యెహోవా మన మొర ఆలకిస్తాడు
“యెహోవా దృష్టి నీతిమంతులమీద నున్నది. ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గియున్నవి.”—కీర్త. 34:15.
1, 2. (ఎ) నేడు చాలామంది మనోభావమెలా ఉంది? (బి) దీనినిబట్టి మనమెందుకు ఆశ్చర్యపడము?
మీరు వేదన అనుభవిస్తున్నారా? అలా అనుభవిస్తున్నది మీరొక్కరే కాదు. లక్షలాదిమంది ఈ దుష్టవిధానంలో దైనందిన జీవిత ఒత్తిళ్లతో పోరాడుతున్నారు. కొంతమందికి ఇవి భరించలేనంతగా ఉన్నాయి. వారి మనోభావం కూడా కీర్తనకర్తయైన దావీదు మనోభావంలాగే ఉంది. ఆయనిలా రాశాడు: “నేను సొమ్మసిల్లి బహుగా నలిగియున్నాను, నా మనోవేదననుబట్టి కేకలు వేయుచున్నాను. నా గుండె కొట్టుకొనుచున్నది, నా బలము నన్ను విడిచిపోయెను, నా కనుదృష్టియు తప్పిపోయెను.”—కీర్త. 38:8, 10.
2 క్రైస్తవులుగా మనం జీవన వేదనలనుబట్టి ఆశ్చర్యపడం. ఆ “వేదనలు” ప్రవచించబడిన యేసు రాకడకు లేదా ప్రత్యక్షతకు సంబంధించిన సూచనలో భాగమని మనం అర్థం చేసుకుంటాం. (మార్కు 13:8; మత్త. 24:3) “వేదనలు” అని అనువదించబడిన ఆదిమభాషా పదం తీవ్రమైన ప్రసవవేదనను సూచిస్తుంది. ఈ “అపాయకరమైన” లేదా ‘ఘోరమైన’ కాలాల్లో ప్రజలు అనుభవిస్తున్న బాధను ఆ పదమెంత ఖచ్చితంగా వర్ణిస్తోందో కదా!—2 తిమో. 3:1; ఈజీ-టు-రీడ్ వర్షన్.
మన వేదనలను యెహోవా అర్థం చేసుకుంటాడు
3. దేవుని ప్రజలకు ఏ విషయం బాగా తెలుసు?
3 ఈ వేదనలకు తామేమీ అతీతులము కాదని, ఈ విపత్కర పరిస్థితులు తప్పకుండా మరింత దిగజారతాయని యెహోవా ప్రజలకు బాగా తెలుసు. మానవులు సాధారణంగా అనుభవిస్తున్న వాటితోపాటు దేవుని సేవకులుగా మనం, మన విశ్వాసాన్ని నాశనం చేసేందుకు కంకణం కట్టుకున్న “విరోధియైన అపవాదిని” కూడా ఎదుర్కొంటున్నాం. (1 పేతు. 5:8) “నిందకు నా హృదయము బద్దలాయెను, నేను బహుగా కృశించియున్నాను, కరుణించువారికొరకు కనిపెట్టుకొంటినిగాని యెవరును లేకపోయిరి. ఓదార్చువారికొరకు కనిపెట్టుకొంటినిగాని యెవరును కానరారైరి” అని పలికిన దావీదులాగే అనుకోవడమెంత సులభమో కదా!—కీర్త. 69:20.
4. మనం వేదన అనుభవిస్తున్నప్పుడు మనకు ఆదరణనిచ్చేదేమిటి?
4 అంటే తనకెలాంటి నిరీక్షణా లేదని దావీదు ఉద్దేశమా? కాదు. అదే కీర్తనలో ఆయన చెప్పిన తర్వాతి మాటలను గమనించండి: “యెహోవా దరిద్రుల మొఱ్ఱ ఆలకించువాడు, ఖైదులో నుంచబడిన తన వారిని ఆయన తృణీకరించువాడు కాడు.” (కీర్త. 69:33) విశాలార్థంలో, కొన్నిసార్లు మనం వేదనలు లేదా కష్టాల చెరలో ఖైదీల్లా ఉన్నామని భావించవచ్చు. ఇతరులు నిజంగా మన పరిస్థితిని అర్థం చేసుకోనట్లు కనిపించవచ్చు. బహుశా వారు అర్థం చేసుకోకపోవచ్చు. కానీ దావీదు ఆదరణ పొందినట్లే మనం కూడా యెహోవా మన వేదనను పూర్తిగా అర్థం చేసుకుంటాడని తెలుసుకొని ఆదరణ పొందవచ్చు.—కీర్త. 34:15.
5. ఏ విషయంలో సొలొమోను రాజుకు నమ్మకముంది?
5 దావీదు కుమారుడైన సొలొమోను, యెరూషలేము దేవాలయ ప్రతిష్ఠాపనా సమయంలో ఈ వాస్తవాన్ని నొక్కిచెప్పాడు. (2 దినవృత్తాంతములు 6:29-31 చదవండి.) యథార్థ హృదయంగల ఏ వ్యక్తైనా “నొప్పిగాని కష్టముగాని అనుభవించుచు” పార్థిస్తే, వారి ప్రార్థన ఆలకించాలని ఆయన యెహోవాను వేడుకున్నాడు. వేదనలు అనుభవించేవారి ప్రార్థనలకు దేవుడెలా స్పందిస్తాడు? దేవుడు వారి ప్రార్థనలను ఆలకించడమే కాదుగానీ వారికి సహాయం చేస్తాడనే నమ్మకాన్ని సొలొమోను వ్యక్తపర్చాడు. ఎందుకు? ఎందుకంటే ఆయనకు “మానవుల హృదయము” నిజంగా తెలుసు.
6. చింతను మనమెలా తాళుకోవచ్చు, దానికి కారణమేమిటి?
6 ఆ మనుష్యుల్లాగే మనం కూడా ‘నొప్పి, కష్టం’ గురించి అంటే మన వేదనల గురించి యెహోవాకు పార్థించవచ్చు. మన వేదనలను ఆయన అర్థం చేసుకుంటాడనీ, మనపట్ల శ్రద్ధ చూపిస్తాడనీ తెలుసుకొని ఉపశమనం పొందవచ్చు. “ఆయన మిమ్మునుగూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయనమీద వేయుడి” అని చెప్పినప్పుడు అపొస్తలుడైన పేతురు ఈ విషయాన్ని రూఢీపరుస్తున్నాడు. (1 పేతు. 5:7) మనకు జరిగేవాటి విషయంలో యెహోవాకు నిజంగా శ్రద్ధవుంది. యెహోవా ప్రేమపూర్వక శ్రద్ధను నొక్కిచెబుతూ యేసు ఇలా అన్నాడు: “రెండు పిచ్చుకలు కాసుకు అమ్మబడును గదా; అయినను మీ తండ్రి సెలవులేక వాటిలో ఒకటైనను నేలనుపడదు. మీ తలవెండ్రుకలన్నియు లెక్కింపబడి యున్నవి గనుక మీరు భయపడకుడి; మీరనేకమైన పిచ్చుకలకంటె శ్రేష్ఠులు.”—మత్త. 10:29-31.
యెహోవా సహాయం చేస్తాడని నమ్మండి
7. ఏ సహాయం లభిస్తుందని మనకు హామీ ఇవ్వబడింది?
7 మనకు విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు మనకు సహాయం చేసేందుకు యెహోవా ఇష్టపడుతున్నాడనీ, ఆయనకు ఆ సామర్థ్యం ఉందనీ మనం ఖచ్చితంగా నమ్మవచ్చు. “దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై యున్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు.” (కీర్త. 34:15-18; 46:1) దేవుడు ఆ సహాయాన్ని ఎలా అందిస్తాడు? 1 కొరింథీయులు 10:13 ఏమి చెబుతోందో పరిశీలించండి: “దేవుడు నమ్మదగినవాడు; మీరు సహింపగలిగినంతకంటె ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనియ్యడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతోకూడ తప్పించుకొను మార్గమును కలుగజేయును.” ఆ దుస్థితి తొలగిపోయేలా యెహోవా విషయాలను నిర్దేశించవచ్చు, లేదా దానిని సహించగల శక్తిని మనకివ్వవచ్చు. ఏ రీతిలోనైనా మనకు సహాయం లభిస్తుంది.
8. దేవుని సహాయాన్ని మనమెలా సద్వినియోగం చేసుకోవచ్చు?
8 ఆ సహాయాన్ని మనమెలా సద్వినియోగం చేసుకోవచ్చు? మనమేమి చేయాలని ఉపదేశించబడ్డామో గమనించండి: “మీ చింత యావత్తు ఆయనమీద వేయుడి.” అంటే అలంకారార్థంగా మన చింతలన్నిటినీ యెహోవాకు అప్పగించడమని అర్థం. చింతించడం మానేసేందుకు ప్రయత్నిస్తూ మన అవసరాలను చూసుకునేలా ఓర్పుతో ఆయనపై నమ్మకముంచుతాం. (మత్త. 6:25-32) అలాంటి నమ్మకానికి, మన శక్తిపై లేదా జ్ఞానంపై ఆధారపడకుండా వినయం కలిగి ఉండడం అవసరం. ‘దేవుని బలిష్ఠమైన చేతిక్రింద’ వినయస్థులముగా ఉండడం ద్వారా, మన దీనస్థితిని గుర్తిస్తాం. (1 పేతురు 5:6 చదవండి.) అలా గుర్తించడం దేవుడు అనుమతించే దేనినైనా తాళుకునేందుకు మనకు సహాయం చేస్తుంది. వెంటనే ఉపశమనం లభించాలని మనం పరితపించవచ్చు, అయితే మన పక్షాన ఖచ్చితంగా ఎప్పుడు, ఎలా చర్య తీసుకోవాలో యెహోవాకు తెలుసు.—కీర్త. 54:7; యెష. 41:9.
9. దావీదు ఎలాంటి భారాన్ని యెహోవాపై మోపాల్సివచ్చింది?
9 కీర్తన 55:22లోని దావీదు మాటలను గుర్తుచేసుకోండి: “నీ భారము యెహోవామీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు.” దావీదు ఆ మాటలు రాసే సమయానికి ఆయన తీవ్ర వేదన అనుభవిస్తున్నాడు. (కీర్త. 55:4) తన కుమారుడైన అబ్షాలోము తననుండి రాజరికాన్ని దోచుకునేందుకు కుట్ర పన్నినప్పుడు ఆయన ఈ కీర్తన రాశాడని తెలుస్తోంది. దావీదు ఎంతగానో విశ్వసించిన మంత్రియైన అహీతోపెలు ఆ కుట్రలో చేతులు కలిపాడు. దావీదు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని యెరూషలేము నుండి పారిపోవాల్సివచ్చింది. (2 సమూ. 15:12-14) అలాంటి విపత్కర పరిస్థితుల్లో సహితం దావీదు దేవునిపై నమ్మకముంచడం మానలేదు, ఆయనకు నిరాశ కలగలేదు.
10. వేదన అనుభవిస్తున్నప్పుడు మనమేమి చేయాలి?
10 మనమెలాంటి వేదనలు అనుభవిస్తున్నా దావీదులాగే మనం కూడా వాటిగురించి యెహోవాకు ప్రార్థించడం ప్రాముఖ్యం. ఈ విషయంలో అపొస్తలుడైన పౌలు మనమేమి చేయాలని ప్రోత్సహిస్తున్నాడో పరిశీలిద్దాం. (ఫిలిప్పీయులు 4:6, 7 చదవండి.) అలాంటి మనఃపూర్వక ప్రార్థనకు ఎలాంటి ఫలితం లభిస్తుంది? “సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును.”
11. “దేవుని సమాధానము” మన హృదయాలకు, తలంపులకు ఎలా కావలివుంటుంది?
11 ప్రార్థన ఫలితంగా మీ పరిస్థితిలో మార్పురావచ్చా? బహుశా రావచ్చు. కానీ యెహోవా ప్రతీసారి మనం కోరుకున్న విధంగా మన ప్రార్థనలకు జవాబివ్వడని మనం గ్రహించాలి. ప్రార్థన, మన వేదనలు మనల్ని తొట్రిల్లజేయకుండా ఉండేలా, మనం మానసిక సమతుల్యాన్ని కాపాడుకునేందుకు సహాయం చేస్తుంది. వేదనభరిత భావాలతో మనం కృంగిపోయినప్పుడు “దేవుని సమాధానము” మనకు మానసిక ప్రశాంతతను చేకూరుస్తుంది. పట్టణాన్ని శత్రువుల దాడినుండి కాపాడేందుకు నియమించబడిన సైనిక దళంలా “దేవుని సమాధానము” మన హృదయాలకు, తలంపులకు కావలివుంటుంది. అలాగే అది మనకున్న సందేహాలను, భయాలను, నిరాశా తలంపులను అధిగమించేలా చేయడమే కాక, దూకుడుగా, మూర్ఖంగా స్పందించకుండా అడ్డుకుంటుంది.—కీర్త. 145:18.
12. ఒక వ్యక్తి మానసిక ప్రశాంతతను ఎలా కలిగివుండవచ్చో ఉదాహరించండి.
12 వేదనలు అనుభవిస్తున్నప్పుడు మనమెలా మానసిక ప్రశాంతతను కలిగివుండవచ్చు? కొన్ని విషయాల్లో మన పరిస్థితికి తగినట్లుండే ఒక ఉదాహరణను పరిశీలించండి. కఠినంగా ప్రవర్తించే మేనేజరు దగ్గర ఒక వ్యక్తి ఉద్యోగం చేస్తుండవచ్చు. అయితే దయగల, మృదు స్వభావంగల ఆ కంపెనీ యజమాని దగ్గర తన మనోభావాలను వ్యక్తపర్చే అవకాశం ఆ ఉద్యోగికి లభిస్తుంది. ఆ యజమాని తాను పరిస్థితిని అర్థం చేసుకున్నానని ఆ ఉద్యోగికి అభయమిచ్చి, త్వరలోనే ఆ మేనేజరును ఆ స్థానం నుండి తొలగిస్తానని చెప్తాడు. ఆ ఉద్యోగికి ఆ మాటలెలా అనిపిస్తాయి? ఆ అభయాన్ని నమ్మడం, త్వరలో జరిగేదేమిటో తెలుసుకోవడం, తాను ఆలోగా మరిన్ని కష్టాలు ఎదుర్కోవాల్సివచ్చినా ఆ ఉద్యోగంలో కొనసాగాలనే ఆయన నిర్ణయాన్ని బలపరుస్తాయి. అదే విధంగా, మన పరిస్థితిని యెహోవా అర్థం చేసుకుంటాడని మనకు తెలుసు, పైగా ఆయన త్వరలోనే “ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును” అని మనకు అభయమిస్తున్నాడు. (యోహా. 12:31) అదెంత ఆదరణనిస్తుందో కదా!
13. ప్రార్థన చేయడంతోపాటు మనమింకా ఏమిచేయాలి?
13 అలాగని మన సమస్యలన్నీ యెహోవాకు ప్రార్థనలో మనవి చేయడం మాత్రమే సరిపోతుందా? లేదు. అంతకన్నా ఎక్కువే చేయాలి. మన ప్రార్థనలకు అనుగుణంగా మనం చర్య తీసుకోవాలి. రాజైన సౌలు దావీదును హత్యచేసేందుకు మనుష్యులను ఆయన ఇంటికి పంపించినప్పుడు, దావీదు ఇలా ప్రార్థించాడు: “నా దేవా, నా శత్రువులచేతిలోనుండి నన్ను తప్పింపుము. నామీద పడువారికి చిక్కకుండ నన్ను ఉద్ధరించుము. పాపము చేయువారి చేతిలోనుండి నన్ను తప్పింపుము. రక్తాపరాధుల చేతిలోనుండి నన్ను రక్షింపుము.” (కీర్త. 59:1, 2) దావీదు అలా ప్రార్థన చేయడమే కాక, తన భార్య మాట విని తప్పించుకోవడానికి అవసరమైన చర్య తీసుకున్నాడు. (1 సమూ. 19:11, 12) అదే విధంగా మనం కూడా, కష్టకర పరిస్థితులతో వ్యవహరించేందుకు, ఆ పరిస్థితుల నుండి బయటపడేందుకు అవసరమైన జ్ఞానం దయచేయమని ప్రార్థించవచ్చు.—యాకో. 1:5.
సహించడానికి మనమెలా బలం కలిగివుండవచ్చు?
14. కష్టాలు అనుభవిస్తున్నప్పుడు ఓర్పు చూపించడానికి మనకేది సహాయం చేయగలదు?
14 మన కష్టాలు వెంటనే తొలగించబడకపోవచ్చు. అవి కొంతకాలంపాటు కొనసాగనూవచ్చు. ఒకవేళ అలా కొనసాగితే, వాటిని సహించడానికి మనకేది సహాయం చేయవచ్చు? మొదటిది, మనం కష్టాల్లో కూడా యెహోవాను నమ్మకంగా సేవించినప్పుడు ఆయనపట్ల మనకు ప్రేమవుందని రుజువు చేస్తామని గుర్తుంచుకోవాలి. (అపొ. 14:22) యోబు విషయంలో సాతాను చేసిన ఈ ఆరోపణను మనసులో ఉంచుకోవాలి: “యోబు ఊరకయే దేవునియందు భయభక్తులు కలవాడాయెనా? నీవు అతనికిని అతని యింటివారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టు కంచె వేసితివి గదా? నీవు అతని చేతిపనిని దీవించుచుండుటచేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించియున్నది. అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన యెడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును.” (యోబు 1:9-11) యోబు తన యథార్థత ద్వారా ఆ ఆరోపణ పచ్చి అబద్ధమని నిరూపించాడు. కష్టకర పరిస్థితుల్లో ఓర్పు వహిస్తే, మనకు కూడా సాతానును అబద్ధికుడని నిరూపించే అవకాశం లభిస్తుంది. అలాగే మన ఓర్పు మన నిరీక్షణను, నమ్మకాన్ని బలపరుస్తుంది.—యాకో. 1:4.
15. ఎలాంటి ఉదాహరణలు మనకు ప్రోత్సాహకరంగా ఉండవచ్చు?
15 రెండవది, “లోకమందున్న మీ సహోదరులయందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని” గుర్తుంచుకోవాలి. (1 పేతు. 5:9) అవును, “సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు.” (1 కొరిం. 10:13) కాబట్టి మీరు మీ కష్టాల గురించే ఆలోచించే బదులు ఇతరుల మాదిరులను ధ్యానించడం ద్వారా బలాన్ని, ధైర్యాన్ని కూడగట్టుకోవచ్చు. (1 థెస్స. 1:4-7; హెబ్రీ. 12:1) బాధాకరమైన వేదనలను అనుభవిస్తున్నా నమ్మకంగా సహించిన మీరెరిగినవారి మాదిరి గురించి ఆలోచించేందుకు సమయం తీసుకోండి. మీరు ఎదుర్కొంటున్నలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నవారి వృత్తాంతాలను కనుగొనేందుకు ప్రచురించబడిన జీవిత కథల కోసం మీరు అన్వేషించారా? ఆ జీవిత కథలు ఎంతో ప్రోత్సాహకరంగా ఉన్నట్లు మీరు కనుగొనివుండవచ్చు.
16. మనం వివిధ శ్రమలను ఎదుర్కొంటున్నప్పుడు దేవుడు మనల్నెలా బలపరుస్తాడు?
16 మూడవది, యెహోవా “కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు . . . మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో, ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తిగలవారమగునట్లు, ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు” అని గుర్తుంచుకోండి. (2 కొరిం. 1:3, 4) అంటే కేవలం ప్రస్తుత శ్రమలోనే కాదుగానీ మన “శ్రమ అంతటిలో” మనల్ని ప్రోత్సహించి, బలపర్చేందుకు దేవుడు మన ప్రక్కనే నిలబడ్డాడని చెప్పవచ్చు. “ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను” మనం ఓదార్చేందుకు ఇది మనకు సహాయం చేస్తుంది. పౌలు ఈ మాటల సత్యత్వాన్ని వ్యక్తిగతంగా చవిచూశాడు.—2 కొరిం. 4:8, 9; 11:23-27.
17. జీవన శ్రమలతో వ్యహరించేందుకు బైబిలు మనకెలా సహాయం చేయగలదు?
17 నాల్గవది, మన దగ్గర దేవుని వాక్యమైన బైబిలు ఉంది, అది “దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడియుండునట్లు దైవావేశమువలన కలిగిన ప్రతిలేఖనము, ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమై యున్నది.” (2 తిమో. 3:16, 17) దేవుని వాక్యం మనం ‘సన్నద్ధులమై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి’ ఉండేలా మాత్రమే కాదు, జీవన శ్రమలతో వ్యహరించేందుకు కూడా మనల్ని బలపరుస్తుంది. “పూర్ణముగా సిద్ధపడియుండునట్లు” అని అనువదించబడిన ఆదిమ భాషా పదానికి అక్షరార్థంగా “సమస్తం సమకూర్చబడిన” అని అర్థం. ప్రాచీన కాలాల్లో ఈ పదం ప్రయాణానికి అవసరమైనవన్నీ సమకూర్చబడిన నావకు లేదా ఏ పని కావాలంటే ఆ పని చేయగల సామర్థ్యమున్న యంత్రానికి సంబంధించి ఉపయోగించడానికి వీలైనదిగా ఉండేది. అదే విధంగా, మనకెలాంటి పరిస్థితి ఎదురైనా దానితో వ్యవహరించేందుకు మనకు అవసరమైనవన్నీ యెహోవా తన వాక్యం ద్వారా సమకూరుస్తున్నాడు. కాబట్టి మనమిలా చెప్పవచ్చు: “దేవుడు ఏదైనా పరిస్థితిని అనుమతిస్తే, ఆయన సహాయంతో నేను దానిని సహించగలను.”
మన శ్రమలన్నిటి నుండి విముక్తి
18. నమ్మకంగా సహించేందుకు దేనిపై దృష్టి నిలపడం మనకు అదనంగా సహాయం చేస్తుంది?
18 ఐదవది, యెహోవా త్వరలోనే మానవులను శ్రమలన్నిటి నుండి విముక్తుల్ని చేస్తాడనే అద్భుత వాస్తవంపై ఎల్లప్పుడూ దృష్టి నిలపండి. (కీర్త. 34:19; 37:9-11; 2 పేతు. 2:9) అది నెరవేరినప్పుడు, దేవుడు అనుగ్రహించే విముక్తి మనల్ని కేవలం ప్రస్తుత శ్రమల నుండి విముక్తుల్ని చేయడమే కాదుగానీ, యేసుతోపాటు పరలోకంలో లేదా పరదైసు భూమిపై నిత్యజీవం అనుభవించే అవకాశాన్నీ ఇస్తుంది.
19. నమ్మకంగా సహించడం ఎలా సాధ్యమవుతుంది?
19 ఆ కాలమొచ్చే వరకు మనమీ దుష్ట ప్రపంచపు వేదనభరిత పరిస్థితులను ఎదుర్కొంటూనే ఉంటాం. అవి పూర్తిగా సమసిపోయే కాలాన్ని మనమెంతగా కోరుకుంటున్నామో కదా! (కీర్త. 55:6-8) మనం నమ్మకంగా సహించడం, అపవాది అబద్ధికుడని నిరూపిస్తుందని గుర్తుంచుకుందాం. మన సహోదరులు కూడా మనలాంటి శ్రమలే అనుభవిస్తున్నారనే విషయాన్ని మనసులో ఉంచుకొని మన సహోదరుల నుండి, మన ప్రార్థనల ద్వారా బలాన్ని పుంజుకుందాం. దేవుని వాక్యాన్ని సమర్థవంతంగా ఉపయోగిస్తూ సన్నద్ధులమవడంలో, పూర్ణంగా సిద్ధపడివుండడంలో కొనసాగుదాం. “సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు” అందించే ప్రేమపూర్వక శ్రద్ధపై మీకున్న నమ్మకాన్ని ఎప్పటికీ సడలిపోనివ్వకండి. “యెహోవా దృష్టి నీతిమంతులమీద నున్నది. ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గియున్నవి” అని గుర్తుంచుకోండి.—కీర్త. 34:15.
మీరు జవాబివ్వగలరా?
• తనకు కలిగిన వేదనల విషయంలో దావీదు మనోవైఖరి ఎలావుంది?
• రాజైన సొలొమోను ఎలాంటి నమ్మకాన్ని వ్యక్తపరిచాడు?
• యెహోవా అనుమతించే పరిస్థితులను తాళుకునేందుకు మనకేది సహాయం చేయగలదు?
[13వ పేజీలోని చిత్రం]
వేదన అనుభవిస్తున్న తన ప్రజల పక్షాన యెహోవా చర్య తీసుకుంటాడని సొలొమోను బలంగా నమ్మాడు
[15వ పేజీలోని చిత్రం]
దావీదు ప్రార్థనలో తన చింతను యెహోవాపై మోపి, తాను ప్రార్థించినదానికి అనుగుణంగా చర్య తీసుకున్నాడు