కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • es25 పేజీలు 98-108
  • అక్టోబరు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • అక్టోబరు
  • ప్రతీరోజు లేఖనాలను పరిశోధిద్దాం—2025
  • ఉపశీర్షికలు
  • బుధవారం, అక్టోబరు 1
  • గురువారం, అక్టోబరు 2
  • శుక్రవారం, అక్టోబరు 3
  • శనివారం, అక్టోబరు 4
  • ఆదివారం, అక్టోబరు 5
  • సోమవారం, అక్టోబరు 6
  • మంగళవారం, అక్టోబరు 7
  • బుధవారం, అక్టోబరు 8
  • గురువారం, అక్టోబరు 9
  • శుక్రవారం, అక్టోబరు 10
  • శనివారం, అక్టోబరు 11
  • ఆదివారం, అక్టోబరు 12
  • సోమవారం, అక్టోబరు 13
  • మంగళవారం, అక్టోబరు 14
  • బుధవారం, అక్టోబరు 15
  • గురువారం, అక్టోబరు 16
  • శుక్రవారం, అక్టోబరు 17
  • శనివారం, అక్టోబరు 18
  • ఆదివారం, అక్టోబరు 19
  • సోమవారం, అక్టోబరు 20
  • మంగళవారం, అక్టోబరు 21
  • బుధవారం, అక్టోబరు 22
  • గురువారం, అక్టోబరు 23
  • శుక్రవారం, అక్టోబరు 24
  • శనివారం, అక్టోబరు 25
  • ఆదివారం, అక్టోబరు 26
  • సోమవారం, అక్టోబరు 27
  • మంగళవారం, అక్టోబరు 28
  • బుధవారం, అక్టోబరు 29
  • గురువారం, అక్టోబరు 30
  • శుక్రవారం, అక్టోబరు 31
ప్రతీరోజు లేఖనాలను పరిశోధిద్దాం—2025
es25 పేజీలు 98-108

అక్టోబరు

బుధవారం, అక్టోబరు 1

“పరలోకం నుండి వచ్చే తెలివి . . . లోబడడానికి సిద్ధంగా ఉండేది.”—యాకో. 3:17.

మీకెప్పుడైనా లోబడడానికి మనసు రాలేదా? రాజైన దావీదుకు కూడా అదే జరిగింది. అందుకే అతను దేవునికి ఇలా ప్రార్థించాడు: “నీకు లోబడాలనే కోరికను నాలో రేపు.” (కీర్త. 51:12) దావీదు యెహోవాను ప్రేమించాడు. అయినా, దావీదుకు కొన్నిసార్లు లోబడడం కష్టమైంది. మనకు కూడా అలాగే అనిపించవచ్చు. ఎందుకో కొన్ని కారణాలు చూడండి. ఒకటి, అపరిపూర్ణతవల్ల అవిధేయత చూపించాలనే కోరిక మన నరనరాల్లో పాతుకుపోయింది. రెండు, తనలాగే మనం కూడా ఎదురుతిరగాలని సాతాను మనల్ని ఎప్పుడూ ప్రేరేపిస్తూనే ఉంటాడు. (2 కొరిం. 11:3) మూడు, ‘ఒకరు చెప్తే నేనెందుకు వినాలి?’ అనే ఆలోచన లేదా వైఖరి ఉన్నలాంటి ప్రజల మధ్య మనం జీవిస్తున్నాం. ఆ వైఖరి, “అవిధేయత పుత్రుల మీద ప్రభావం చూపిస్తోంది.” (ఎఫె. 2:2, అధస్సూచి) కాబట్టి సాతాను, అతని లోకం ప్రేరేపించే తప్పుడు కోరికలతో అలాగే ఎదురుతిరగాలనే ఆలోచనలతో మనం పోరాడుతూనే ఉండాలి. అంతేకాదు, యెహోవాకు అలాగే ఆయన ఎవరికైతే అధికారం ఇచ్చాడో వాళ్లందరికీ మనం లోబడడానికి చేయగలిగినదంతా చేయాలి. w23.10 6 ¶1

గురువారం, అక్టోబరు 2

“నువ్వు మాత్రం ఇప్పుడు మంచి ద్రాక్షారసాన్ని ఇస్తున్నావు.”—యోహా. 2:10.

యేసు నీళ్లను ద్రాక్షారసంగా మార్చిన అద్భుతం నుండి మనం ఏ పాఠం నేర్చుకోవచ్చు? వినయం. యేసు ఈ అద్భుతం గురించి గొప్పలు చెప్పుకోలేదు. నిజానికి ఆయన చేసిన దేనికీ గొప్పలు చెప్పుకోలేదు. బదులుగా, ప్రతీసారి ఆ ఘనతను వినయంగా తన తండ్రికి ఇచ్చేశాడు. (యోహా. 5:19, 30; 8:28) మనం యేసును అనుకరిస్తే, మనం చేసినవాటికి గొప్పలు చెప్పుకోకుండా వినయంగా ఉంటాం. మన గురించి గొప్పలు చెప్పుకోకుండా, మనం సేవ చేస్తున్న యెహోవా గురించి గొప్పలు చెప్పుకుంటాం. (యిర్మీ. 9:23, 24) ఘనతంతా ఆయనకు ఇస్తాం. ఎంతైనా, యెహోవా సహాయం లేకుండా మనం ఏమైనా చేయగలమా? (1 కొరిం. 1:26-31) మనకు వినయం ఉంటే, మనం ఇతరులకు సహాయం చేసినప్పుడు గొప్పలు చెప్పుకోం. మనం చేసే ప్రతీది యెహోవా చూస్తాడని, విలువైనదిగా ఎంచుతాడని సంతృప్తితో ఉంటాం. (మత్తయి 6:2-4 తో పోల్చండి; హెబ్రీ. 13:16) నిజానికి, మనం యేసులా వినయం చూపించినప్పుడు యెహోవా సంతోషిస్తాడు.—1 పేతు. 5:6. w23.04 4 ¶9; 5 ¶11-12

శుక్రవారం, అక్టోబరు 3

“మీ గురించి మాత్రమే ఆలోచించుకోకుండా ఇతరుల మీద కూడా శ్రద్ధ చూపిస్తూ ఉండండి.”—ఫిలి. 2:4.

క్రైస్తవులు తమ గురించి మాత్రమే ఆలోచించుకోకుండా ఇతరుల మీద కూడా శ్రద్ధ చూపిస్తూ ఉండాలని అపొస్తలుడైన పౌలు ప్రోత్సహించాడు. దీన్ని మనం మీటింగ్స్‌లో ఎలా పాటించవచ్చు? మనలాగే ఇతరులకు కూడా కామెంట్‌ చెప్పాలని ఉంటుందని గుర్తుంచుకోవడం ద్వారా పాటించవచ్చు. దీనిగురించి ఒకసారి ఆలోచించండి. స్నేహితులు అందరూ కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు, వేరేవాళ్లకు అవకాశం ఇవ్వకుండా మీరే అంతా మాట్లాడేస్తారా? లేదు కదా. అందరూ మాట్లాడాలని మీరు అనుకుంటారు. అలాగే మీటింగ్స్‌లో కూడా అందరూ కామెంట్స్‌ చెప్పాలని మీరు కోరుకుంటారు. నిజానికి మన బ్రదర్స్‌, సిస్టర్స్‌ ఒక్క కామెంట్‌ అయినా చెప్పి, తమ విశ్వాసాన్ని చూపించే అవకాశం ఇవ్వడం వాళ్లను ప్రోత్సహించే ఒక మంచి పద్ధతి. (1 కొరిం. 10:24) కాబట్టి చిన్నచిన్న కామెంట్స్‌ చెప్పండి. అప్పుడు ఎక్కువమందికి కామెంట్స్‌ చెప్పే అవకాశం దొరుకుతుంది. ఒకవేళ మీరు చిన్న కామెంట్స్‌ చెప్పినా అన్ని విషయాలు చెప్పకుండా జాగ్రత్తపడండి. పేరాలో ఉన్న అన్ని విషయాలు మీరే చెప్పేస్తే, బహుశా వేరేవాళ్లు చెప్పడానికి ఇంకేమి మిగలకపోవచ్చు. w23.04 22-23 ¶11-13

శనివారం, అక్టోబరు 4

“మంచివార్తను ఇతరులతో పంచుకోవాలని, మంచివార్త కోసమే నేను అన్నీ చేస్తున్నాను.”—1 కొరిం. 9:23.

ప్రీచింగ్‌ చేస్తూ వేరేవాళ్లకు సహాయం చేయడం ఎంత ప్రాముఖ్యమో మనం గుర్తుంచుకోవాలి. మనం ప్రీచింగ్‌లో పరిస్థితులకు తగ్గట్టు మారాలి. ఎందుకంటే మనం వేర్వేరు నమ్మకాలు ఉన్నవాళ్లను, వేర్వేరు ప్రాంతాలకు, వేర్వేరు సంస్కృతులకు చెందినవాళ్లను కలుస్తాం. అపొస్తలుడైన పౌలు పరిస్థితులకు తగ్గట్టు మారాడు, ఆయన నుండి మనం ఎంతో నేర్చుకోవచ్చు. యేసు ఆయన్ని ‘అన్యజనులకు అపొస్తలునిగా’ నియమించాడు. (రోమా. 11:13) ఆ పనిని చేస్తూ పౌలు యూదులకు, గ్రీకువాళ్లకు, బాగా చదువుకున్న వాళ్లకు, పల్లెటూరి వాళ్లకు, అధికారులకు, రాజులకు ప్రకటించాడు. ఇలా రకరకాల ప్రజల హృదయాన్ని చేరుకోవడానికి పౌలు వాళ్లలా మారాడు. (1 కొరిం. 9:19-22) తను చెప్పేది వినేవాళ్ల సంస్కృతి, నేపథ్యం, నమ్మకాల మీద ఆయన మనసుపెట్టాడు. దానికి తగ్గట్టు తను చెప్పాలనుకున్న విషయాన్ని మార్చుకున్నాడు. మనం కూడా పరిచర్యను బాగా చేయాలంటే, మనం చెప్పేది వినే ప్రతీ ఒక్కరి గురించి ఆలోచించి, వాళ్ల అవసరాలకు తగ్గట్టు మనం చెప్పే విషయాన్ని మార్చుకోవాలి. w23.07 23 ¶11-12

ఆదివారం, అక్టోబరు 5

“ప్రభువు దాసుడు గొడవలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. బదులుగా అతను అందరితో మృదువుగా వ్యవహరించాలి.”—2 తిమో. 2:24.

సౌమ్యత ఒక బలహీనత కాదు, బలం! ఎందుకంటే కష్టమైన పరిస్థితుల్లో కూడా ప్రశాంతంగా ఉండాలంటే చాలా బలం కావాలి. అంతేకాదు సౌమ్యత ‘పవిత్రశక్తి పుట్టించే లక్షణాల్లో’ ఒకటి. (గల. 5:22, 23) “సౌమ్యత” అని అనువదించబడిన గ్రీకు పదం, లొంగదీసుకున్న ఒక అడవి గుర్రాన్ని వర్ణించడానికి ఉపయోగించేవాళ్లు. ఒక అడవి గుర్రం సాధు జంతువుగా మారినట్టు ఊహించుకోండి. అది సాధు జంతువుగా మారినంత మాత్రాన దాని బలమేమీ తగ్గిపోదు. అయితే మనుషులుగా మనం సౌమ్యతను పెంచుకుంటూనే బలవంతులుగా ఎలా ఉండొచ్చు? అది కేవలం మన సొంత శక్తి వల్ల కాదు, పవిత్రశక్తి వల్లే సాధ్యమౌతుంది. అందుకే సౌమ్యత అనే అందమైన లక్షణాన్ని పెంచుకోవడానికి సహాయం చేయమని మనం యెహోవాను అడగాలి. అలా చేయడంవల్ల చాలామంది ఈ లక్షణాన్ని పెంచుకోగలిగారు. తమను వ్యతిరేకించినా సౌమ్యత చూపించడం వల్ల చాలామంది సాక్షులు ఇతరుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు.—2 తిమో. 2:24, 25. w23.09 15 ¶3

సోమవారం, అక్టోబరు 6

“నేను ప్రార్థించాను, నేను యెహోవాకు చేసుకున్న విన్నపాన్ని ఆయన అనుగ్రహించాడు.”—1 సమూ. 1:27.

అపొస్తలుడైన యోహాను ఆశ్చర్యకరమైన ఒక దర్శనంలో, 24 మంది పెద్దలు పరలోకంలో యెహోవాను ఆరాధించడం చూశాడు. యెహోవా “మహిమ, ఘనత, శక్తి పొందడానికి” అర్హుడని వాళ్లు గుర్తించి, ఆయన్ని స్తుతించారు. (ప్రక. 4:10, 11) నమ్మకమైన దేవదూతలు కూడా యెహోవాను స్తుతించడానికి, ఘనపర్చడానికి కారణాలు కోకొల్లలు. వాళ్లు పరలోకంలో ఆయనతోపాటు ఉన్నారు కాబట్టి ఆయన వాళ్లకు బాగా తెలుసు. వాళ్లు ఆయన లక్షణాల్ని, పనుల్ని దగ్గరగా చూశారు కాబట్టి ఆయన్ని స్తుతించకుండా ఉండలేకపోయారు. (యోబు 38:4-7) మనం కూడా మన ప్రార్థనలో యెహోవాను స్తుతించవచ్చు. ఆయనలో మనకు ఏది బాగా నచ్చుతుందో, ఎందుకు నచ్చుతుందో చెప్పవచ్చు. బైబిల్ని చదువుతున్నప్పుడు, అధ్యయనం చేస్తున్నప్పుడు ఆయన చూపించిన లక్షణాల గురించి తెలుసుకుని, అందులో మీకు ఏది బాగా నచ్చుతుందో గుర్తించండి. (యోబు 37:23; రోమా. 11:33) ఆ తర్వాత, ఆ లక్షణాల గురించి మీకు ఏమనిపిస్తుందో యెహోవాకు చెప్పండి. మనకు, మన బ్రదర్స్‌-సిస్టర్స్‌కి అండగా ఉంటున్నందుకు యెహోవాను స్తుతించండి.—1 సమూ. 2:1, 2. w23.05 3-4 ¶6-7

మంగళవారం, అక్టోబరు 7

‘యెహోవాకు తగినట్టు నడుచుకోండి.’—కొలొ. 1:10.

1919 లో మహాబబులోను, దేవుని ప్రజల మీద తనకున్న పట్టు కోల్పోయింది. అదే సంవత్సరం “నమ్మకమైన, బుద్ధిగల దాసుడు” తెరమీదికి వచ్చాడు. వచ్చీరాగానే కొత్తగా తెరుచుకున్న ‘పవిత్ర మార్గంలోకి’ సరైన హృదయస్థితి గలవాళ్లకు స్వాగతం పలికాడు. (మత్త. 24:45-47; యెష. 35:8) అయితే, గతంలో ఆ “దారిని” సిద్ధం చేసిన నమ్మకమైన పురుషుల వల్ల, ఆ రహదారిపై బుడిబుడి అడుగులు వేస్తున్న చాలామంది యెహోవా సంకల్పాల గురించి ఇంకా ఎక్కువ నేర్చుకోగలిగారు. (సామె. 4:18) అంతేకాదు, యెహోవా కోరుకున్నట్టు వాళ్ల జీవితాల్ని మార్చుకోగలిగారు. అయితే వాళ్లు ఉన్నపళంగా మార్పులు చేసుకోవాలని యెహోవా కోరుకోలేదు గానీ, మెల్లమెల్లగా ఆయన తన ప్రజల్ని మెరుగుదిద్దాడు. మనం చేసే ప్రతీ పని యెహోవా మనసును తాకినప్పుడు మనం ఎంత సంతోషంగా ఉంటామో కదా! ఏ రహదారికైనా అప్పుడప్పుడు మరమ్మతులు చేయాల్సి వస్తుంది. సాధ్యమైనంత ఎక్కువమంది మహాబబులోనును విడిచి వచ్చేలా, 1919 నుండి ‘పవిత్ర మార్గానికి’ కూడా మరమ్మతులు అవసరమయ్యాయి. w23.05 17 ¶15; 19 ¶16

బుధవారం, అక్టోబరు 8

“నిన్ను ఎప్పుడూ విడిచిపెట్టను.”—హెబ్రీ. 13:5.

పరిపాలక సభ కొంతమంది సహాయకుల్ని కూడా ఏర్పాటుచేసి, స్వయంగా వాళ్లకు శిక్షణ ఇస్తుంది. ప్రస్తుతం ఆ సహాయకులు సంస్థలో ఎన్నో బాధ్యతల్ని నమ్మకంగా చూసుకుంటున్నారు. వీళ్లందరూ క్రీస్తు గొర్రెల్ని జాగ్రత్తగా చూసుకోవడానికి బాగా సిద్ధపడి ఉన్నారు. మహాశ్రమ చివర్లో, అభిషిక్త క్రైస్తవుల్లోని చివరి వ్యక్తి పరలోకానికి తీసుకెళ్లబడిన తర్వాత కూడా భూమ్మీద స్వచ్ఛారాధన కొనసాగుతూనే ఉంటుంది. యేసుక్రీస్తు తన నాయకత్వంలో ఉన్న దేవుని ప్రజలకు ఆధ్యాత్మికంగా ఏలోటూ లేకుండా చూసుకుంటాడు. నిజమే, ఆ సమయానికి మాగోగు వాడైన గోగు అని బైబిలు పిలిచే దేశాల గుంపు మనపై దాడి చేస్తుంటుంది. (యెహె. 38:18-20) కానీ ఆ దాడి కొంతకాలమే ఉంటుంది. అలాగే యెహోవాను ఆరాధించకుండా దేవుని ప్రజల్ని ఆ దాడి అస్సలు అడ్డుకోలేదు. చివరికి అది ఒక విఫలయత్నంగానే మిగిలిపోతుంది! యెహోవా తన ప్రజల్ని తప్పకుండా కాపాడతాడు. అపొస్తలుడైన యోహాను ఒక దర్శనంలో క్రీస్తు వేరేగొర్రెలు ఉన్న “ఒక గొప్పసమూహం” చూశాడు. “వీళ్లు మహాశ్రమను దాటి వచ్చేవాళ్లు” అని దేవదూత యోహానుకు చెప్పాడు. (ప్రక. 7:9, 14) అవును, యెహోవా తన ప్రజల్ని సురక్షితంగా ఉంచుతాడు! w24.02 5-6 ¶13-14

గురువారం, అక్టోబరు 9

“దేవుని పవిత్రశక్తి జ్వాలను ఆర్పకండి.”—1 థెస్స. 5:19.

మనకు పవిత్రశక్తి కావాలంటే ఏం చేయాలి? మనం ప్రార్థించాలి, దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయాలి, పవిత్రశక్తితో నడిచే సంస్థతో సహవసించాలి. ఇవన్నీ చేసినప్పుడు, ‘పవిత్రశక్తి పుట్టించే లక్షణాల్ని’ పెంచుకోగలుగుతాం. (గల. 5:22, 23) ఆలోచనల్లో, ప్రవర్తనలో పవిత్రంగా ఉండేవాళ్లకే యెహోవా తన పవిత్రశక్తిని ఇస్తాడు. చెడ్డ ఆలోచనల్లో విహరిస్తూ, చెడ్డ పనులు చేస్తూ ఉండేవాళ్లకు ఆయన తన పవిత్రశక్తిని ఇవ్వడు. (1 థెస్స. 4:7, 8) యెహోవా పవిత్రశక్తిని పొందుతూ ఉండాలంటే, ‘ప్రవచనాల్ని చులకనగా చూడకూడదు.’ (1 థెస్స. 5:20) “ప్రవచనాలు” అంటే, యెహోవా తన పవిత్రశక్తితో చెప్పిన విషయాలు. వాటిలో యెహోవా రోజు గురించి, మనం జీవిస్తున్న కాలం ప్రాముఖ్యత గురించిన విషయాలు కూడా ఉన్నాయి. మనం బ్రతికుండగా హార్‌మెగిద్దోన్‌ రాదులే అని ఆలోచిస్తూ యెహోవా రోజును మన మనసులో నుండి తీసేసుకోకూడదు. బదులుగా, మనం పవిత్రంగా నడుచుకుంటూ, “దైవభక్తిగల పనులు చేస్తూ” ఆ రోజును ఎప్పుడూ మనసులో ఉంచుకోవాలి.—2 పేతు. 3:11, 12. w23.06 12 ¶13-14

శుక్రవారం, అక్టోబరు 10

“యెహోవా మీదుండే భయమే తెలివికి ఆరంభం.”—సామె. 9:10.

క్రైస్తవులుగా మనకు అశ్లీల చిత్రాలు కంటపడితే ఏం చేయాలి? వెంటనే తల తిప్పేసుకోవాలి. అలా చేయాలంటే, యెహోవాతో మనకున్న సంబంధం చాలా విలువైనదని మనం గుర్తు తెచ్చుకోవాలి. అయితే, మనం చూసేవి అశ్లీల చిత్రాలు కాకపోయినా అవి మనలో లైంగిక కోరికల్ని రేపుతుంటే, వాటిని కూడా చూడకపోవడం మంచిది. ఎందుకు? ఎందుకంటే, మనం హృదయంలో కూడా లైంగిక పాపం చేయాలని అనుకోం. (మత్త. 5:28, 29) థాయ్‌లాండ్‌లో ఉంటున్న డేవిడ్‌ అనే సంఘపెద్ద ఇలా చెప్తున్నాడు: “నేను చూసేవి అశ్లీల చిత్రాలు కాకపోయినా, ఇవి చూస్తే యెహోవా ఇష్టపడతాడా? అని నన్ను నేను ప్రశ్నించుకుంటాను. అలా నేను తెలివైన నిర్ణయాలు తీసుకోగలిగాను.” దేవున్ని బాధపెడతామేమో అనే సరైన భయం పెంచుకుంటే తెలివిగా నడుచుకుంటాం. “యెహోవా మీదుండే భయమే తెలివికి ఆరంభం.” w23.06 23 ¶12-13

శనివారం, అక్టోబరు 11

‘నా ప్రజలారా, వెళ్లండి, లోపలి గదుల్లోకి ప్రవేశించండి.’—యెష. 26:20.

“లోపలి గదులు” అంటే అవి సంఘాల్ని సూచిస్తుండవచ్చు. మహాశ్రమ సమయంలో మనం మన బ్రదర్స్‌, సిస్టర్స్‌తో కలిసిమెలిసి ఐక్యంగా ఉంటే మనల్ని కాపాడతానని యెహోవా మాటిస్తున్నాడు. కాబట్టి మనం ఇప్పుడు మన బ్రదర్స్‌, సిస్టర్స్‌ని భరించడమే కాదు, వాళ్లను ప్రేమించడానికి కూడా కష్టపడాలి. అలా చేస్తేనే మనం మన ప్రాణాల్ని రక్షించుకుంటాం. “యెహోవా మహారోజు” వచ్చినప్పుడు మనుషులందరికీ అది కష్టమైన సమయంగా ఉంటుంది. (జెఫ. 1:14, 15) యెహోవా ప్రజలకు కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు మనం సిద్ధంగా ఉంటే, ఆ సమయంలో మనం ప్రశాంతంగా ఉంటాం, ఇతరులకు సహాయం చేస్తాం. మన ముందు ఎన్ని కష్టాలు వచ్చినా సహిస్తాం. మన బ్రదర్స్‌, సిస్టర్స్‌కి కష్టాలు వచ్చినప్పుడు వాళ్లకు నీడగా ఉంటూ, వాళ్లకు చేయూతను ఇస్తూ కనికరం చూపిస్తాం. అలాగే మన బ్రదర్స్‌, సిస్టర్స్‌కి ఇప్పుడు వెన్నంటే ఉంటూ వాళ్లమీద ప్రేమ చూపిస్తే, భవిష్యత్తులో కూడా ఇంకా ఎక్కువగా అలా చేస్తూ ఉంటాం. అప్పుడు యెహోవా మనకు ప్రతిఫలం ఇస్తాడు. అదే విపత్తులు, శ్రమలు గుర్తేరాని కొత్తలోకంలో శాశ్వత జీవితం!—యెష. 65:17. w23.07 7 ¶16-17

ఆదివారం, అక్టోబరు 12

“యెహోవా మిమ్మల్ని స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు, గట్టి పునాది మీద మిమ్మల్ని నిలబెడతాడు.”—1 పేతు. 5:10.

బైబిలు విశ్వాసం చూపించినవాళ్లను బలవంతులని లేదా శక్తిమంతులని చెప్తుంది. కానీ కొన్నిసార్లు అలాంటివాళ్లకు కూడా బలహీనంగా, నిస్సత్తువగా అనిపించింది. ఉదాహరణకు, ఒక సందర్భంలో దావీదు రాజు “పర్వతంలా బలంగా” ఉన్నాను అని చెప్పాడు. కానీ ఇంకొన్ని సందర్భాల్లో ఆయన భయంతో ‘బెదిరిపోయాడు.’ (కీర్త. 30:7) అంతేకాదు, సమ్సోనుకు దేవుని పవిత్రశక్తి వచ్చినప్పుడు చెప్పలేనంత కండబలం వచ్చేది. ఒకవేళ అది లేకపోతే ఆయనకున్న బలం తగ్గిపోయి అందరిలాగే మామూలు మనిషిలా ఉంటాడని ఆయనకు తెలుసు. (న్యాయా. 14:5, 6; 16:17) నిజమే, ఆ బలవంతులకు అంత బలం ఇచ్చింది యెహోవాయే! యెహోవా ఇచ్చే శక్తి తనకు అవసరమని అపొస్తలుడైన పౌలు కూడా అర్థంచేసుకున్నాడు. (2 కొరిం. 12:9, 10) ఆయనకు అనారోగ్య సమస్యలు ఉండేవి. (గల. 4:13, 14) కొన్నిసార్లు, సరైంది చేయడానికి ఆయన పెద్ద పోరాటాన్నే చేయాల్సి వచ్చింది. (రోమా. 7:18, 19) ఇంకొన్నిసార్లు తన జీవితంలో ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో తెలీక భయపడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. (2 కొరిం. 1:8, 9) అయినా, పౌలు “నేను ఎప్పుడు బలహీనుణ్ణో అప్పుడే బలవంతుణ్ణి” అని అన్నాడు. అదెలా? ఆయనలో శక్తి ఆవిరైపోయినప్పుడు యెహోవా తన పవిత్రశక్తిని నింపాడు. అలా పౌలు బలవంతుడయ్యాడు! w23.10 12 ¶1-2

సోమవారం, అక్టోబరు 13

“యెహోవా హృదయాన్ని చూస్తాడు.”—1 సమూ. 16:7.

అప్పుడప్పుడు మనకు కూడా ఎందుకూ పనికిరానివాళ్లం అని అనిపించవచ్చు. అప్పుడు యెహోవాయే స్వయంగా మనల్ని ఆకర్షించుకున్నాడు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. (యోహా. 6:44) మనలో మనం కూడా చూసుకోలేని మంచిని ఆయన చూడగలడు. అంతేకాదు, ఆయనకు మన మనసు తెలుసు. (2 దిన. 6:30) కాబట్టి మనం తనకు చాలా విలువైనవాళ్లమని ఆయన చెప్పినప్పుడు దాన్ని నమ్మవచ్చు. (1 యోహా. 3:19, 20) సత్యం తెలుసుకోకముందు మనలో కొంతమంది ఎన్నో తప్పులు చేసుంటాం. ఆ తప్పులు ఎందుకు చేశామని ఇప్పటికీ బాధపడుతుండవచ్చు. (1 పేతు. 4:3) నమ్మకమైన క్రైస్తవులు కూడా తమకున్న బలహీనతలతో ఇంకా పోరాడుతూనే ఉంటారు. మరి మీ విషయమేంటి? కొన్నిసార్లు యెహోవా మిమ్మల్ని అస్సలు క్షమించడని మీకు అనిపిస్తుందా? అలాగైతే, యెహోవాకు నమ్మకంగా సేవచేసిన వాళ్లకు కూడా మీలాగే అనిపించిందని మర్చిపోకండి. ఉదాహరణకు, అపొస్తలుడైన పౌలు కూడా తనకున్న అపరిపూర్ణతల గురించి ఆలోచించినప్పుడు చాలా బాధపడ్డాడు. (రోమా. 7:24) నిజమే పౌలు తన పాపాల విషయంలో పశ్చాత్తాపపడి, బాప్తిస్మం తీసుకున్నాడు. అయినాసరే, “అపొస్తలులందరిలో తక్కువవాణ్ణి,” “వాళ్లందరిలో నేనే పెద్ద పాపిని” అని ఆయన అన్నాడు.—1 కొరిం. 15:9; 1 తిమో. 1:15. w24.03 27 ¶5-6

మంగళవారం, అక్టోబరు 14

‘వాళ్లు యెహోవా మందిరాన్ని విడిచిపెట్టారు.’—2 దిన. 24:18.

యెహోయాషు రాజు చెడ్డ నిర్ణయం నుండి మనం నేర్చుకునే ఒక పాఠం ఏంటంటే, యెహోవాను ప్రేమించి, ఆయన్ని సంతోషపెట్టాలని అనుకునే వాళ్లనే స్నేహితులుగా ఎంచుకోవాలి. వాళ్లు మనకు మంచి చేస్తారు. అయితే కేవలం మన వయసు వాళ్లతోనే స్నేహం చేయాలని హద్దులు పెట్టుకోవద్దు. ఎందుకంటే యెహోయాషు తన స్నేహితుడైన యెహోయాదా కన్నా చాలా చిన్నవాడని మర్చిపోకండి. మీరు స్నేహితుల్ని ఎంచుకుంటున్నప్పుడు ఇలా ప్రశ్నించుకోండి: ‘యెహోవా మీద విశ్వాసం పెంచుకోవడానికి వీళ్లు నాకు సహాయం చేస్తారా? యెహోవా ప్రమాణాల ప్రకారం జీవించేలా నన్ను ప్రోత్సహిస్తారా? యెహోవా గురించి, ఆయన విలువైన సత్యాల గురించి మాట్లాడతారా? యెహోవా ప్రమాణాలంటే వీళ్లకు గౌరవం ఉందా? అవసరమైనప్పుడు నన్ను సరిదిద్దేంత ధైర్యం వీళ్లకు ఉందా?’ (సామె. 27:5, 6, 17) ఒక్కమాటలో చెప్పాలంటే, మీ స్నేహితులు యెహోవాను ప్రేమించకపోతే వాళ్లు మీకు వద్దు. కానీ ఒకవేళ మీ స్నేహితులు యెహోవాను ప్రేమించే వాళ్లయితే వాళ్లను అస్సలు వదలొద్దు. వాళ్లు మీకు మంచి చేస్తారు.—సామె. 13:20. w23.09 9-10 ¶6-7

బుధవారం, అక్టోబరు 15

“నేనే ఆల్ఫాను, ఓమెగను.”—ప్రక. 1:8.

గ్రీకు అక్షరాల్లో ఆల్ఫా అనేది మొదటి అక్షరం, ఓమెగ అనేది చివరి అక్షరం. “నేనే ఆల్ఫాను, ఓమెగను” అని యెహోవా చెప్తున్నప్పుడు ఆయన దేన్నైనా మొదలుపెడితే, దానికి ఒక విజయవంతమైన ముగింపును కూడా ఇస్తాడని అది సూచిస్తుంది. యెహోవా ఆదాముహవ్వల్ని చేసిన తర్వాత ఇలా అన్నాడు: “మీరు పిల్లల్ని కని, ఎక్కువమంది అయ్యి, భూమిని నింపండి, దాన్ని లోబర్చుకోండి.” (ఆది. 1:28) ఆయన ఆ మాటల్ని చెప్పడం ద్వారా ఒక విధంగా “ఆల్ఫా” అని చెప్పినట్టే. ఆయన తన సంకల్పాన్ని కూడా స్పష్టంగా చెప్పాడు: విధేయులైన, పరిపూర్ణులైన ఆదాముహవ్వల పిల్లలు ఈ భూమిని నింపి, దాన్ని పరదైసుగా మార్చే సమయం వస్తుంది. ఆ సమయం వచ్చినప్పుడు, యెహోవా ఒక విధంగా “ఓమెగ” అని అంటాడు. “ఆకాశాన్ని, భూమిని, వాటిలోని సమస్తాన్ని చేయడం పూర్తయిన” తర్వాత యెహోవా ఒక గ్యారంటీ ఇచ్చాడు. మనుషుల విషయంలో, భూమి విషయంలో యెహోవా ఏదైతే అనుకున్నాడో అది ఖచ్చితంగా ఏడో రోజు చివర్లో జరుగుతుందని ఆయన గ్యారంటీ ఇచ్చాడు.—ఆది. 2:1-3. w23.11 5 ¶13-14

గురువారం, అక్టోబరు 16

“యెహోవా మార్గాన్ని సిద్ధం చేయండి! మన దేవుని కోసం ఎడారి గుండా తిన్నని రాజమార్గాన్ని ఏర్పాటు చేయండి.”—యెష. 40:3.

బబులోను నుండి ఇశ్రాయేలుకు ప్రయాణం అంత తేలికైందేమి కాదు. దానికి దాదాపు నాలుగు నెలలు పడుతుంది. కానీ అలా తిరిగివచ్చే వాళ్ల దారిలో ఎలాంటి అడ్డంకులు లేకుండా చేస్తానని యెహోవా మాటిచ్చాడు. నమ్మకమైన యూదులకు ఇశ్రాయేలు దేశంలో పొందబోయే దీవెనలతో పోలిస్తే వాళ్లు చేసే త్యాగాలు రవ్వంతలా కనిపించాయి. వాళ్లు పొందే గొప్ప దీవెన ఏంటంటే, వాళ్లు చేసే ఆరాధనే. ఎందుకంటే, బబులోను దేశంలో యెహోవాకు ఒక్క ఆలయం కూడా లేదు. మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఇశ్రాయేలీయులు బలులు అర్పించడానికి బలిపీఠం గానీ, యాజక ఏర్పాటు గానీ లేదు. దానికితోడు యెహోవాను గానీ, ఆయన ప్రమాణాల్ని గానీ లెక్కచేయని ప్రజల మధ్య, యెహోవా ప్రజల్ని వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. కాబట్టి వేలల్లో ఉన్న దైవభక్తిగల యూదులు తమ స్వదేశానికి తిరిగెళ్లి, సత్యారాధనను మళ్లీ మొదలుపెట్టాలని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. w23.05 14-15 ¶3-4

శుక్రవారం, అక్టోబరు 17

“వెలుగు బిడ్డల్లా నడుచుకోండి.”—ఎఫె. 5:8.

మనం “వెలుగు బిడ్డల్లా” నడుచుకుంటూ ఉండాలంటే దేవుని పవిత్రశక్తి సహాయం చాలా అవసరం. ఎందుకు? ఎందుకంటే, అనైతికతతో కంపుకొట్టే ఈ లోకంలో శుభ్రంగా ఉండడం అంత తేలిక కాదు! (1 థెస్స. 4:3-5, 7, 8) యెహోవా ఆలోచనలకు ఈ లోకంలో ఉన్నవాళ్ల ఆలోచనలకు అస్సలు పొంతన లేదు. కాబట్టి ఆ ఆలోచనల్ని తిప్పికొట్టాలంటే మనకు పవిత్రశక్తి సహాయం కావాలి. అంతేకాదు, పవిత్రశక్తి మనలో “అన్నిరకాల మంచితనం, నీతి” అనే ఫలాల్ని పుట్టిస్తుంది. (ఎఫె. 5:9) పవిత్రశక్తిని పొందే ఒక విధానం ఏంటంటే, దానికోసం ప్రార్థన చేయడం. “తనను అడిగేవాళ్లకు” యెహోవా పవిత్రశక్తి ఇస్తాడని యేసు చెప్పాడు. (లూకా 11:13) అలాగే మీటింగ్స్‌లో మనం అందరితో కలిసి యెహోవాను స్తుతించినప్పుడు కూడా పవిత్రశక్తిని పొందుతాం. (ఎఫె. 5:19, 20) పవిత్రశక్తి మనమీద పనిచేసినప్పుడు యెహోవాను సంతోషపెట్టేలా బ్రతుకుతాం. w24.03 23-24 ¶13-15

శనివారం, అక్టోబరు 18

“అడుగుతూ ఉండండి, మీకు ఇవ్వబడుతుంది; వెతుకుతూ ఉండండి, మీకు దొరుకుతుంది; తడుతూ ఉండండి, మీ కోసం తెరవబడుతుంది.”—లూకా 11:9.

మీరు ఇంకా ఓర్పుగా ఉండాలంటే, యెహోవాకు ప్రార్థించండి. ఓర్పు పవిత్రశక్తి పుట్టించే లక్షణాల్లో ఒకటి. (గల. 5:22, 23) కాబట్టి పవిత్రశక్తి కోసం ప్రార్థించి, అది పుట్టించే ఆ లక్షణాన్ని పెంచుకునేలా సహాయం చేయమని మనం యెహోవాను అడగొచ్చు. ఓర్పు చూపించడం కష్టంగా అనిపిస్తే పవిత్రశక్తి కోసం “అడుగుతూ ఉండండి.” (లూకా 11:13) విషయాల్ని యెహోవా వైపు నుండి ఆలోచించడానికి సహాయం చేయమని కూడా మనం అడగొచ్చు. అలా ప్రార్థించిన తర్వాత, ప్రతీరోజు ఓర్పు చూపించడానికి మనవంతు మనం చేయగలిగినదంతా చేయాలి. అలా మనం ఓర్పు చూపించడానికి సహాయం చేయమని ఎంతెక్కువ ప్రార్థిస్తామో, ఆ లక్షణాన్ని చూపించడానికి ఎంతెక్కువ ప్రయత్నిస్తామో, అంతెక్కువగా ఆ లక్షణం మన హృదయంలో మొలకెత్తి మన వ్యక్తిత్వంలో భాగమైపోతుంది. గతంలో మనం ఆ లక్షణాన్ని చూపించలేకపోయినా ఇప్పుడు మనం ఓర్పు చూపించే వ్యక్తిగా తయారౌతాం. అలాగే, బైబిలు ఉదాహరణల గురించి లోతుగా ఆలోచించండి. బైబిల్లో ఓర్పు చూపించిన ఎంతోమంది గురించి ఉంది. వాళ్ల ఉదాహరణల గురించి లోతుగా ఆలోచించినప్పుడు, మనం వేర్వేరు విధాలుగా ఓర్పు చూపించడం నేర్చుకుంటాం. w23.08 22 ¶10-11

ఆదివారం, అక్టోబరు 19

“మీ వలలు వేయండి.”—లూకా 5:4.

తన అవసరాల్ని యెహోవా ఖచ్చితంగా తీరుస్తాడని యేసు అపొస్తలుడైన పేతురుకు అభయమిచ్చాడు. పునరుత్థానమైన తర్వాత యేసు మరోసారి పేతురుకు, ఇతర అపొస్తలులకు అద్భుతరీతిలో చేపలు దొరికేలా చేశాడు. (యోహా. 21:4-6) తన అవసరాల్ని చూసుకోవడం యెహోవాకు పెద్ద పనేం కాదని ఈ అద్భుతం నుండి పేతురుకు అర్థమైంది. ఆ తర్వాత, ‘దేవుని రాజ్యానికి మొదటిస్థానం’ ఇచ్చేవాళ్ల అవసరాల్ని యెహోవా తీరుస్తాడని యేసు చెప్పిన మాటలు పేతురు మదిలో మెదిలివుంటాయి. (మత్త. 6:33) అందుకే, అతను చేపల వ్యాపారానికి కాకుండా పరిచర్యకే మొదటిస్థానం ఇచ్చాడు. క్రీ.శ. 33 పెంతెకొస్తు రోజున అతను ధైర్యంగా సాక్ష్యమిచ్చాడు. దానివల్ల వేలమంది బాప్తిస్మం తీసుకున్నారు. (అపొ. 2:14, 37-41) ఆ తర్వాత సమరయులు, ఆఖరికి అన్యులు కూడా క్రీస్తును అంగీకరించేలా అతను సహాయం చేశాడు. (అపొ. 8:14-17; 10:44-48) అలా అన్నిరకాల ప్రజలు క్రైస్తవ సంఘంలోకి వచ్చేలా యెహోవా పేతురును గొప్ప స్థాయిలో ఉపయోగించుకున్నాడు. w23.09 20 ¶1; 23 ¶11

సోమవారం, అక్టోబరు 20

“మీరు కలను, దాని భావాన్ని నాకు చెప్పకపోతే మిమ్మల్ని ముక్కలుముక్కలు చేస్తాను.”—దాని. 2:5.

బబులోనీయులు యెరూషలేమును నాశనం చేసిన దాదాపు రెండు సంవత్సరాల తర్వాత, బబులోను రాజైన నెబుకద్నెజరుకు ఒక భారీ ప్రతిమ గురించి కలవరపెట్టే కల వచ్చింది. అది అతనికి కంటిమీద కునుకు లేకుండా చేసింది. ఆ కల ఏంటో, దాని భావం ఏంటో చెప్పకపోతే దానియేలుతో సహా తన దగ్గరున్న జ్ఞానులందర్నీ చంపేస్తానని రాజు బెదిరించాడు. (దాని. 2:3-5) దానియేలు వెంటనే ఏదోకటి చేయకపోతే అందరూ తమ ప్రాణాల మీద ఆశలు వదులుకోవాల్సిందే. అప్పుడు “దానియేలు రాజు దగ్గరికి వెళ్లి, కల భావం చెప్పడానికి సమయం ఇవ్వమని కోరాడు.” (దాని. 2:16) అలా అడగడానికి అతనికి చాలా గుండె ధైర్యం, విశ్వాసం అవసరమైంది. ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడూ దానియేలు కలల భావం చెప్పినట్టు బైబిల్లో లేదు. “పరలోక దేవుడు తమను కరుణించి ఆ రహస్యాన్ని తెలియజేసేలా ఆయన్ని వేడుకోమని” తన స్నేహితులను అడిగాడు. (దాని. 2:18) యెహోవా వాళ్ల ప్రార్థనల్ని విన్నాడు. దేవుని సహాయంతో దానియేలు నెబుకద్నెజరుకు వచ్చిన కల భావాన్ని చెప్పాడు. దాంతో దానియేలు, అతని స్నేహితులు ప్రాణాలతో బయటపడ్డారు. w23.08 3 ¶4

మంగళవారం, అక్టోబరు 21

“అంతం వరకు సహించినవాళ్లే రక్షించబడతారు.”—మత్త. 24:13.

ఓర్పు చూపించడం వల్ల వచ్చే ప్రయోజనాల గురించి ఆలోచించండి. ఓర్పు మన సంతోషాన్ని, ప్రశాంతతను రెట్టింపు చేస్తుంది. అంతేకాదు ఓర్పు చూపించినప్పుడు మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటాం. మనం ఇతరులతో ఓర్పుగా ఉన్నప్పుడు వాళ్లతో మంచి బంధాలు ఉంటాయి. సంఘం కూడా ఇంకా ఐక్యంగా తయారౌతుంది. ఎవరైనా మనకు చిరాకు తెప్పించినప్పుడు త్వరగా కోపం తెచ్చుకోకుండా ఉంటే పరిస్థితి చేయిదాటిపోకుండా చూసుకోగలుగుతాం. (కీర్త. 37:8, అధస్సూచి; సామె. 14:29) అన్నిటికన్నా ముఖ్యంగా, మన పరలోక తండ్రిని అనుకరించిన వాళ్లమౌతాం, ఆయనకు ఇంకా దగ్గరౌతాం. ఓర్పు ఆకట్టుకునే ఒక అందమైన లక్షణం. దానివల్ల ఎన్నో ఉపయోగాలు కూడా ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో ఓర్పు చూపించడం చేదుగా ఉండొచ్చు కానీ, యెహోవా సహాయంతో ఓర్పు చూపిస్తే దానివల్ల వచ్చే ప్రయోజనాలు చాలా తియ్యగా ఉంటాయి. కాబట్టి కొత్తలోకం కోసం మనం ఓపిగ్గా ఎదురుచూస్తుండగా మనం ఈ నమ్మకంతో ఉండొచ్చు: “యెహోవా కళ్లు తన పట్ల భయభక్తులుగల వాళ్లను, తన విశ్వసనీయ ప్రేమ కోసం ఎదురుచూస్తున్న వాళ్లను గమనిస్తాయి.” (కీర్త. 33:18) కాబట్టి మనందరం ఓర్పును అలవర్చుకుంటూ ఉండాలని తీర్మానించుకుందాం. w23.08 22 ¶7; 25 ¶16-17

బుధవారం, అక్టోబరు 22

“విశ్వాసాన్ని చేతల్లో చూపించకపోతే అది చనిపోయినట్టే.”—యాకో. 2:17.

ఒక వ్యక్తి విశ్వాసం ఉందని చెప్పుకోవచ్చు గానీ అతను దానికి తగిన పనులు చేస్తున్నాడా? అని యాకోబు అన్నాడు. (యాకో. 2:1-5, 9) ఒక వ్యక్తి తన ‘తోటి సహోదరుడు గానీ సహోదరి గానీ వేసుకోవడానికి బట్టలు లేక, తినడానికి తిండి లేక ఇబ్బంది పడడం చూసి’ కూడా ఏ సహాయం చేయకపోతే, అతను విశ్వాసం ఉందని చెప్పుకున్నా, దానికి తగిన పనులు లేవు కాబట్టి అది వ్యర్థమని యాకోబు అన్నాడు. (యాకో. 2:14-16) విశ్వాసాన్ని పనుల్లో చూపించిన వాళ్లలో రాహాబు ఒక మంచి ఉదాహరణ అని యాకోబు చెప్పాడు. (యాకో. 2:25, 26) ఆమె యెహోవా గురించి విని, ఇశ్రాయేలీయులకు ఆయన మద్దతిస్తున్నాడని గుర్తించింది. (యెహో. 2:9-11) ఆమె ఇశ్రాయేలీయులైన ఇద్దరు గూఢచారుల ప్రాణాల్ని కాపాడి, తన విశ్వాసాన్ని పనుల్లో చూపించింది. దానివల్ల ఇశ్రాయేలీయురాలుకాని, అపరిపూర్ణురాలైన ఈ స్త్రీ, దేవుని దృష్టిలో అబ్రాహాములాగే నీతిమంతురాలు అని పేరు తెచ్చుకుంది. మన విశ్వాసాన్ని మన పనుల్లో చూపించడం చాలా ప్రాముఖ్యమని రాహాబు ఉదాహరణ నుండి నేర్చుకోవచ్చు. w23.12 5-6 ¶12-13

గురువారం, అక్టోబరు 23

“మీరు వేళ్లూనుకున్న చెట్టులా పునాది మీద స్థిరంగా ఉండాలి.”—ఎఫె. 3:17.

క్రైస్తవులుగా మనం బైబిల్లో ఉన్న పైపైన విషయాలు తెలుసుకుని తృప్తిపడం. దేవుని పవిత్రశక్తి సహాయంతో మనం “లోతైన విషయాల్ని” తెలుసుకోవాలని పరితపిస్తాం. (1 కొరిం. 2:9, 10) దానికోసం, యెహోవాకు మిమ్మల్ని దగ్గర చేసే వ్యక్తిగత అధ్యయన ప్రాజెక్ట్‌ను మొదలుపెట్టవచ్చు. అలా చేయడానికి కొన్ని ఐడియాలు ఏంటంటే, యెహోవా తన ప్రాచీనకాల సేవకుల మీద ఎలా ప్రేమ చూపించాడో, ఇప్పుడు ఆయన మీమీద ప్రేమ చూపిస్తున్నాడని అదెలా నిరూపిస్తుందో తెలుసుకోండి. అలాగే ఇశ్రాయేలీయులు తనను ఆరాధించడానికి యెహోవా ఎలాంటి ఏర్పాటు చేశాడో, దానికీ మన మీటింగ్స్‌కీ ఎలాంటి పోలికలు ఉన్నాయో తెలుసుకోండి. అంతేకాదు, యేసుక్రీస్తు భూమ్మీద ఉన్నప్పుడు ఆయన జీవితంలో, పరిచర్యలో ఏయే ప్రవచనాలు నెరవేర్చాడో లోతుగా పరిశీలించండి. యెహోవాసాక్షుల పరిశోధనా పుస్తకంలో ఈ విషయాల్ని మీరు పరిశీలించినప్పుడు, అధ్యయనం చేయడాన్ని మరింత ఇష్టపడతారు. బైబిల్ని లోతుగా అధ్యయనం చేయడం ద్వారా మీ విశ్వాసం బలపడుతుంది. అలాగే “దేవుని గురించిన జ్ఞానం” దొరుకుతుంది.—సామె. 2:4, 5. w23.10 18-19 ¶3-5

శుక్రవారం, అక్టోబరు 24

“అన్నిటికన్నా ముఖ్యంగా, ఒకరి మీద ఒకరు ప్రగాఢమైన ప్రేమ కలిగివుండండి. ఎందుకంటే ప్రేమ చాలా పాపాల్ని కప్పుతుంది.”—1 పేతు. 4:8.

అపొస్తలుడైన పేతురు రాసిన “ప్రగాఢమైన” అనే పదానికి అక్షరార్థంగా “పరచడం” అని అర్థం. ఆ వచనంలోని రెండో భాగం ప్రకారం, ప్రగాఢమైన ప్రేమ ఉండడం వల్ల ఏం జరుగుతుంది? అది మన బ్రదర్స్‌సిస్టర్స్‌ పాపాల్ని కప్పుతుంది. దీన్ని అర్థం చేసుకోవడానికి, గీతలు పడ్డ ఒక టేబుల్‌ని ఊహించుకోండి. ఒక క్లాత్‌ పెద్దగా పరిచి ఆ టేబుల్‌ మీద కప్పినప్పుడు, అది ఒకట్రెండు గీతల్ని కాదుగానీ గీతలన్నిటినీ కప్పేస్తుంది. అదేవిధంగా, మనకు బ్రదర్స్‌సిస్టర్స్‌ మీద ప్రగాఢమైన ప్రేమ ఉంటే అది ఒకట్రెండు కాదుగానీ “చాలా పాపాల్ని కప్పుతుంది.” ఇక్కడ “కప్పడం” అంటే క్షమించడం అని అర్థం. బ్రదర్స్‌సిస్టర్స్‌ మీద మనకు ఎంత ప్రేమ ఉండాలంటే వాళ్లు చేసిన పొరపాట్లను క్షమించడానికి మనకు మనసు రాకపోయినా వాళ్లను క్షమించాలి. (కొలొ. 3:13) అలా క్షమిస్తే మనకు వాళ్లమీద ఎంత ప్రేముందో చూపిస్తాం, యెహోవాను సంతోషపెడతాం. w23.11 11-12 ¶13-15

శనివారం, అక్టోబరు 25

“షాఫాను ఆ గ్రంథాన్ని రాజు ముందు చదవడం మొదలుపెట్టాడు.”—2 దిన. 34:18.

యోషీయా రాజు పెద్దయ్యాక ఆలయాన్ని బాగుచేయించడం మొదలుపెట్టాడు. ఆ పనులు జరుగుతున్నప్పుడు “మోషే ద్వారా యెహోవా ఇచ్చిన ధర్మశాస్త్ర గ్రంథం” దొరికింది. అందులో ఉన్న విషయాలు విన్న తర్వాత, వాటికి తగ్గట్టు మార్పులు చేయడానికి యోషీయా రాజు నడుంబిగించాడు. (2 దిన. 34:14, 19-21) మీకు కూడా ప్రతిరోజు బైబిలు చదవడం అంటే ఇష్టమా? మీరిప్పటికే బైబిల్ని ప్రతిరోజు చదువుతుంటే, మీరు దాన్ని ఇష్టపడుతున్నారా? మీకు ఉపయోగపడే లేఖనాల్ని ఎక్కడైనా రాసిపెట్టుకుంటున్నారా? యోషీయాకు దాదాపు 39 ఏళ్లు ఉన్నప్పుడు ఒక పొరపాటు చేసి, తన ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు. నిర్దేశం కోసం ఆయన యెహోవా వైపు చూసే బదులు తనను తాను ఎక్కువ నమ్ముకున్నాడు. (2 దిన. 35:20-25) దీన్నుండి మనకేంటి పాఠం? మనం ఎంత పెద్దవాళ్లమైనా లేదా బైబిల్ని ఎంతకాలం నుండి అధ్యయనం చేస్తున్నా యెహోవాను వెదుకుతూనే ఉండాలి. అంటే ప్రతీరోజు నిర్దేశం కోసం ప్రార్థన చేయాలి, బైబిల్ని అధ్యయనం చేయాలి, పరిణతిగల క్రైస్తవుల సలహాల్ని వినాలి. ఇవన్నీ చేసినప్పుడు మనం పెద్దపెద్ద పొరపాట్లు చేసే సందర్భాలు తక్కువౌతాయి, సంతోషంగా ఉండే సందర్భాలు ఎక్కువౌతాయి.—యాకో. 1:25. w23.09 12 ¶15-16

ఆదివారం, అక్టోబరు 26

“దేవుడు గర్విష్ఠుల్ని వ్యతిరేకిస్తాడు కానీ వినయస్థులకు అపారదయను అనుగ్రహిస్తాడు.”—యాకో. 4:6.

యెహోవాను ప్రేమించి, ఆయన్ని నమ్మకంగా సేవించిన ఎంతోమంది స్త్రీల గురించి బైబిలు చెప్తుంది. వాళ్లు “అలవాట్ల విషయంలో మితంగా” ఉన్నారు, “అన్ని విషయాల్లో నమ్మకంగా” ఉన్నారు. (1 తిమో. 3:11) అంతేకాదు, అలా పరిణతి సాధించిన సహోదరీలు మీ సంఘంలో కూడా ఉండివుండవచ్చు. వాళ్ల నుండి యౌవన సహోదరీలు ఎంతో నేర్చుకోవచ్చు. యౌవన సహోదరీల్లారా, పరిణతి సాధించిన స్త్రీలు ఎవరైనా మీకు తెలుసా? వాళ్లలో ఉన్న మంచి లక్షణాల్ని గమనించండి. వాటిని మీరెలా చూపించవచ్చో ఆలోచించండి. పరిణతిగల క్రైస్తవులుగా అవ్వడానికి వినయం చాలా ముఖ్యమైన లక్షణం. ఒక స్త్రీకి వినయం ఉంటే యెహోవాతో అలాగే ఇతరులతో మంచి స్నేహం ఉంటుంది. ఉదాహరణకు, యెహోవాను ప్రేమించే స్త్రీ తన పరలోక తండ్రి పెట్టిన శిరసత్వపు ఏర్పాటును గౌరవిస్తుంది. (1 కొరిం. 11:3) అయితే, ఆ శిరసత్వపు సూత్రం సంఘానికి అలాగే కుటుంబ ఏర్పాటుకు కూడా వర్తిస్తుంది. w23.12 18-19 ¶3-5

సోమవారం, అక్టోబరు 27

“భర్తలు . . . తమ సొంత శరీరాన్ని ప్రేమించుకున్నట్టు తమ భార్యల్ని ప్రేమించాలి.”—ఎఫె. 5:28.

భర్త భార్యను ప్రేమించాలని, ఆమె అవసరాల్ని చూసుకోవాలని, ఆమెకు మంచి ఫ్రెండ్‌గా ఉండాలని, ఆమెకు దేవునితో ఉన్న స్నేహాన్ని కాపాడాలని యెహోవా ఆశిస్తున్నాడు. ఆలోచనా సామర్థ్యం, ఆడవాళ్లను గౌరవించడం, నమ్మకస్థులుగా ఉండడం మిమ్మల్ని ఒక మంచి భర్తగా చేస్తాయి. మీకు పెళ్లయ్యాక మీరొక తండ్రి అవ్వొచ్చు. ఒక మంచి తండ్రిగా ఉండడం గురించి యెహోవా నుండి ఏం నేర్చుకోవచ్చు? (ఎఫె. 6:4) యెహోవా తన కుమారుడైన యేసుతో తనని ప్రేమిస్తున్నానని, తనను చూసి సంతోషిస్తున్నానని చెప్పాడు. (మత్త. 3:17) ఒకవేళ మీరు ఒక తండ్రైతే, మీ పిల్లల్ని ప్రేమిస్తున్నారని వాళ్లకు చెప్తూ ఉండండి. వాళ్లు చేసే మంచి పనుల్ని ఎక్కువగా మెచ్చుకోండి. యెహోవాను ఆదర్శంగా తీసుకున్న తండ్రులు, తమ పిల్లలు పరిణతిగల సహోదరులుగా, సహోదరీలుగా ఎదగడానికి సహాయం చేస్తారు. భవిష్యత్తులో పొందే ఆ బాధ్యతల కోసం మీరిప్పుడే ఎలా సిద్ధపడవచ్చు? మీ కుటుంబం మీద, సంఘంలో ఉన్నవాళ్ల మీద శ్రద్ధ చూపించండి. వాళ్లను ప్రేమిస్తున్నారని, వాళ్లను చూసి సంతోషిస్తున్నారని చెప్పండి.—యోహా. 15:9. w23.12 28-29 ¶17-18

మంగళవారం, అక్టోబరు 28

“నీ కాలాలకు స్థిరత్వాన్ని ఇచ్చేది [యెహోవాయే].”—యెష. 33:6.

ఈ లోకంలో అందరికీ వచ్చే కష్టాలకు, ఇబ్బందులకు యెహోవా నమ్మకమైన సేవకులు అతీతులేమి కాదు. దానికితోడు వాళ్లు హింస, వ్యతిరేకత కూడా ఎదుర్కోవాలి. అయితే, మనకు కష్టాలు రాకుండా చేస్తానని యెహోవా మాట ఇవ్వట్లేదు గానీ మనకు సహాయం చేస్తానని మాటిస్తున్నాడు. (యెష. 41:10) ఆయన సహాయంతో కష్టమైన పరిస్థితుల్లో కూడా మనం సంతోషంగా ఉండవచ్చు, సరైన నిర్ణయాలు తీసుకోవచ్చు, ఆయనకు నమ్మకంగా ఉండవచ్చు. “దేవుని శాంతి” అని బైబిలు అంటున్న దాన్ని ఇస్తానని యెహోవా మాటిస్తున్నాడు. (ఫిలి. 4:6, 7) దేవుని శాంతి అంటే, మనం ఆయనతో దగ్గరి సంబంధం కలిగివుండడం వల్ల వచ్చే ప్రశాంతత, నెమ్మది. ఈ శాంతి “మానవ అవగాహనకు మించినది,” మన ఊహలకు-ఆలోచనలకు అతీతమైనది. దాన్ని మాటల్లో వర్ణించలేం. ఉదాహరణకు, మీరు యెహోవాకు తీవ్రంగా ప్రార్థించిన తర్వాత మీకు వచ్చిన ప్రశాంతతను బట్టి ఆశ్చర్యపోయారా? అదే “దేవుని శాంతి.” w24.01 20 ¶2; 21 ¶4

బుధవారం, అక్టోబరు 29

“నా ప్రాణమా, యెహోవాను స్తుతించు; నాలో ఉన్న సమస్తమా, ఆయన పవిత్రమైన పేరును స్తుతించు.”—కీర్త. 103:1.

దేవుని నమ్మకమైన సేవకులు ఆయన మీదున్న ప్రేమ వల్ల ఆయన పేరును నిండుహృదయంతో స్తుతిస్తారు. రాజైన దావీదు యెహోవా పేరును స్తుతించడం అంటే యెహోవాను స్తుతించడం అనే విషయం అర్థం చేసుకున్నాడు. మనం యెహోవా పేరు గురించి ఆలోచించినప్పుడు ఆయన వ్యక్తిత్వం, ఆయన అద్భుతమైన లక్షణాలు, ఆయన గొప్ప పనులు గుర్తొస్తాయి. దావీదు యెహోవా పేరును పవిత్రంగా ఎంచి, దాన్ని స్తుతించాలి అనుకున్నాడు. తనలో ఉన్న ‘సమస్తాన్ని’ అంటే నిండుహృదయంతో యెహోవాను స్తుతించాలని కోరుకున్నాడు. లేవీయులు కూడా యెహోవాను స్తుతించే విషయంలో అలాంటి స్ఫూర్తినే చూపించారు. యెహోవా పవిత్రమైన పేరును స్తుతించడానికి తమ పెదాలు పలికే మాటలు సరిపోవని వినయంగా ఒప్పుకున్నారు. (నెహె. 9:5) అలా వినయంగా, మనస్ఫూర్తిగా స్తుతించినప్పుడు యెహోవా ఎంతో మురిసిపోతాడు. w24.02 9 ¶6

గురువారం, అక్టోబరు 30

“మనం ప్రగతి సాధించినమేరకు ఇదే పద్ధతిలో ముందుకు సాగిపోతూ ఉందాం.” —ఫిలి. 3:16.

మీ వల్ల కాని లక్ష్యాన్ని చేరుకోనంత మాత్రాన యెహోవా దృష్టిలో ఓడిపోయినట్టు కాదు. (2 కొరిం. 8:12) వెనకడుగు వేసిన పరిస్థితుల నుండి నేర్చుకోండి. ఇప్పటికే సాధించిన వాటిగురించి ఆలోచించండి. బైబిలు ఇలా చెప్తుంది: ‘మీరు చేసిన పనిని మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్థుడు కాడు.’ (హెబ్రీ. 6:10) కాబట్టి మీరు చేసిన పనుల్ని మీరు కూడా మర్చిపోవద్దు. ఇప్పటికే చేరుకున్న లక్ష్యాల గురించి ఆలోచించండి. బహుశా అది యెహోవాతో ఉన్న స్నేహం కావచ్చు, ఆయన గురించి ఇతరులతో చెప్పడం కావచ్చు లేదా బాప్తిస్మం తీసుకోవడం కావచ్చు. గతంలో మీరు పెట్టుకున్న లక్ష్యాలు చేరుకోగలిగారు అంటే, ఇప్పుడు కూడా మీరు పెట్టుకున్న లక్ష్యాల వైపు అడుగులు వేయగలరు. యెహోవా సహాయంతో వాటిని చేరుకోగలరు. మీరు మీ లక్ష్యం వైపు అడుగులేస్తున్నప్పుడు, ఆ ప్రయాణమంతటిలో యెహోవా మీ చేయి పట్టుకుని ఎలా నడిపించాడో, ఎలా దీవించాడో చూడడం మర్చిపోకండి. (2 కొరిం. 4:7) మీరు అలుపెరగకుండా మీ లక్ష్యం వైపు అడుగులేస్తున్నప్పుడు యెహోవా పట్టలేనన్ని దీవెనలు కుమ్మరిస్తాడు.—గల. 6:9. w23.05 31 ¶16-18

శుక్రవారం, అక్టోబరు 31

“స్వయంగా తండ్రే మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు; ఎందుకంటే మీరు నన్ను ప్రేమించారు, నేను దేవుని ప్రతినిధిగా వచ్చానని నమ్మారు.”—యోహా. 16:27.

యెహోవా తన ప్రజల్ని ప్రేమిస్తున్నానని, వాళ్లను చూసి సంతోషిస్తున్నానని చెప్పే మార్గాల కోసం వెదుకుతాడు. తన కుమారుడైన యేసును ప్రేమిస్తున్నాడని, తనని చూసి సంతోషిస్తున్నాడని రెండు సందర్భాల్లో చెప్పినట్లు లేఖనాలు చూపిస్తున్నాయి. (మత్త. 3:17; 17:5) మిమ్మల్ని చూసి కూడా యెహోవా సంతోషిస్తున్నాడని చెప్పడం వినాలనుకుంటున్నారా? యెహోవా మనకు వినిపించేలా మాట్లాడకపోవచ్చు గానీ మనకు కనిపించే బైబిలు ద్వారా మాట్లాడతాడు. సువార్త పుస్తకాల్లో యేసు చెప్పిన మాటల్ని చదివినప్పుడు యెహోవా మనల్ని చూసి సంతోషిస్తున్నట్టు చెప్పడాన్ని “వింటాం.” ఎందుకంటే, యేసు తన తండ్రి వ్యక్తిత్వాన్ని అచ్చుగుద్దినట్టు ప్రతిబింబించాడు. కాబట్టి తన నమ్మకమైన అపరిపూర్ణ అనుచరుల్ని చూసి యేసు సంతోషిస్తున్నానని చెప్పిన మాటల్ని చదివినప్పుడు, ఒకవిధంగా యెహోవా మనల్ని చూసి సంతోషిస్తున్నాడని చెప్పినట్టుగా ఊహించుకోవచ్చు. (యోహా. 15:9, 15) మనకు కష్టాలు వస్తున్నాయంటే మనల్ని చూసి యెహోవా సంతోషించట్లేదని దానర్థం కాదు. బదులుగా, మనకు ఆయన మీద ఎంత ప్రేమ ఉందో, మనం ఆయన్ని ఎంత నమ్ముతున్నామో చూపించే అవకాశాలుగా వాటిని చూడాలి.—యాకో. 1:12. w24.03 28 ¶10-11

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి