అధ్యయన ఆర్టికల్ 41
మనం ఆరాధించే దేవుడు “అత్యంత కరుణామయుడు”
“యెహోవా అందరికీ మంచి చేస్తాడు, ఆయన కరుణ ఆయన పనులన్నిట్లో కనిపిస్తుంది.”—కీర్త. 145:9.
పాట 44 ఒక దీనుడి ప్రార్థన
ఈ ఆర్టికల్‌లో . . .a
1. కరుణ గల వ్యక్తి అనగానే మనకు ఏం గుర్తుకు రావచ్చు?
కరుణ గల వ్యక్తి అనగానే దయ, ప్రేమ, కనికరం, ఇచ్చే గుణం ఉన్న వ్యక్తి మనకు గుర్తుకు రావచ్చు. అలాగే పొరుగువాడైన సమరయుడి గురించి యేసు చెప్పిన కథ కూడా మనకు గుర్తుకు రావచ్చు. ఆ సమరయుడు వేరే జాతికి చెందిన వాడైనప్పటికీ, దొంగల చేతికి చిక్కిన యూదుని మీద ‘కరుణ చూపించాడు.’ ఆ సమరయుడు గాయపడిన యూదుని మీద ‘జాలి పడ్డాడు,’ ప్రేమతో అతని బాగోగులు చూసుకున్నాడు. (లూకా 10:29-37) ఈ ఉదాహరణ మన దేవునికున్న ఒక చక్కని లక్షణాన్ని గుర్తుచేస్తుంది, అదే కరుణ. ఆ లక్షణం దేవుని ప్రేమలో ఒక భాగం. ఆయన ప్రతీరోజు ఎన్నో విధాలుగా మనమీద కరుణ చూపిస్తున్నాడు.
2. కరుణ గల వ్యక్తి ఇంకా ఏం చేస్తాడు?
2 కరుణ గల వ్యక్తి ఇంకా ఏం చేస్తాడు? కరుణ గల వ్యక్తి, శిక్షించాల్సిన వ్యక్తిని శిక్షించకుండా వదిలేయాలని అనుకోవచ్చు. యెహోవా అలా మనమీద చాలాసార్లు కరుణ చూపించాడు. “ఆయన మన పాపాలకు తగ్గట్టు మనతో వ్యవహరించలేదు, మన తప్పులకు తగినట్టు మనల్ని శిక్షించలేదు” అని కీర్తనకర్త అన్నాడు. (కీర్త. 103:10) కానీ, కొన్నిసార్లు తప్పు చేసిన వ్యక్తికి గట్టిగా క్రమశిక్షణ ఇవ్వడం ద్వారా యెహోవా కరుణ చూపిస్తాడు.
3. మనం ఏ ప్రశ్నలకు జవాబులు చూస్తాం?
3 ఈ ఆర్టికల్‌లో మనం మూడు ప్రశ్నలకు జవాబులు చూస్తాం: యెహోవా ఎందుకు కరుణ చూపిస్తాడు? ఒక వ్యక్తికి గట్టిగా క్రమశిక్షణ ఇస్తూనే, అతని మీద కరుణ చూపించడం సాధ్యమేనా? మనం కరుణ చూపించడానికి ఏది సహాయం చేస్తుంది? ఈ ప్రశ్నలకు బైబిలు ఏం జవాబిస్తుందో ఇప్పుడు చూద్దాం.
యెహోవా ఎందుకు కరుణ చూపిస్తాడు?
4. యెహోవా ఎందుకు కరుణ చూపిస్తాడు?
4 యెహోవా ప్రేమగలవాడు కాబట్టి కరుణ చూపిస్తాడు. దేవుడు “అత్యంత కరుణామయుడు” అని అపొస్తలుడైన పౌలు రాశాడు. ఈ సందర్భంలో అపరిపూర్ణ మనుషులకు, అంటే అభిషిక్తులకు పరలోక జీవితాన్ని ఇవ్వడం ద్వారా యెహోవా కరుణ చూపిస్తున్నాడని పౌలు చెప్తున్నాడు. (ఎఫె. 2:4-7) అయితే యెహోవా ఇంకా ఎన్నో విధాలుగా కరుణ చూపిస్తాడు. కీర్తనకర్త అయిన దావీదు ఇలా రాశాడు: “యెహోవా అందరికీ మంచి చేస్తాడు, ఆయన కరుణ ఆయన పనులన్నిట్లో కనిపిస్తుంది.” (కీర్త. 145:9) యెహోవాకు ప్రజల మీద ప్రేమ ఉంది కాబట్టే, కరుణ చూపించడానికి ఆధారం ఉన్న ప్రతీసారి వాళ్లమీద కరుణ చూపిస్తాడు.
5. యెహోవా కరుణ గలవాడని యేసుకు ఎలా తెలుసు?
5 యెహోవాకు కరుణ చూపించడం అంటే ఎంత ఇష్టమో యేసుకు బాగా తెలుసు. యేసు భూమ్మీదికి రాకముందు, చాలాకాలం పరలోకంలో తన తండ్రితో కలిసి ఉన్నాడు. (సామె. 8:30, 31) చాలా సందర్భాల్లో, పాపులైన మనుషుల మీద తన తండ్రి ఎలా కరుణ చూపించాడో యేసు గమనించాడు. (కీర్త. 78:37-42) ప్రజలకు బోధిస్తున్నప్పుడు, తరచూ తన తండ్రికి ఉన్న ఈ చక్కని లక్షణం గురించి యేసు మాట్లాడాడు.
ఇంటికి తిరిగొచ్చిన కుమారుణ్ణి వాళ్ల నాన్న అవమానించలేదు కానీ, ఇంట్లోకి ఆహ్వానించాడు (6వ పేరా చూడండి)c
6. తన తండ్రి చూపించే కరుణను యేసు ఎలా వర్ణించాడు?
6 ముందటి ఆర్టికల్‌లో చూసినట్టు, యేసు తప్పిపోయిన కుమారుడి ఉదాహరణ ఉపయోగించి, యెహోవాకు కరుణ చూపించడం అంటే ఎంత ఇష్టమో చాలా చక్కగా వర్ణించాడు. ఆ అబ్బాయి ఇల్లు వదిలి వెళ్లి, “విచ్చలవిడిగా జీవిస్తూ తన ఆస్తంతా దుబారా చేశాడు.” (లూకా 15:13) తర్వాత, అలాంటి జీవితం గడిపినందుకు పశ్చాత్తాపపడి, తనను తాను తగ్గించుకుని ఇంటికి తిరిగి వచ్చాడు. అప్పుడు వాళ్ల నాన్న ఏం చేశాడు? వాళ్ల నాన్న తనను క్షమిస్తాడో లేదో అని అతను ఎక్కువసేపు ఆలోచించాల్సిన అవసరం రాలేదు. యేసు ఇలా చెప్పాడు: “అతను [ఆ అబ్బాయి] ఇంకా దూరంగా ఉన్నప్పుడే, వాళ్ల నాన్న అతన్ని చూసి, జాలిపడి, పరుగెత్తుకుంటూ వచ్చి అతన్ని కౌగిలించుకొని, ఆప్యాయంగా ముద్దుపెట్టుకున్నాడు.” వాళ్ల నాన్న ఆ అబ్బాయిని అవమానించలేదు. బదులుగా కరుణ చూపించి ఆ అబ్బాయిని క్షమించాడు, తిరిగి తన కుటుంబంలో చేర్చుకున్నాడు. తప్పిపోయిన కుమారుడు ఘోరమైన తప్పు చేసినప్పటికీ, అతను పశ్చాత్తాపం చూపించాడు కాబట్టి అతని తండ్రి అతన్ని క్షమించాడు. ఉదాహరణలోని ఈ కరుణ గల తండ్రి, యెహోవాకు గుర్తుగా ఉన్నాడు. నిజంగా పశ్చాత్తాపపడే పాపుల్ని క్షమించడానికి తన తండ్రి ఎంత సిద్ధంగా ఉంటాడో యేసు ఈ ఉదాహరణ ద్వారా చాలా చక్కగా వివరించాడు.—లూకా 15:17-24.
7. యెహోవా చూపించే కరుణలో ఆయన తెలివి ఎలా కనిపిస్తుంది?
7 యెహోవాకు అంతులేని తెలివి ఉంది కాబట్టి కరుణ చూపిస్తాడు. ఆయనకు ఎంతో తెలివి ఉంది, తెలివితో పాటు చాలా కరుణ కూడా ఉంది. దేవుని తెలివి “కరుణతో, మంచి ఫలాలతో నిండివున్నది” అని బైబిలు చెప్తుంది. (యాకో. 3:17) ఒక ప్రేమగల తండ్రిలాగే, యెహోవా తన పిల్లలమైన మన మీద కరుణ చూపిస్తాడు. (కీర్త. 103:13; యెష. 49:15) మనం అపరిపూర్ణులం కాబట్టి ఆయన కరుణ చూపించి మన పాపాల్ని క్షమిస్తే, భవిష్యత్తులో మనకు శాశ్వత జీవితం పొందే అవకాశం దొరుకుతుందని ఆయనకు తెలుసు. యెహోవాకు తెలివి ఉంది కాబట్టి, ఒక వ్యక్తి నిజంగా పశ్చాత్తాపపడినప్పుడు ఆయన కరుణ చూపిస్తాడు. అయితే, తప్పును సమర్థించినట్టు అనిపించే సందర్భాల్లో ఆయన కరుణ చూపించడు. అలా ఆయన కరుణ చూపించే విధానంలో ఆయనకున్న తెలివి కనిపిస్తుంది.
8. కొన్నిసార్లు ఏం చేయాల్సి వస్తుంది? ఎందుకు?
8 ఒక దేవుని సేవకుడు కావాలనే పాపాలు చేస్తుంటే అప్పుడేంటి? “అతనితో సహవాసం మానేయాలి” అని పౌలు దైవ ప్రేరణతో రాశాడు. (1 కొరిం. 5:11) కాబట్టి పశ్చాత్తాపపడని పాపుల్ని సంఘం నుండి బహిష్కరిస్తారు. సంఘంలో ఉన్న నమ్మకమైన సహోదర సహోదరీల్ని కాపాడడానికి, యెహోవా పవిత్ర ప్రమాణాల్ని సమర్థించడానికి అలా చేయాల్సి వస్తుంది. కానీ ఒక వ్యక్తిని బహిష్కరించినప్పుడు, దేవుడు అతని మీద కరుణ చూపించట్లేదని కొంతమంది అనుకుంటారు. అది నిజమేనా? దాని గురించి ఇప్పుడు చూద్దాం.
బహిష్కరించడం కరుణ చూపించినట్టు ఎలా అవుతుంది?
జబ్బుపడిన గొర్రెను మందకు దూరంగా ఉంచినప్పటికీ, అది ఇంకా కాపరి సంరక్షణ నుండి ప్రయోజనం పొందుతూ ఉంటుంది (9-11 పేరాలు చూడండి)
9-10. హెబ్రీయులు 12:5, 6 ప్రకారం, ఒక వ్యక్తిని బహిష్కరించడం కరుణ చూపించినట్టు ఎలా అవుతుంది? ఒక ఉదాహరణ చెప్పండి.
9 మనకు తెలిసినవాళ్లు లేదా బాగా ఇష్టమైనవాళ్లు సంఘం నుండి బహిష్కరించబడ్డారని మీటింగ్‌లో ప్రకటన చేసినప్పుడు, మనకు చాలా బాధ అనిపిస్తుంది. అసలు వాళ్లను బహిష్కరించడం నిజంగా అవసరమా అని మనకు అనిపించవచ్చు. అలా బహిష్కరించడం కరుణ చూపించినట్టు అవుతుందా? ఖచ్చితంగా అవుతుంది. క్రమశిక్షణ అవసరమైన వ్యక్తికి దాన్ని ఇవ్వకపోతే తెలివి, కరుణ, ప్రేమ చూపించినట్టు అవ్వదు. (సామె. 13:24) పశ్చాత్తాపపడని పాపిని బహిష్కరించడం వల్ల అతనిలో మార్పు వస్తుందా? రావచ్చు. సంఘ పెద్దలు తీసుకున్న ఈ చర్య వల్లే తమ తప్పు తెలిసొచ్చిందని, ప్రవర్తన మార్చుకున్నామని, యెహోవా దగ్గరికి తిరిగి వచ్చామని ఘోరమైన పాపం చేసిన చాలామంది చెప్తున్నారు.—హెబ్రీయులు 12:5, 6 చదవండి.
10 ఒక ఉదాహరణ పరిశీలించండి. తన మందలో ఒక గొర్రెకు జబ్బు చేసిందని కాపరి గమనించాడు. జబ్బు తగ్గాలంటే ఆ గొర్రెను మిగతా మందకు వేరుగా ఉంచాలని ఆయనకు తెలుసు. అయితే గొర్రెలు మందతో ఉండడానికే ఎక్కువగా ఇష్టపడతాయి, మందకు దూరంగా ఒంటరిగా ఉంటే అవి బహుశా బెదిరిపోవచ్చు. మరి కాపరి ఆ గొర్రెను దూరంగా ఉంచడం క్రూరత్వం అవుతుందా? కాదు. జబ్బుపడిన గొర్రెను మిగతా మందతో కలవనిస్తే, ఆ జబ్బు మిగతావాటికి కూడా అంటుకుంటుందని ఆయనకు తెలుసు. కాబట్టి, జబ్బుపడిన గొర్రెను దూరంగా ఉంచడం ద్వారా ఆయన మిగతా మంద అంతటిని కాపాడుతున్నాడు.—లేవీయకాండం 13:3, 4 తో పోల్చండి.
11. (ఎ) బహిష్కరించబడిన వ్యక్తిని జబ్బుపడిన గొర్రెతో ఎందుకు పోల్చవచ్చు? (బి) బహిష్కరించబడిన వ్యక్తికి ఏ సహాయం అందుబాటులో ఉంది?
11 బహిష్కరించబడిన క్రైస్తవుడిని జబ్బుపడిన ఆ గొర్రెతో పోల్చవచ్చు. అతను ఆధ్యాత్మిక అనారోగ్యంతో ఉన్నాడు. (యాకో. 5:14) కొన్ని రకాల జబ్బుల్లాగే, ఆధ్యాత్మిక అనారోగ్యం కూడా వేరేవాళ్లకు అంటుకోవచ్చు. కాబట్టి కొన్నిసార్లు, ఆధ్యాత్మిక అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని సంఘం నుండి వేరుగా ఉంచాల్సి వస్తుంది. అలాంటి క్రమశిక్షణ, మందలో ఉన్న నమ్మకమైనవాళ్ల మీద యెహోవాకు ప్రేమ ఉందని రుజువు చేస్తుంది, తప్పు చేసిన వ్యక్తి హృదయాన్ని కదిలించి అతను పశ్చాత్తాపపడేలా చేస్తుంది. బహిష్కరించబడిన తర్వాత కూడా ఆ వ్యక్తి మీటింగ్స్‌కి రావచ్చు, ఆధ్యాత్మిక ఉపదేశం పొందుతూ తన విశ్వాసాన్ని బలంగా ఉంచుకోవచ్చు. అలాగే చదువుకోవడానికి పత్రికలు తీసుకోవచ్చు, JW బ్రాడ్‌కాస్టింగ్ చూడవచ్చు. సంఘ పెద్దలు అతని ప్రగతిని గమనిస్తూ, ఎప్పటికప్పుడు సలహాలు, నిర్దేశాలు ఇస్తూ అతను ఆధ్యాత్మికంగా కోలుకోవడానికి సహాయం చేయవచ్చు. అలా చివరికి అతను సంఘంలోకి తిరిగి చేర్చుకోబడవచ్చు.b
12. పశ్చాత్తాపపడని పాపి మీద సంఘ పెద్దలు ఎలా ప్రేమ, కరుణ చూపించవచ్చు?
12 మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, పశ్చాత్తాపపడని పాపుల్ని మాత్రమే బహిష్కరిస్తారు. ఒక వ్యక్తిని బహిష్కరించే ముందు లోతుగా ఆలోచించాలని సంఘ పెద్దలకు తెలుసు. అంతేకాదు యెహోవా “తగిన మోతాదులో” క్రమశిక్షణ ఇస్తాడని కూడా వాళ్లకు తెలుసు. (యిర్మీ. 30:11) పెద్దలు తమ సహోదరుల్ని ప్రేమిస్తారు, వాళ్లకు ఆధ్యాత్మిక హాని కలిగించే దేన్నీ చేయాలనుకోరు. కానీ కొన్నిసార్లు, తప్పు చేసిన వ్యక్తిని సంఘం నుండి బహిష్కరిస్తేనే అతని మీద ప్రేమ, కరుణ చూపించినట్టు అవుతుంది.
13. కొరింథులోని ఒక క్రైస్తవుడిని ఎందుకు బహిష్కరించాల్సి వచ్చింది?
13 మొదటి శతాబ్దంలో పశ్చాత్తాపపడని ఒక పాపి విషయంలో అపొస్తలుడైన పౌలు ఏం చేశాడో గమనించండి. కొరింథులో ఒక క్రైస్తవుడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడు. ఎంత ఘోరం! యెహోవా గతంలో ఇశ్రాయేలీయులకు ఇలా చెప్పాడని పౌలుకు తెలుసు: “తన తండ్రి భార్యతో పడుకునే వ్యక్తి తన తండ్రిని అవమానిస్తున్నాడు. అలా పడుకున్న ఇద్దర్నీ ఖచ్చితంగా చంపేయాలి.” (లేవీ. 20:11) అయితే పౌలు తప్పు చేసిన వ్యక్తిని చంపేయమని చెప్పలేదు కానీ, అతన్ని బహిష్కరించమని చెప్పాడు. ఎందుకంటే, అతని ప్రవర్తన వల్ల సంఘంలో ఉన్న మిగతావాళ్ల మీద కూడా చెడు ప్రభావం పడుతోంది, కొంతమందైతే అతను చేసింది అంత పెద్ద తప్పేం కాదని అనుకుంటున్నారు.—1 కొరిం. 5:1, 2, 13.
14. బహిష్కరించబడిన వ్యక్తి మీద పౌలు ఎలా కరుణ చూపించాడు? ఎందుకు? (2 కొరింథీయులు 2:5-8, 11)
14 కొంతకాలం తర్వాత, అతనిలో నిజంగా మార్పు వచ్చిందని పౌలుకు తెలిసింది. అతను నిజంగా పశ్చాత్తాపపడ్డాడు! ఆ వ్యక్తి సంఘానికి అవమానం తెచ్చినప్పటికీ, పౌలు అతనితో “మరీ కఠినంగా” ఉండాలనుకోలేదు. పౌలు కొరింథులోని పెద్దలకు ఇలా చెప్పాడు: “మీరు దయతో అతన్ని క్షమించి ఓదార్చండి.” ఎందుకు? పౌలు ఇలా వివరించాడు: “లేదంటే అతను తీవ్రమైన దుఃఖంలో మునిగిపోతాడు.” పశ్చాత్తాపపడిన వ్యక్తి మీద పౌలు జాలిపడ్డాడు. ఎందుకంటే, ఆ వ్యక్తి తీవ్రమైన దుఃఖంలో మునిగిపోయి దేవుని క్షమాపణ పొందడానికి చేసే ప్రయత్నాల్ని ఆపేసే ప్రమాదం ఉంది. అలా జరగడం పౌలుకు ఇష్టం లేదు.—2 కొరింథీయులు 2:5-8, 11 చదవండి.
15. సంఘ పెద్దలు క్రమశిక్షణ ఇస్తూనే, ఎలా కరుణ కూడా చూపిస్తారు?
15 యెహోవాలాగే సంఘ పెద్దలకు కూడా కరుణ చూపించడం అంటే చాలా ఇష్టం. వాళ్లు అవసరమైనప్పుడు గట్టిగా క్రమశిక్షణ ఇస్తారు. అదేసమయంలో, కరుణ చూపించడానికి సరైన ఆధారం ఉన్నప్పుడు సాధ్యమైనంత వరకు కరుణ చూపిస్తారు. వాళ్లు క్రమశిక్షణ ఇవ్వకుండా పూర్తిగా వదిలేస్తే, తప్పును సమర్థించినట్టు అవుతుంది కానీ, కరుణ చూపించినట్టు అవ్వదు. అయితే కరుణ చూపించాల్సింది సంఘ పెద్దలు మాత్రమేనా?
మనందరం కరుణ చూపించడానికి ఏది సహాయం చేస్తుంది?
16. సామెతలు 21:13 ప్రకారం, కరుణ చూపించనివాళ్లతో యెహోవా ఎలా ప్రవర్తిస్తాడు?
16 క్రైస్తవులందరూ యెహోవాలాగే కరుణ చూపించడానికి కృషి చేస్తారు. ఎందుకు? ఒక కారణం ఏంటంటే, మనం వేరేవాళ్ల మీద కరుణ చూపించకపోతే యెహోవా మన ప్రార్థనలు వినడు. (సామెతలు 21:13 చదవండి.) యెహోవా మన ప్రార్థనల్ని వినాలని మనందరం కోరుకుంటాం, కాబట్టి మనం కఠినంగా తయారవ్వకుండా జాగ్రత్తపడతాం. బాధలో ఉన్న తోటి క్రైస్తవుడు చెప్పేది వినకుండా మనం చెవులు మూసుకోకూడదు, బదులుగా “దీనుల మొర” వినడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. బైబిలు ఇస్తున్న ఈ సలహాను కూడా మనం గుర్తుంచుకుంటాం: “కరుణ చూపించని వ్యక్తి కరుణలేని తీర్పే పొందుతాడు.” (యాకో. 2:13) మనకు కరుణ ఎంత అవసరమో గుర్తించినప్పుడు, మనం కూడా ఇతరుల మీద కరుణ చూపించాలని కోరుకుంటాం. మరిముఖ్యంగా, పశ్చాత్తాపపడి సంఘానికి తిరిగి వచ్చిన వ్యక్తి మీద మనం కరుణ చూపించాలనుకుంటాం.
17. దావీదు రాజు ఎలా మనస్ఫూర్తిగా కరుణ చూపించాడు?
17 మనం కఠినంగా తయారవ్వకుండా కరుణ చూపించడానికి బైబిలు ఉదాహరణలు సహాయం చేస్తాయి. ఉదాహరణకు దావీదు రాజు గురించి ఆలోచించండి. ఆయన చాలాసార్లు మనస్ఫూర్తిగా కరుణ చూపించాడు. సౌలు తనను చంపాలనుకున్నా, దావీదు అతని మీద కరుణ చూపించాడు. సౌలు దేవుడు అభిషేకించిన రాజు కాబట్టి అతని మీద ప్రతీకారం తీర్చుకోవాలని గానీ, అతనికి హాని చేయాలని గానీ దావీదు ఎప్పుడూ అనుకోలేదు.—1 సమూ. 24:9-12, 18, 19.
18-19. దావీదు ఏ రెండు సందర్భాల్లో కరుణ చూపించలేదు?
18 కానీ దావీదు కొన్నిసార్లు కరుణ చూపించలేదు. ఒక సందర్భంలో, మొరటువాడైన నాబాలు అగౌరవంగా మాట్లాడి దావీదుకు, ఆయన మనుషులకు ఆహారం ఇవ్వనని చెప్పాడు. అప్పుడు దావీదుకు ఎంత కోపం వచ్చిందంటే ఆయన నాబాలును, అతని ఇంట్లో ఉన్న మగవాళ్లందర్నీ చంపేయాలనుకున్నాడు. నాబాలు భార్య అబీగయీలు ఎంతో ఓర్పు గలది. ఆమె వెంటనే వచ్చి ఆపకపోయుంటే దావీదు రక్తాపరాధి అయ్యేవాడు.—1 సమూ. 25:9-22, 32-35.
19 ఇంకో సందర్భంలో, నాతాను ప్రవక్త దావీదుకు ఒక కథ చెప్పాడు. అందులో ఒక పేదవాడు అల్లారుముద్దుగా చూసుకుంటున్న గొర్రెపిల్లను ధనవంతుడు దొంగిలించాడు. అది వినగానే దావీదుకు చాలా కోపమొచ్చి ఇలా అన్నాడు: “యెహోవా జీవం తోడు, ఆ పని చేసిన మనిషి మరణశిక్షకు అర్హుడు!” (2 సమూ. 12:1-6) దావీదుకు మోషే ధర్మశాస్త్రం తెలుసు. ధర్మశాస్త్రం ప్రకారం, ఎవరైనా గొర్రెను దొంగిలిస్తే ఆ గొర్రెకు బదులుగా నాలుగు గొర్రెల్ని నష్టపరిహారంగా చెల్లించాలి. (నిర్గ. 22:1) కానీ దావీదు మరణశిక్ష విధించాలని అంటున్నాడు. అది ఎంత కఠినమైన తీర్పో కదా! నిజానికి నాతాను ఒక కథ చెప్తున్నాడు. ఆ దొంగతనం కన్నా ఘోరమైన పాపాలు దావీదు చేశాడని ఆయనకు తెలిసొచ్చేలా చేయడానికి నాతాను ఆ కథ చెప్పాడు. దావీదు ఆ కథలో ఉన్న దొంగకు మరణశిక్ష విధించాలని కఠినంగా తీర్పు తీర్చాడు. కానీ అంతకన్నా ఘోరమైన తప్పులు చేసిన దావీదు మీద యెహోవా ఎంతో కరుణ చూపించాడు.—2 సమూ. 12:7-13.
నాతాను కథలోని ధనవంతుడి మీద దావీదు రాజు కరుణ చూపించలేదు (19-20 పేరాలు చూడండి)d
20. దావీదు ఉదాహరణ నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?
20 దావీదు చాలా కోపంలో ఉన్నప్పుడు నాబాలును, అతని ఇంట్లో ఉన్న మగవాళ్లందర్నీ చంపేయాలని నిర్ణయించుకున్నాడు. తర్వాత ఇంకో సందర్భంలో, నాతాను చెప్పిన కథలోని ధనవంతుడికి మరణశిక్ష వేయాలని దావీదు తొందరపాటుగా తీర్పు తీర్చాడు. దావీదు ప్రేమ గలవాడు కదా, అలాంటి కఠినమైన తీర్పు తీర్చాడేంటి అని మనకు సందేహం రావచ్చు. నాతాను ఆ కథ చెప్పినప్పుడు, దావీదు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో గమనించండి. ఆ సమయంలో దావీదు అపరాధ భావాలతో నలిగిపోతున్నాడు. ఒక వ్యక్తి కఠినంగా తీర్పు తీరుస్తున్నాడంటే, అతను ఆధ్యాత్మికంగా అనారోగ్యంతో ఉన్నాడని అర్థం. అందుకే, యేసు తన అనుచరులకు ఈ గట్టి హెచ్చరిక ఇచ్చాడు: “తీర్పు తీర్చడం ఆపేయండి, అప్పుడు మీకు తీర్పు తీర్చబడదు.” (మత్త. 7:1, 2) కాబట్టి మనం కఠినంగా తయారవ్వకుండా జాగ్రత్తపడదాం, “అత్యంత కరుణామయుడు” అయిన మన దేవునిలా ఉండడానికి కృషిచేద్దాం.
21-22. మనం ఏయే విధాలుగా కరుణ చూపించవచ్చు?
21 కరుణ అంటే కేవలం కష్టంలో ఉన్న వాళ్లకు సహాయం చేయాలని కోరుకోవడమే కాదు, దాన్ని మన పనుల్లో చూపించడం. కాబట్టి మనందరం మన కుటుంబంలో, సంఘంలో, సమాజంలో ఎవరికి ఏ అవసరం ఉందో జాగ్రత్తగా ఆలోచించవచ్చు. అలా చేసినప్పుడు కరుణ చూపించే ఎన్నో అవకాశాలు మనకు దొరుకుతాయి. ఉదాహరణకు, మనం ఎవరినైనా ఓదార్చగలమా? అవసరంలో ఉన్నవాళ్లకు ఆహారం ఇవ్వగలమా లేదా ఇంకేదైనా సహాయం చేయగలమా? సంఘానికి తిరిగి వచ్చిన వాళ్లకు మంచి స్నేహితులుగా ఉంటూ వాళ్లను ప్రోత్సహించగలమా? ఇతరులతో మంచివార్త పంచుకోగలమా? అలా మంచివార్త ప్రకటించడం, మనం కలిసే ప్రతీఒక్కరి మీద కరుణ చూపించడానికి ఒక చక్కని మార్గం.—యోబు 29:12, 13; రోమా. 10:14, 15; యాకో. 1:27.
22 వేరేవాళ్లకు ఉన్న అలాంటి అవసరాల్ని పట్టించుకున్నప్పుడు కరుణ చూపించే ఎన్నో అవకాశాలు మన చుట్టూ కనిపిస్తాయి. మనం కరుణ చూపిస్తే మన పరలోక తండ్రి, “అత్యంత కరుణామయుడు” అయిన యెహోవాను సంతోషపెడతాం!
పాట 43 కృతజ్ఞతా ప్రార్థన
a యెహోవాకు ఉన్న చక్కని లక్షణాల్లో కరుణ ఒకటి, మనలో ప్రతీ ఒక్కరం ఆ లక్షణాన్ని అలవర్చుకోవాలి. యెహోవా ఎందుకు కరుణ చూపిస్తాడో, యెహోవా కరుణతోనే ఒక వ్యక్తికి క్రమశిక్షణ ఇస్తాడని ఎందుకు చెప్పవచ్చో, ఈ చక్కని లక్షణాన్ని మనమెలా చూపించవచ్చో ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం.
b సంఘంలోకి తిరిగి చేర్చుకోబడిన వాళ్లు మళ్లీ దేవునితో మంచి సంబంధం కలిగి ఉండడానికి ఏం చేయవచ్చో, సంఘ పెద్దలు వాళ్లకు ఎలా సహాయం చేయవచ్చో తెలుసుకోవడానికి, ఈ పత్రికలో “యెహోవాతో మీ స్నేహాన్ని బాగు చేసుకోండి” అనే ఆర్టికల్ చూడండి.
c చిత్రాల వివరణ: తన కుమారుడు ఇంటికి తిరిగి రావడం డాబా మీద నుండి గమనించి, వాళ్ల నాన్న అతన్ని కౌగిలించుకోవడానికి పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు.
d చిత్రాల వివరణ: అపరాధ భావాలతో నలిగిపోతూ ఎంతో ఒత్తిడిలో ఉన్న దావీదు రాజు నాతాను చెప్పింది వినగానే, చాలా కోపంతో ఆ కథలోని ధనవంతుడిని చంపేయాలని అన్నాడు.