ్వాఫలము అర్పించుదము.”​—హెబ్రీయులు 13:15.

19 యేసులాగే మీరు, యెహోవాను ఎరుగని, ఆయనను స్తుతించనివారి ఎదుట ఆయనను స్తుతించేందుకు మీ పెదవులను ఉపయోగిస్తూ ‘సంఘంలో’ దేవుణ్ణి స్తుతించడంలో ఆనందిస్తున్నారా? (హెబ్రీయులు 2:11; రోమీయులు 15:9-11) మన జవాబు కొంతమేర, దేవుని సంకల్పంలో మన స్థానిక సంఘం పోషించే పాత్రను గురించి మనం భావించేదానిపై ఆధారపడి ఉంటుంది. మన స్థానిక సంఘాన్ని యెహోవా ఎలా నిర్దేశిస్తూ, ఉపయోగించుకుంటున్నాడు, నేడు మన జీవితాల్లో దాని పాత్ర ఏమైవుండాలి అనే అంశాలను మనం తర్వాతి ఆర్టికల్‌లో పరిశీలిస్తాం.

మీకు జ్ఞాపకమున్నాయా?

• అభిషిక్త క్రైస్తవులతో ఏర్పడిన “దేవుని సంఘము” ఎలా ఉనికిలోకి వచ్చింది?

• “సంఘము” అనే పదాన్ని బైబిలు అదనంగా ఏ మూడు విధాలుగా ఉపయోగిస్తోంది?

• సంఘం విషయంలో దావీదు, యేసు, మొదటి శతాబ్దపు క్రైస్తవులు ఏమి చేసేందుకు ఇష్టపడ్డారు, అది మనపై ఎలా ప్రభావం చూపించాలి?

[21వ పేజీలోని చిత్రం]

యేసు ఏ సంఘానికి పునాదిగా ఉన్నాడు?

[23వ పేజీలోని చిత్రం]

క్రైస్తవుల స్థానిక గుంపులు ‘దేవుని సంఘాలుగా’ కూడుకున్నాయి

[24వ పేజీలోని చిత్రం]

బెనిన్‌లోని క్రైస్తవుల్లాగే మనం, సమకూడిన సమూహాల్లో యెహోవాను స్తుతించవచ్చు

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి